అమెరికా అధ్యక్షుడు వస్తుంటే ప్రపంచమే స్తంభించి పోతుందా? మూడంచెల భద్రతావలయం, ఏడు విమానాలు, హోటల్లో మూడు ఫ్లోర్లు, ఒక 'ది బీస్ట్' కారు, ఇంకా...

అమెరికా అధ్యక్షుడి భద్రత

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రపంచ అగ్రదేశాధినేతలందరూ భారత్‌కు వస్తున్నారు. దీంతో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ వస్తుండగా, ఆయనతోపాటూ ఆయన సెక్యూరిటీ పటాలం మొత్తం దిల్లీకి కదిలివస్తోంది.

అమెరికా అధ్యక్షుడి భద్రత గురించి హాలీవుడ్‌లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన భద్రతా వలయం గురించి అందులో కథలు కథలుగా చూపిస్తారు. ఆ హంగామా అంతా వాస్తవమే.

అధ్యక్షుడి భద్రతలో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ ఏజెన్సీ 1865లో ఏర్పడినప్పటికీ, 1901 నుంచి దీనికి అమెరికా అధ్యక్షుడికి భద్రతా బాధ్యతలను అప్పగించారు.

ఈ సీక్రెట్ సర్వీసులో దాదాపు ఏడు వేల మంది ఏజెంట్లు, అధికారులు పనిచేస్తారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు.

వీరి ట్రైనింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన శిక్షణల్లో ఒకటిగా భావిస్తారు.

అమెరికా అధ్యక్షుడి భద్రత

ఫొటో సోర్స్, GETTY IMAGES

మూడు నెలలు ముందు నుంచే పనులు ప్రారంభం

అమెరికా అధ్యక్షుడిని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతగా భావించినప్పటికీ, ఆయన భద్రత విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం సీక్రెట్ సర్వీస్‌కే ఉంటుంది.

తనను ఒంటరిగా వదిలేయాలని, అధ్యక్షుడు స్వయంగా కోరినా, ఆ ఆదేశాలను వారు స్వీకరించరు.

అమెరికా అధ్యక్షుడు వేరే ఏ దేశానికైనా వెళ్లాలని నిర్ణయించుకుంటే.. నిర్ధారిత తేదీకి దాదాపు మూడు నెలల ముందు నుంచే సీక్రెట్ సర్వీస్ తమ పనులు ప్రారంభిస్తుంది.

అధ్యక్షుడు భద్రతా వలయంలో ఉంటారు. అందులో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. అది అత్యంత బలమైనదే కాదు, అత్యంత ఖరీదైనది కూడా.

నిజానికి అమెరికా తమ నలుగురు అధ్యక్షులు హత్యకు గురికావడాన్ని చూసింది.

1865లో అబ్రహాం లింకన్, 1881లో జేమ్స్ గార్‌ఫీల్డ్, 1901లో విలియమ్ మెకిన్లే, 1963లో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురయ్యారు.

అందుకే, తమ అధ్యక్షుడికి భద్రత విషయాన్ని అమెరికా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది.

ఇప్పుడు ఈ సెక్యూరిటీలో ఏమేం ఉంటాయో చూద్దాం

అధ్యక్షుడికి మూడు లేయర్లతో సెక్యూరిటీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

మూడు సెక్యూరిటీ లేయర్లు

అమెరికా అధ్యక్షుడికి మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. అన్నిటికంటే లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్, మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఆ తర్వాత పోలీసులు ఉంటారు.

ఇప్పుడు ఆయన దిల్లీ వస్తున్నారు కాబట్టి.. వీటికి అదనంగా దిల్లీ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో కూడిన మరొక సెక్యూరిటీ లేయర్ కూడా ఉంటుంది.

అమెరికా సీక్రెట్ సర్వీస్, వైట్ హౌస్ స్టాఫ్ రెండు మూడు నెలల ముందే ఆయా దేశాలకు వచ్చి స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీలను కలుస్తారు.

