జీ20: సంయుక్త ప్రకటన ప్రధాని మోదీకి ఎంత ప్రతిష్టాత్మకం, వివిధ దేశాలు ఏం కోరుకుంటున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్
మునుపెన్నడూ లేని రీతిలో విస్తృత దౌత్య చర్చలకు కేంద్రంగా జీ-20ని ఇండియా మార్చేసింది.
ఏడాది పొడవునా 60 భారత నగరాల్లో చర్చల అనంతరం, ఈ వారాంతంలో జరగబోయే ప్రపంచ నాయకుల సదస్సు విజయవంతం కావాలనే ప్రచారం నేడు పతాక స్థాయికి చేరుకుంది.
దిల్లీలో భారీగా బిల్‌బోర్డులు, పోస్టర్లు కనిపిస్తున్నాయి. వీటిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటోలతోపాటు ప్రపంచ నాయకులకు ఆహ్వానం పలికే సందేశాలు దర్శనం ఇస్తున్నాయి.
జీ20 శిఖరాగ్ర సమావేశంతోపాటు ప్రపంచ పరిణామాలపై ఏకాభిప్రాయంతో చివర్లో విడుదలచేసే సంయుక్త ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రకటన కోసం ఇండియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, దీన్ని విడుదల చేయడం అంత తేలికేమీ కాదు. ఎందుకంటే యుక్రెయిన్ సంక్షోభం సహా చాలా అంశాలపై నేడు జీ20 భిన్న వర్గాలుగా చీలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
నిరుడు ఇండోనేసియాలో జరిగిన సదస్సుపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపించింది. అయినప్పటికీ చివర్లో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. దీనిలో జీ20 దేశాల మధ్య విభేదాలు కనిపించాయి.
అయితే, ఆ తర్వాత ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. నేడు రష్యా, చైనా వెనక్కి తగ్గే సూచనలేమీ కనిపించడం లేదు. అదే సమయంలో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు యుద్ధాన్ని ఖండించాలని పట్టుబడుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. దీంతో పరిస్థితి మరింత జటిలం కావచ్చు. ప్రస్తుతం రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, చైనా ప్రధాని లీ కియాంగ్ సదస్సుకు హాజరు అవుతున్నారు. వీరు చివరి నిమిషంలో తమ దేశాల అధినాయకులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు.
ఈ ఏడాది మొదట్లో జరిగిన విదేశీ, ఆర్థిక మంత్రుల సదస్సులు కూడా ఎలాంటి సంయుక్త ప్రకటన లేకుండానే ముగిశాయి.
అయితే, నేడు దక్షిణార్ధ గోళంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలపై చర్చించేందుకు యుక్రెయిన్ సంక్షోభం అడ్డుకాదని ఇండియా భావిస్తోంది.
ప్రపంచ జీడీపీలో జీ20 దేశాల వాటా 85 శాతం. వాణిజ్యంలో ఇది 75 శాతంగా ఉంది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల జనాభా జీ20 దేశాల్లోనే జీవిస్తున్నారు. ఈ కూటమిలో లేని దేశాల కోసం కూడా ఆలోచించాలని, ముఖ్యంగా దక్షిణార్ధ గోళంలోని దేశాల అభివృద్ధికి కృషి చేయాలని ఇండియా ఎప్పటినుంచో చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఇండియా చేస్తున్న కృషికి జీ-20 సదస్సులో ఆఫ్రికా యూనియన్ నాయకులకు ప్రాతినిధ్యం కల్పించడమనేది చక్కటి ఉదాహరణ.
అయితే, రుణభారం, ఆహారం, చమురు ధరల పెరుగుదల లాంటి సమస్యలకు యుక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి మరింత ఆజ్యం పోశాయని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ నిపుణురాలు తన్వీ మదన్ చెప్పారు. ‘‘ఈ సమస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సాయం చేయాలని భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి’’ అని ఆమె అన్నారు.
ఈ అంశాలపై అందరూ ఏకాభిప్రాయానికి రావడం కాస్త కష్టమే. ఉదాహరణకు రుణాల అంశాన్ని తీసుకోండి. ఇక్కడ చెల్లింపులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సహా అంతర్జాతీయ సంస్థలు, ధనిక దేశాలు కాస్త ఉపశమనం ఇవ్వాలని ఇండియా, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి.
