OCCRP రిపోర్ట్: అదానీ గ్రూప్ ఒక్కరోజే రూ. 35 వేల కోట్లు నష్టపోవడానికి కారణమైన ఆ నివేదికలో ఏముంది?

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ అమెరికన్ షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఈ ఏడాది జనవరిలో నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తి.

కానీ, ఆ నివేదిక వచ్చిన వెంటనే ఆయన సంపద 120 బిలియన్ డాలర్ల (రూ. 9.9 లక్షల కోట్లు) నుంచి 39.9 బిలియన్ డాలర్ల (రూ. 3.3 లక్షల కోట్లు)కు పడిపోయింది.

అంటే రాత్రికి రాత్రే అదానీ సంపద మూడింట ఒక వంతుకు తగ్గిపోయింది. భారీ పతనం అనంతరం గత కొద్ది నెలలుగా అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లలో కొద్దిగా రికవరీ కనిపిస్తోంది.

అయితే, మూడు రోజుల కిందట (2023 ఆగస్టు 31న) ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రిపోర్ట్స్ ఆధారంగా బ్రిటిష్ వార్తాపత్రికలు 'ది గార్డియన్' , 'ఫైనాన్షియల్ టైమ్స్' ప్రచురించిన కథనాలు అదానీ గ్రూప్‌ను మరోసారి ఇబ్బందుల్లో పడేశాయి.

ఈ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ కంపెనీలు దాదాపు రూ. 35,200 కోట్లు నష్టపోయాయి.

ఈ ఓసీసీఆర్‌పీ డాక్యుమెంట్లలో ఏముంది?

ఓసీసీఆర్‌పీ నివేదికల ఆధారంగా మూడురోజుల కిందట గార్డియన్, ఫైనాన్షియల్ టైమ్స్ కథనాలు ప్రచురించాయి.

దీని ప్రకారం.. మారిషస్‌లోని ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్ (EIFF), ఈఎం రిసర్జెంట్ ఫండ్ (EMRF) సంస్థలు 2013, 2018 మధ్య కాలంలో అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి.

అంతేకాకుండా, వాటాలను కొనుగోలు చేసి విక్రయించాయి. ఈ రెండు ఫండ్ల ద్వారా యూఏఈ ఇన్వెస్టర్ నాసిర్ అలీ షబానా అహ్లీ, తైవాన్ ఇన్వెస్టర్ చాంగ్ చుంగ్ లెంగ్ ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.

ఈ డబ్బును బెర్ముడా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయిన గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ (జీఓఎఫ్) నుంచి తీసుకువచ్చారు. 2017లో ఇరువురు పెట్టి ఈ పెట్టుబడి విలువ సుమారు 430 మిలియన్ డాలర్లు (రూ.3,550 కోట్లు).

2017 జనవరి నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లలో ఈ ఇద్దరికి వరుసగా 3.4, 4 , 3.6 శాతం వాటాలు ఉన్నాయి.

అదానీ

ఫొటో సోర్స్, REUTERS

గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీపై వచ్చిన ఆరోపణలేంటి?

వినోద్ అదానీ గౌతమ్ అదానీ సోదరుడు. అదానీ ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు కూడా.

ఓసీసీఆర్‌పీ నివేదిక ప్రకారం.. ఇఐఎఫ్‌ఎఫ్‌, ఇఎంఆర్‌ఎఫ్‌, జీఓఎఫ్‌‌ కంపెనీల ద్వారా వినోద్ అదానీకి చెందిన యూఏఈ ఆధారిత రహస్య కంపెనీలైన ఎక్సెల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్‌కి సలహా రుసుం కింద 11 కోట్ల రూపాయలు 2012 జూన్ నుంచి 2014 ఆగస్టు మధ్య చేరాయి.

వినోద్ అదానీ ఆదేశాలనుసారం అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఇఐఎఫ్‌ఎఫ్‌, ఇఎంఆర్‌ఎఫ్‌, జీఒఎఫ్‌లు పెట్టుబడులు పెడుతున్నట్లు ఓసీసీఆర్‌పీ విచారణలో తేలింది.

అంటే ఇఐఎఫ్‌ఎఫ్‌, ఇఎంఆర్‌ఎఫ్‌, జీఓఎఫ్‌‌ ఫండ్‌లు షెల్ కంపెనీలు. వాటి ద్వారా అదానీ గ్రూప్ కంపెనీలలో వినోద్ అదానీ భారీగా పెట్టుబడులు పెట్టారు. అంటే ఈ ఫండ్ ఆధారంగా కంపెనీ ఆర్థిక స్థితి మెరుగ్గా కనిపిస్తోంది.

దీంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీ స్థానం ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల, గ్రూప్ కంపెనీలకు పెట్టుబడిదారులు మళ్లారు. ఇదే సందర్భంలో స్టాక్ మార్కెట్‌లో షేర్ల పనితీరును బట్టి చూస్తే కంపెనీ వ్యాపారం అంత బాగా లేదు.

నిజానికి అదానీ గ్రూప్ కంపెనీల్లో వినోద్ అదానీ కోరిక మేరకు నాసిర్ అలీ, చాంగ్ చుంగ్ లెంగ్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాయి.

దీనిప్రకారం పరిశీలిస్తే అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లలో ప్రమోటర్ గ్రూప్ (వీటిలో వినోద్ అదానీ సభ్యుడు)కు 78 శాతానికి పైగా (జనవరి 2017) వాటా ఉంది.

ఇది సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) రూల్స్ 1957లోని రూల్ 19A ఉల్లంఘన. దీని ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని కంపెనీలు 25 శాతం పబ్లిక్ హోల్డింగ్ నియమాన్ని అనుసరించాలి.

సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్

రూల్ 19A అంటే ఏమిటి?

సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) రూల్స్-1957 నుంచి రూల్ 19Aను 2010 జూన్ 4న సవరణ ద్వారా తీసుకొచ్చారు. దీని ప్రకారం, స్టాక్ మార్కెట్‌లోని ప్రతి లిస్టెడ్ కంపెనీ 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నియమాన్ని అనుసరించాలి. అంటే, ఆ కంపెనీ 25 శాతం ట్రేడింగ్ కోసం ఉంచుకోవాలి.

అంటే దీనిలో జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు, ప్రమోటర్ పిల్లలు లేదా గ్రూప్‌లోని అనుబంధ కంపెనీలు, అసోసియేట్ కంపెనీల భాగస్వామ్యం ఉండకూడదు.

కంపెనీ షేర్ల ధరను నిర్ణయించడంలో ఇది ముఖ్యమైనది. ఈ నియమాన్ని ఉల్లంఘించి షేర్ల ధరలు కృత్రిమంగా మార్చినట్లు తెలుస్తోంది. ఇది అంతర్గత వ్యాపారాన్ని కూడా సూచిస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తుంది.

అయితే, ఒక కంపెనీకి 75 శాతం షేర్లు ఉండటం చట్ట విరుద్ధం కాదన్నారు భారత స్టాక్ మార్కెట్ నిపుణుడు అరుణ్ అగర్వాల్‌.

''అలా చేయడం ద్వారా మార్కెట్‌లో షేర్లకు కృత్రిమ కొరత ఏర్పడుతుంది. దీంతో కంపెనీ తన షేర్ల విలువను పెంచుతుంది. షేర్ల ధర పెరిగినప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్లో ఉన్న షేర్లను వాటి ధరలతో గుణించడం ద్వారా పొందిన విలువ) కూడా పెరుగుతుంది. అంటే కంపెనీ తన షేర్ల ధరలను తారుమారు చేయడం ద్వారా తన సంపదను పెంచుకుంటుంది'' అని వివరించారు అరుణ్.

ఈ నివేదికపై అదానీ గ్రూప్ ఏం చెప్పింది?

ఈ ఓసీసీఆర్పీ నివేదిక 'రీ-సైకిల్' అని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంటే పాత రిపోర్టునే కొత్త తరహాలో ప్రజెంట్ చేశారని తెలిపింది.

ఇది ప్రముఖ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు వక్రీకరించిన నివేదిక అని ఆరోపించింది. దీనికి విదేశీ మీడియాలోని ఒక విభాగం నుంచి కూడా మద్దతు ఉందని తెలిపింది.

జర్నలిస్టులు పేర్కొన్న మారిషస్ ఫండ్ గతంలో హిండెన్‌బర్గ్ నివేదికలో కూడా ఉందని, అవన్నీ దశాబ్ధాల కిందట మూసేసిన కేసుల ఆధారంగా ఉన్నాయంది. తమ గ్రూప్‌పై ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని ఆ ప్రకటన తెలిపింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్‌కు సంబంధించిన రెగ్యులేటరీ నిబంధనలను తమ కంపెనీలు అనుసరిస్తున్నాయని పేర్కొంది.

