మనిషి సముద్రంలో ఎంత లోతుకు వెళ్లగలడు?

డీప్ డైవ్

‘‘సముద్రంలో 100 మీటర్ల లోతుకి వెళితే సూర్యరశ్మి ఉండదు. అంతా చీకటే. నీ ఊపిరితిత్తులు రెండూ కూడా టెన్నిస్ బాల్ పరిమాణానికి కుచించుకుపోతాయి. నీ పని అయిపోయింది ఇక మృత్యువే అని సిద్ధపడుతోన్న నీ మనసుకి సర్దిచెప్పుకుని నువ్వు ముందుకు సాగాలి” టర్కిష్ ఫ్రీ డైవర్ సాహిక ఎర్క్యెమెన్ మాటలు ఇవి.

ఆగస్టు నెలలో జరిగిన ఫ్రీ డైవింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొన్న అథ్లెట్లలో సాహిక ఒకరు. ఫ్రీ డైవింగ్ లో రెండు జాతీయ రికార్డులతోపాటు ఏసియన్ కాంటినెంటల్ రికార్డ్ కూడా సాధించారామె.

ఈ ఏడాది ఫ్రీ డైవింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆగస్టు నెలలో రోటాన్ ఐలాండ్ లోని హండరాస్ ఉత్తర తీరాన నిర్వహించారు.

ఈ పోటీల్లో రష్యన్ ఫ్రీ డైవర్ అలెక్సీ మాల్చనోవ్ సముద్రంలో 136 మీటర్ల లోతుకు డైవింగ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

ఈ క్రీడకు ఉన్న ఆదరణను పక్కన పడితే ఫ్రీ డైవింగ్ ప్రమాదకరమైనది. ఇందులో ఒక సముద్రంలోకి డైవ్ చేసి, నీటి అడుగుకు వెళ్తూ కొన్ని నిముషాల పాటు శ్వాస బిగపట్టుకుని ఉండాలి. సముద్రం ఉపరితలం కన్నా 10 రెట్లు ఎక్కువ పీడనం ఉండే లోతుకు వెళ్లి రావాలి. ఏ మాత్రం నియంత్రణ కోల్పోయినా ప్రాణాలకు ప్రమాదమే.

ఇటీవల నెట్ ఫ్లిక్ లో విడుదలైన డాక్యుమెంటరీ ‘ది డీపెస్ట్ బ్రీత్’ లో 38 ప్రపంచ రికార్డులు సాధించిన ఇటాలియన్ ఫ్రీ డైవర్ అలెస్సియా జెచ్చిని, ఆమె భాగస్వామి ఐరిష్ సేఫ్టీ డైవర్ స్టీఫెన్ కీనన్ ల విషాద ప్రేమకథను మనం చూడొచ్చు. ఇందులో ఫ్రీ డైవింగ్ తోపాటు వారి మధ్య ఉన్న బంధం, ఈ క్రీడలో ధ్యానం, ఏకాగ్రతల ప్రాధాన్యం కూడా మనకు తెలుస్తుంది.

“సముద్రంతో గనుక పోరాటం చేద్దామని ప్రయత్నిస్తే కచ్చితంగా ఓడిపోతాం” అని యూకెకు చెందిన ఫ్రీ డైవింగ్ శిక్షకులు ఐయాన్ డొనాల్డ్ బీబీసీతో అన్నారు.

Sahika Ecrumen

ప్రమాదకరమైన క్రీడ

“సముద్రపు అడుగుకు వెళ్లి, తిరిగి ఉపరితలానికి చేరుకుని తొలి శ్వాస తీసుకోవడం అంటే మళ్లీ జన్మించినట్లే” అని టర్కిష్ ఫ్రీ డైవర్ సాహిక ఎర్క్యుమెన్ అన్నారు.

“ఎక్కువగా ఆశించొద్దు, అలాగే ఎక్కువ ఆందోళన కూడా పెట్టుకోవద్దు. ఇది చాలా సాహసోపేతమైన క్రీడ. ఒకవేళ మనం దీనిని ఆస్వాదించలేకపోతే, వదిలేసి వెళ్లడమే మంచిది” అని మరోక టర్కిష్ ఫ్రీ డైవర్ ఎగ్ముర్ ఎర్గున్ అన్నారు. ఆగస్టు నెలలో ఈజిప్ట్ లో జరిగిన ఏఐడీఏ ఫ్రీ డైవింగ్ ప్రపంచ కప్ పోటీల్లో మొప్పలు లేకుండా ఫ్రీ డైవింగ్ చేసి ఆమె జాతీయ రికార్డ్ నెలకొల్పారు.

