చాట్ జీపీటీని 'గూగుల్ కిల్లర్' అని ఎందుకు అంటున్నారు... ఏఐ రేసులో గూగుల్ ఎక్కడ?

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయి క్లీన్‌మన్
    • హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

ఈ నెలలో గూగుల్‌కు 25 ఏళ్లు నిండబోతున్నాయి. 1998లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఈ టెక్ దిగ్గజాన్ని మొదలుపెట్టినప్పటితో పోలిస్తే నేడు టెక్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి.

అప్పట్లో గూగుల్ మాత్రమే ఏకైక సెర్చ్ ఇంజిన్. 2014 నుంచి 2023 మధ్య యూట్యూబ్ హెడ్‌గా పనిచేసిన సుశాన్ వోయ్‌చికీ ఈ సెర్చ్ ఇంజిన్‌తో మొదటి అక్షరాలు దిద్దించారు.

అప్పటి నుంచి ఈ సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తూ వచ్చిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పేరును డిక్షనరీలో చేర్చి కూడా 17 ఏళ్లు అవుతోంది.

మొదట్లో అసలు ఈ పదాన్ని ఉపయోగించాలా వద్దా? ఎందుకంటే ఆ పదాన్ని ఉపయోగిస్తే ఆ సంస్థను ఉచితంగా ప్రమోట్ చేసినట్లు అవుతుందని బీబీసీలో చర్చ జరిగిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది.

ప్రస్తుతం ఆల్ఫాబెట్‌ గ్రూపు కంపెనీలలో ఒకటిగా కొనసాగుతున్న గూగుల్ టెక్నాలజీలోని ప్రతి రంగంలోకీ విస్తరించింది. కొన్ని రంగాల్లో సంస్థ తిరుగులేని ఆధిపత్య కనబరుస్తోంది. కొన్ని దేశాల్లోని యాంటీ-కాంపిటీషన్ రెగ్యులేటర్ల దర్యాప్తుకూ ఇది కారణం అవుతోంది.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో తన మార్కు చూపించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. అయితే, ఈ రేసులో గూగుల్ వెనకబడిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

హిట్‌లు, మిస్‌లు

ఈ-మెయిల్, స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, డ్రైవర్‌లెస్ కార్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వీడియో స్ట్రీమింగ్ ఇలా గూగుల్ వందలకొద్దీ ప్రాడక్టులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే, వీటిలో అన్నీ విజయవంతం కాలేదు.

ఇలా మధ్యలోనే అటకెక్కించిన 288 ప్రాడక్టులు గూగుల్ వెబ్‌సైట్‌లో మనకు కనిపిస్తాయి. వీటిలోనే గేమింగ్ ప్లాట్‌ఫామ్ స్టాడియా, బడ్జెట్ వీఆర్ హెడ్‌సెట్ గూగుల్ కార్డ్‌బోర్డ్ కూడా ఉన్నాయి.

శరవేగంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగించగలదా అనేదే అసలు ప్రశ్న.

ప్రస్తుతం ఏఐలో గూగుల్ వెనకపడిందని సంస్థ లోపలి నుంచే కొన్ని వదంతులు కనిపిస్తున్నాయి. ఓ గూగుల్ ఇంజినీర్ బయటపెట్టిన మెమోలో ఈ రేసులో తాము విజయం సాధించలేమేమోనని పైఅధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

చాట్‌బాట్‌ల రేసులో ఈ ఆందోళన మరింత స్పష్టంగా వ్యక్తం అవుతోంది.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

చాలా మందితో తొలిసారి మాట్లాడిన ఏఐ చాట్‌బాట్‌గా చాట్‌జీపీటీ చరిత్ర సృష్టిస్తోంది. 2022 నవంబరులో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బాట్ ప్రజల మన్ననలు కూడా పొందుతోంది.

చాట్‌జీపీటీకి మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా అందాయి. ఈ చాట్‌బాట్ సాయంతో బింగ్ సెర్చ్ ఇంజిన్, ఆఫీస్ 365 లాంటి సొంత ఉత్పత్తులకు మెరుగులు దిద్దేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది.

చాట్‌జీపీటీని ‘గూగుల్ కిల్లర్’ అని చాలా మంది పిలుస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నకు సమాధానంగా మరిన్ని పేజీల్లోకి తీసుకెళ్లే బదులు నేరుగా ఇది సమాధానం చెబుతోంది.

దీని కోసం ‘ట్రాన్స్‌ఫార్మర్‌’గా పిలిచే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్‌ను చాట్‌జీపీటీ ఉపయోగించుకుంటోంది. నిజానికి ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిచయం చేసింది గూగులే.

చాట్‌జీపీటీకి పోటీగా ఒక కొత్త చాట్‌బోట్ ‘బార్డ్’ను గూగుల్ తీసుకొచ్చింది. కానీ, దీని ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

బార్డ్‌ను ఉపయోగించడానికి చాలా నిబంధనలు పెట్టారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు దీన్ని ఉపయోగించకూడదనే నిబంధన కూడా దీనిలో ఒకటి. ఇది ఇంకా పరీక్షల దశలోనే ఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

ఈ నిబంధలకు ప్రస్తుతం టెక్ రంగంలో పరిస్థితులే కారణం కావచ్చు.

గూగుల్

ఫొటో సోర్స్, getty images

అలా ఎలా?

