పార్లమెంట్‌లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంట్‌లో తాను నిరంతరం వేధింపులకు గురవుతున్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు చెప్పారు.
దిగువ సభలో తోటి సభ్యుడు తన మెడపై గాలి ఊదడం చేస్తుండేవారని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని మాజీ మంత్రి అయిన కరెన్ ఆండ్రూస్ తెలిపారు. అయితే ఆ సభ్యుడి పేరును ఆమె వెల్లడించలేదు.
విస్తృతమైన లైంగిక వేధింపులకు సంబంధించిన నివేదికలతో ఆస్ట్రేలియా పార్లమెంట్ అట్టుడికిపోయింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీలు, సిబ్బందికి సంబంధించిన నూతన నూతన ప్రవర్తనా నియామవళిని పార్లమెంట్‌లోని రెండు సభలు అంగీకరించాయి.
‘‘పార్లమెంట్‌లో నా పని నేను చేసుకుంటుండగా వెనుక నుంచి నా మెడపై గాలి తగిలేది. నా వెనుక కూర్చొనే సభ్యుడు ఒకరు నాకు దగ్గరగా వచ్చి ఊపిరి తీసుకునేవారు. ఇదేంటని నేను అడిగితే, ‘‘చాలా మంచి ప్రశ్న అడిగావు. తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా’’ అని సమాధానం వచ్చేది.
అసలు సమస్య ఏంటంటే, ఈ విషయం గురించి మనం ప్రస్తావిస్తే, ‘‘సరదాగా తీసుకోలేవా?’’ అని చాలామంది నుంచి బదులు వచ్చేది. అలా చేసినప్పుడు ఒక్కోసారి నేను ప్రశ్నిస్తాను. ఒక్కోసారి వదిలేస్తాను. ప్రతీసారి గొడవ పడలేను కదా” అని ఏబీసీ వార్తా సంస్థకు కరెన్ వివరించారు.

ఫొటో సోర్స్, SUPPLIED
స్కాట్ మారిసన్ సంకీర్ణ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, హోం శాఖ మంత్రిగా కరెన్ ఆండ్రూస్ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్తగా కరెన్ ఆండ్రూస్‌కు పేరుంది.
రాజకీయాల్లో మహిళలపై వివక్ష, మహిళల పట్ల దురుసు ప్రవర్తన, లైంగిక వేధింపులపై చాలాసార్లు ఆమె ప్రశ్నించారు.
ఇటీవలే తన రిటైర్మెంట్‌ను కూడా ప్రకటించారు. 2025 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చెప్పారు.
రాజకీయాల్లోకి ప్రవేశించకముందు కరెన్ ఆండ్రూస్ పురుషాధిక్యం ఎక్కువగా ఉండే రంగాల్లో పనిచేశారు. ఆమె గతంలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. కానీ, పార్లమెంట్‌లోనే తాను లింగ వివక్షను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు.
ఏబీసీ ప్రతినిధి అనబెల్ క్రాబ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ
“నేను ఇంజినీర్‌గా పని చేసిన రోజుల్లో పని ప్రదేశంలోగానీ, ఆ రంగం నుంచి గానీ ఎలాంటి వివక్షా, వేధింపులను ఎదుర్కోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక చాలా ఇబ్బంది పడ్డాను. నేను కేవలం మహిళ అయిన కారణంగానే చిన్న చిన్న విషయాల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది" అంటూ వివక్ష తీవ్రతను గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సెనెటర్‌పై లైగింక వేధింపుల ఆరోపణలు
కరెన్‌తో గతంలో పనిచేసిన లిబరల్ పార్టీ సహచరుడు, సెనెటర్ డేవిడ్ వాన్‌పై ఈ ఏడాది ప్రారంభంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ముగ్గురు మహిళలు ఆరోపణలు చేశారు. ఇందులో ఇద్దరు తోటి ఎంపీలైన లిడియా థార్పే, అమండా స్టాకర్ ఉన్నారు.
సెనెటర్ డేవిడ్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఈ ఏడాది జూన్‌లో ఎంపీ లిదియా థోర్పె ఆరోపించారు. పార్లమెంట్ గది మెట్ల మార్గం దగ్గర అసభ్యకర రీతిలో తాకారని ఆరోపించారు. అదే సమయంలో మరో మహిళా ఎంపీ అమండా స్టోకర్ కూడా గతంలో డేవిడ్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
ఈ ఆరోపణలు లిబరల్ పార్టీకి తలనొప్పిగా మారడంతో డేవిడ్ వాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇలాంటి ప్రవర్తనని ఉపేక్షించమని స్పష్టం చేసింది.
డేవిడ్ వాన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారని అన్నారు.
ప్రధాని కార్యాలయానికి కొద్ది దూరంలోనే అత్యాచారం
2021లో లిబరల్ పార్టీ మాజీ ఉద్యోగి స్వయంగా ముందుకు వచ్చి తనపై అత్యాచారం జరిగిందని చెప్పారు. 2019లో ప్రధాని కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే తనతో పనిచేసే సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించచారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.
ప్రతీ ముగ్గురిలో ఒకరిపై లైంగిక వేధింపులు
2021 నవంబరులో ఆస్ట్రేలియా హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆస్ట్రేలియాలోని చట్ట సభల పని ప్రదేశాలలోని పరిస్థితులపై విడుదల చేసిన నివేదిక దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
పార్లమెంటరీ కార్యాలయాలో పనిచేసే మహిళల్లో 51% మంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపుల బారిన పడ్డారని ఆ నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- ఆంధ్రప్రదేశ్: ఓ గిరిజన వర్సిటీ రైతులను ఎలా రోడ్డున పడేసిందంటే....
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, జగన్ ఎన్నికల హామీ ఏమైంది?
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














