డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ కావాలనే ఓడించిందా, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, GOVERNMENT OF MAHARASHTRA
- రచయిత, నామ్‌దేవ్ కాట్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను ఎన్నికల్లో గెలివనివ్వలేదని ఆయన అందులో రాశారు.
సంతోష్ పోస్టుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే స్పందించారు. అంబేడ్కర్‌పై హిందూ మహాసభ కూడా అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన బదులిచ్చారు.
దీంతో ఈ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీసింది. అసలు భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఏం జరిగింది?
భారత్‌లో తొలి ఎన్నికలు
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ నాలుగు నెలల పాటు 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకూ కొనసాగింది.
ఈ మొదటి ఎన్నికల్లో లోక్‌సభలోని 489 సీట్లకు గానూ 1500 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 50కి పైగా పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి.
అందులో సుమారు వంద నియోజకవర్గాలకు ఇద్దరు సభ్యులు ప్రాతినిధ్యం వహించేవారు. అంటే, ఒక ఎంపీ సీటు నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎంపికయ్యేవారు. వారిలో ఒకరు జనరల్ కోటా అభ్యర్థి కాగా, రెండోవారు రిజర్వ్ కేటగిరీకి చెందిన వారు. 1960లో ఈ ఇద్దరు సభ్యుల విధానాన్ని రద్దయ్యి, ఒక నియోజకవర్గానికి ఒకరే ఎంపీ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అదే విధానం అమల్లో ఉంది.
తొలిసారి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బాంబే నుంచి బరిలోకి దిగారు. అప్పట్లో దానిని బాంబే ప్రావిన్స్‌గా పిలిచేవారు. ఆయన నార్త్ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అది ఇద్దరు ఎంపీలు ఉండే నియోజకవర్గం.

ఎన్నికల బరిలో అంబేడ్కర్
ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు, 1951 సెప్టెంబర్ 27న అంబేడ్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. హిందూ కోడ్ బిల్లు, ఇతర కొన్ని విషయాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు.
అప్పటికి అంబేడ్కర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించి కొద్దికాలమే అయింది. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ఎన్నికల వ్యూహాలను ప్రారంభించారు.
ఆ ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన పార్టీ తరపున అభ్యర్థులు పోటీలో నిలిచారు. వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా ఒకరు.
ఈ ఎన్నికల్లో అంబేడ్కర్‌కు పోటీ ఎవరు? పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరు? ఎన్నికల పోరు ఎలా సాగిందనే విషయాలను తెలుసుకునే ముందు, అసలు ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.
దేశంలో తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, జన సంఘ్, సోషలిస్ట్ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.
స్వాతంత్య్రోద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ అప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. అలాంటి కాంగ్రెస్‌ను ఎదుర్కొని మనుగడ సాధించడమనేది మిగిలిన పార్టీలకు అతిపెద్ద సవాల్‌గా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అంబేడ్కర్, సోషలిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల ప్రకటన వెలువడిన వారంలోనే అంబేడ్కర్‌కి చెందిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, సోషలిస్ట్ పార్టీ మధ్య పొత్తు కుదిరింది.
''ఈ ఒప్పంద ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకూడదు. అలాగే, కొన్ని జిల్లాల్లోని జనరల్ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థులను నిలబెడుతుంది. వారికి సోషలిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన జనరల్ నియోజకవర్గాల్లో అంబేడ్కర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మద్దతు ఇస్తుంది'' అని ఆచార్య ఆత్రే తన పుస్తకం 'కర్హేచే పానీ'లో రాశారు.

ఫొటో సోర్స్, EPARLIB.NIC.IN
ఈ మేరకు 1951 నవంబర్ 1న దిల్లీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సోషలిస్ట్ పార్టీకి చెందిన ఎస్‌ఎం జోషీ, మొయినుద్దీన్ హారిస్, అంబేడ్కర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌కి చెందిన దాదా సాహెబ్ గైక్వాడ్ సంతకాలు చేశారు.
ఇద్దరు ఎంపీలు ఉండే నార్త్ ముంబై నియోజకవర్గంలో జనరల్ కేటగిరీ అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ నేత అశోక్ మెహతాను సోషలిస్ట్ పార్టీ పోటీకి నిలబెట్టింది. అదే నియోజకవర్గం నుంచి రిజర్వ్‌డ్ అభ్యర్థిగా అంబేడ్కర్ కూడా ఎన్నికల బరిలో నిలిచారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నుంచి మరో 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ జనరల్ అభ్యర్థిగా వీబీ గాంధీకి టిక్కెట్ ఇచ్చింది. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థిగా నారాయణరావు కాజ్రోల్కర్‌ను అంబేడ్కర్‌పై పోటీకి నిలిపింది. కమ్యూనిస్టు పార్టీ నుంచి శ్రీపాద్ అమృత్ డాంగే, రామ రాజ్య పార్టీ నుంచి కేశవ్ జోషీ, హిందూ నేత గోపాల్ రావ్ దేశ్‌ముఖ్ నియోజకవర్గంలోని రెండు కేటగిరీలకు పోటీ చేశారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రావ్ కాజ్రోల్కర్ మధ్యనే ప్రధాన పోటీ అని అంతా భావించారు.