ఎంత లోతుకు వెళ్లగలం?

అంతరిక్షంలో ఉన్నట్లే సాగర గర్భం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. మానవుల ఓపిక, ఉత్సుకతల పరిధిని పరీక్షించేంతలా సాగర గర్భం తనలో ఎన్నో అద్భుతాలను దాచుకుంది.

2007లో ఆస్ట్రేలియా ఫ్రీ డైవర్ హెర్బర్ట్ నిట్స్చ్ హెవీ మెటల్ వెయిట్ సాయంతో సముద్రంలో 253.2 మీటర్ల లోతుకు వెళ్లి వచ్చాడు. అయితే, మానవులు సముద్రంలో ఎంత లోతు వరకు వెళ్లగలరు? అన్న విషయం మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది.

చాలామంది అనుకున్నట్లు సముద్రపు లోతుకు వెళ్లడం అన్నది క్లిష్టమైన విషయం కాదు. ఒక్కసారి గుండెలనిండా శ్వాస తీసుకుని, సముద్రంలోకి డైవ్ చేసిన వారు తిరిగి సముద్ర ఉపరితలాన్ని చేరుకోవడమే చాలా కీలకం. ఈ సమయాన శరీరంలో ఉన్న ప్రాణవాయు నిల్వలు సరిపోక, పైకి చేరుకునే లోగానే ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఎక్కువ శాతం ప్రమాదాలు ఈ కారణంగానే జరుగుతుంటాయి.

ఇంతటి ప్రమాదకరమైన క్రీడ గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు బీబీసీ ప్రఖ్యాత డైవర్లు, శిక్షకులను సంప్రదించింది.

Yagmur Ergun

అసలు ఫ్రీఫాల్ అంటే?

“సముద్రపు నీటి అడుగున చిమ్మచీకటిలో శ్వాస బిగబట్టుకుని ఉంటే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?” అని ప్రపంచ ఫ్రీ డైవింగ్ ఛాంపియన్ విలియం ట్రుబ్రిడ్జ్ 2018లో జరిగిన టెడెక్స్ షో లో ప్రేక్షకులను ప్రశ్నించారు.

“నిజానికి మనమంతా ఈ అనుభూతిని పొందాం. తల్లి కడుపున చీకట్లో కొన్ని నెలలపాటు ఉన్నాం. ఈ భూమ్మీదకు వచ్చి తొలి శ్వాస తీసుకునేవరకు ఆ అనుభూతిలోనే ఉన్నాం” అని ఫ్రీ డైవింగ్ అనుభూతి గురించి ప్రేక్షకులకు అర్థం చేయించే ప్రయత్నం చేశారు.

ఫ్రీ డైవింగ్ కు అనుకున్న రీతిలో ఆర్థిక మద్దతు లేదు. ఆర్థిక రికార్డులు నెలకొల్పుతున్న టర్కిష్ ఫ్రీ డైవర్ ఎగ్ముర్ ఎర్గున్ ప్రపంచ స్థాయి అథ్లెట్స్ కు ఏమాత్రం తీసిపోని క్రీడాకారిణి. కానీ ఆమె తన ఉద్యోగాన్ని విడిచి, పూర్తిస్థాయిలో అందుకు సన్నద్ధం అయ్యేంత ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతోంది. ఫ్రీ డైవర్ అలెక్సీ మాల్చనోవ్ రోటాన్ లో జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో 4 నిముషాల 37 సెకన్లలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

డైవ్ చేయడానికి ముందు డైవర్లు తమ శ్వాస నియంత్రణ, ఏకాగ్రత, ధ్యానం వంటి అంశాలపై దృష్టి పెడతారు. తాము సిద్ధం అయ్యామని అనుకున్న క్షణాన గుండెల నిండా ఊపిరిపీల్చుకుని నీటిలోకి డైవ్ చేస్తారు. మొదట వారు నీటిలో ప్లవన శక్తిని ఎదుర్కొని సముద్రపు లోతుకు వెళ్లాలి. ఈ ప్లవన శక్తి వారిని తిరిగి సముద్ర ఉపరితలంవైపుకు అంటే పైకి నెట్టేస్తుంది. మరోవైపు పీడన ప్రభావం శరీరంపై పడి ఊపిరితిత్తులు కొంచెం కొంచెగా కుచించుకుపోవడం మొదలై, 10 మీటర్ల లోతుకు చేరుకునే సరికి, సగం పరిమాణానికి కుచించుకుపోతాయి. శరీరపు సాంద్రత పెరిగి, నీటి సాంద్రత స్థాయితో సమయయ్యే స్థితిలో డైవర్ తటస్థ ప్లవన శక్తి స్థితికి చేరుకుంటాడు. ఒకవేళ అదే స్థితిలో గనుక డైవర్లు ఆగితే నీటిలో తేలుతారు.

