థర్మన్ షణ్ముగరత్నం: చైనీయులను వెనక్కి నెట్టి భారత సంతతి వ్యక్తి సింగపూర్ అధ్యక్షుడెలా అయ్యారు

ఫొటో సోర్స్, GETTY IMAGES
సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు.
శుక్రవారం జరిగిన ఎన్నికల్లో థర్మన్ 70.4 శాతం ఓట్లను సాధించారు.
అయితే, ఈ ఎన్నిక విషయంలో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ జరగనన్ని వివాదాలు చెలరేగాయి.
ఇద్దరు అభ్యర్థులను ఓడించి థర్మన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఆయన సింగపూర్ మంత్రిగా పని చేశారు.
సింగపూర్ ప్రజలలో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. వక్త, మేధావిగా పేరుంది. ఆ దేశంలో పాపులర్ రాజకీయ నాయకులలో ఆయన ఒకరు.
అందుకే అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) నుంచి వైదొలిగి, రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయాలని థర్మన్ షణ్ముగరత్నం నిర్ణయించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.
ఆయన ఈ నిర్ణయం ద్వారా తన పవర్‌ను వృథా చేసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.
దేశాధ్యక్షుడిగా ఎన్నికైన షణ్ముగరత్నానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘భారత్, సింగపూర్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేయడం నాకు సంతోషంగా ఉంది’’ అని మోదీ అన్నారు. మాజీ హోంమంత్రి పి.చిదంబరం కూడా షణ్ముగరత్నానికి అభినందనలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, HOW HWEE YOUNG/EPA-EFE/REX/SHUTTERSTOCK
అధ్యక్షుడి అధికారమెంత?
సింగపూర్‌లో అధ్యక్షుడి అధికారాలు చాలా పరిమితంగా ఉంటాయి.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొంత వరకు నిర్ణయాధికారాలున్నా, ప్రభుత్వ, ప్రజా వ్యవహారాల్లో జోక్యంపై అధ్యక్షుడికి చాలా పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి.
అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆయన పూర్తి స్వేచ్ఛతో మాట్లాడలేరని, అధ్యక్షుడి పాత్ర బ్రిటన్ రాణి తరహాలోనే ఉంటుందని ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇంతకుముందు చాలామంది అధ్యక్షుల మాదిరిగానే ప్రశాంత స్వభావం, వివాదరహితులకే ఈ పదవి సరైనదని అంటంటారు.
అంతకుముందు ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధానిగా సింగపూర్ రాజకీయ వ్యవహారాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. పైగా ఆయన ఆర్థికవేత్త కూడా. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి ప్రపంచ సంస్థలలో పని చేసిన అనుభవం ఉంది.
ఒకప్పుడు ఆయన ఐఎంఎఫ్‌కు అధిపతి అవుతారనే ఊహాగానాలు కూడా సాగాయి.

