సింగపూర్: చికెన్ రైస్ దుకాణాల దగ్గర జనాలు ఎందుకు క్యూ కడుతున్నారు

చికెన్ రైస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింగపూర్‌లో చికెన్ రైస్‌ను చాలామంది ఇష్టంగా తింటారు
    • రచయిత, అనాబెల్లె లియాంగ్, డెరెక్ కాయ్
    • హోదా, బీబీసీ న్యూస్

చికెన్ రైస్‌ను ‘రాచెల్ చోంగ్’ చాలా ఇష్టపడతారు. వారంలో మూడుసార్లు ఆమె తప్పకుండా చికెన్ రైస్ తింటారు.

''నా జాబితాలో ఇది అన్నింటికంటే ముందు ఉంటుంది. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. తేలికైన ఆహారం'' అని ఆమె చెప్పారు. ఆమె ఎప్పుడూ తినే 'అహ్ కీట్ చికెన్ రైస్' స్టాల్‌లో దీని ధర 4 సింగపూర్ డాలర్లు (సుమారు 225 రూపాయలు).

సింగపూర్‌లోని చాలామంది ప్రజలకు చికెన్ రైస్ చాలా ఇష్టమైన ఆహారం. సువాసనభరితమైన అన్నంపై కాల్చిన లేదా ఉడికించిన చికెన్‌ను ప్లేట్‌లో వడ్డిస్తారు. దీన్ని సింగపూర్ జాతీయ వంటకం అని కూడా కొందరు పిలుస్తారు.

''సింగపూర్‌లో చికెన్ రైస్ దొరకకుండా పోతుందని నేను అనుకోను. న్యూయార్క్‌లో పిజ్జా లేకుండా ఉంటుందా'' అని బీబీసీతో ఒక దుకాణాదారుడు అన్నారు.

కానీ, అందరికీ ఎంతో ఇష్టమైన, తక్కువ ధరకు లభించే ఈ భోజనాన్ని పొందడం త్వరలో కష్టంగా మారొచ్చు. ఇది మరింత ఖరీదైన వంటకంగా మారిపోవచ్చు.

ఎందుకంటే ఈ వంటకంలో ప్రధాన వస్తువు అయిన చికెన్ ఎగుమతులపై ఆంక్షలు విధించారు.

ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నందున కొన్ని ఆసియా దేశాలు, ప్రధాన ఆహార పదార్థాల ఎగుమతులను పరిమితం చేయడం లేదా నిషేధించడం చేశాయి. దేశీయంగా సరిపడినంత ఆహారపదార్థాలను అందుబాటులో ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇలా చేశాయి. మలేసియా కోళ్ల ఎగుమతులను తగ్గించింది.

చికెన్ రైస్ స్టాల్

గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన భారత్, చక్కెర విక్రయాలపై కూడా పరిమితులు విధించింది. ఇండోనేసియా, పామాయిల్ ఎగుమతులను నిషేధించింది. ఈ బాటలోనే మలేసియా ఎగుమతులు చేసే కోళ్ల మొత్తంలో కోత విధించింది.

ఈ చర్యల వల్ల నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయని ఆహార పదార్థాల దిగుమతులపై ఆధారపడే దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

సింగపూర్ దిగుమతుల్లో 90 శాతానికి పైగా ఆహారపదార్థాలే ఉంటాయి. తాజా ఆంక్షలతో సింగపూర్ ఆందోళన చెందుతోంది. దేశంలో వినియోగించే మూడొంతుల చికెన్ కోసం మలేసియాపైనే ఆధారపడుతుంది.

ఎగుమతులపై పరిమితులు విధిస్తున్నారనే వార్తలతో సింగపూర్‌లోని ప్రతీ ఫుడ్ కోర్ట్, హ్యాకర్ సెంటర్లలోని చికెన్ రైస్ స్టాళ్ల వద్ద జనం క్యూ కట్టడం పెరిగింది.

''ఈసారికి చికెన్, మరోసారి ఇంకేదైనా వస్తువు అవ్వొచ్చు. దీనికి మనం సిద్ధంగా ఉండాలి'' అని సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ అన్నారు.

