పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా? మద్రాస్ హైకోర్ట్ ఏం చెప్పింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రమీల కృష్ణన్
- హోదా, బీబీసీ తమిళ్ ప్రతినిధి
తమిళనాడుకు చెందిన 70 ఏళ్ల సురేశ్ (పేరు మార్చాం) తన కొడుక్కి ఆస్తి రాసిచ్చాక అంతా మారిపోయింది. ఆయన్ను కొడుకు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అప్పటికే సురేశ్ భార్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆ స్థితిలో ఆస్తి పత్రాలు తీసుకొని తండ్రికి ఆసరా లేకుండా చేశాడు కొడుకు. దాంతో రెండేళ్ల పాటు కష్టపడిన తండ్రి సురేశ్ చివరికి చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
వృద్ధాప్యంలో తమను పిల్లలు ఆదుకుంటారనే ఆశతో సురేశ్ లాంటి చాలామంది సీనియర్ సిటిజన్లు ఆస్తులను రాసిస్తున్నారని, అలా చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
అదేవిధంగా ఆస్తిని రాసిచ్చేముందు అందులో 'లవ్ అండ్ ఎఫెక్షన్ (ప్రేమ, అనురాగం)'గా రాస్తే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ఆస్తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి పొందవచ్చని మద్రాసు హైకోర్టు స్పష్టంచేసింది.
కొడుకు గురించి చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేసేముందు చాలాసార్లు ఆలోచించానని బీబీసీతో సురేశ్ చెప్పారు.
“వృద్ధులను పట్టించుకోకుండా వదిలేయడం గురించి నేను చాలాసార్లు వార్తల్లో చదివాను. నాకూ ఆ పరిస్థితి రావడంతో నమ్మలేకపోయా. నా భార్య కీళ్లనొప్పుల కారణంగా అనారోగ్యం పాలైంది, నాకు సాయం చేసేవారు లేరు. నా కొడుకును డబ్బులడిగితే తిట్టాడు. దాంతో నా ఆస్తిని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించాను. కానీ నా కొడుకు నన్ను ఒంటరిగా వదిలేసి, ఆస్తి పత్రాలు తీసుకెళ్లాడు, చాలా బాధపడ్డాను'' అని సురేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్తి తిరిగివ్వకపోతే ఏమవుతుంది?
సురేశ్ ఫిర్యాదు చేయడంతో, ఆయన కొడుకుని పిలిచి అధికారులు 'ఆస్తి చట్టాలు' వివరించారు.
కేసు నమోదు చేస్తే చట్టప్రకారం కనీసం మూడు నుంచి ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని వివరించడంతో సురేశ్ కుమారుడు ఆస్తి పత్రాలను తిరిగిచ్చాడు.
రెండు వారాల క్రితం సురేశ్ మాదిరిగానే తమిళనాడులోని మడిప్పాగ్‌కు చెందిన పార్థసారథి తన కొడుకు నుంచి ఆస్తిని ఎలా స్వాధీనం చేసుకున్నారో డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీపక్ వివరించారు.
‘‘పార్థసారథికి 82 ఏళ్లు. ఏడాది కాలంగా ఆస్తి కోసం కొడుకును అడుగుతున్నాడు. కొడుకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. అంతేకాదు తండ్రితో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. దీనిపై మాకు ఫిర్యాదు అందింది. నేరుగా పార్థసారథి ఇంటికి వెళ్లి వివరాలు కనుక్కున్నాం. ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి ఉంది. డబ్బుల్లేక వైద్య పరీక్షలు చేయించుకోలేకపోయాడు. వైద్య ఖర్చుల కోసం ఆస్తిని అమ్మాలనుకుంటే కొడుకు వ్యతిరేకించాడు. మేం పార్థసారథి కొడుకుతో మాట్లాడాం. మొదట నిరాకరించాడు. చట్ట ప్రకారం ముందుకెళ్లడంతో ఆస్తి పత్రాలను తిరిగిచ్చాడు" అని దీపక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రులు ఆస్తి పత్రాలను ఎలా రద్దు చేయవచ్చు?
పిల్లలు తమను పోషించకపోతే వారికి ప్రేమతో ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు తిరిగి తీసుకోవచ్చంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయవాది రాజశేఖరన్‌తో బీబీసీ మాట్లాడింది.
రాజశేఖరన్‌కు సీనియర్ సిటిజన్ల హక్కులకు సంబంధించిన కేసులు వాదించిన అనుభవం ఉంది. చాలామంది సీనియర్ సిటిజన్లకు వారి పిల్లల నుంచి ఆస్తిని తిరిగి వచ్చేలా చేశారాయన.
