లిబియా వరదలు:‘చావుకన్నా ఘోరమైన దృశ్యాలు చూశాం...’ బతికి బయటపడిన బాధితుల ఆవేదన

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, జోయెల్ గుంటెర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కుక్కలు విపరీతంగా మొరగడం ఏదో జరగబోతోందనడానికి అక్కడి వారికి తొలి సంకేతంగా మారింది.
తెల్లవారు జామున 2.30 అవుతోంది. అంతా చీకటిగా ఉంది. లిబియాలోని డెర్నా నగరంలో 31 ఏళ్ల అకౌంటెంట్ హుసామ్ అబ్దేల్‌గావి నిద్రలేచి ఆ మత్తులోనే కిందికి దిగినప్పుడు అతని కాళ్లకు నీళ్లు తగిలాయి.
తన తమ్ముడు ఇబ్రహీం ఉంటున్న కింద ఫ్లాట్ ముందున్న తలుపు తెరిచారు హుసామ్. ఒక్కసారిగా నీరు లోపలికి వచ్చింది. అప్పటికే తలుపు కొంత విరిగింది.
అక్కడ జీవితంలో ఎప్పుడూ చూడని, చావుకన్నా ఘోరమైన దృశ్యాన్ని చూసిన సోదరులిద్దరూ, భయంతో ఇంటి వెనక్కు పరుగెత్తారు.
వరదల్లో తమకు ఎదురైన అనుభవాలను అల్-కుబ్బా నగరం నుంచి ఫోన్ ఇంటర్వ్యూలో బీబీసీకి వివరించారు హుసామ్.
‘‘మహిళలు, పిల్లల మృతదేహాలు మా పక్క నుంచి తేలుకుంటూ వెళుతున్నాయి. ఇళ్లు, కార్లు అన్నీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. కొన్ని మృతదేహాలు మా ఇంట్లోకి కొట్టుకువచ్చాయి’’ అని ఆయన వివరించారు.
వరద నీరు హుసామ్, ఇబ్రహీమ్‌లను కూడా లాక్కెళ్లింది. ఊహించనంత వేగంతో వారు వరదలో కొట్టుకుపోవడం ప్రారంభించారు. కొన్ని సెకన్లలో వారు 150 మీటర్ల దూరం వెళ్లిపోయారు.
వరదలో కొట్టుకు వస్తున్న కరెంటు తీగలను ఎలాగో పట్టుకోగలిగారు ఇబ్రహీం. ఇద్దరూ ఆ తీగలను సమీపంలోని భవనానికి కట్టి, దాని మూడో అంతస్తుకు చేరుకున్నారు. పక్కనే ఉన్న మరో భవనం మీదకు తీగల సాయంతో వెళ్లి ఐదో అంతస్తు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద తగ్గు ముఖం పట్టే వరకు అక్కడే ఉన్నారు.
"మేము ఉన్న ప్రాంతం ఆ నగరంలోనే ఎత్తైన ప్రాంతం. లోతట్టు ప్రాంతాలలో ఐదారు అంతస్తులలో ఉన్నవారు కూడా బతికుంటారని నేను అనుకోను’’ అన్నారాయన.

ముంచెత్తిన వరదలు
డేనియల్ తుపాను లిబియాను ముంచెత్తినప్పుడు వచ్చిన వరదలకు 5,000 మందికి పైగా మరణించారు. 20,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని డెర్నా నగర మేయర్ అన్నారు.
డెర్నా వెలుపల ఉన్న రెండు డ్యామ్‌లు ఫెయిలవడంతో వరదలు ముంచెత్తాయి.
"వరదలకు డెర్నా నగరం రెండు ముక్కలకుగా విడిపోయింది. మధ్యలో ప్రదేశమంతా కొట్టుకుపోయింది. చాలామంది చనిపోయారు’’ అని ఇంటి పైకప్పు మీదకు చేరి ప్రాణాలు కాపాడుకున్న 18 ఏళ్ల విద్యార్థి రహ్మా బెన్ ఖయల్ అన్నారు.
వరదకు ముందు రోజు చిన్నపాటి వర్షంతొ మొదలైంది. మరుసటి రోజుకు డెర్నా నగరం చాలా వరకు కొట్టుకుపోయింది.
‘‘ఇంత తీవ్రంగా ఉంటుందని మొదట అనిపించలేదు’’ అని 23 ఏళ్ల మెడికల్ విద్యార్ధిని అమ్నా అమీన్ అబ్సైస్ తెలిపారు. అనారోగ్యంతో ఇటీవలే తన తల్లిదండ్రులు మరణించడంతో తన ముగ్గురు తమ్ముళ్లకు ఆమే సంరక్షురాలిగా మారారు.
ఏడంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో ఉంటున్న ఈ నలుగురు బయట భారీగా వర్షం కురుస్తుండంటో బిక్కుబిక్కు మంటూ కూర్చున్నారు. ఎందుకైనా మంచిదని తన తమ్ముడికి లైఫ్ జాకెట్ కూడా తొడిగారు అమ్నా.