“మనం అలాంటి స్థితికి చేరుకునే సమయానికి మనం అన్నింటిని వదిలేయాలి. మన గతం, ఆందోళన, భయం, ఆశ.. అన్ని వదిలేసి, ఆ క్షణాలను ఆస్వాదించాలి“ అని ట్రుబ్రిడ్జ్ చెప్తారు.

ఆ స్థితి నుంచి కొన్ని స్ట్రోక్స్ ఇస్తూ డైవర్ల ఫ్రీ ఫాల్ క్రీడ మొదలవుతుంది. ఇది చీకట్లోకి, సముద్ర గర్భంలోకి వారిని తీసుకుని వెళ్తుంది. ఈ ప్రయాణం అద్భుతమైనదని డైవర్స్ వర్ణిస్తారు.

Jacques Mayol

మమ్మాలియన్ డైవ్ రిఫ్లెక్స్

ఆశ్చర్యకరరీతిలో మానవులు నీటి అడుగున శ్వాసని బిగబట్టుకుని ఉండటం అలవాటు చేసుకున్నారు. మమ్మాలియన్ డైవ్ రిఫ్లెక్స్ అన్న ప్రక్రియపై మానవులు ఆధారపడ్డారు. ఈ చర్యలో చల్లని సముద్రపు నీరు మొహం, శరీరం చుట్టూ చేరి క్రమేణా గుండె కొట్టుకునే వేగం తగ్గడంతోపాటు రక్తప్రసరణలో కూడా మార్పు వస్తుంది. ఈ ప్రక్రియ ఎంతగానో ఉపకరిస్తుంది. డాల్ఫిన్లు, సీల్స్, తిమింగళాల వంటి జీవులు కూడా ఇదే చర్యపై ఆధారపడి, నీటి అడుగున ఎక్కువకాలం చేతన స్థితిలో ఉండగలవు.

కానీ సముద్ర గర్భం ఆవాసం కాదు. శరీరంలో ప్రాణవాయువు నిల్వను కోల్పోయిన డైవర్స్ బ్లాకవుట్స్ బారిన పడతారు. ఆ పీడనం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఈ బ్లాకవుట్స్ వలన చాలామంది డైవర్స్ గతంలో ప్రాణాలు గతంలో కోల్పోయారు. కొంతమంది ఆచూకీ కూడా తెలీలేదు.

ఫ్రీ డైవింగ్ ఛాంపియన్ అలెక్సీ మాల్చనోవా తల్లి నటాలియా మాల్చనోవా ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా డైవర్లలో ఒకరిగా కీర్తించబడ్డారు. ఈమె 2015లో స్పెయిన్ లోని ఇబిజా తీరాన చేసిన డైవింగ్ లో సముద్రపు అడుగున గల్లంతయ్యారు. ఆమె మృతదేహం ఇప్పటికీ దొరకలేదు.

మానవ- సాగర బంధం..

ఫ్రీ డైవింగ్ అనేది ఇప్పటిది కాదు.. వందల ఏళ్ల నుంచి ఉంది. చరిత్రను పరిశీలిస్తే సముద్రంలో ఆహారం కోసం ఫ్రీ డైవింగ్ చేసేవారు. శతాబ్దాల కాలం నుంచి సముద్రపు జీవుల వేట, ముత్యాల కోసం సముద్ర గర్భాన్ని చుట్టి వస్తూనే ఉన్నారు. దక్షిణ కొరియాలోని జేజు ఐలాండ్ కు చెందిన మత్స్యకారులు తరాల నుంచి ఫ్రీ డైవింగ్ మెళకువలను నేర్చుకున్నారు.

అండమాన్ సముద్రపు తీరాన ఉండే థాయిలాండ్ లోని మొకెన్ సమూహంలోని ప్రజలు కూడా చిన్నతనం నుంచే ఈ డైవింగ్ కు అలవాటు పడ్డారు.

