'ఈ రహదారి ప్రపంచపు ఎనిమిదో వింత'

కారకోరం రోడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సమంతా షియా
    • హోదా, బీబీసీ ట్రావెల్

తెల్లటి కొండల నడుమ మలుపులు తిరుగుతూ పోతున్న 1300 కిలోమీటర్ల పొడవున్న కారకోరం రహదారి... కేవలం రవాణాకు మాత్రమే కాదు. సాహసాలు చేయాలనుకునే వారికి, ప్రకృతిలోకి పరుగులు తీయాలనుకునే వాళ్లకు స్వాగతం పలుకుతోంది.

పర్వతాల మీదుగా వచ్చే చల్లటి గాలి కారు విండోలో నుంచి దూసుకొచ్చి మొహాన్ని తాకుతోంది.

పర్వతాల సమూహం మధ్య నుంచి కారు వెళుతోంది. నడి వేసవిలోనూ భూమికి 7వేల మీటర్ల ఎత్తులో ఉన్న కొండ అంచుల మీద మంచు దట్టంగా అల్లుకుంది.

హిమానీనదాల నుంచి వస్తున్న నీరు నదిలోని జలచరాలకు కొత్త శక్తిని అందిస్తోంది. పాకిస్తాన్‌లో అత్యంత ఎత్తైన హుంజా లోయకు షాంగ్రిలా అని బ్రిటిష్ నవలా రచయిత జేమ్స్ హిల్టన్ మంచి పేరే పెట్టారు.

నేను కారకోరం హైవే మీదుగా ప్రయాణిస్తున్నాను. ప్రపంచంలోని అద్భుతమైన రాతి ఫలకాల మధ్య నుంచి వెళుతుందీ రహదారి. దీన్ని ప్రపంచ ఎనిమిదో వింతగా భావిస్తుంటారు. ఈ రోడ్‌మీద ప్రయాణించాలనేది చాలా మంది కల.

ఇది ఒకప్పుడు సిల్క్‌రోడ్డులో బాగం. ఈ మార్గానికి శతాబ్ధాల క్రితమే పూర్వీకులు పునాదులు వేశారు.

అయితే 1978 వరకూ అంతగా అస్థిత్వంలో లేదు. 1978లో 24వేల మంది పాకిస్తానీ, చైనా కార్మికులు 20 ఏళ్ల పాటు ఈ మార్గాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వాహనాల రాకపోకల కోసం అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఈ మారుమూల ప్రాంతంలో వాణిజ్యం, పర్యటకం, ప్రయాణాలు పెరిగాయి.

1300 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామబాద్ సమీపంలో ఉన్న చిన్న పట్టణం హసన్ అబ్దల్‌ నుంచి కుంజేరబ్ మీదుగా చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో ఉన్న కష్గర్ వరకూ వెళుతుంది. ఒక దేశం నుంచి మరో దేశంలోకి అది కూడా సముద్ర మట్టానికి 4700 మీటర్ల ఎత్తులో నిర్మించిన అతి పెద్ద రహదారి ఇది. ఈ మార్గంలో 194వ కిలోమీటర్ వద్ద హంజా లోయలోకి వెళ్లేందుకు ఈ హైవే దిగి పక్కనున్న మరో రోడ్డులోకి వెళ్లాలి. లోయ చుట్టూ ఉన్న కొండలనే కారకోరం పర్వత శ్రేణిగా పిలుస్తారు. వీటి వల్లనే ఈ రహదారికి ఆ పేరు వచ్చింది. హిమానీ నదాల నుంచి వచ్చే స్వచ్చమైన

జలాలు, ఆ నీటిని నింపుకున్న సరస్సులు, చుట్టూ మంచు అల్లుకున్న శిఖరాల మధ్య ఉన్న ఈ ప్రాంతం అసాధారణ ప్రకృతి రమణీయతతో మన ప్రయాణాన్ని మరింత ఆహ్లదకరంగా మారుస్తుంది. ప్రయాణం ముందుకు సాగే కొద్దీ లోయలోని ప్రజల జీవన విధానం, వారి సంప్రదాయాలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి.

