క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి పారిపోయిన ‘డేంజరస్ కిల్లర్’

ఫొటో సోర్స్, CHESTER COUNTY PRISON
- రచయిత, మేక్స్ మట్జా
- హోదా, బీబీసీ న్యూస్
అయిదడుగుల దూరం ఉన్న రెండు గోడలపై చాకచక్యంగా పాకుతూ పైకి ఎక్కి పారిపోయాడు ఓ డేంజరస్ కిల్లర్.
ఓ గోడపై చేతులు, మరో గోడపై కాళ్లు ఆనించి పీతలా పాకుతూ పైకి ఎక్కాడా హంతకుడు.
ఇంతకీ ఆ హంతకుడు పారిపోయింది ఎక్కడి నుంచో తెలుసా..? అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఓ జైలు నుంచి.
అవును.. జైలులోని రెండు గోడల మధ్య ఖాళీ ఉండడంతో ‘డేనెలో కేవల్‌కేంటీ అనే 34 ఏళ్ల హంతకుడు చాకచక్యంగా పైకి ఎక్కి తప్పించుకున్నాడు.
డేనెలో కంటే ముందు ఇదే ఏడాది మరో ఖైదీ కూడా ఈ గోడలపైనే క్రాబ్ వాక్ చేస్తూ పారిపోయి ఆ వెంటనే దొరికిపోయాడు.
గతంలో ఓ ఖైదీ ఇలా తప్పించుకున్న తరువాత గోడలపై ముళ్ల కంచె వేశామని అధికారులు చెప్తున్నారు. అయితే, ఆ కంచె ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందని డేనెలో పరారీతో అర్థమవుతోంది.

ఫొటో సోర్స్, POLICE HANDOUT
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి చంపి...
తాజాగా తప్పించుకున్న డేనెలో కేవల్‌కేంటీ ఓ హత్య కేసులో శిక్ష పడి ఈ జైలులో ఉన్నాడు.
తన మాజీ గర్ల్ ఫ్రెండ్ డెబోరా బ్రాండావోను 2021 ఏప్రిల్ నెలలో ఆమె ఇద్దరు చిన్నారుల ఎదుటే దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన కేసులో డేనెలో దోషిగా తేలడంతో ఆయనకు నెల కిందట యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
కాగా శిక్ష పడిన కొద్దిరోజులకే డేనెలో జైలు నుంచి ఆగస్ట్ 31న తప్పించుకోవడంతో ఆయన సొంత దేశం బ్రెజిల్‌లో ఆ వార్త చర్చనీయమైంది.
2017 నాటి ఓ హత్య కేసులో డేనెలో బ్రెజిల్ పోలీసుల వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.

ఫొటో సోర్స్, PENNSYLVANIA STATE POLICE
కాగా, డేనెలో క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి తప్పించుకున్నట్లు సీసీ టీవీ కెమేరా దృశ్యాలు వెల్లడించాయి.
ఈ మేరకు జైలు వార్డెన్ హోలాండ్ కూడా బుధవారం ధ్రువీకరించారు.
అయితే, కొద్దినెలల కిందటే ఇదే తరహాలో ఓ ఖైదీ తప్పించుకునే ప్రయత్నం చేశాక కూడా సరైన చర్యలు ఎందుకు చేపట్టలేదన్న ప్రశ్నకు వార్డెన్ సమాధానమిస్తూ ముళ్ల కంచె వేసినా ఫలితం లేకపోయిందన్నారు.
గతంలో ఇలా తప్పించుకున్న వ్యక్తిని అయిదు నిమిషాలలోనే పట్టుకున్నామని.. అప్పుడు వెంటనే సీసీ కెమేరాలో చూడడంతో వెతికి పట్టుకున్నామని.. కానీ, ఈసారి అబ్జర్వేషన్ టవర్‌లో ఉన్న అధికారి ఈ పరారీని వెంటనే గుర్తించలేకపోయారని చెప్పారు.
డేనెలో పరారీ తరువాత ఆ అధికారిని విచారిస్తున్నారు.

ఫొటో సోర్స్, CHESTER COUNTY PRISON
హెలికాప్టర్లతో గాలింపు..
డేనెలో కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ భారీ ఎత్తున సాగుతోంది.
చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ హెలికాప్టర్లు, పెట్రోలింగ్ కార్లలో పోలీసులు డేనెలో కోసం వెతుకుతున్నారని పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీస్ లెఫ్టినెంట్ కల్నల్ జార్జ్ బీవెన్స్ చెప్పారు.
బ్రెజిల్‌లో ఉంటున్న డేనెలో తల్లితో తన కుమారుడిని లొంగిపోవాలని చెప్పించి ఆ వాయిస్ రికార్డును హెలికాప్టర్ల నుంచి బిగ్గరగా వినిపిస్తున్నారు.
మరోవైపు డేనెలోకు సంబంధించిన సమాచారం అందిస్తే 20 వేల డాలర్లు (సుమారు 16.5 లక్షల రూపాయలు) బహుమతి ప్రకటించారు పోలీసులు.
డేనెలో తప్పించుకోవడంతో హతురాలు బ్రాండావో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారికి పోలీసులు గట్టి భద్రత కల్పించారు.
ఇవి కూడా చదవండి:
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' -
- మదనపల్లె భానుభారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














