సముద్రాల లోపల హీట్ వేవ్స్... వర్షాల సైకిల్‌ను దారుణంగా మార్చేస్తాయా?

మెరైన్ హీట్‌వేవ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇసబెల్లా కమిన్స్కీ
    • హోదా, బీబీసీ ముండో

ఉష్ణోగ్రతలు రికార్డు చేయడం మొదలైన తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది జూన్‌తోపాటు, జులై మొదటి వారంలో నమోదయ్యాయని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.

అమెరికాలోని దక్షిణ ప్రాంతాలతోపాటు దక్షిణ యూరోప్‌లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొన్నిచోట్ల హీట్‌వేవ్‌లు, మరికొన్నిచోట్ల కార్చిచ్చులు, ఇంకొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం విజృంభిస్తోంది.

కేవలం నేలపై మాత్రమే కాదు, ప్రస్తుతం సముద్రంలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

రికార్డులు మొదలైన తర్వాత ఈ జూన్‌లో మునుపెన్నడూలేని రీతిలో సముద్రాల్లోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది.

మరోవైపు అంచనా వేసే ఉష్ణోగ్రతలు, వాస్తవానికి మధ్య తేడా కూడా జూన్‌లో చాలా ఎక్కువగా నమోదైందని నేషనల్ ఆఫీస్ ఆఫ్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) తెలిపింది.

ప్రస్తుతం ఫ్లోరిడా పరిసరాల్లోని జలాలు చాలా వేడెక్కుతున్నాయి. మే నెలలోనూ అమెరికా, కెనడాల పశ్చిమ తీరంలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.

‘‘ప్రస్తుతం ఈశాన్య అట్లాంటిక్‌లో హీట్‌వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అయితే, అదే సమయంలో పశ్చిమ మధ్యధరా సముద్రంలో, ముఖ్యంగా జిబ్రాల్టార్ జల సంధికి సమీపంలో ఒక హీట్‌వేవ్ తీవ్రం అవుతున్నట్లుగా కనిపిస్తోంది’’ అని ఎన్‌జీవో మెర్కటర్ ఓషన్ ఇంటర్నేషనల్ తెలిపింది.

ప్రస్తుతం ఇర్లాండ్, బ్రిటన్‌ల తీరాలతోపాటు బాల్టిక్ సముద్రంలోనూ విపరీత ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. దక్షిణ గ్రీన్‌లాండ్‌లోని లాబ్రడార్ సముద్రంలోనూ ఒక హీట్‌వేవ్ విజృంభించే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

‘‘భిన్న ప్రాంతాల్లోని సముద్రాల్లో తీవ్రమైన హీట్‌వేవ్‌లు కనిపిస్తున్నాయి. ఇవి చాలా తీవ్రంగా ఉండటంతోపాటు చాలా ఎక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్నాయి’’ అని మెర్కటర్ ఓషన్‌లో ఓషనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కరీనా షుక్‌మన్ చెప్పారు.

మెరైన్ హీట్‌వేవ్స్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఎలాంటి సంకేతాలు లేకుండానే’’

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉండబోతోందని శాస్త్రవేత్తలు ముందుగానే అంచనా వేశారని యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ కార్లో బౌంటెంపో చెప్పారు.

‘‘అయితే, ప్రస్తుతం ఉత్తర అట్లాంటిక్‌లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను ఎవరూ ముందుగా ఊహించలేదు’’ అని బౌంటెంపో ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ఈ విపరీత ఉష్ణోగ్రతల వెనకున్న కారణాలపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు.

ప్రాంతీయ సముద్ర, వాతావరణంలో చోటుచేసుకునే కొన్ని మార్పులతో తీవ్రమైన హీట్‌వేవ్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇవి వారాల వరకూ కొనసాగొచ్చు.. అయితే, గరిష్ఠంగా కొన్నిసార్లు ఏళ్ల వరకూ కూడా వీటి ప్రభావం ఉండొచ్చు.

అయితే, దీర్ఘకాలం ఇలా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.

మనుషుల ప్రమేయముండే చర్యలతో వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణంలో 90 శాతం సముద్రాల్లోకి వెళ్తుంది. భూ వాతావరణం శోషించుకునే ఉష్ణోగ్రత గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యింది.