Hunza Valley

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హుంజా లోయ

షిన్జియాంగ్- అఫ్గానిస్తాన్‌లోని వఖాన్ కారిడార్ మధ్య గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో పొదలా అల్లుకుపోయినట్లు కనిపించే హంజావ్యాలీ భౌగోళిక కారణాల వల్ల 20వ శతాబ్ధం వరకూ ప్రపంచానికి దూరంగా ఉంది. మొదట్లో బురుషో, వాఖి తెగలకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన భాష, సంగీతం, సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. అవి ఇక్కడే తప్ప పాకిస్తాన్ కానీ, ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ కనిపించవు.

కారకోరం హైవే ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం మొదలై, ఇక్కడి పర్యావరణాన్ని ధ్వంసం చేసింది. అంతే కాకుండా ఇక్కడున్న తెగల్లో నుంచి అనేకమంది తమ సంప్రదాయ జీవితాన్ని వదిలేసి కొత్తరకమైన వాటిని అలవాటు చేసుకున్నారు. వసంత కాలానికి స్వాగతం పలుకుతూ స్థానికులు కొన్ని రోజుల పాటు చేసుకునే గియానీ పండగలో బాగంగా సంప్రదాయబద్దమైన దుస్తులు ధరించడం తగ్గిపోయింది.

అయినప్పటికీ కొంతమంది మాత్రం హంజావ్యాలీ సంప్రదాయాన్ని కాపాడేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.

Leif Larsen Music Center

ఫొటో సోర్స్, Samantha Shea

ఫొటో క్యాప్షన్, లీఫ్ లార్సన్ మ్యూజిక్ సెంటర్‌లో డోలు వాయించడం నేర్చుకుంటున్న బాలుడు

నా ప్రయాణంలో మొదటి మజిలీ అల్టిట్ గ్రామం. ఈ ఊరిలో 11 వందల ఏళ్ల పైబడిన చరిత్ర ఉన్న కోట నాటి సంస్కృతిని చాటి చెబుతూ సగర్వంగా నిలబడి ఉంది. ఇక్కడున్న ఓ కెఫేలో సంగీత కళాకారుడు ముజిబ్ రుజిక్‌ను కలిశాను. కారకోరం పర్వత శ్రేణిలో 7788 మీటర్ల ఎత్తున్న రకపోషి, 7266 మీటర్ల ఎత్తున్న డిరన్.. మంచు కప్పుకున్న ఈ శిఖరాల మధ్య కెఫే ఉంది. కెఫేకు కొంచెం దూరంలో లెయిఫ్ లార్సన్ మ్యూజిక్ సెంటర్ ఉంది. హంజా వ్యాలీలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ సంగీతాన్ని తర్వాతి తరానికి నేర్పిస్తోంది.

మేము సంగీతం మీద ఆధారపడ్డాం, ఎందుకంటే జీవితంలోని ప్రతీ అంశంలోనూ సంగీతం ముడిపడి ఉంది. మీరు వ్యవసాయం చేస్తున్నా లేక గోధుమ పంట కోస్తున్నా మేము సంప్రదాయ పాటలు పాడుతూ ఆ పని చేస్తామని రుజిక్ చెప్పారు. అయితే ఈ తరం వాళ్లకు వాటి గురించి తెలియడం లేదని సంగీతం నేర్పించడం

మొదలు పెట్టిన తర్వాత వాళ్లిప్పుడు తమ సంస్కృతి ఎంత ముఖ్యమో తెలుసుకుంటున్నారని ఆయన నాతో అన్నారు.

