మట్టిలో పెరిగిన దానికన్నా ఈ గంజాయికి ధర ఎక్కువ, ఎలా పట్టుబడిందంటే....

ఫొటో సోర్స్, SARKHEJ POLICE
- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
గంజాయిని పొలంలోనో, తోటలోనో రహస్యంగా పండించడం గురించి మీరు విని ఉండవచ్చు. కానీ, ఎవరైనా తమ ఇంట్లో లేదా ఫ్లాట్‌లో గంజాయి పెంచడం గురించి విన్నారా?
గుజరాత్‌లోని ఓ ఫ్లాట్‌లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసుల దాడిలో వెలుగు చూసింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిందితులు రెండు ఫ్లాట్లను అద్దెకు తీసుకుని బెడ్‌రూమ్‌లో గంజాయి సాగు ప్రారంభించారు. ఫ్లాట్‌లో గంజాయి సాగు కోసం శాస్త్రీయ పద్ధతిలో ప్రత్యేకంగా 'గ్రీన్‌రూమ్' తయారు చేశారు.
ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు వచ్చి చూడగా....ఆ గదిలో గంజాయి చెట్లు కనిపించాయి.
నిందితులు ఈ గంజాయిని దేనికోసం పండించారు? ఎవరికి సరఫరా చేయనున్నారు? డ్రగ్స్ సరఫరా చేసే ముఠాతో వీరికి సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, SARKHEJ POLICE
ఎలా దొరికారు?
అహ్మదాబాద్‌లోని ఎస్.పి. రింగ్ రోడ్‌లో గల 'యాపిల్‌వుడ్స్-ఆర్కిడ్ లెగసీ' అపార్ట్‌మెంట్స్‌లోని రెండు ఫ్లాట్లలో అనుమానాస్పద కార్యకలాపాలను ఇరుగు పొరుగువారు గమనించారు.
సాధారణంగా ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినప్పుడు, ఇంటి సామగ్రి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ సరుకులు మాత్రమే రవాణా అయ్యేవి. నీటి జాడీలు, బకెట్లు, ప్లాస్టిక్ ట్యాంకులు తదితర వస్తువులు ఇక్కడికి వచ్చేవి.
ఈ విషయం పోలీసులకు చేరింది. దీంతో సెప్టెంబర్ 3న రాత్రి 11 గంటలకు 15వ అంతస్తులో గల ఈ రెండు ఫ్లాట్లపై అహ్మదాబాద్ పోలీసులు దాడులు చేశారు.
పోలీసులు కాలింగ్ బెల్ కొట్టగానే ఓ వ్యక్తి వచ్చి డోర్ తీశారు. పోలీసులను చూడగానే ఒక్కసారిగా షాకయ్యారు
పోలీసులు ఫ్లాట్‌ను తనిఖీ చేసి, అక్కడ గంజాయి లాంటి చెట్లు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అధికారులను పిలిపించారు పోలీసులు. అది గంజాయేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఫ్లాటా? లేక గార్డెనా?
బ్లాక్ నం డి-2లోని 15వ అంతస్తులో గల ఈ ఫ్లాట్‌లో రవి ప్రకాష్ మురార్కా, రితికా ప్రసాద్, వీరేన్ మోదీలు ఉన్నారు. ముగ్గురూ జార్ఖండ్ వాసులు.
పోలీసులు ఫ్లాట్‌లో సోదా చేయగా, వారికి ప్లాస్టిక్ జిప్-లాక్ బ్యాగ్ కనిపించింది. ఆ సంచిలో ఆకుపచ్చ రంగులో ఏదో ఉంది. దీనిపై పోలీసులు రవిప్రకాష్‌ని ప్రశ్నించగా అది గంజాయని బదులిచ్చారు.
ఫ్లాట్ సెటప్ మొత్తం ప్రయోగశాలలా ఉంది. ఫ్లాట్‌లోకి అడుగుపెట్టగానే గదిలో ఉన్నామా లేక గార్డెన్‌లో ఉన్నామా? అనే అనుమానం కలిగిందని పోలీసులు తెలిపారు.
నిందితులు గంజాయి పండించేందుకు ఫ్లాట్‌లో 48 కుండలు పెట్టారు. మొక్కలు నాటిన ఒక్కో గదిలో 8 ఫ్యాన్లు ఉన్నాయి.
ఫ్యాన్లతో పాటు తేమను నియంత్రించేందుకు ప్రతి గదిలో హ్యూమిడిఫికేషన్ (తేమను పెంచడం), డీహ్యూమిడిఫికేషన్ (తేమను తగ్గించే) యంత్రాలను ఏర్పాటు చేశారు.
