‘నేను కూడా అబ్బాయిల తొడలపై చేతులు వేసి లైంగికంగా వేధించి ఉండొచ్చు. కానీ, నాకు గుర్తు లేదు.’

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కెల్లీ ఎన్‌జీ, షైమా ఖాలిల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
జపాన్ పాప్ ఏజెన్సీ జానీ అండ్ అసోసియేట్స్ కొత్త సీఈవో నురియుకీ హిగషియమ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఏజెన్సీ వ్యవస్థాపకులు, జపాన్ వినోద పరిశ్రమలోనే అత్యంత ప్రభావశీలులు, శక్తివంతులు, మ్యూజిక్ మొఘల్ గా పిలుచుకునే జానీ కిటగావాపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంస్థ ప్రతిష్ట దిగజారిన నేపథ్యంలో సీఈవో రిజైన్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన సీఈవోపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి.
జానీ కిటగావాపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై స్వతంత్య్ర దర్యాప్తు జరిగింది.
ఆ దర్యాప్తు నేపథ్యంలో ఏజెన్సీ డైరక్టర్‌గా కొనసాగుతున్న జానీ కిటగావా మేనకోడలు జూలీ ఫుజిషిమా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
అదే సంస్థలో దీర్ఘకాలం నుంచి ఉన్న నురియుకి హిగషియామాను సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించి ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నురియుకి హిగషియామాకూ లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి పుస్తకంలో పేర్కొన్న అంశాలపై జర్నలిస్టులు నురియుకి హిగషియామాను వివరణ కోరారు.
బ్యాండ్‌లోని యువకులతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం, వారి తొడలను తాకుతూ అసభ్యకర రీతిలో మాట్లాడారా? అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
“నాకు ఏం జరిగిందో సరిగా గుర్తులేదు. ఒకవేళ అలా జరిగి ఉండొచ్చు. లేదా జరిగి ఉండకపోవచ్చు. ఆరోగ్య సమస్య కారణంగా నేను గుర్తుచేసుకోలేకపోతున్నాను” అన్నారు.
యువ కళకారులను వేధించారన్న ఆరోపణలపై “వారితో కఠినంగా ఉన్న మాట నిజమై ఉండొచ్చని, తాను టీనేజర్‌గా లేదా 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు చేసి అలా ప్రవర్తించి ఉండొచ్చని, ఇప్పుడు మాత్రం అలాంటి పనులకు పాల్పడలేదని అన్నారు.
నురియుకి హిగషియామా వయస్సు 56 ఏళ్లు. ఆయన పేరు జపాన్ అంతటా పరిచయమే.
తొలినాళ్లలో జానీ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీ నుంచే ప్రపంచానికి పరిచయమై, తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు.
నురియుకి హిగషియామా నియామకంపై విమర్శలు వచ్చాయి. నురియుకి హిగషియామాకు ఉన్న గత చరిత్ర కారణంగా ఏజెన్సీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు.
విమర్శలపై నురియుకి హిగషియామా స్పందించారు. “అందరి నమ్మకాన్ని గెలుచుకోవడానికి సమయం పడుతుంది. నా శాయశక్తులా కృషి చేసి ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదిస్తాను” అని అన్నారు.
ఏజెన్సీ వ్యవస్థాపకులు జానీ కిటగావా లైంగిక వేధింపుల విషయాన్ని ప్రస్తావిస్తూ “ఆయనపై వస్తున్న పుకార్ల గురించి నాకు తెలుసు. కానీ నాకెప్పుడూ ఆయన నుంచి ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు” అని అన్నారు.
ఏజెన్నీ పేరు మారుస్తారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ అలాంటి ఆలోచన లేదన్నారు.
ఆరోపణలు, విమర్శలు గట్టిగానే వినిపిస్తున్న నేపథ్యంలో నురియుకి హిగషియామా ఏజెన్సీ గుర్తింపును కాపాడటానికి ఏం చేయగలరన్న ప్రశ్నలు చాలానే వస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. మీపై అందరూ అనుమానపడుతుంటే, ఎలా ఏజెన్సీని పునర్నిర్మించగలరు? అని ప్రశ్నించారు.
మరో యూజర్, “ఇక ఏజెన్సీ పని అయిపోయినట్లేనా?” అని ప్రశ్నించారు.

జానీ కిటగావా బాధితులు ఏమంటున్నారు?
జానీ కిటగావా బాధితులలో ఒకరైన కౌవాన్ ఒకామొటో శుక్రవారం నురియుకి హిగషియామా నియామకంపై మీడియాతో మాట్లాడారు.
జానీ కిటగావా తన పట్ల ప్రవర్తించిన తీరుపై కన్నీరు పెట్టుకున్నారు. జానీ కిటగావా తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని, తనకన్నా తన తల్లి ఎంతో మనోవేదనని అనుభవించిందని అన్నారు.
“నాకు జరిగిన అన్యాయానికి అమ్మ తీవ్ర వేదన చెందుతోంది. నాకు జరిగిన కొన్ని విషయాలను తనతో కూడా చెప్పలేదు. వాటిని చెప్పి ఆమెని మరింత బాధపెట్టాలని అనుకోవడం లేదు” అని కన్నీటిపర్యంతం అయ్యారు.