ఎండబెట్టిన ఆప్రికాట్స్

ఫొటో సోర్స్, alamy

ఫొటో క్యాప్షన్, ఎండబెట్టిన ఆప్రికాట్స్

ఈ మ్యూజిక్ సెంటర్‌ను 2016లో ప్రారంభించారు. అయితే జియా అల్ కరీమ్ పిల్లలకు సంగీతం నేర్పడం మొదలు పెట్టాకనే ఇది పని చేయడం మొదలైందని రుజిక్ వివరించారు. జానపద సంగీతాన్ని హాబీగా ఎంజాయ్ చేస్తున్న అల్టిట్ గ్రామంలో ఇక్కడే పుట్టి పెరిగిన ఉల్ కరీమ్ సంగీతంలో డిగ్రీ సాధించడంతో పాటు అనేక రకాల సంగీత వాద్య పరికరాలను వాయించడంలో నైపుణ్యం సంపాదించారు. ఇక్కడ ఈ ఘనత సాధించింది ఆయనొక్కరే. 2022లో ఓ మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించే వరకు వందమందికిపైగా విద్యార్థులకు ఆయన సంగీతం నేర్పించారు.

విద్యార్థులు సంగీతం నేర్చుకునే గదిలోకి రుజిక్ నన్ను తీసుకెళ్లారు. అదొక ఇల్లులాగే ఉంది. ఆ గదిలో నాలుగు గోడలకు దుషెక్ అని పిలిచే దిండు గలీబులు, దిరోస్ అని పిలిచే దిండ్లు వారగా వేసి ఉన్నాయి. అక్కడ దాదాపు 12 మంది విద్యార్థులు ఉన్నారు. పాకిస్తాన్ జాతీయ అతివాద దేశమైనా హంజా లోయలో ఉదారవాదం, స్వేచ్చ ఎక్కువ. ఇస్లాం ఆధిపత్యం ఎక్కువగా ఉన్నా.. ఇస్లాంలోని ఆధునిక తరం సహనం, మహిళల హక్కుల్ని ప్రోత్సహిస్తోంది. ఆడపిల్లలు స్వేచ్చగా ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, మహిళలు చాలా మంది యూనివర్సిటీలకు వెళ్లి చదువుకుంటున్నారు. లింగ వివక్ష లేకుండా అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు కల్పించడం అభినందించాల్సిన అంశం. సంగీతం నేర్చుకునేందుకు గదిలో కూర్చున్న వారిలో రుబాబ్ అని పిలిచే వీణ లాంటి వాయిద్యాన్ని పట్టుకున్న బాలికలు కూడా ఉన్నారు.

ముగ్గురు విద్యార్థులు “హరీప్” మ్యూజిక్ గురించి వివరించే క్రమంలో( హంజా ట్యూన్స్‌ని పిలిచే స్థానిక సంప్రదాయ పదం). పొడవాటి, సన్నటి వీణ లాంటి పరికరాన్ని వాయిస్తున్నారు. దానికి సపోర్టివ్‌గా ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో గీతలతో ఉండి డడాంగ్ అని పిలిచే పెద్ద డ్రమ్ము కూడా ఉంది. హంజా లోయలో ఏళ్ల తరబడి వారసత్వంగా వస్తున్న ఆ జానపద ధ్వనులు గాలినంతా ఆవరించి నన్ను మైమరిపించాయి. మరో లోకానికి తీసుకెళ్లాయి. మాటల్లో వివరించలేని అనుభూతిని మిగిల్చాయి.

పాత అల్టిట్‌లో రాళ్లు పరిచి ఉన్న బాట మీదుగా మళ్లీ కారకోరం హైవే మీదకు వచ్చాను. అక్కడ నుంచి స్థానికంగా గొజాల్ అని పిలిచే అప్పర్ హంజాలోకి అడుగు పెట్టాను.

Bozlanj Cafe

ఫొటో సోర్స్, Samantha Shea

ఫొటో క్యాప్షన్, కేఫ్

సెంట్రల్ హంజాలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలే పాటిస్తున్నప్పటికీ గొజాలీలు వాఖి భాష ఎక్కువగా మాట్లాడుతున్నారు. వీరు వందల ఏళ్ల క్రితం పక్కనే ఉన్న వఖాన్ కారిడార్ నుంచి ఇక్కడకు వలస వచ్చి ఉండవచ్చు. రహదారి ప్రారంభించకముందు హంజాలోని ఈ రెండు ప్రాంతాల్లో ఒక దాని నుంచి మరొక దానికి చేరుకోవడానికి రోజులు పట్టేది. అయితే ఇప్పుడు గంటలోపే చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే దట్టమైన నీలి రంగులో ఉన్న అట్టాబాద్ సరస్సు నాకు స్వాగతం పలికింది.

