మొరాకో భూకంపం: ఆ ఊళ్లో సగంమంది కనిపించకుండా పోయారు, లేదంటే చచ్చిపోయారు....బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, నిక్ బీక్
- హోదా, బీబీసీ న్యూస్, మొరాకో
మొరాకో భూకంపంలో 2,122 మంది మరణించారని, 2,421 మంది గాయాలు పాలయ్యారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల ఇళ్లన్నీ కుప్పకూలాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మరకేశ్ నగరం తీవ్రంగా దెబ్బతింది.
మొరాకో భూకంపం వల్ల సంభవించిన నాశనాన్ని అంచనావేయడానికి తఫేఘగ్తే నివాసితుల్ని మేం కలిశాం.
‘‘ఈ గ్రామంలోని ప్రజలు సగం మంది మృతి చెందారు, చాలామంది ఆస్పత్రి పాలయ్యారు’’ అని వారు చెప్పారు.
శిథిలాల పైకి చేరుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే.. ఈ ప్రకృత్తి విపత్తు నుంచి ఎవరూ తప్పించుకుని ఉండకపోవచ్చు.
ఇక్కడ పేరుకుపోయిన ఇళ్ల ఇటుకలు, రాళ్లు ఈ భూకంప ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి.
200 మంది ఉన్న ఈ గ్రామంలో 90 మంది మరణించినట్లు ధ్రువీకరణ అయింది. చాలా మంది కనిపించకుండా పోయారు. వీరు చనిపోయారో తెలియదు, బతికున్నారో తెలియదు.
‘‘దీని నుంచి బయటపడేందుకు వారికి అవకాశం దొరకదు. వారికి వారు రక్షించుకునేందుకు కూడా సమయం ఉండదు’’ అని హస్సన్ అనే వ్యక్తి చెప్పారు.
ఈ శిథిలాల కింద తన అంకుల్ సమాధి అయిపోయాడని హస్సన్ కన్నీరు మున్నీరయ్యారు. ఈ శిథిలాల కింద నుంచి ఆయన బయట పడతారన్న ఆశ కూడా లేదన్నారు.
మెషీన్‌లతో శిథిలాలు తొలగిస్తూ.. సహాయక చర్యలు అందించే ఎవరూ ఇక్కడికి రాలేదు. బయట నిపుణులెవరూ తమ గ్రామానికి రాలేదన్నారు.
‘‘ప్రభుత్వ సాయం మాకు కావాల్సి ఉంది. వారు చాలా ఆలస్యం చేస్తున్నారు. ప్రజలకు సాయం చేసేందుకు వారు చాలా ఆలస్యంగా వస్తున్నారు’’ అని చెప్పారు.
అంతర్జాతీయంగా అందే ప్రతి సాయాన్ని మొరాకో అధికారులు అంగీకరించాలని హస్సన్ కోరారు. కానీ, ఆత్మగౌరవం పేరుతో ఈ అంతర్జాతీయ సహాయాన్ని వారు తిరస్కరించే అవకాశం ఉందని కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఈ చిన్న కమ్యూనిటీలో, ప్రతి ఒక్కరూ ఓ వ్యక్తిని ఓదార్చడం మనకు కనిపిస్తోంది.
ఆయన పేరు అబ్దౌ రెహ్మాన్‌గా గుర్తించాం. ఆయన తన భార్యను, ముగ్గురు పిల్లల్ని కోల్పోయారు.
‘‘మా ఇల్లు అక్కడ ఉండేది’’ అంటూ తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని చూపించారు.
ఇది ఇప్పుడు పూర్తిగా శిథిలంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రాళ్లు, ఇటుకలే కనిపిస్తున్నాయి.
‘‘తెల్ల దుప్పట్లు, ఫర్నీచర్‌ను కూడా మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కటీ ధ్వంసమైంది’’ అని అబ్దౌ రెహ్మాన్ చెప్పారు.
భూకంపం సంభవించినప్పుడు ఆయన పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. తన ఇల్లు అక్కడికి 3 కి.మీల దూరంలో ఉంటుందని రెహ్మాన్ చెప్పారు. భూకంపం వచ్చిన వెంటనే ఇంటికి పరిగెత్తుకుని వెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పిల్లల కోసం గట్టిగా అరిచానని, తన అరుపులు విని ఇతరులు కూడా అలానే చేశారని, కానీ తనకు తిరిగి సమాధానం రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
వారి ఖనన కార్యక్రమాలు పూర్తి చేశామంటూ చెప్పారు. తాము వారిని గుర్తించినప్పుడు, వారందరూ ఒకే దగ్గరున్నట్లు తెలిపారు. ముగ్గురు పిల్లలు నిద్రపోతున్నారు. నిద్రలోనే వారు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
బయట ప్రపంచానికి ఈ గ్రామాన్ని కలిపే పర్వత మార్గంలో డజన్ల కొద్దీ కుటుంబాలు టెంట్లు వేసుకుని కూర్చుని ఉన్నారు.
అక్కడ కూర్చున్న వారందరూ కూడా బాగా ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం చాలా కష్టమే.
శిథిలాల నుంచి బయటికి తీసిన పదేళ్ల బాలిక మృతదేహాన్ని చూసి, వారు మరింత కన్నీరుమున్నీరయ్యారు.
అట్లాస్ పర్వతాల్లో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ భూకంపం పెను విషాదాన్ని సృష్టించింది. ఎక్కడ చూసినా గుట్టగుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలే కనిపిస్తున్నాయి.
సంప్రదాయ కమ్యూనిటీలు కొన్ని ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతుండొచ్చు. కానీ, వారికి ఇప్పుడు బయట సహాయం అవసరం. వీలైనంత త్వరగా వీరికి సాయం అందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు రిమాండ్: వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలు ఏమంటున్నారు
- నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు... ఆమె పుట్టింది తెలంగాణలోనా?
- ఆంధ్రప్రదేశ్: తోలుబొమ్మలాట మొగలుల దండయాత్ర వల్లే తెలుగు నేలకు చేరిందా?
- రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
- 46 వేల ఏళ్ల నాటి సూక్ష్మజీవులను నిద్ర లేపిన పరిశోధకులు.. ఇప్పుడేం జరుగనుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