ఫొటో సోర్స్, MEA
శివాజీ పార్కు మీటింగ్‌కి లక్షలాది మంది
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సారథ్యంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, సోషలిస్ట్ పార్టీ ముంబైలో భారీగా సభలు నిర్వహించింది. ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సుమారు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది హాజరయ్యారు.
''సమాజ్‌వాదీ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ జతకలిశాయి. పరస్పర సహకారంతో నాలుగడుగులు ముందుకు వేయగలమని విశ్వసిస్తున్నా. ఈ కూటమి వల్ల ఉమ్మడి మహారాష్ట్ర కల సాకారమవుతుందని ఆశిస్తున్నా. అధికారం హస్తగతం చేసుకోలేకపోయినా, కాంగ్రెస్‌కి బలమైన ప్రతిపక్షంగా ఉంటూ, దాని దురాచారాలను వెలుగులోకి తెస్తాం'' అని ఆ సభలో అంబేడ్కర్ ప్రసంగించారు.
''శివాజీ పార్కులో నిర్వహించిన సభకు వచ్చిన లక్షలాది మంది డాక్టర్ అంబేడ్కర్ అంటూ నినాదాలు చేశారు. సమాజ్‌వాదీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కూటమికి అనూహ్యమైన మద్దతు వచ్చింది. అది నా చెవుల్లో ఇంకా మార్మోగుతోంది'' అని ఆచార్య ఆత్రే రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అంబేడ్కర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టిందా?
ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం దేశాన్ని షాక్‌కి గురిచేశాయి. ఎందుకంటే నారాయణ్ రావ్ కాజ్రోల్కర్‌కి ఆ ఎన్నికల్లో లక్షా 38 వేల 137 ఓట్లు రాగా, బాబాసాహెబ్ అంబేడ్కర్‌కి లక్షా 23 వేల 576 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రావ్ అంబేడ్కర్‌ను ఓడించారు. అది కూడా 14 వేల 561 ఓట్లతో.
కాంగ్రెస్ అధిష్టానం కావాలనే అంబేడ్కర్‌ను ఓడించిందనే ఆరోపణ అప్పటి నుంచి కొనసాగుతూ వస్తోంది.
కాంగ్రెస్ నిజంగా అంబేడ్కర్‌ను ఓడించిందో లేదో తెలుసుకోవాలంటే అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ముంబయికి చెందిన కాంగ్రెస్ నేత ఎస్.కె. పాటిల్ బాంబే కాంగ్రెస్ కమిటీలో కీలకం. ఆయన్ను కాదని వేరొకరి మాట చెల్లే పరిస్థితులు లేవు. బాంబే కాంగ్రెస్ కమిటీలో ఆయన ఆధిపత్యమే కొనసాగుతోంది. పార్టీ అభ్యర్థి పేరు ముంబయిలో ఖరారైనా, దిల్లీలో ఖరారైనా పాటిల్ ఆమోదం లేకుండా జరిగేది కాదు.
అంతలా పాటిల్ ముంబయి కాంగ్రెస్‌లో ఆధిపత్యం సాగేది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ''రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి అంబేడ్కర్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టదు'' అని పాటిల్ ప్రకటించారు.
అలాంటప్పుడు, నారాయణ్ రావ్‌ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలబెట్టిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

