భారత్: రాజ్యాంగ ముసాయిదాలో లేని ఈ పదం తర్వాత ఎలా చేరింది?

అంబేద్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE'S ARCHIVAL COLLECTION NAVAYANA

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు దేశం పేరుపై జరిగిన చర్చల్లో తుది నిర్ణయం ఏం తీసుకున్నారు? రాజ్యాంగంలోని మొదటి ముసాయిదాలో 'భారత్' పేరు ఉందా? ఆ పేరు ఎప్పుడొచ్చింది?

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత (1945లో) జరిగిన బ్రిటన్ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో భారతదేశానికి స్వాతంత్ర్య ఇస్తామంటూ వాగ్దానాలను చేర్చాయి.

ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. 1945 సెప్టెంబర్లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్, భారతదేశానికి పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించే దిశలో ముందుకు సాగాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

ఆ తర్వాత పనులు చాలా వేగంగా ముందుకు సాగాయి. చివరికి దేశం ఇండియా, పాకిస్తాన్‌లుగా విడిపోయి 1947 ఆగస్టు 14-15 తేదీల్లో స్వాతంత్య్రం పొందాయి. తదనంతరం రాష్ట్ర అసెంబ్లీలు భారత రాజ్యాంగ సభగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాంగ సభలో జరిగిన చర్చల ఆధారంగా డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.

రాజ్యాంగ ముసాయిదా
ఫొటో క్యాప్షన్, రాజ్యాంగ ముసాయిదాలోని పత్రం

రాజ్యాంగం మొదటి ముసాయిదాలో 'భారత్' లేదు

డాక్టర్ అంబేద్కర్ ఈ ముసాయిదాను 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో సమర్పించారు. ఈ మొదటి ముసాయిదాలో దేశం పేరును పేర్కొన్న ఆర్టికల్ 1లో 'భారత్' అనే పదం కనిపించలేదు.

"ఇండియా రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది (India Shall be a Union of States)" అని ముసాయిదాలో పేర్కొన్నారు.

ఏడాది తర్వాత 1949 సెప్టెంబర్ 17న డాక్టర్ అంబేద్కర్ కొన్ని సవరణలు ప్రతిపాదించారు.

ఒక సవరణగా "ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది (India that is Bharat, Shall be a Union of States)" అని కూడా ప్రతిపాదించారు.

ఆ రోజే అంబేద్కర్ తెచ్చిన సవరణకు ఆమోదం పడింది.

తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న నాయకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న నాయకులు

సవరణతో కూడిన ప్రతిపాదన

మరుసటి రోజు సెప్టెంబర్ 18న మధ్యప్రదేశ్ కు చెందిన హెచ్.వి. కామత్ భారతదేశం పేరును ప్రస్తావిస్తూ మొదటి విభాగానికి రెండు సవరణలు తీసుకొచ్చారు.

అందులో మొదటిది దేశం పేరు "భారత్ లేదా ఆంగ్ల భాషలో ఇండియా, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది (Bharat or, in the English language, India, shall be a Union of States)" అని,

రెండవ సవరణ 'హింద్ లేదా ఆంగ్ల భాషలో ఇండియా, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది (Hind, or, in the English language, India, shall be a Union of States)' అని ప్రతిపాదించారు.

కానీ ఈ రెండు సవరణలు పరస్పర విరుద్ధమని సభకు చైర్మన్‌గా ఉన్న రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

''రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఏ పేరు పెట్టాలనే దానిపై పలువురు కొన్ని సూచనలు చేశారు. భారత్, హిందుస్థాన్, హింద్, భరత్‌భూమి, భరతవర్ష్ అని అంటున్నారు. కొందరు ఇండియాకు కొత్త పేరు పెట్టాలని అంటున్నారు. భారత్, భరతవర్ష్, భరత్‌భూమి అని పేర్లను ప్రతిపాదిస్తున్నారు. చాలామంది చరిత్రకారులు ఈ భారత్ అనే పేరు మూలం గురించి పరిశోధనలు చేశారు. అయితే, దీని మూలం గురించి వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. అది కొందరు దుష్యంత - శకుంతల కుమారుడి పేరని, ఆయన వల్లనే దేశానికి భారత్ అని పేరు వచ్చిందన్నారు. భారత్ అనేది వేద కాలం నాటిదని అంటున్నారు'' అని ఆ రోజు జరిగిన చర్చలో కామత్ తెలిపారు.

కామత్ ఇలా మాట్లాడుతుండగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడ్డుకున్నారు.

"ఇదంతా ఇప్పుడు అవసరమా? దాని ఉద్దేశం నాకర్థం కాలేదు. దీని గురించి మరో చోట మాట్లాడటం బాగుంటుందేమో. మిత్రులు భారత్ అనే పేరును అంగీకరించారు. మనకు చాలా తక్కువ సమయం ఉంది'' అన్నారు.

అయితే 'ఇండియా దటీజ్ భారత్' అని పేరు పెట్టడం సబబు కాదని కామత్ వ్యాఖ్యానించారు. ఇండియాకు భారత్ అని పేరు పెట్టాలని జబల్‌పూర్‌కు చెందిన సేఠ్ గోవింద్ దాస్ సూచించారు.

"వేదాలలో ఇండియా అనే పేరే లేదు, భారతదేశం అనే పేరు మాత్రమే ఉంది. మహాభారతం, విష్ణు పురాణం, బ్రహ్మ పురాణాలలో కూడా భారతదేశం అనే పేరు ఉంది.