ఓవర్ ఇన్‌వాయిస్, విదేశాలకు నిధుల బదిలీ, సంబంధిత పార్టీ లావాదేవీలు, ఎఫ్‌పీఐ పెట్టుబడులపై వచ్చిన ఆరోపణలపై డీఆర్‌ఐ దర్యాప్తు చేసిందని అదానీ కంపెనీ తెలిపింది.

అదానీ గ్రూప్ వివరణపై అరుణ్ స్పందన

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, అదానీ గ్రూప్ వివరణపై అరుణ్ స్పందన

ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో సెబీ పాత్రను కూడా ప్రశ్నించింది.

అదానీ గ్రూప్‌లోకి అక్రమంగా నిధులు వచ్చాయని ఆరోపణలు వచ్చిన సమయంలో సెబీ సంస్థకు యూసీ సిన్హా చీఫ్‌గా ఉండేవారని గుర్తుచేసింది.

ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూప్ మీడియా వెంచర్ అయిన NDTVకి నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు.

అయితే దీనిపై యూసీ సిన్హాను 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రశ్నించగా.. నివేదికలో తన పేరు లేదన్నారు.

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ.. ‘2014లో అదానీ గ్రూప్‌పై విచారణ జరిగింది.

ఇందులో అదానీకి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిన పెద్దమనిషిని ఇప్పుడు NDTVలో డైరెక్టర్‌ని చేశారు, కాబట్టి ఏదో పెద్ద తప్పు జరిగిందని స్పష్టమైంది'' అని అన్నారు.

అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఓసీసీఆర్‌పీ ఎక్కడి సంస్థ?

ఓసీసీఆర్‌పీ అనేది పాత్రికేయులు సృష్టించిన పరిశోధనాత్మక సంస్థ. దీన్ని 2006లో స్థాపించారు.

ప్రారంభంలో దీనికి 'యునైటెడ్ నేషన్స్ డెమోక్రసీ ఫండ్' నిధులు సమకూర్చింది. మొదటి కార్యాలయం సరయేవోలో ప్రారంభించారు. సంస్థ ప్రారంభించినపుడు ఆరుగురు జర్నలిస్టులు ఉండేవారు. కానీ ఇప్పుడు 30 దేశాల నుంచి 150 కంటే ఎక్కువ మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు.

అవినీతి, నేరాల గ్లోబల్ నెట్‌వర్క్‌ను బాగా అర్థం చేసుకోవడానికి, బహిర్గతం చేయడానికి తమలో తాము సమాచారాన్ని సులభంగా పంచుకోగలిగే జర్నలిస్టుల వరల్డ్ నెట్‌వర్క్‌ను తయారుచేస్తోంది ఈ సంస్థ.

ఓసీసీఆర్‌పీ ఇప్పటివరకు 398 నేరాలు, అవినీతి చిట్టాలను బయటపెట్టింది. దీని కారణంగా 621 మంది అరెస్టయ్యారు. 131 మంది తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయా కంపెనీలకు రూ. 82 వేల కోట్లకు పైగా జరిమానా పడింది.

జార్జ్ సోరోస్

ఫొటో సోర్స్, Getty Images

జార్జ్ సోరోస్‌కు ఓసీసీఆర్‌పీతో సంబంధం ఏమిటి?

ప్రపంచంలోని అనేక పెద్ద సంస్థలు ఓసీసీఆర్‌పీకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ప్రపంచంలోని 120 దేశాలలో పనిచేస్తోంది. దీనిని 1984లో ఏర్పాటుచేశారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చినప్పుడు, విదేశీ పెట్టుబడిదారులకు, భారత పార్లమెంటుకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పవలసి ఉంటుందని జార్జ్ సోరోస్ వ్యాఖ్యానించారు.

జార్జ్ సోరోస్ హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త.

ఆయన తన సంపదలో దాదాపు 2.6 లక్షల కోట్లు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. ఇందులో రూ. 1.24 లక్షల కోట్లు ఇచ్చేశారు.

2021 వరకు ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ. 71 వేల కోట్లు.

ప్రభుత్వాలు తమ ప్రజలకు జవాబుదారీగా ఉండే శక్తిమంతమైన, సమగ్ర ప్రజాస్వామ్యం కోసం తమ సంస్థ పని చేస్తుందని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)