''ముంబయిలో రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేస్తే అంబేడ్కర్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టదని ఎస్.కె. పాటిల్ ముందుగా ప్రకటించారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పొత్తు పెట్టుకోవడం పాటిల్‌కు రుచించలేదు. దీంతో ఆయన అంబేడ్కర్‌పై పోటీకి నారాయన్ రావ్ కాజ్రోల్కర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు'' అని ఆత్రే తన పుస్తకంలో రాశారు.
సోషలిస్టులను ఎస్.కె. పాటిల్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులపై ఆయన ఆగ్రహం అందరికీ తెలుసు.
పాటిల్‌కి అంబేడ్కర్‌పై గౌరవం ఉన్నప్పటికీ సోషలిస్టులపై లేదు. ఎన్నికల వేళ అంబేడ్కర్ సోషలిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కి వ్యతిరేకంగా తమ అభ్యర్థిని బరిలోకి దించింది.
అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టబోమని పాటిల్ ప్రకటించే నాటికి, నెహ్రూ క్యాబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు అంబేడ్కర్. ఆ తర్వాత ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగడం, సోషలిస్టులతో పొత్తు పెట్టుకోవడంతో ఆయనకు మద్దతు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. పాటిల్ తన హామీని నెరవేర్చలేదు.
అంబేడ్కర్‌తో సాంగత్యం గురించి ఆయన రెండో భార్య మాయీ అంబేడ్కర్ రాసిన ఆమె జీవితచరిత్రలో, న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రస్తావించారు.
''ముంబయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్.కె. పాటిల్ రాజకీయ సహకారం గురించి బాబాసాహెబ్‌కు లేఖ రాశారు. అయితే, అప్పుడాయన న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అందువల్ల ఆయన బాబాసాహెబ్‌తో చర్చలు జరిపి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌తో సమన్వయం చేసుకోవాలి. కానీ, బాబాసాహెబ్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ తర్వాత అలాంటి పరిస్థితి లేదు'' అని మాయీ అంబేడ్కర్ రాశారు.
అయితే, ఇక్కడ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని నమ్మేవారు ఉన్నారు, అలాగే కమ్యూనిస్టుల వల్లే అంబేడ్కర్ ఓడిపోయారని నమ్మేవారూ ఉన్నారు.
కమ్యూనిస్టుల వల్లే అంబేడ్కర్‌కు ఓట్లు రాలేదని ఆచార్య ఆత్రే ఆరోపించారు. రిజర్వుడ్ సీటు నుంచి పోటీ చేస్తున్న ఎవరికీ ఓట్లు వేయొద్దని కమ్యూనిస్టులు ప్రచారం చేశారని, అది కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రావ్‌కి కలిసొచ్చిందని ఆత్రే చెప్పారు.
బాబాసాహెబ్ రెండో భార్య మాయీ అంబేడ్కర్ కూడా తన జీవిత చరిత్ర పుస్తకంలో కమ్యూనిస్టులపై అవే తరహా ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, VIJAY SURWADE
నారాయణ్ రావ్‌ను పెద్ద మనసుతో క్షమించారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఓటమితో చాలా మంది బాధపడ్డారు. తనను ఓడించిన నారాయణ్ రావ్‌ను అంబేడ్కర్ ఉదార మనసుతో క్షమించారు.
విజయం సాధించిన తర్వాత నారాయణ్ రావ్ ఆశీస్సులు తీసుకునేందుకు అంబేడ్కర్ వద్దకు వెళ్లారు. అప్పుడు ఆయన్ను ఆశీర్వదిస్తూ ''మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా, నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి'' అని అంబేడ్కర్ అన్నారు.
''లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మేం దిల్లీలో ఉన్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మేం ముంబయికి వచ్చాం. అప్పుడు సిద్ధార్థ కాలేజీలోనో, కులబ్యాలోని జయరాజ్ ఇంట్లోనో బస చేశాం. బాంబే పీపుల్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశాల కోసం వచ్చినట్టున్నాం. మూడు, నాలుగు రోజులు ఉన్నాం'' అని మాయీ అంబేడ్కర్ రాశారు.
''ఒకరోజు బాబాసాహెబ్‌ను కలిసేందుకు నారాయణ్ రావ్ కాజ్రోల్కర్ సిద్ధార్థ కాలేజీకి వచ్చారు. ఆయన ముందు నిలబడడానికి నారాయణ్ రావ్ కాస్తా ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన సంకోచిస్తూనే బాబాసాహెబ్ దగ్గరకు వచ్చారు. ఆయన్ను చూడగానే బాబాసాహెబ్ చాలా ఆప్యాయంగా పిలిచారు. నారాయణ్ రావ్ వెంటనే వచ్చి కాళ్లకు నమస్కారం చేశారు. బాబాసాహెబ్ రెండు చేతులతో ఆయన్ను పైకి లేపి పక్కన కూర్చోబెట్టుకున్నారు. విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు''

ఉప ఎన్నికలోనూ ఓటమి
ఎన్నికల్లో ఓటమితో అంబేడ్కర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికే ఆయన అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది.
ఆయన ఓటమి గురించి పెద్ద చర్చ జరిగింది. తన ఓటమికి కారణమని ఎవరినీ నిందించని అంబేడ్కర్, ఒక సందర్భంలో ఎన్నికలను క్రికెట్‌తో పోల్చారు. ఓడిపోయిన జట్టు అలాగే కూర్చుండిపోకూడదని, తరువాతి పోటీకి సన్నద్ధం కావాలని అన్నారు.
ఆ తర్వాత ఆయన బాంబే ప్రావిన్స్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. కానీ, ఆయన లోక్‌సభకు వెళ్లాలని భావించారు.
ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన బాంద్రా ఉపఎన్నికల్లో అంబేడ్కర్ పోటీ చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
అదే అంబేడ్కర్ పోటీ చేసిన చివరి ఎన్నిక. ఆ తర్వాత రెండేళ్లకు 1956లో ఆయన చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?
- కుంభమేళా: యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్‌వో ఎందుకు హెచ్చరించింది?
- ఇండియా-భారత్: గత వందేళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయంటే...
- పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