అట్టాబాద్ సరస్సు సహజంగా ఏర్పడింది కాదు. దాని వెనుక ఓ విషాదం ఉంది. ఈ సరస్సు ప్రకతి శోభతో కళకళలాడుతోంది. 2010 జనవరి 4న పెద్ద కొండ చరియ విరిగిపడటంతో కొన్ని రాళ్లు హంజా నది ప్రవాహానికి అడ్డుగా పడిపోయాయి. అది అట్టాబాద్ సరస్సుని సృష్టించింది. ఇప్పుడా సరస్సు చుట్టూ ఖరీదైన హోటళ్లు ఏర్పడ్డాయి. కొండచరియలతో ధ్వంసమైన గ్రామం పేరే సరస్సుకు పెట్టారు. ఇప్పుడా గ్రామం హంజా లోయ ఆధునికతకు, మార్పుకు పోస్టర్ బాయ్‌లా కనిపిస్తోంది. కారకోరం హైవే చైనా- పాకిస్తాన్ ఫ్రెండ్‌షిప్ టన్నెల్స్ పేరుతో ఐదు సొరంగ మార్గాలను 2015లో నిర్మించారు. అవి ఈ మారుమూల ప్రాంతంలో కాకుండా... ఏదో ఒక అత్యాధునిక నగరంలో నిర్మించిన వాటిలా ఉన్నాయి.

రోడ్డు విడిచి కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత నాకు బాజ్‌లాంజ్ కెఫే కనిపించింది. స్థానిక మహిళలే ప్రారంభించి, నిర్వహిస్తూ, స్థానిక వంటకాలు వడ్డిస్తున్న ఇలాంటి రెస్ట్రాంట్ కోసమే నేను వెదుకుతున్నాను. పాకిస్తానీ వంటకాల్లో మసాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది. అయితే హంజా వంటకాల్లో మాత్రం అది పుదీనా వాసనను దాటి బయటకు రాదు. పైగా చాలా రుచికరంగా ఉంటుంది. కొన్ని వంటల్లో ఆలివ్ నూనె జడల బర్రె మాంసం ఉంటాయి. నేను మూల్ ( పాలతో చేసిన చీజ్, చక్కెర, యాపిల్ వెనిగర్‌తో చేసిన వంటకం), గిల్మండి( పల్చటి రొట్టె ముక్కల మధ్య వెన్న, కొన్ని గింజలు పెట్టి చేసే శాండ్ విచ్ లాంటిది) కోసం ఆర్డర్ చేశాను.

Korgah is a female-run carpet factory located inside a 400-year-old home

ఫొటో సోర్స్, Samantha Shea

ఫొటో క్యాప్షన్, మహిళలే నిర్వహించే కార్పెట్ ఫ్యాక్టరీ కోర్గా

2016లో రెస్ట్రాంట్‌ను ప్రారంభించిన సుల్తానా, రషిదా బేగం తాము తమ అమ్మ, అమ్మమ్మల నుంచి నేర్చుకున్న స్థానిక వంటకాలనే వండి అతిధులకు వడ్డిస్తున్నామని నాతో చెప్పారు. వాళ్లు ఈ వంటలను వారి స్వగ్రామం గుల్మిట్‌లో నేర్చుకున్నారు. ఈ గ్రామం కారకోరం హైవే మీద వెళ్లేటప్పుడు ఓ మలుపు వద్ద కనుచూపు మేర దూరం కనిపిస్తుంది.

“సంప్రదాయ వంటలు దాదాపు అంతరించే దశలో ఉన్నాయి. ఎందుకంటే మా పిల్లలు ఈ వంటలను ఇష్టపడటం లేదు. వాటినెవరూ చెయ్యడం లేదు. దాంతో మేము వాటిని వండటం మొదలు పెట్టాము. మాతో మరి కొంతమంది మహిళలు కలిశారు. సంప్రదాయ వంటకాలను రుచి చూడటానికి స్థానికులు బాగానే వస్తున్నారు” అని సుల్తానా నాతో చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రాచీనమైన అడవి పువ్వు బాజ్‌లంజ్ పేరు మీద స్థాపించిన ఈ రస్ట్రాంట్‌లో ఇదే పేరుతో తయారు చేసిన టీ కూడా తాగాను.