ఫ్లాట్‌లో రూ.4,87,300 నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ చావ్డా బీబీసీతో తెలిపారు. అంతేకాకుండా అమినో యాసిడ్‌లతో పాటు పీహెచ్ (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) టెస్టింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ వెయిటింగ్ ఫోర్క్, బీకర్స్, పది స్థూపాకారపు జగ్గులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
''ప్లాస్టిక్ ట్రేలలో 24 గంజాయి మొక్కలు కనిపించాయి. అక్కడ ఉన్న ఆర్‌ఓ (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్‌ను కూడా సీజ్ చేశాం.
గోధుమ, తెలుపు రంగు ఎరువులను వేర్వేరుగా ఉంచారు. పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, SARKHEJ POLICE
భూమి లేదు, సూర్యరశ్మి లేదు, ఎలా పెంచారు?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి సాగుచేసిన ఫ్లాట్ సెటప్ ఓ లాబొరేటరీలా ఉంది. నిందితులు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గంజాయిని పండించారు.
హైడ్రోపోనిక్స్ వ్యవసాయం అంటే మట్టి లేకుండా చేసే వ్యవసాయం. పంటలకు 80 శాతం తేమ అవసరం. ఈ పద్ధతిలో చిన్న మొక్కలను సాగు చేశారు.
పైపులో రంధ్రాలు చేసి మొక్కలు నాటారు. ప్రస్తుతం టమాటా, తులసి, కొత్తిమీర, పెసలు ఇలాగే సాగు చేస్తున్నారు. దీనిని మోడ్రన్ అగ్రికల్చర్ (ఆధునిక వ్యవసాయం) అని కూడా అంటారు.
పోలీసులు ఫ్లాట్‌కు చేరుకుని చూడగా రెండు మూడు అంగుళాల గంజాయి మొక్కలు కనిపించాయి.
మొక్కలకు అవసరమైన నీరు, రసాయనాలను పైపుల ద్వారా అందించారు. ఈ మొక్కలకు ఎలక్ట్రానిక్ డ్రిప్ విధానంలో నీరు పోస్తున్నారు. గది పైకప్పుపై LED లైట్ స్ట్రిప్స్ సైతం ఏర్పాటు చేశారు.
ప్రకాశవంతమైన వెండి రంగు కాగితం నేల, గోడలపై రిఫ్లెక్టర్లుగా అమర్చారు. మొక్కలపై ఎల్ఈడీ కాంతి పడేలా ఈ కాగితం చేస్తుంది. ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిగేలా చేస్తుంది.

ఫొటో సోర్స్, SARKHEJ POLICE
పరారీలో ప్రధాన నిందితుడు
నిందితులు జూలై నుంచి ఫ్లాట్‌లో ఉంటున్నారని, 15 రోజుల క్రితం ఇక్కడ గంజాయిని నాటారని, కుండీల్లో వేసిన మొక్కలు నిదానంగా పెరుగుతున్నాయని, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని బీబీసీతో చావ్డా తెలిపారు.
ఇలా తయారైన గంజాయికి, సాధారణ గంజాయి కంటే ధర ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
"ఈ రకమైన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన గంజాయికి మార్కెట్‌లో ధర ఎక్కువ. నిర్దిష్ట తేమలో పండించడమే దీనికి కారణం" అని చావ్డా చెప్పారు.
అరెస్టయిన నిందితులంతా బాగా చదువుకున్న వారేనని పోలీసులు తెలిపారు.
"రవి ప్రకాష్ చార్టర్డ్ అకౌంటెంట్. రితికా ప్రసాద్ బీసీఏ, వీరేన్ మోదీ బీకాం చదివారు" అని చావ్డా చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రవిప్రకాశ్ తమ్ముడు ఉజ్వల్ పరారీలో ఉన్నాడు.
'ఉజ్వల్ వ్యవసాయంలో నిపుణుడు, టెక్స్‌టైల్ ఇంజనీర్ కూడా. అతనే రాంచీ నుంచి విత్తనాలు తెప్పించేవాడు. సూర్యకాంతి లేకుండా మూసి ఉన్న గదిలో సాగుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు" అని చావ్డా తెలిపారు. అయితే, తయారు చేసిన గంజాయిని ఇంకా ఎవరికీ విక్రయించలేదని పోలీసుల విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి
- మొరాకో భూకంపం: 820కి చేరిన మృతుల సంఖ్య.. ఎటు చూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద శవాలు
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