అయితే, ఇక్కడ చైనా గురించి ప్రస్తావించకుండా చర్చలు ముందుకు వెళ్లడం కష్టం. ప్రపంచంలోని పేద దేశాల రుణభారం మొత్తంగా 62 బిలియన్ డాలర్లు (రూ. 5.15 లక్షల కోట్లు) అని, వీటిలో మూడింట రెండొంతులు చైనాకే చెల్లించాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ చెప్పారు.
దీని వల్ల చాలా దేశాల్లో పేదరికం మరింత పెరుగుతోంది. ఆహారం, చమురు ధరలు కూడా మరింత పెరుగుతున్నాయి.
రుణాల విషయంలో చైనాను దోపిడీదారుతో పశ్చిమ దేశాలు పోలుస్తున్నాయి. అయితే, దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అభివృద్ధి చెందుతున్న దేశాలు రుణాల చెల్లింపులకు మరింత సమయం కావాలని కోరుతున్నాయి. కొన్ని దేశాలైతే మరిన్ని రుణాలతో తమను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని అడుగుతున్నాయి’’ అని మదన్ చెప్పారు.
‘‘ఈ విషయంలో సదస్సు ఏం చర్చిస్తుందో తెలియదు. కానీ, ధనిక దేశాలు మాత్రం కాస్త దిగివచ్చే అవకాశముంది’’ అని మదన్ అన్నారు.
పేద దేశాల రుణాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు కామన్ ఫ్రేమ్‌వర్క్ (సీఎఫ్)కు జీ20 దేశాలు 2020లోనే అంగీకరించాయి. అయితే, ఆ తర్వాత పురోగతి కనిపించలేదు. చైనా కావాలనే ఈ విషయంలో అడ్డుపుల్లలు వేస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే, వీటిని చైనా తిరస్కరిస్తోంది.
చైనాతో సరిహద్దు వివాదాలున్న ఇండియా మాత్రం ధనిక దేశాలు కాస్త సాయం చేయాలని, మధ్య ఆదాయ దేశాలకూ సీఎఫ్‌ను విస్తరించాలని కోరుతోంది. దీనికి యూరోపియన్ యూనియన్ కూడా మద్దుతు పలికింది.
అయితే, ఈ రుణ సంక్షోభానికి చైనానే కారణమని పశ్చిమ దేశాలు మొండిపట్టు పట్టుకుని కూర్చుంటే పరిస్థితి ముందుకు వెళ్లే అవకాశం లేదు.
క్రిప్టోకరెన్సీల నియంత్రణతోపాటు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల పునర్‌వ్యవస్థీకరణను కూడా ఇండియా కోరుతోంది. అయితే, ఈ విషయంలోనూ పురోగతి కనిపించే అవకాశం లేదు.
ఇండియా తరచూ ప్రస్తావిస్తున్న అంశాల్లో వాతావరణ మార్పులు కూడా ఒకటి. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు కొన్ని పేద దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఇండియా చెబుతోంది.

ఫొటో సోర్స్, getty Images
వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఆర్థిక సాయం, టెక్నాలజీ బదిలీలోనూ కనిపించాలని గత గురువారం ప్రధాన మంత్రి ఒక కథనంలో కోరారు.
వాతావరణ మార్పులపై పోరాడేందుకు ఆర్థిక సాయంపై విభేదాలు ఉన్నాయని మోదీ కథనాన్ని చదివితే స్పష్టం అవుతుంది. గ్రీన్‌హౌస్ ఉద్గారాల కట్టడి లక్ష్యాలను అంగీకరించేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధంగా లేవు, ఎందుకంటే దీనితో తమ అభివృద్ధి కుంటుపడుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ఈ సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమని, అందుకే వారే నిధులు, టెక్నాలజీ రూపంలో సాయం చేయాలని కోరుతున్నాయి.
వాతావరణ మార్పుల విషయంలో ప్రస్తుతం సంచలన నిర్ణయాలేవీ వచ్చే అవకాశం లేదని దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని విదేశాంగ విధానం ప్రొఫెసర్ హ్యాప్పీమాన్ జాకబ్ అన్నారు.
‘‘ప్రస్తుత అజెండాలోని ప్రధాన అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ విషయంలో మరింత సాయం చేయాలని అభివృద్ధి చెందిన దేశాలను ఇండియా కోరుతుంది’’ అని ఆయన చెప్పారు.