1982 నుంచి 2016 మధ్య మెరైన్ హీట్‌వేవ్‌లు రెట్టింపు అయ్యాయని, 1980ల తర్వాత వీటి తీవ్రత, నిడివి కూడా చాలా పెరిగిందని 2021లో విడుదలైన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) వెల్లడించింది.

సముద్రంలో హీట్‌వేవ్స్ పెరగడానికి వాతావరణంలోని ఏరోసోల్ స్థాయిలు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. వీటి వల్ల చుట్టుపక్కల కాస్త చల్లగా ఉంటుంది. అయితే, షిప్పింగ్ రంగాన్నీ కార్బన్ రహితంగా మార్చే ప్రక్రియల్లో ఏరోసోల్ స్థాయిలు పడిపోతున్నాయి.

ఇటీవల సహారా ప్రాంతం నుంచి దుమ్ముతో కూడిన గాలి కూడా రావడం తగ్గిపోయింది. నిజానికి ఇది కాస్త చల్లదనాన్ని ఇస్తుంది.

మెరైన్ హీట్‌వేవ్స్

ఫొటో సోర్స్, Getty Images

పరిస్థితులు దారుణంగా..

ప్రస్తుత హీట్‌వేవ్‌లు మరింత తీవ్రంగా కూడా కావచ్చు. ఉత్తర అట్లాంటిక్‌లో పరిస్థితులకు ఎల్‌నినో కారణం కాకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, సాధారణంగా ఎల్‌నినోతో ప్రపంచంలోని అన్నిచోట్లా సముద్రాలు కాస్త వేడెక్కుతాయని డబ్ల్యూఎంవో నిపుణులు వివరిస్తున్నారు.

ఈ హీట్‌వేవ్‌ల వల్ల సముద్రపు జీవులు, చేపలు, వాతావరణం తీవ్రంగా ప్రభావితం కావొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 2010/2011ల్లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇక్కడి కెల్ప్ అడవులు కూడా ధ్వంసమయ్యాయి. ఫలితంగా ఇక్కడ పర్యావరణ వ్యవస్థ చాలా దెబ్బతింది.

దీనికి కొన్ని సంవత్సరాల తర్వాత, 2016లో వాతావరణ మార్పులు, ఎల్‌నినోల వల్ల నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు గ్రేట్ బారియర్ రీఫ్‌లో కోరల్ బ్లీచింగ్‌కు కారణమైంది.

మెరైన్ హీట్‌వేవ్‌ల వల్ల క్లోరల్ బ్లీచింగ్ అంటే పగడపు దిబ్బల్లోని జీవులు మరణించొచ్చు. మరోవైపు ఈ వేడి పగడపు దిబ్బలపై మరింత ఒత్తిడికి కారణం అవుతుంది.

గరిష్ఠ ఉష్ణోగ్రతల వల్ల తమ శరీరంపై జీవించే రంగులకు కారణమయ్యే జూజంతలై జీవులను కోరల్ పాలిప్స్ వెళ్లగొడతాయి. ఫలితంగా కోరల్స్ మొత్తం తెల్లరంగులోకి మారిపోతాయి. అప్పుడు వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుంది.

మధ్యధరా సముద్రంలో 2015 నుంచి 2019 మధ్య నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వల్ల కోరల్స్, ఆల్గే లాంటి జీవులు పెద్దయెత్తున మరణించాయి.

మెరైన్ హీట్‌వేవ్‌లతో కొత్తరకం జాతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఉదాహరణగా జాపనీస్ కెల్ప్‌ను తీసుకోవచ్చు. 2017-18ల మధ్య టాస్మానియా సముద్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలతో స్థానిక కెల్ప్ మొక్కలు దెబ్బతిన్నాయి. అయితే, వీటిస్థానాన్ని జాపనీస్ కెల్ప్ ఆక్రమించాయి.

మెరైన్ హీట్‌వేవ్స్

ఫొటో సోర్స్, Getty Images

‘‘తెలుసుకోవాల్సింది చాలా ఉంది’’

‘‘ఒక్కసారిగా పెరిగే ఉష్ణోగ్రతలు అక్కడి జీవులకు ఎక్కువ సమయం ఇవ్వవు. ఫలితంగా వాటి మనుగడకే ముప్పు ఉండొచ్చు’’ అని ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ మెరైన్ హీట్‌వేవ్స్ సభ్యుడు, యూకే మెరైన్ బయోలాజికల్ అసోసియేషన్ మెరైన్ ఎకాలజిస్టు డాన్ స్మేల్ చెప్పారు.

