ఆంధ్రప్రదేశ్: ఓ గిరిజన వర్సిటీ రైతులను ఎలా రోడ్డున పడేసిందంటే....

రైతు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విభజన చట్టంలో భాగంగా ఏపీలో ఏర్పాటవుతున్న గిరిజన యూనివర్సిటీకి రెండు సార్లు వేర్వేరు చోట్ల శంకుస్థాపన జరిగింది. ఈ రెండు చోట్ల గిరిజన యూనివర్సిటీకి భూములిచ్చిన నిర్వాసితులు తమకి న్యాయం జరగలేదంటూ అధికారుల ఎదుట గగ్గోలు పెడుతున్నారు.

అసలు జరిగింది ఏంటంటే?

రాష్ట్ర విభజనలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో కొత్తవలస మండలం రెల్లి రెవిన్యూ గ్రామ పరిధిలోని అప్పన్నదొరపాలెం వద్ద యూనివర్సిటీ నెలకొల్పాలని నిర్ణయించారు.

దీని కోసం 2016లో 526 ఎకరాల భూమిని అధికారులు సేకరించి, 2017 డిసెంబరులో ప్రహరీ కూడా నిర్మించారు. ఇక్కడ వర్సిటీ కోసం సేకరించిన భూముల్లో 200 ఎకరాలను జీడి తోటలు పెంచుతున్న గిరిజనుల నుంచి తీసుకున్నారు.

అయితే 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధి మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దులకు మార్చారు. అక్కడ 561.91 ఎకరాల భూమిని సేకరించారు.

ఇందులో 90.60 ఎకరాల జిరాయితీ భూమి, 208.72 ఎకరాల డి-పట్టా భూములను రైతుల నుంచి సేకరించారు.

ఈ భూమిలో సీఎం జగన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఏడాది ఆగస్టు 25న శంఖుస్థాపన చేశారు. ఒకే వర్సిటీ నిర్మాణానికి రెండోసారి జరిగిన శంకుస్థాపన ఇది.

రైతు పాసు పుస్తకం
ఫొటో క్యాప్షన్, రైతు పాసు పుస్తకం

మావి దొంగపట్టాలు కావు, ఇచ్చింది వైఎస్సారే

మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో జిరాయితీ భూములకు ఎకరాకు రూ.12 లక్షలు, డి-పట్టాకు రూ.9 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.

మెంటాడ మండలం కుంటివలసకు చెందిన వారికి ఈ ప్రాంతంలోనే డి-పట్టా భూములున్నాయి.

తాము వర్సీటి కోసం భూములిస్తే.. తమ పట్టాదారు పాసు పుస్తకాలు దొంగ పాసు పుస్తకాలని... కొందరికి పూర్తిగా, మరికొందరికి పాక్షికంగా పరిహారం చెల్లించలేదని రైతులు చెబుతున్నారు.

“రైతులకు సాగు చేసుకోండని సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ మాకు డి-పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అవి దొంగ పట్టాలని అధికారులు అంటున్నారు. నాకు 50 సెంట్లు భూమి ఉంటే, 20 సెంట్లే నాదని, మిగతాది ప్రభుత్వానిదంటూ నాకు రూ. 2 లక్షలే పరిహారం ఇచ్చారు” అని కుంటివలసకు చెందిన లింగాల సూర్యకాంతం బీబీసీతో చెప్పారు.

“యూనివర్సిటీ కోసం కలెక్టర్ వచ్చి చెప్తే, భూమలు ఇచ్చాం. తర్వాత ఆ డి-పట్టా భూములు ప్రభుత్వానివంటూ.. ఇస్తామన్న రూ. 9 లక్షలు ఇవ్వకుండా కోత పెట్టారు. అలా ఎలా చేస్తారని అడిగితే.. సమాధానం చెప్పడం లేదు” అని కుంటివలసకు చెందిన రైతు రమణ బీబీసీతో చెప్పారు.

కొన్ని సాంకేతిక కారణాలు వలన కొందరికి పరిహారం ఇవ్వడం కుదరలేదని, వాటిని సవరించి వారి రికార్డులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి పరిహారం అందజేస్తామని దత్తిరాజేరు మండలం తహశీల్దార్ గురుమూర్తి బీబీసీతో తెలిపారు.

గిరిజన యూనివర్సిటీకి సేకరించిన భూముల్లో రకరకాలున్నాయి. వాటిలో అర్హత ఉన్న వారందరికి పరిహారం ఇచ్చాం. అనర్హులకు మాత్రమే పరిహారం అందలేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు.

రాష్ట్రమంతా మంచి పాసు బుక్కులు ఇచ్చి... వైఎస్సార్ మా గ్రామానికే దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చారా? అని అధికారులను గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

సీఎం జగన్ శంకుస్థాపన

ఫొటో సోర్స్, facebook/YSRCP

మెంటాడకు ముందు అప్పన్నదొరపాలెంలో...

2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో 526.24 ఎకరాలను సేకరించింది.

వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన అప్పన్నదొరపాలెం మెంటాడ మండలానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విశాఖ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అప్పన్నదొరపాలెంలో యూనివర్సిటీ పనుల్లో భాగంగా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కేంద్రం రూ.5 కోట్ల కేటాయించింది. దీనికి అప్పటీ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు శంకుస్థాపన చేయగా, గోడ నిర్మాణం పూర్తయింది.

మరోవైపు అప్పన్నదొరపాలెంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆ ప్రాంతంలో 200 ఎకరాల భూములిచ్చిన 174 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ‘భూమికి భూమి’ అప్పగించేందుకు సమీపంలోనే స్థలాన్ని కూడా గుర్తించారు.

ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో టీడీపీ ప్రభుత్వం సేకరించిన స్థలం గిరిజన ప్రాంతంలో లేదంటూ వైసీపీ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మెంటాడ మండలానికి తరలించింది. వర్సిటీ పనుల శంకుస్థాపన కోసం అప్పనదొరపాలెంలో వేసిన శిలాఫలకం ధ్వంసమై కనిపిస్తోంది.

మెంటాడ మండలం గిరిజన ప్రాంతం సమీపంలోనే ఉంది కానీ, గిరిజన ప్రాంతం కాదు. కాకపోతే ఇది ఎస్టీ నియోజకవర్గమైన సాలూరులో ఉంది.

రైతు భూముల వద్ద అధికారులు

నిర్వాసితులుగా మారిన గిరిజనుల పరిస్థితి ఏంటి?

వైసీపీ ప్రభుత్వం వర్సిటీ తరలించడంతో అప్పన్నదొరపాలెంకు చెందిన 174 మంది రైతులకు అప్పటి ప్రభుత్వం ఇస్తామన్న భూమి విషయం ఎటూ తేలలేదు.

పైగా సాగు భూమిని వర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించడంతో ప్రస్తుతం 174 గిరిజన కుటుంబాలకు భూమి కూడా లేదు.

“మా తాతల, తండ్రుల నుంచి మేం సాగు చేసుకుంటున్న భూములను వర్సిటీ కోసం తీసుకుని, మమ్మల్ని రానివ్వకుండా దాని చుట్టూ పెద్ద గోడ కట్టారు. ఇప్పుడు యూనివర్సిటీ ఇక్కడ రావట్లేదు. మేం గతంలో సాగు చేసిన ఈ భూముల్ని కానీ, లేదా మాకు వేరే చోట ఇస్తామన్న భూములను కాని ఇవ్వండి. హామీలను నెరవేర్చకుండా మా భూమిని ఏపీఐఐసీకి ఇచ్చేయడం ఎంత వరకు న్యాయం?” అని అప్పన్నదొర పాలెంకు చెందిన గిరిజన రైతు ఉగ్గిన నరసింగరావు బీబీసీతో అన్నారు.

రైతు భూములు

ఏపీఐఐసీకి గిరిజన సాగు భూములు ఎందుకిస్తున్నారు?

“వర్సిటీ కోసం సేకరించిన భూములను ఇండస్ట్రియల్ జోన్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు భూములను సేకరించే ఏపీఐఐసీకి 156 ఎకరాల భూమిని అప్పగిస్తున్నాం. ఎవరైతే వర్సిటీ కోసం భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారారో వారికి మరో చోట భూములు ఇవ్వడం జరుగుతుంది. భూములు ఇచ్చిన 174 కుటుంబాల రికార్డులు పరిశీలించి, వారికి భూమి ఇచ్చే ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపుతున్నాం” అని కొత్తవలస మండలం తహశీల్దార్ ఎం. శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

చెట్లు తొలగించడానికే రెండేళ్లు..

వర్సిటీకి రెండు చోట్ల భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారినవారికి పూర్తి న్యాయం జరగలేదు.

పైగా ప్రభుత్వం మారితే మేం యూనివర్సిటీని మరో చోటుకు మారుస్తామని ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అంటోందని గిరిజన సంఘం నాయకులు అంటున్నారు.

టీడీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అప్పన్నదొర పాలెంలో వర్సిటీ పనులు ప్రారంభించింది.

ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో వర్సిటీ స్థలం కూడా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నికలు ఏడెనిమిది నెలలున్నాయనగా శంకుస్థాపన చేసింది.

ఇదెప్పటికి పూర్తవుతుందో, ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం వైస్ ప్రెసిడెంట్ తుమ్మి అప్పలరాజు దొర బీబీసీతో అన్నారు.

“ప్రస్తుతం శంకుస్థాపన జరిగిన భూముల్లోని జీడి, మామిడి తోటలను తొలగించి, ఒక రూపు తీసుకుని రావడానికి రెండేళ్లు పడుతుంది. ఇక దాని చుట్టూ ప్రహరీ నిర్మాణం జరిగి, వర్సిటీ పూర్తయ్యేదెప్పుడో చెప్పలేం. ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతోంది.” అని అన్నారు.

వర్సిటీ ఏర్పాటుతో లాభపడింది నాయకులే...

'గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో గిరిజనులకు మేలు జరుగుతుందని భావించాం, కానీ యూనివర్సిటీ ఏర్పాటు కాకముందే వర్సిటీ కోసం చేసిన భూ సేకరణలో నాయకులు లాభపడ్డారు. టీడీపీ ప్రభుత్వం తమ నాయకులకు భూములున్న చోట వర్సిటీని పెడితే, వైసీపీ దానిని మార్చి తమ నాయకులకు లాభం చేకూర్చే చోట వర్సిటీని పెట్టింది. ఈ రెండు చోట్ల నిర్వాసితులు నష్టపోయారు' అని సీపీఎం పార్టీ నాయకులు రాకోటి రాములు అన్నారు.

“సాగులో ఉన్న గిరిజన భూముల్ని తీసుకుని అప్పన్నదొరపాలెంలో మరో చోట భూమి ఇస్తామని ఇవ్వలేదు. దాంతో వారు ఉపాధి కోల్పోయారు. మెంటాడలో అరకొర పరిహారాలు ఇచ్చి రైతుల భూములను తీసుకున్నారు. వారు పరిహారం కోసం పోరాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ రోజూ తిరుగుతున్నారు” అని రాములు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)