చికెన్ రైస్ కోసం ఉపయోగించే కోళ్లను ప్రాణంతోనే మలేసియా నుంచి సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు. వాటితో అక్కడ వంటకాలు చేస్తారు.

ఇకపై ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మలేసియా కోళ్ల ఎగుమతులను ఆపేసింది. దేశీయంగా ధరలు, ఉత్పత్తులు స్థిరపడేంతవరకు ఎగుమతులపై నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

హమీద్ బిన్ బువాంగ్
ఫొటో క్యాప్షన్, హమీద్ బిన్ బువాంగ్

యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధనం, కోళ్ల మేత ధరలు పెరిగినందున తనకు కోళ్లను సరఫరా చేసే మలేసియా సరఫరాదారు ఈ ఏడాది నుంచి 20 శాతం అదనంగా వసూలు చేయడం ప్రారంభించాడని అహ్ కీట్ చికెన్ రైస్ స్టాల్ యజమాని లిమ్ వీయ్ కీట్ చెప్పారు. అయినప్పటికీ చికెన్ రైస్ ధరను పెంచడంపై తనకు ఆసక్తి లేదని ఆయన తెలిపారు.

''మేం చికెన్ రైస్ ధరలను పెంచాలని అనుకోవట్లేదు. ఇలా చేస్తే వినియోగదారులు దూరం అవుతారు. ఒక నెలపాటు మేం పెరిగిన ధరలను భరించగలమనే అనుకుంటున్నా. పరిస్థితి మరింత దిగజారితే అప్పుడు ప్లేటు చికెన్ రైస్‌కు 50 సెంట్ల వరకు ధర పెంచాల్సి ఉంటుంది'' అని లిమ్ చెప్పారు.

రాబోయే రోజుల్లో సరిపడినంత చికెన్ దొరక్కపోవచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు.

ఈ లోటును భర్తీ చేయడానికి ఫ్రోజెన్ మాంసాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కానీ, ఇలాంటి మాంసం పట్ల వినియోగదారులు ఆసక్తి చూపరు అని చెప్పారు.

హమీద్ బిన్ బువాంగ్, దశాబ్ద కాలానికి పైగా నగరంలోని మార్కెట్‌లో చికెన్‌ను అమ్ముతున్నారు.

కొన్నిరోజులుగా తన కస్టమర్లు ఎక్కువగా మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కానీ, మలేసియా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసేవరకు తన కొట్టును మూసేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

''చికెన్ లేకపోతే అందరికీ ఇబ్బందే'' అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, చికెన్‌ను షాపు నుంచి తెచ్చాక కడగకూడదా?

ఫారం నుంచి టేబుల్ మీదకు

దేశాలు, ఎగుమతులపై పరిమితులు విధించినప్పుడు ఉత్పత్తిదారుల సరఫరా గొలుసుపై, రిటైలర్లు, కస్టమర్లు ఇలా అందరిపై ప్రభావం పడుతుందని ఎస్. రాజారత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ పాల్ టెంగ్ అన్నారు.

''ఒకవేళ ధరలను పెంచితే రిటైల్ స్థాయిలోని కస్టమర్లు దూరం కావొచ్చు'' అని బీబీసీ ఆసియా బిజినెస్ రిపోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెంగ్ అన్నారు.

యుక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దీని కారణంగానే చికెన్‌ను ఎక్కువగా తినే సింగపూర్, యూకే వంటి దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఫుడ్ ట్రక్... ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నం పెడుతుంది

కస్టమర్లపై ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై ఎగుమతులపై నియంత్రణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ ఫెలో డేవిడ్ లాబోర్డ్ హెచ్చరించారు.

''ఆహారం అందుబాటులో ఉండి, దాని ధర అధికంగా పెరిగిపోతే తొలుత దీనికి బాధితులుగా మారేది పేదవారే. కొన్ని సందర్భాల్లో వారు ఆరోగ్యం, విద్యపై పెట్టే ఖర్చుల్లో కోత విధించి వాటిని ఆహారం కోసం కేటాయించాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.

ధరల పెరుగుదల, తనకు ఎంతో ఇష్టమైన చికెన్ రైస్‌ను తినకుండా ఆపలేదని భావిస్తున్నట్లు చోంగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)