“తమ పిల్లల నుంచి ఆస్తిని తిరిగి పొందాలని కోరుకునే తల్లిదండ్రులకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది కొన్ని నిబంధనలతో, రెండోది 'లవ్ అండ్ ఎఫెక్షన్ (ప్రేమ, అనురాగం) అని ఆస్తి రాసి ఇవ్వడం. పత్రంలో ఈ రెండింటిలో దేన్నైనా పేర్కొన్నట్లయితే, తల్లిదండ్రులు వారి సంతానం నుంచి ఆస్తిని తిరిగి పొందవచ్చు. అలా కాకుండా కేవలం తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నట్లయితే దానిని రికవరీ చేయడం కష్టం’’ అని అంటున్నారు న్యాయవాది రాజశేఖరన్.
అంటే "పిల్లలకు ఆస్తిని విరాళంగా ఇచ్చేటప్పుడు, దస్తావేజులో 'నా జీవితాంతం నన్ను చూసుకోవడమే కాకుండా, అన్ని ఖర్చులను భరిస్తామని నా కొడుకు / కుమార్తె వాగ్దానం చేయడంతో నేను నా ఆస్తిని విరాళంగా ఇస్తున్నా. నా భద్రత, వైద్య సహాయం అందించకుండా నిరాకరిస్తే ఆస్తిని వెనక్కి తీసుకుంటాను' అని రాసి ఉండాలి. ఇది షరతులతో కూడిన బహుమతి దస్తావేజుగా పరిగణిస్తారు'' అని న్యాయవాది చెప్పారు.
"లేదా 'నా ఆస్తిని ప్రేమ, అనురాగంతో రాస్తున్నా' అని దస్తావేజులో పేర్కొంటే, తల్లిదండ్రులను పిల్లలు చూసుకుంటున్నారా? లేదా అనేది 'సీనియర్ సిటిజన్స్ రైట్స్ కమిషన్' పరిగణనలోకి తీసుకుంటుంది. వృద్ధులు ఎలాంటి సంరక్షణ లేకుండా ఉన్నారని భావిస్తే, ఆస్తిని తిరిగి పొందవచ్చని నిర్ధారిస్తుంది. స్పష్టంగా ఉండాలంటే, మొదటి ఆప్షన్‌లో చెప్పినట్లు రాస్తే బాగుంటుంది’’ సూచిస్తున్నారు న్యాయవాది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం ఆస్తిని తిరిగి పొందేందుకు తల్లిదండ్రులు దావా వేయవచ్చని ఆయన చెప్పారు.
"తల్లిదండ్రులు సెక్షన్ 23(1)లోని నిబంధనల ప్రకారం దావా వేయవచ్చు. అంటే, ఆస్తిని స్వీకరించే వ్యక్తి దాతకు ప్రాథమిక సౌకర్యాలతో పాటు భద్రతా సౌకర్యాలను అందించాలి. దానిని తిరస్కరించినట్లయితే .. 'సీనియర్ సిటిజన్ల కమిషన్' ఆస్తి పత్రం బలవంతంగా రిజిస్టర్ అయిందని భావించి, ఆస్తి బదిలీ చెల్లదని ప్రకటించవచ్చు” అని రాజశేఖరన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సీనియర్ సిటిజన్లకు ఎవరు సాయం చేస్తారు?
ఆస్తుల రికవరీ ఫిర్యాదుల గురించి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా వ్యవహరించే సాంఘిక సంక్షేమ అధికారులను బీబీసీ వివరాలు అడిగింది.
‘‘వృద్ధులు మాకు ఇచ్చే ఫిర్యాదుల తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం. వెంటనే పోలీసుల ద్వారా ఒత్తిడి తేవడమో లేదా, నేరుగా మేమే ఇంటిని తనిఖీ చేయడమో చేస్తాం. సీనియర్ సిటిజన్స్ కమిషన్ ద్వారా పిల్లల నుంచి మెయింటెనెన్స్ ఖర్చులు/ప్రాపర్టీని తిరిగి తీసుకునేందుకు చర్య తీసుకుంటాం. చాలా తక్కువమంది సీనియర్ సిటిజన్లు మాత్రమే ఫిర్యాదు నమోదు చేయడానికి ముందుకు వస్తారు. అయితే, పిటిషన్ వేయడానికి ముందు కొడుకు / కుమార్తెతో మాట్లాడితే బాగుంటుంది. సమస్యను బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని చెన్నై నగర సాంఘిక సంక్షేమ అధికారి మంగయ్యకరసి చెబుతున్నారు.
ఇలాంటి వాటికోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ (14567) సంప్రదించాలని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
- చాట్ జీపీటీని 'గూగుల్ కిల్లర్' అని ఎందుకు అంటున్నారు... ఏఐ రేసులో గూగుల్ ఎక్కడ?
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
- యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