అక్కడి ఇంటెలిజెన్స్ బ్యూరో వీవీఐపీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడుతారు.

అధ్యక్షుడు ఎక్కడ బస చేయాలి అనేది సీక్రెట్ సర్వీస్ నిర్ణయిస్తుంది. ఆ ప్రాంతాన్ని నిశితంగా తనిఖీలు చేస్తుంది. హోటల్ సిబ్బంది నేపథ్యాన్ని కూడా చెక్ చేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

సెక్యూరిటీ ప్రోటోకాల్

వీటితోపాటూ ఇంకా చాలా ఏర్పాట్లు ఉంటాయి. అంటే, ఎయిర్ పోర్ట్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా ల్యాండింగ్ స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఆయన ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంతోపాటూ, మరో ఆరు బోయింగ్ సీ17 విమానాలు కూడా అక్కడ ల్యాండ్ అవుతాయి.

వాటిలో హెలికాప్టర్ ఉంటుంది. ఆయన లిమోజిన్ కార్లు ఉంటాయి. కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఎంతోమంది ఏజెంట్లు, స్టాఫ్ మెంబర్స్ కూడా వస్తారు.

ఆయన ఎక్కడికి వెళ్తుంటే ఆ దేశ లోకల్ ఏజెన్సీలు, సీక్రెట్ సర్వీస్ కలిసి అధ్యక్షుడి కాన్వాయ్ రూట్‌ను నిర్ణయిస్తాయి.

ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు అధ్యక్షుడిని అక్కడి నుంచి ఎలా తప్పించాలి, ఏదైనా దాడి జరిగితే, సురక్షితమైన ప్రాంతం ఏది అనేది చూసుకుంటారు.

చుట్టుపక్కల ఏయే ఆస్పత్రులు ఉన్నాయో చూస్తారు. అధ్యక్షుడు బస చేసిన ప్రాంతం హాస్పిటల్‌కు 10 నిమిషాల కంటే ఎక్కువ దూరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఎమర్జెన్సీలో డాక్టర్లతో కోఆర్డినేట్ చేసుకోడానికి వీలుగా చుట్టుపక్కల ఉన్న ప్రతి హాస్పిటల్ దగ్గర ఒక ఏజెంట్‌ను మోహరిస్తారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తే ఇవ్వడానికి వీలుగా అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ బ్లడ్ కూడా వారి దగ్గర ఉంటుంది.

అధ్యక్షుడి ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ సీక్రెట్ ఏజెంట్స్ అధ్యక్షుడి మార్గంలో ఉన్న ప్రతి స్టాఫ్‌ను చెక్ చేస్తారు.

ఆయన ఏ హోటల్లో బస చేస్తారో దానికి చుట్టుపక్కల మార్గాల్లో పార్క్ చేసిన కార్లు, వాహనాలను మొత్తం తొలగిస్తారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడు ఏ హోటల్‌లో బస చేస్తారు

అధ్యక్షుడు బస చేసిన హోటల్లో ఆయన గది ఉన్న ఫ్లోర్ మాత్రమే కాదు, దానికి పైన, కింద ఉన్న అంతస్తులు కూడా ఖాళీ చేయిస్తారు. కేవలం ఆయన స్టాఫ్ మాత్రమే అక్కడ ఉంటారు.

అధ్యక్షుడు ఉండబోయే గదిని నిశితంగా పరిశీలిస్తారు. రహస్యంగా ఏవైనా కెమెరాలు, రికార్డింగ్ డివైస్‌లు దాచారేమో చూడ్డానికి తనిఖీ చేస్తారు.

హోటల్ వారి టీవీ, ఫోన్లు కూడా తొలగిస్తారు. కిటికీలన్నింటికీ బులెట్ ప్రూఫ్ షీల్డ్ బిగిస్తారు.