ఫొటో సోర్స్, REUTERS
సైరన్ల మోతతో భయం భయం....
ఆదివారం రాత్రి వర్షం మరింత ఎక్కువైంది. సైరన్లు మోగాయి. దీంతో వారికి నిద్ర పట్టలేదు.
"తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రారంభమైంది. శబ్దం రానురాను పెరుగుతోంది. వీధిలోకి నీరు వచ్చిందని నా తమ్ముడు చెప్పాడు.’’ అని అమ్నా ఫోన్ ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
నీరు పెరగడంతో ఇరుగుపొరుగు వారు మేడ పైకి వెళ్లడం ప్రారంభించారు. అమ్నా తమ పెంపుడు పిల్లిని, తమ పాస్ పోర్టులను తీసుకుని, తమ్ముళ్లతో కలిసి మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వెళ్లారు.
‘‘బయట జనం చీకటిలోకి చూస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కాసేపటికి మా ఫ్లాట్ మూడో అంతస్తులోకి కూడా నీరు వచ్చి చేరింది. అందరూ కేకలు వేయడం ప్రారంభించారు. మేము ఐదో అంతస్తుకి, తర్వాత ఏడో అంతస్తుకు వెళ్లాం.’’ అని వెల్లడించారామె.
‘‘మా పిల్లి కొట్టుకుపోయింది. నా తమ్ముడు కూడా జారిపోయాడు. కానీ, తర్వాత ఎలాగో పట్టుకున్నాను. ఏడో అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చాయి. ఇంకా పైకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎదురుగా మూడంతస్తుల భవనం పై కప్పుపై చాలామంది కనిపించారు. అందులో మా స్నేహితులు, బంధువుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్లు చీకట్లో ఫోన్ టార్చ్‌లు ఊపుతున్నారు. కొద్దిసేపటికి వారి భవనం నీళ్లలో కుప్ప కూలింది.’’ అని అమ్నా వివరించారు.
"అది భూకంపంలా అనిపించింది. ఇంకా ఆ కుటుంబం ఆచూకీ దొరకలేదు. వాళ్లబ్బాయి తన కుటుంబం కోసం వెతుకుతున్నాడు. వాళ్ల బిల్డింగ్ మా కళ్ల ముందే కూలిపోయిందని చెప్పాం.’’ అని అమ్నా తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
బంధువుల ఆచూకీ లేదు
అమ్నా బంధువుల్లో కూడా కొందరు గల్లంతయ్యారు. కూలిపోయిన ఆ భవనంలో ఆమె మామ కుటుంబం ఉంటోంది.
‘‘మా మామ మాకు చివరిసారిగా రాత్రి 9 గంటలకు కాల్ చేసి మేం ఎలా ఉన్నామో కనుక్కున్నాడు. ఆ తర్వాత అతను ఏమయ్యారో తెలియదు. మళ్లీ కాల్ రాలేదు’’ అన్నారు అమ్నా.
వరద తగ్గుముఖం పట్టడంతో అమ్నా తన ముగ్గురు సోదరులతో ఆ భవనం నుంచి బయటకు వచ్చారు. వాళ్ల వీధి మొత్తం వరద నీటికి కొట్టుకుపోయింది.
కొన్ని గంటలపాటు నడచి ఆ నలుగురూ ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. దారిలో వారికి చాలా మృతదేహాలు కనిపించాయి.
చనిపోయినవారిలో కనీసం 30 మంది స్నేహితులు, 200 మందికి పైగా పరిచయస్తులు ఉన్నారని అకౌంటెంట్ హుసామ్ అబ్దేల్గావి చెప్పారు. నేను ప్రాణాలతో బయటపడడం ఓ అద్భుతం అన్నారాయన.
(రియామ్ దలాతి ఈ రిపోర్టుకు అదనపు సమాచారం అందించారు.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