షాంగ్‌జాంగ్ (హ్యుయాన్ త్సాంగ్) తన పుస్తకంలో కూడా భారతదేశాన్ని పేర్కొన్నారు. దేశానికి భారత్ అని పేరు పెడితే అదేం మన దేశాన్ని పురోగమించకుండా నిరోధించదు" అని అన్నారు గోవింద్ దాస్.

ఈ డిబేట్‌లో పాల్గొన్న మరో కాంగ్రెస్ నేత కమలాపతి త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ఇండియా దటీజ్ భారత్’ కి బదులు ‘భారత్ దటీజ్ ఇండియా’ వాడొచ్చు. లేదంటే ‘భారత్’ అనే సవరణను అంగీకరించవచ్చు" అని అన్నారు.

వేదాలు, పురాణాలలో కూడా భరత అనే పేరు ఉంది. భారత్ అని పేరు పెడితే భారతదేశం గొప్ప దేశంగా మారి మానవాళికి సేవ చేస్తుందని ఆయన తెలిపారు.

సవరణ తీర్మానం ఏమైంది?

అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ కూడా భారతదేశాన్ని భారత్ లేదా భరత్ వర్ష అని పెట్టాలని సూచించారు.

"మనం మతపరమైన కార్యాలు చేసేటపుడు భరత వర్షే, భరత ఖండే? అని అంటామా?'' అని ప్రశ్నించారు.

'భారత్‌ లేదా ఆంగ్ల భాషలో ఇండియా, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది ( Bharat or, in the English language, India, shall be a Union of States)' అని కామత్ తీసుకువచ్చిన తీర్మానంపై సభ ఛైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 38 మంది, వ్యతిరేకంగా 51 మంది ఓటు వేశారు. దీంతో తీర్మానం వీగిపోయింది. అందుకే ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌ (India that is Bharat, Shall be a Union of States) అనే పేరు ఖరారైంది.

భారత్ పేరు పెట్టాలని మళ్లీ చర్చలు జరిగాయా?

భారతదేశం పేరు గురించి రాజ్యాంగ సభలో అప్పుడప్పుడు చర్చలు జరిగాయి.

''ఈ రాజ్యాంగంలో 'ఇండియా దటీజ్ భారత్' అని ఉంది. భారత్ పేరు చేర్చడం చాలా సంతృప్తిని కలిగించే విషయం. కానీ దానిని ప్రస్తావించిన విధానం సంతృప్తికరంగా లేదు, 'ఇండియా దటీజ్ భారత్' అనేది ఒక విచిత్రమైన పేరు'' అని 1949 నవంబర్ 17వ తేదీన సభలో సేఠ్ గోవింద్ దాస్ అన్నారు.

‘‘మొదట మన దేశాన్ని భారత్ అని పిలిచేవారు. తర్వాత భారత్ అంటే ప్రపంచ దేశాలకు అర్థం కాకపోవడంతో ‘ఇండియా దటీజ్ భారత్’ అంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఒడిశాకు చెందిన లక్ష్మీనారాయణ్ సాహు.

1949 నవంబర్ 18న గుజరాత్ కు చెందిన కంఠూభాయ్ దేశాయ్ మాట్లాడుతూ పేరుకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదన్నారు.

" 'ఇండియా దటీజ్ భారత్' అనే పేరును రాజ్యాంగంలో పెట్టడంపై మిత్రులు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానిలో నాకైతే పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. ప్రపంచం మనల్ని ఇండియా పేరుతోనే గుర్తిస్తుంది. ఇండియాగా పిలుస్తుంది, మనల్ని మనం భారత్ అని పిలుచుకుంటాం" అని అన్నారు.

అంబేద్కర్‌పై విమర్శలు

ఇండియా పేరుపై 1949 నవంబర్ 21వ తేదీన జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అల్గు రాయ్ శాస్త్రి విమర్శలు గుప్పించారు.

"దేశం పేరును ఇండియా యూనియన్ అని ప్రస్తావించారు. ఇది బానిస మనస్తత్వం నుంచి మనం బయటకు రాలేదని తెలియజేస్తుంది. మన దేశం పేరు స్పష్టంగా చెప్పలేదు. ఈ భూమికి 'ఇండియా దటీజ్ భారత్' అని పేరు సరైనదా? ప్రపంచంలో ఏ దేశానికీ ఇంత సంక్లిష్టమైన పేరు లేదు. ఇది అస్సలు పేరు కాదు. సరైన పేరు పెట్టడంలో విఫలమయ్యాం" అని అన్నారు.

డాక్టర్ అంబేద్కర్ భారతదేశానికి అయోమయమైన పేరు పెట్టారని 1949 నవంబర్ 24న జరిగిన చర్చలో బిహార్‌కు చెందిన మహమ్మద్ తాహిర్ అన్నారు.

‘‘మన రాజ్యాంగం మన దేశానికి పేరు పెట్టలేక పోయిందది, తికమక పెట్టే పేరు పెట్టారు. దాన్ని అంగీకరించారు కూడా. మీ దేశం పేరేంటని ఎవరైనా అంబేద్కర్‌ను అడిగితే.. భారత్, ఇండియా లేదా హిందుస్థాన్ అని చెప్పవచ్చు. నన్ను ఎవరైనా అడిగితే 'ఇండియా దటీజ్ భారత్' అని చెప్పాలి'' అని విమర్శించారు తాహిర్.

అయితే, ఈ చర్చలు అంతగా ప్రభావం చూపలేదు. ఆర్టికల్ 1లో ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌ (India that is Bharat, Shall be a Union of States) అని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించారు. ఈ చట్టం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)