ఆహార, ఇంధన ధరలు కూడా ప్రస్తుత సదస్సులో చర్చకు వచ్చే అవకాశముంది. ఈ విషయంలో కొంతవరకూ ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ చర్చలు రష్యాపైనే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లోకి యుక్రెయిన్ ఆహార ధాన్యాలు వచ్చేలా చూసేందుకు మొదట అంగీకరించాల్సింది రష్యానే. అయితే, ఇక్కడ కూడా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశంలేదని నిపుణులు చెబుతున్నారు.
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ప్రపంచ సరఫరా గొలుసుల పరిరక్షణ, మహమ్మారులను అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలపై ప్రస్తుత సదస్సులో చర్చిస్తారో లేదో స్పష్టతలేదు.
మరోవైపు మోదీ ప్రభుత్వ హయాంలో మానవ హక్కులను నీరు గారుస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపైనా చర్చించే అవకాశం కనిపించడం లేదు. దీనిపై ఇండియాలోని విపక్షాలు తరచూ ప్రశ్నలు సంధిస్తున్నాయి.
హక్కుల ఉద్యమకారులు, సంస్థలు తరచూ మాట్లాడేటప్పటికీ పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం లేదు. ఎందుకంటే చైనాకు కళ్లెం వేయడంలో ఇండియా ప్రధాన పాత్ర పోషించగలదని ఈ దేశాలకు తెలుసు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత సదస్సు అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేయకపోతే ఇది ఇండియా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతోపాటు జీ20కి కూడా ఎదురుదెబ్బలా మారుతుందని విల్సన్ థింక్-ట్యాంక్‌కు చెందిన విశ్లేషకుడు మైఖేల్ కుజెల్‌మన్ లాంటి నిపుణులు చెబుతున్నారు.
అయితే, తమ దారికి రాని దేశాలతోనూ విజయవంతంగా చర్చలు జరిపిన చరిత్ర భారత్‌కు ఉందని, ఇటు రష్యా అటు అమెరికా రెండు దేశాలతోనూ ఇండియా చక్కగా ముందుకు వెళ్లడమే దీనికి ఉదాహరణని ఆయన అన్నారు.
‘‘విభేదాల నడుమ చక్కగా పనిచేసిన చరిత్ర భారత్‌కు ఉంది. ఇప్పుడు కూడా అలానే ముందుకు వెళ్లొచ్చు. కానీ, ఇది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం’’ అని ఆయన చెప్పారు.
అయితే, సంయుక్త ప్రకటన లేకపోయినా కూడా ఈ సదస్సు విఫలమైందని చెప్పకూడదని మదన్ అన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ‘చైర్స్ సమ్మరీ’ని ఆతిథ్య దేశాలు విడుదల చేస్తుంటాయి. దీనిలోని అంశాలపై దాదాపు 90 శాతం వరకూ సభ్య దేశాల ఆమోదం ఉంటుంది.
అయితే, సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, వేగంగా మారుతున్న పరిణామాల నడుమ ఈ సంస్థ ప్రభావంపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
ఇప్పటికే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా), షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) లాంటి సంస్థలకు చైనా ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల బ్రిక్స్ కూటమిలో అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లకు కూడా సభ్యత్వం కల్పించారు. ఈ దేశాలన్నింటికీ చైనాతో మంచి సంబంధాలున్నాయి.
బ్రిక్స్, ఎస్‌సీవో లాంటి సంస్థలతోపాటు పశ్చిమ దేశాల కూటములుగా భావించే క్వాడ్, జీ7 (ప్రత్యేక ఆహ్వానమున్న దేశం), జీ20లలోనూ సభ్యత్వమున్న అతికొద్ది దేశాల్లో ఇండియా కూడా ఒకటి.
అందుకే దిల్లీలో జరగబోయే ఈ సదస్సు విజయవంతం కావడం చాలా ముఖ్యం. ఫలితంగా నరేంద్ర మోదీ, ఇండియా పేరు అంతర్జాతీయంగా మరింత బలపడుతుంది.
భిన్న అంతర్జాతీయ వేదికల డిమాండ్లను అర్థం చేసుకోవడంతోపాటు వీటికి నేతృత్వం వహించడంలో ఇండియా పనితీరుకు ఈ సదస్సు ఒక పరీక్ష లాంటిది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా మోదీ పేరు, ప్రఖ్యాతులు దీనితో మరింత పెరగొచ్చు.
జీ20 సాయంతో చిన్నచిన్న పట్టణాలు, నగరాలకూ విదేశాంగ విధానాలను తీసుకెళ్లడం ద్వారా నరేంద్ర మోదీకి దీనితో ప్రయోజనాలు చేకూరే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