ఫొటో సోర్స్, EPA
జనాదరణ పొందిన నాయకుడు
థర్మన్ ఒకవేళ పీపుల్స్ యాక్షన్ పార్టీని ఏ కారణంతోనైనా వదిలేశాడంటే, ఆ తర్వాత ఆయన అంతర్జాతీయరంగంలో మంచి పేరు సంపాదిస్తాడని చాలామంది భావించారు. భవిష్యత్ ప్రధాని అని కూడా చాలామంది భావించారు. నాటి ప్రధాని లీ హెచ్‌సీన్ లూంగ్ ఆ పదవికి రాజీనామా చేస్తే, ప్రధాని పదవికి ప్రజల మొదటి ఆప్షన్ థర్మనేనని కొన్నేళ్ల కిందట నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. సార్వత్రిక ఎన్నికల్లో లీ హెచ్‌సీన్ లూంగ్ తర్వాత ఆయనకే ఎక్కువగా ఓట్లు వచ్చాయి.
చాలాకాలం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా పని చేసినా, ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలన్నీ ప్రధానమంత్రి లూంగ్ ఎదుర్కోవలసి వచ్చింది. ఇది ఆయనకు జనాదరణను పెంచింది.
66 ఏళ్ల థర్మన్ ఒక పెద్ద మనిషి ఇమేజ్‌ని సృష్టించుకోగలిగారు. ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా అందరి మీదా వ్యక్తి గత విమర్శలకు పాల్పడకుండా హుందాగా వ్యవహరించడం సింగపూర్ ప్రజలకు నచ్చింది. జెంటిల్‌మెన్ పొలిటీషియన్ అన్న పేరొచ్చింది.
ఆయన సింగపూర్‌కు మొదటి చైనాయేతర ప్రధానమంత్రి అవుతారని కూడా భావించారు. సింగపూర్‌లో జాతులకు అత్యంత ప్రాధాన్యముంటుంది. చైనీస్ మెజారిటీ ఉన్న సింగపూర్‌లో చైనాయేతర వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కాలేరని పీఏపీ నాయకులు గతంలోనే స్పష్టం చేశారు.
అయితే, అధ్యక్ష ఎన్నికల చివరి దశ వరకు ఈ అంశంపై థర్మన్ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత సింగపూర్ ఇప్పుడు చైనాయేతర ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉందని తాను భావిస్తున్నట్లు ప్రకటించారు థర్మన్. దీనిపై ఆయన అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
థర్మన్ విజయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ప్రధానమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని థర్మన్ చెప్పుకుంటున్నారు. తాను మెరుగైన ప్రధాని కాలేనని ఆయన స్వయంగా అన్నారు. అదే సమయంలో, పీఏపీ కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
దీంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆయన పార్టీని వీడాలని భావించినట్లు చెబుతున్నారు.
మరోవైపు పీఏపీ కూడా కొత్త ప్రధానమంత్రికి సహకరించేందుకు థర్మన్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించినట్లు ఒక కథనం వినిపిస్తోంది. అందుకే ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
చైనాయేతర మూలాలున్న నాయకులు ఇంతకు ముందు సింగపూర్ అధ్యక్షుడిగా పని చేశారు. కానీ, పోటీలో గెలవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ విజయం జాతి వివక్షకు వ్యతిరేకంగా సాధించిన విజయమని ఆయన అనుచరులు అంటున్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా చైనా మూలాలున్న నాయకుడినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి.
ఎన్నికల్లో థర్మన్ ప్రత్యర్థులిద్దరూ చైనా సంతతికి చెందినవారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ విజయం ద్వారా పీఏపీ పార్టీ నిర్దేశించుకున్న రేసిస్ట్ పాలసీని కూడా ఆయన బద్ధలు కొట్టినట్లయింది.
2017 రాష్ట్రపతి ఎన్నికలకు ముందు కొన్ని ఎన్నికల్లో మైనారిటీ వర్గానికి చెందిన నాయకులకే సీట్లు కేటాయించాలని ప్రభుత్వం చట్టం చేసింది. ఇది సింగపూర్‌లో మలయ్, ఇండియన్, యురేషియన్ మూలాలకు చెందిన మైనారిటీలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తుందని అప్పట్లో పీఏపీ చెప్పింది.
అయితే, ఈ ఎన్నికల్లో ఆ నియమాన్ని పాటించలేదు. కానీ, మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడిగా ఎన్నికల్లో పాల్గొని తన సొంత ఇమేజ్‌తో భారీ మెజారిటీతో గెలవగనని థర్మన్ నిరూపించారు.
"జాతి వివక్ష కోణంలో చూసినట్లయితే ఈ విజయం చాలా కీలకమైంది" అని ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్‌లో రేస్ ఎక్స్‌పర్ట్ మాథ్యూ మాథ్యూస్ చెప్పారు.
అలాగని సింగపూర్‌ను జాతి వివక్షపూరిత దేశంగా చూడకూడదని మాథ్యూస్ అన్నారు.
‘‘సమానమైన బలంగల అభ్యర్ధులుంటే అప్పుడు జాతి వివక్ష అనేది పెద్ద విషయంగా ఉండేది. కానీ, థర్మన్ మీద పోటీ చేసిన అభ్యర్ధులు అంతగా పేరున్నవారు కాదు’’ అని మాథ్యూస్ అన్నారు.

ఫొటో సోర్స్, HOW HWEE YOUNG/EPA-EFE/REX/SHUTTERSTOCK
ఎవరి ప్రభావం ఎంత
ఈసారి సింగపూర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పీఏపీకి రెఫరెండంగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆ పార్టీపై విమర్శలు బాగా పెరిగాయి.
అయితే థర్మన్ సాధించిన విజయం ఆయన వ్యక్తిగత పాపులారిటీతోనే తప్ప పార్టీ వల్ల వచ్చింది కాదు.
ఎందుకంటే పార్టీ పేరుకంటే అతని పాపులారిటీ ఇంకా ఎక్కువ.
అయితే, ఇప్పుడు థర్మన్ పీఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.
తాను ఎవరి ప్రభావం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తానని థర్మన్ చెప్పారు.
కానీ, పీఏపీతో అనుబంధం ఉన్న వ్యక్తి అలా వ్యవహరిస్తాడనుకోవడం కష్టమని చాలామంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, REUTERS/EDGAR SU
ఎన్నికలపై వివాదం
ఈ ఎన్నికల్లో పారదర్శకత లోపించడం, అనర్హులను ఎన్నికల్లో పాల్గొననీయకుండా అడ్డుకోవడంలాంటి చర్యలు సరిగా చేపట్టలేదన్న విమర్శలు వినిపించాయి.
అధ్యక్షుడు కాగల అవకాశం ఉందని భావించిన జార్జ్ గో ఎన్నికలకు ముందే అనర్హత వేటుకు గురయ్యారు.
అలాగే మహిళలపై వివక్ష, జాత్యహంకార ఆరోపణలున్న తాన్ కిన్ లియాన్ ఎన్నికల్లో పోటీ చేయగలిగారు.
ఈసారి ఎన్నికలు కూడా 2017లో జరిగిన ఎన్నికలను గుర్తు చేశాయి. అప్పట్లో ప్రభుత్వం నిబంధనల్లో కొన్ని మార్పులు చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అధ్యక్ష ఎన్నికల పోటీలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని థర్మన్ విజయం మరింతగా పెంచింది.
అందరినీ గౌరవిస్తూ కలుపుకొనివెళ్తానని థర్మన్ వాగ్దానం చేశారు. "విభిన్న అభిప్రాయాలు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులను గౌరవిస్తాను" అని థర్మన్ అన్నారు.
కానీ, అధ్యక్షుడిగా తన వాగ్దానాలను థర్మన్ ఎంత వరకు నెరవేర్చగలరనేది ఇప్పుడే చెప్పడం కష్టమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
- NIN సర్వే: ఐటీ ఉద్యోగులకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువా? కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటి...
- లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్‌క్రాఫ్ట్
- ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