కానీ బ్రిటన్ తీరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవు. దీంతో ఇక్కడి పర్యావరణ వ్యవస్థల్లో మార్పులకు అలవాటయ్యేందుకు జీవులకు కాస్త సమయం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఈ వేసవి మొత్తం అలానే హీట్‌వేవ్స్ ఉంటే పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం కావచ్చు.

‘‘అయితే, నేలపై వచ్చే హీట్‌వేవ్స్‌తో పోల్చినప్పుడు సముద్రంలోని హీట్‌వేవ్స్‌పై మనకు అందుబాటులో ఉండే సమాచారం చాలా తక్కువ. కాబట్టి వీటిని పరిశీలించడం కొంచెం కష్టం’’ అని స్మేల్ చెప్పారు.

‘‘1980ల నుంచి ఉపగ్రహాలు మనకు మంచి సమాచారం అందిస్తున్నాయి. అయితే, అంతకుమించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడే సమస్య ఎదురవుతుంది’’ అని ఆయన వివరించారు.

మెరైన్ హీట్‌వేవ్స్

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని రోజులు ఇలానే ఉంటే..

ప్రస్తుతం నమోదవుతున్న మెరైన్ హీట్‌వేవ్‌లతో ఉత్తర అట్లాంటిక్‌లో ఇప్పటికే ఫైటోప్లాంక్టన్‌ల సంఖ్య చాలా తగ్గిందని మెర్కటర్ ఓషన్ చెబుతోంది.

వసంత కాలంలో సముద్రపు ఆహారపు గొలుసుకు కావాల్సిన శక్తి అంతా అందుతుంది. ఇదే సమయంలో వాతావరణంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను సముద్రాలు పెద్దమొత్తంలో శోషించుకుంటాయి. కానీ, ప్రస్తుతం ఇవన్నీ ప్రభావితం అవుతున్నాయి.

ఒక్కోసారి ప్రాంతీయ మత్స్య సంపద కూడా ఇలాంటి హీట్‌వేవ్ వల్ల ప్రభావితం కావచ్చు.

2012లో వాయువ్య అట్లాంటిక్‌లో హీట్‌వేవ్ వల్ల కొన్ని సముద్ర జీవులు ఉత్తరం వైపునకు వలస వెళ్లిపోయాయి. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ రకం జీవులు అందుబాటులో ఉంటాయి? లాంటి అంశాలు ఇక్కడ మారిపోయే అవకాశం ఉంటుంది.

తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనేందుకు కూడా ఒక్కోసారి ఉత్తర అట్లాంటిక్ కారణం అవుతుంది. ఇక్కడ సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో హరీకేన్లు ఎక్కువగా రావచ్చు. ప్రస్తుత ఎల్‌నినోతో ఇక్కడ ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియాల్సి ఉంది.

మరోవైపు ఉత్తర అట్లాంటిక్‌లో జలాలు వేడెక్కడంతో మధ్య ఆఫ్రికాలో కరవు, భారీ వర్షాల సైకిల్‌ కూడా నియంత్రణ తప్పే అవకాశం ఉంటుంది.

మొత్తంగా ఎక్కువ రోజులు కనిపిస్తున్న తాజా మెరైన్ హీట్‌వేవ్‌లపై మనం ఆందోళన పడాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు. నేలపై హీట్‌వేవ్‌ల ద్వారా హిమానీనదాలు అసాధారణ రీతిలో కరగడం తరహాలోనే సముద్రంలోనూ వీటితో విధ్వంసకర మార్పులు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం వెంటనే కార్బన ఉద్గారాలను తగ్గించుకున్నప్పటికీ కొన్ని ఏళ్ల వరకూ సముద్రాలు వేడిగానే ఉంటాయని కరీనా చెప్పారు.

‘‘మన లక్ష్యాలకు మనం చాలా దూరంలో ఉండిపోయామని చాలా ఆందోళనగా అనిపిస్తోంది’’ అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, రాత్రి పూట సేద్యంలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)