46 వేల ఏళ్ల నాటి సూక్ష్మజీవులను నిద్ర లేపిన పరిశోధకులు.. ఇప్పుడేం జరుగనుంది?

పురుగులు

ఫొటో సోర్స్, Reuters

దాదాపు 46,000 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న రెండు సూక్ష్మజీవులను అంతర్జాతీయ పరిశోధకుల బృందం మేల్కొల్పింది.

ఇప్పటివరకు తెలియని ఈ నెమటోడ్ జాతికి చెందిన సూక్ష్మజీవులు క్రిప్టోబయోసిస్ అనే నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఈ స్థితిలో నీరు, ఆక్సిజన్ కొరతను అలాగే తీవ్రమైన ఉష్ణోగ్రతలను సూక్ష్మజీవులు తట్టుకోగలవు.

ఐదేళ్ల క్రితం సైబీరియ‌లో 40 మీటర్ల లోతులోని ఎలుకల కలుగులో ఈ నెమటోడ్‌లను (గుండ్రని సూక్ష్మజీవులను) కనుగొన్నారు. వాటికి నీరు అందించినపుడు తిరిగి చేతన స్థితిలోకి వచ్చాయని పరిశోధకులు అంటున్నారు.

ఇలాంటి సూక్ష్మజీవులను తిరిగి మేల్కొల్పడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఇంతకుముందు వాటి నిద్రాణ స్థితి ఇంత ఎక్కువ కాలం కొనసాగలేదు.

పురుగులు

ఫొటో సోర్స్, Reuters

అన్నేళ్లు అలాగే ఉన్నాయని అనుకోలేదు: పరిశోధకుడు

"ఆ సూక్ష్మజీవుల నిద్రాణ స్థితి 40 వేల సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువే ఉంటుందని ఎవరూ అనుకోలేదు" అని పీఎల్‌వోఎస్ జెనెటిక్స్ జర్నల్‌లో ఫిలిప్ షిఫెర్ చెప్పారు.

జర్మనీలోని కొలోన్ విశ్వవిద్యాలయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ శాస్త్రవేత్తల బృందానికి ఫిలిప్ నాయకుడు.

"చాలా కాలం తర్వాత మళ్లీ అవి జీవితం ప్రారంభించడం ఆశ్చర్యంగా ఉంది" అని ఆయన చెప్పారు.

ఈ నెమటోడ్‌లకు కార్బన్ డేటింగ్ చేసిన శాస్త్రవేత్తలు, ఇవి 45,839 నుంచి 47,769 ఏళ్ల క్రితం నుంచి అచేతనంగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

వేల ఏళ్లు నిద్రాణ స్థితిలో ఉండడానికి కారణం?

జన్యు విశ్లేషణతో శాస్త్రవేత్తలు ఈ సూక్ష్మజీవులు నిద్రాణ స్థితిలోకి వెళ్లడానికి పురిగొల్పే కీలక జన్యువులను కనుగొన్నారు.

కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే సమకాలీన నెమటోడ్‌లలో కనిపించే జన్యువులే ఇవని వారు గుర్తించారు. వీటివల్లే ఈ జీవులు క్రిప్టోబయోసిస్ స్థితిలోకి ప్రవేశించగలవన్నారు.

ఈ జీవులను ప్రయోగశాలలో కొద్దిగా డీహైడ్రేషన్‌కు గురిచేయగా, ట్రెహలోస్ అనే చక్కెరను ఉత్పత్తి చేశాయి. ఈ జన్యువుల వల్లే ఇవి గడ్డకట్టడం, తీవ్రమైన డీహైడ్రేషన్‌ను తట్టుకోగలవని పరిశోధకులు గమనించారు.

ఈ సూక్ష్మజీవులు సుమారు ఒక మిల్లీమీటర్ పొడవు ఉన్నాయి. ప్రయోగశాలలో అవి కొన్ని సూక్ష్మజీవులకు జన్మనిచ్చాక మరణించాయి.

అయితే ఆ సూక్ష్మజీవులు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లడానికి కారణాలను లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు వాటి సంతానంపై ప్రయోగాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)