చాట్‌బాట్‌లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎల్‌ఎల్ఎం టెక్నాలజీతో పనిచేస్తాయి. గూగుల్ సొంత ఎల్ఎల్ఎం పేరు లామ్డా.

దీని కోసం పనిచేసిన ఒక ఇంజినీర్ లామ్డాకు కొన్ని ఫీలింగ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దీన్ని రుజువు చేసేందుకు కొన్ని పేజీలను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిలో లామ్డాకు భావోద్వేగాలు, సొంత ఆలోచనా విధానం ఉన్నట్లు చెబుతున్నారు.

నిజానికి ఎల్‌ఎల్ఎంలను ఇవే లక్ష్యాలతో మెరుగుపరుస్తున్నారు. అచ్చం మనుషుల్లానే స్పందించేలా వీటికి మెరుగులు దిద్దుతున్నారు. అయితే, ఆ ఇంజినీరు చెప్పిన అంశాలను గూగుల్ తిరస్కరించింది. అంతేకాదు, ఆయనను విధుల నుంచి తొలగించింది కూడా.

కానీ, అప్పటికే ఈ విషయంపై ప్రపంచ నలుమూలలకూ వార్తలు వ్యాపించాయి. కొంతమంది ఇలాంటి చాట్‌బాట్‌లపై ఆందోళన కూడా వ్యక్తంచేశారు.

ఈ ఏఐ రేసులో ముందుకు వచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తూనే ఉంది. గత మే నెలలో జరిగిన ఐవో డెవలపర్స్ కాన్ఫెరెన్స్‌లో 25 కొత్త ఏఐ ప్రాడక్టులను తీసుకువస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏఐ రంగంలో తాము ముందంజలో ఉన్నామని తమ వెబ్‌సైట్‌లోనూ గూగుల్ రాసుకొచ్చింది.

తమ గూటికి చెందిన డీప్‌మైండ్ సంస్థ ఏఐ ప్రోగ్రామ్ ఆల్ఫాఫోల్డ్ కొత్త ఔషధాల అభివృద్ధికి కూడా కృషిచేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

గత ఆగస్టులో గార్ట్‌నర్ సంస్థ విశ్లేషకుడు గూగుల్ నెక్ట్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏఐ ఎకానమీలో ఆధిపత్యం కోసం గూగుల్ కృషిచేస్తుంది’’ అని చెప్పారు.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

‘‘అప్పుడే అంచనాకు రాకూడదు’’

గూగుల్ ఏఐపై అప్పుడే ఒక అంచనాకు వచ్చేయడం తొందరపాటు అవుతుందని క్రియేటివ్ స్ట్రాటజీస్ సంస్థ విశ్లేషకురాలు కరోలినా మిలనేసి చెప్పారు.

‘‘చార్‌బాట్ రేసులో గూగుల్ వెనకపడిందనే వాదనతో నేను ఏకీభవించను. అటు కన్జూమర్లు, ఇటు సంస్థలు రెండు వైపుల నుంచీ ఏఐ రంగంలో వారికి చాలా అవకాశాలు ఉన్నాయి’’ అని ఆమె అన్నారు.

ఆమె మాటలతో ఇన్వెస్టింగ్ సంస్థ హార్‌గ్రీవ్స్ లాన్స్‌డౌన్‌లోని మనీ, మార్కెట్స్ విభాగం హెడ్ సుశానా స్ట్రీటర్ కూడా ఏకీభవించారు.

గూగుల్ రహస్య ఆయుధం క్లౌడ్ బిజినెస్ ఇప్పటికీ చక్కగా పనిచేస్తుందని సుశానా అన్నారు. క్లౌడ్ కంపెనీలు తమ కంప్యూటర్లు, ప్రాసెసింగ్ సామర్థ్యంతో చాలా కంపెనీలకు సేవలు కల్పిస్తుంటాయి. ఇప్పటికీ చాలా కంపెనీలకు ఈ స్టోరేజీ ఖర్చులను భరించే స్థోమత లేదు.

‘‘గూగుల్ క్లౌడ్ బిజినెస్‌తో ఏఐ విప్లవానికి కేంద్రంగా ఆల్ఫాబెట్ మారుతోంది. జెనరేటివ్ ఏఐ నెట్‌వర్క్‌లకు క్లౌడ్ సేవల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని ఆమె అన్నారు.

‘‘ఇతర క్లౌడ్ దిగ్గజాలైన అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ లాంటి సంస్థలతో పోలిస్తే గూగుల్ క్లౌడ్ సేవలు కాస్త పరిమితమైనవే అయినప్పటికీ వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది’’ అని ఆమె చెప్పారు.

గూగుల్ కన్జూమర్ సేవలను వారం రోజులపాటు వాడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో జర్నలిస్టు టిమ్ డౌలింగ్ గతంలో ఒక కథనాన్ని ప్రచురించారు. ఇది కొవ్వొత్తుల వెలుగులో షాపింగ్ చేసినట్లే ఉంటుందని చెప్పారు.

ఇదే రీతిలో కొన్ని గూగుల్ ఏఐ ప్రాడెక్టులు విజయం సాధించినా మార్కెట్‌లో సంస్థ ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంటుంది.

వీడియో క్యాప్షన్, సుందర్ పిచాయ్ బర్త్ డే :ఫోన్, టీవీ లేని కుటుంబం నుంచి గూగుల్ సీఈఓ దాకా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)