మొరాకో భూకంపం: ‘నా కుటుంబంలో 10 మంది చనిపోయారు’

మొరాకో భూకంపం

ఫొటో సోర్స్, GETTY IMAGE

    • రచయిత, లారెన్ టర్నర్
    • హోదా, బీబీసీ న్యూస్

మొరాకోలో భూకంపం అర్థరాత్రి సమయంలో వచ్చింది. అప్పటికే చాలా మంది ప్రజలు నిద్రలో ఉన్నారు.

6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

తొలుత రాత్రి 11 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 19 నిమిషాలకు 4.9 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయి.

ఈ భూకంపంలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1400 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ చెప్పింది.

మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని ఆ దేశ అధికారులు చెప్తున్నారు.

మృతుల్లో ఎక్కువ మంది మరకేశ్ నగరానికి చెందినవారున్నారు. ఎందుకంటే భూకంప కేంద్రానికి ఇది 44 మైళ్ల దూరంలోనే ఉంది.

భూకంపం ప్రభావంతో రాత్రంతా వీధుల్లోనే ఉన్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూకంపం ప్రభావంతో రాత్రంతా వీధుల్లోనే ఉన్న ప్రజలు

‘‘తీవ్రమైన ప్రకంపనాలను మేం చూశాం. ఇది భూకంపమని నాకు వెంటనే అర్థమైంది. భవనాలు కదులుతుండడం నేను చూశాను’’ అని అబ్దెల్హక్ ఎల్ అమ్రానీ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

“వెంటనే నేను బయటకు పరుగు తీశాను. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రజలందరూ షాక్‌కి గురయ్యారు. అంతా భయాందోళనలో ఉండి పోయారు. పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.” అని స్థానికులు అబ్దెల్హక్ ఎల్ అమ్రానీ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు.

పది నిముషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు ఫోన్ లైన్స్ కూడా పని చేయలేదని తెలిపారు.

భవనాలు కదులుతున్న దృశ్యాలు చూసి తీవ్ర భయానికి గురయ్యానని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

‘‘నా బెడ్ ఎగురుతున్నట్లు నాకనిపించింది. దుస్తులు సరిగా వేసుకోకుండానే నేను బయటికి పరుగు తీశాను. ఆ తర్వాత వెంటనే బయట చూస్తే గందరగోళంగా అనిపించింది. ఇది నిజంగా మహా విపత్తు’’ అని మరకేశ్ పాత పట్టణంలో నివసించే ఫ్రాన్స్‌కు చెందిన మైఖేల్ బిజెట్ అన్నారు.

భూకంపం వచ్చినప్పుడు హౌదా ఔట్సాఫ్ అనే వ్యక్తి మరకేశ్‌లోని జెమా ఎల్-ఫ్నా స్క్వేర్‌ వద్ద నడుచుకుంటూ వస్తున్నారు.

తాను సురక్షితంగా ఉన్నా, తన కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు చెప్పారు ఆయన.

‘‘నా కుటుంబానికి చెందిన 10 మందిని కోల్పోయాను. నేను వారిని కలిసి రెండు రోజులు కూడా కావడం లేదు’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

భూకంపం ప్రభావంతో రాత్రంతా వీధుల్లోనే ఉన్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

మొరాకోలో నివసించే బ్రిటన్‌ జర్నలిస్ట్ మార్టిన్ జే కూడా భూకంప అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. ప్రజల అరుపులతో తాను మేల్కొనట్లు తెలిపారు.

‘‘నా భార్య పెద్దగా అరిచింది. మేమిద్దరం అప్పుడే నిద్రపోదాం అనుకున్నాం. నిద్రలోకి జారుకుంటోన్న సమయంలో నా భార్య గట్టిగా అరిచింది. నేను కళ్లు తెరిచే చూసేసరికి, అసలేం జరుగుతుందో తెలియలేదు. భూకంపం వస్తుందని ఊహించలేకపోయాను.’’ అని బీబీసీ రేడియా 4 ప్రొగ్రామ్‌కి ఆయన చెప్పారు.

‘‘అన్నీ కదులుతున్నాయి. మా బెడ్, ఫ్లోర్, గదికి నాలుగు పక్కలున్న గోడలు అన్ని ఆ సమయంలో కదిలాయి’’ అని చెప్పారు.

ప్రజల్ని తమ ఇళ్లకి వెళ్లొద్దని సూచనలు వచ్చినట్లు తెలిపారు.

‘‘మొరాకోలో ప్రతి పట్టణం కూడా అర్థరాత్రి వేళలో ఈ మహా విపత్తును కళ్లారా చూసింది. ప్రజలందరూ తమ ఇళ్లకు, అపార్ట్‌మెంట్లకు బయటున్న వీధుల్లోనే పడిగాపులు కాశారు.

రెండు గంటల తర్వాత మరోసారి భూకంపం సంభవిస్తుందన్న హెచ్చరికలకు భయపడి ప్రజలంతా ఇళ్ల బయటే ఉన్నారు. దేవుడి దయవల్ల అది రాలేదు’’ అని చెప్పారు.

మరకేశ్‌లో శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మరకేశ్‌లో శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది

స్థానిక కాలమానం ప్రకారం అర్థరాత్రి 11.11 గంటల సమయంలో భూకంపం వచ్చినప్పుడు, మరకేశ్‌లోని స్థానికుడు ఫైసల్ బదౌర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు.

‘‘నేను కారు ఆపి బయటకు చూస్తే ప్రజలు అప్పటికే ఏడుస్తూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నారు’’ అని ఏఎఫ్‌పీకి తెలిపారు.

భూకంపం సంభవించిన మొరాకోలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

‘‘నా చుట్టుపక్కల వాళ్లందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రజలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ’’ అని భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న అస్ని అనే పర్వత ప్రాంతానికి చెందిన మోంటాసిర్ ఇత్రి తెలిపారు.

భూకంప తీవ్రత కారణంగా అట్లాస్ పర్వతాల్లోని మారుమూల ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి కష్టతరమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మొరాకో భూకంపం

ఫొటో సోర్స్, AFP

మరకేశ్ పర్యాటకుల కేంద్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

అక్కడి పర్యాటకులు కూడా భూకంప అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

‘‘గదంతా ఒక్కసారిగా ఊగడం ప్రారంభమైంది’’ అని సెలవులపై అక్కడికి వెళ్లిన బ్రిటన్ మహిళ లారెల్లా పల్మర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)