2018లో వెల్లడైన పరిశోధనల్లో దక్షిణ-తూర్పు ఏసియా ప్రాంతంలో ఉండే సంచార, నావికా వృత్తి సాగించిన ప్రజల శరీరంలో ప్లీహము డైవింగ్ చేసేందుకు అనుగుణంగా సాధారణ స్థాయికంటే కాస్త ఎక్కువగానే వృద్ధి చెందినదని తెలిసింది. ఈ ప్లీహము పరిమాణం పెరిగితే డైవింగ్ సమయంలో రక్తప్రసరణకు అవసరమయ్యే ప్రాణవాయువును ఎక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంచడానికి సాయపడుతుంది.

ఫ్రీ డైవింగ్ చేయడానికి స్విమ్ సూట్, మాస్క్ ఈ రెండూ ఉంటే చాలని శిక్షకులు అయాన్ డొనాల్డ్ అన్నారు. సాగర అద్భుతాన్ని ఆస్వాదించేందుకు ఫ్రీ డైవింగ్ మంచి అవకాశంగా పేర్కొన్నారు.

“సముద్రపు అడుగున జల చరాలు మనతో ప్రవర్తించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. మనకు అత్యంత సమీపానికి వచ్చి, మనల్ని పలకరిస్తాయి. డైవర్లు శ్వాసని బిగబట్టుకుని ఉన్న కారణంగా నోటి నుంచి బుడగల లాంటివి వదలరు. అప్పుడు నీటి అడుగున చేపలు రాతిపై ఉన్న నాచును తింటున్న శబ్దం, డాల్ఫిన్ లు చేసే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ క్షణాన సాగరంతో మానవులకు ఉన్న బంధం అర్థమవుతుంది” అన్నారు.

గుర్తింపు..

ఫ్రీ డైవింగ్ క్రీడ ప్రజాదరణ పొందినప్పటికీ ఇతర ప్రమాదకరమైన క్రీడలతో పోలిస్తే ఆర్థికపరమైన మద్దతు తక్కువే. 2023లో అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ గుర్తించి, ప్రపంచ క్రీడల జాబితాలో చేర్చారు. అయితే ఇంకా ఒలంపిక్ క్రీడగా గుర్తించలేదు.

ఆర్థికంగా మద్దతు లేని కారణంగా అర్హత, సామర్థ్యం ఉన్నప్పటికీ క్రీడాకారులు వెనకడుగు వేస్తున్నారు. టర్కిష్ రికార్డ్ హోల్డర్ అయిన ఎగ్ముర్ ఎర్గున్ ప్రపంచ స్థాయి అథ్లెట్లతో పోటీపడే సామర్థ్యం ఉన్నా స్థోమత లేని కారణంగా తన ఉద్యోగంలోనే కొనసాగుతోంది.

“పోటీల్లో నేను మొప్పలు లేకుండానే డైవ్ చేయడానికి కారణం ఉంది. ఒక్కో జత మొప్పలు 1120 డాలర్లు ధర ఉంటాయి. నా దగ్గర వాటిని కొనేంత డబ్బు లేదు.“ అని తెలిపారు.

“శిఖరం ఎత్తు తెలుస్తుంది కానీ, అడుగు భాగం ఎక్కడివరకు ఉందో కచ్చితంగా చెప్పలేం. అలాగే అందరికీ తెలిసిన మరియానా ట్రెంచ్ అడుగును కూడా ఎవరూ చేరుకోలేరు. అసలు ఎంత లోతుకని వెళ్లగలరు?” అంటూ ప్రశ్నించారు ఐయాన్ డొనాల్డ్.

ప్రాచుర్యం.. ప్రజాదరణ..

● 20వ శతాబ్దంలో యూరప్ లో ఫ్రీ డైవింగ్ ప్రాచుర్యం పొందింది.

● 1949లో ఇటాలియన్ ఫైలెట్ రాయ్ మొండొ బుచర్ సముద్ర గర్భాన 30 మీటర్ల లోతుకు ఫ్రీ డైవింగ్ చేసి అధికారికంగా తొలి రికార్డ్ నెలకొల్పాడు.

● 1960-74ల మధ్య కాలంలో సిసిలియాకు చెందిన ఫ్రీ డైవర్ ఎంజో మజోర్కా పలు రికార్డులను సాధించాడు.

● 1976లో ఫ్రెంచ్ డైవర్ జాక్వెస్ మయోల్ 100 మీటర్ల లోతుకు వెళ్లి సరికొత్త రికార్డ్ సాధించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)