అయితే, నురియుకి హిగషియామా ఎంపికను తాను గౌరవిస్తున్నానని అన్నారు. “ఆ బాధ్యతను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో నురియుకి హిగషియామా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు” అన్నారు.
జానీ కిటగావాను తాను అసహ్యించుకున్నప్పటికీ, ఆయనకు రుణపడి ఉన్నానని, ఆయన వల్లే తాను సంగీత ప్రపంచానికి పరిచయం అయ్యానని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
మ్యూజిక్ మొఘల్.. జానీ కిటగావా
జపాన్ దేశ వినోద పరిశ్రమలో అత్యంత శక్తివంతులు, ప్రభావవంతులుగా జానీ అండ్ అసోసియేట్స్ వ్యవప్థాపకులు జానీ కిటగావాకు పేరుంది.
ఆరు దశాబ్దాలుగా జపాన్ పాప్ సంగీత రంగాన్ని శిఖరస్థాయికి తీసుకువెళ్లారు.
బాయ్స్ బ్యాండ్ పేరిట ఆయన పరిచయం చేసిన వారంతా మంచి పేరు సంపాదించుకున్నారు.
యువ కళాకారులను తయారుచేసిన సంస్థగా జానీ అండ్ అసోసియేట్స్ గుర్తింపు పొందింది.
జానీ కిటగావాను దేవుడిగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. అయితే జానీ కిటగావాపై లైంగిక ఆరోపణలు చాలానే ఉన్నాయి.
ఈ విషయంపై జరిగిన స్వతంత్ర దర్యాప్తులో గతవారం పాప్ సంగీత మొఘల్ జానీ ఆరు దశాబ్దాల కాలంగా వందల మంది యువకులు, బాలురపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తన మ్యూజిక్ ఏజెన్సీని అడ్డుపెట్టుకొని ఈ పనులు సాగించారని తేలింది.
జానీ కిటగావా 2019లో 87 సంవత్సరాల వయసులో మృతి చెందారు.
ఆయన జీవించి ఉన్న కాలంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే వచ్చారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన మరణించిన రోజున జాతీయస్థాయిలో సంతాపం ప్రకటించారు. జపాన్ ప్రధాని కూడా సంతాపం కూడా వ్యక్తం చేశారు.
పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారం బహిరంగ రహస్యమే అయినా దశాబ్దాలుగా జపాన్ మీడియాలో ఆ ఆరోపణలపై ఎలాంటి వార్తలు, కథనాలు ప్రచురించలేదు.
ఈ ఏడాది విడుదలైన బీబీసీ డాక్యుమెంటరీ ఫలితంగా కిటగావా, జపాన్ పాప్ పరిశ్రమపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది.
జానీ కిటగావా బాధితులు ముందుకు రావడానికి కారణమైంది. ఈ ఫలితంగా స్వతంత్ర దర్యాప్తు దిశగా అడుగులు పడ్డాయి.
దర్యాప్తు సిఫారసుని అనుసరించి జానీ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీ డైరక్టర్ బాధ్యతల నుంచి జూలీ ఫుజిషిమా తప్పుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జూలీ ఫుజిషిమా తొలిసారిగా కిటగావా వేధింపులపై స్పందించి, వేధింపులు నిజమే అని అంగీకరించారు. ఆయన పరిశ్రమలో అత్యంత ప్రభావశీలురని, ఆ కారణంగానే ఆమెతో సహా పరిశ్రమలో చాలామంది మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
“జానీ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీ మిగిలిన సంస్థల కన్నా చాలా శక్తివంతమైనది” అని జపాన్ వినోద పరిశ్రమలో జర్నలిస్టుగా కొనసాగుతున్న మత్సుతానీ సోయిచిరో అన్నారు.
ఏజెన్సీని వీడిన కళాకారుల కథనాలను ప్రచురించకుండా ఒత్తిడి చేయొద్దని 2019లో జపాన్ అధికారులు జానీ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీని హెచ్చరించారు.
“సమస్య మూలాలను పూర్తిగా తెలుసుకుని, పరిష్కరించకపోతే ఇతర ఏజెన్సీలలో కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది“అని మత్సుతానీ సోయిచిరో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంకలో 269 మంది ప్రాణాలు తీసిన ఆనాటి ఆత్మాహుతి బాంబు దాడులు రాజపక్సను ఎన్నికల్లో గెలిపించడానికే జరిగాయా?
- IMF రిపోర్ట్: సౌదీలో మహిళల జీవితాలు మారిపోయాయా... ఎలా?
- మాల్దీవుల ఎన్నికల్లో ‘ఇండియా ఔట్’ అనే నినాదం ఎందుకు వినిపిస్తోంది... అక్కడ చైనా ఏం చేస్తోంది?
- లా ఆపరేషన్ : ‘గర్భనిరోధక మాత్ర పరీక్షల కోసం అమెరికా ఆ మహిళలను గినీ పందుల్లా వాడుకుంది’- డాక్యుమెంటరీలో దారుణ నిజాలు
- మట్టిలో పెరిగిన దానికన్నా ఈ గంజాయికి ధర ఎక్కువ, ఎలా పట్టుబడిందంటే....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