అధ్యక్షుడి భోజనం, కుకింగ్ స్టాఫ్ కూడా ఆయనతోపాటే అమెరికా నుంచి వస్తారు.

ఆయనకు భోజనం వారే తయారు చేసి, వడ్డిస్తారు. అక్కడ కూడా ఎలాంటి సమస్యలూ రాకుండా సీక్రెట్ సర్వీస్ పూర్తి నిఘా పెడతారు.

సీక్రెట్ సర్వీస్‌కు మరో పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. ప్రతి క్షణం అధ్యక్షుడి వెన్నంటి ఉండే ఆర్మీ అధికారిని కూడా వారు సురక్షితంగా చూసుకోవాల్సి ఉంటుంది.

ఆ అధికారి దగ్గర యూఎస్ న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేయగలిగే బ్రీఫ్‌కేస్ ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడు లిమోజిన్ కార్లో ప్రయాణిస్తారు. ఆ కారుకు ద బీస్ట్ అనే పేరుంది. ఈ కారులో అన్ని రకాల ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి.

బుల్లెట్ ప్రూఫ్ కారులో ఎన్నో డిఫెన్సివ్ పరికరాలు, టెక్నాలజీ ఉంటుంది. వీటిలో స్మోక్ స్క్రీన్, టియర్ గ్యాస్, నైట్ విజన్ టెక్నాలజీ, గ్రెనేడ్ లాంచర్ లాంటివి ఉంటాయి.

ఈ కారు కెమికల్ దాడులను కూడా తట్టుకోగలిగేలా సురక్షితంగా ఉంటుంది.

ది బీస్ట్‌ను నడిపే డ్రైవర్లు ఎలాంటి దాడి జరిగినా కారును 180 డిగ్రీల్లో వెనక్కు తిప్పగలిగేలా శిక్షణ పొంది ఉంటారు.

2015లో భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2015లో భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు...

2015లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. భారత సంప్రదాయం ప్రకారం ఆయన ఆ సమయంలో భారత రాష్ట్రపతితో కలిసి వేదిక వరకూ రావాల్సి ఉంది. కానీ, ఒబామా తన బులెట్ ప్రూఫ్ కారు ది బీస్ట్‌లోనే వేదిక వరకూ వచ్చారు.

ఆ రోజు ఒబామా తన సెక్యూరిటీలో ఒక ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. సీక్రెట్ సర్వీస్ గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్షుడు 45 నిమిషాలకంటే ఎక్కువ సమయం ఓపెన్ ఎయిర్ వెన్యూలో ఆగకూడదు. కానీ, అధ్యక్షుడు ఒబామా ఆ రోజు 2 గంటలపాటు రిపబ్లిక్ డే వేదికపై ఉన్నారు.

అయితే, అధ్యక్షుడి గురించి మొత్తం సమాచారం సీక్రెట్ కాదు. సీక్రెట్ సర్వీస్‌లో గతంలో పనిచేసిన వారు దీనిపై ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. దీనిపై పుస్తకం రాసిన జోసెఫ్ పెట్రో అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్‌లో 23 ఏళ్లు స్పెషల్ ఏజెంటుగా పని చేశారు. ఇక వందమందికి పైగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను ఇంటర్వ్యూ చేసిన రొనాల్డ్ కాస్లర్ ‘ఇన్ ద ప్రెసిడెంట్స్ సీక్రెట్ సర్వీస్’ అనే ఒక పుస్తకం రాశారు.

అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా, అందులో వేలమంది ఇన్వాల్వ్ అవుతారు. అందుకే, “అమెరికా అధ్యక్షుడు విదేశీ ప్రయాణం చేస్తే ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది” అని ఒకసారి బీబీసీ వైట్ హౌస్ రిపోర్టర్ రాశారు.

వీడియో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు వస్తుంటే ప్రపంచమే స్తంభించి పోతుందా? ఎందుకు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)