గొజల్‌లో ప్రత్యేకించి గుల్మిట్‌లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య ఎక్కువని నాకు అప్పుడే తెలిసింది. పాకిస్తాన్‌లో కార్మికశక్తిలో మహిళల వాటా 20 శాతం మాత్రమే. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ. అయితే హంజావ్యాలీలో మాత్రం మహిళలు రెస్ట్రాంట్లు, షాపులు నిర్వహించడమే కాకుండా

కార్పెంటర్లుగా కూడా పని చేస్తున్నారు. సుల్తానా, బేగం రెస్ట్రాంట్‌కు కొంచెం దూరంలో చర్చ్ ముందు వైపున పైబాగంలో కనిపించే కోన్ లాంటి లాంటి నిర్మాణం మహిళా సాధికారతకు మరో ఉదాహరణ. 400 ఏళ్ల నాటి ఇంట్లో కోర్గాహ్ అనే కార్పెట్ ఫ్యాక్టరీని మహిళలే నడుపుతున్నారు.

నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఐదుగురు మహిళలు విశాలమైన గదిలో కూర్చుని పని చేస్తున్నారు. వారి చుట్టూ అల్లిన రగ్గులు గోడకు వేలాడ దీసి ఉన్నాయి. వాళ్లు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న సమయంలో తీసిన ఫోటోలు కూడా గోడకు వేలాడుతున్నాయి.

The Passu Cones' cathedral-shaped peaks are one of the most spectacular views on the KKH

ఫొటో సోర్స్, Samantha Shea

ఫొటో క్యాప్షన్, కారకోరం రోడ్‌లో అందమైన ప్రకృతి దృశ్యాలలో ఈ ‘పాసు కోన్స్’ కూడా ఒకటి

“మేము 1998లో మొదలు పెట్టాం, అప్పట్లో కారకోరం ప్రాంత అభివృద్ధి సంస్థ 30 మంది మహిళలకు శిక్షణ ఇచ్చిందని షమినా బానో నాతో చెప్పారు. ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన ఆమె కోర్గాహ్‌ను నడిపిస్తున్నారు. గుల్మిట్‌లో, మొత్తంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలోనే రగ్గుల తయారీలో శిక్షణ తీసుకున్న తొలి మహిళ ఆమె. వందల మందితో కలిసి పని చేశారు. కారకోరం హైవే మీద ప్రస్తుతం ఈ రగ్గుల ఫ్యాక్టరీ సుప్రసిద్ధ పర్యటక ప్రాంతం. అంటే దీనర్ధం అంతరించిపోతున్న రగ్గులు, కార్పెట్ల అల్లకాన్ని కాపాడటంతో పాటు ఈ మహిళలు తమ కుటుంబాల పోషణ బాధ్యతంతా తమ భుజాల మీద మోస్తున్నారు.

సంప్రదాయ రగ్గులను వాఖి భాషలో షర్మా లేదా ప్లాస్ అని పిలుస్తారు. వీటిని జడల బర్రె లేదా మేక వెంట్రుకలతో తయారు చేస్తారు. ఇవి వందల ఏళ్లుగా మా సంస్కృతిలో భాగం. మేము శిక్షణ తీసుకోవడానికి ముందే ఉన్నాయని బానో చెప్పారు. పర్వత ప్రాంతాల్లో పెరిగే ఐబెక్స్ అనే మేకను పోలిన డిజైన్‌తో ఆమె ఓ రగ్గును తయారు చేస్తున్నారు.

ఒక గంట తర్వాత సెంట్రల్ హంజాకు వెళ్లేందుకు బయల్దేరాను. పస్సు కోన్స్ ఇల్లు క్రమేపీ నా కంటి చూపు నుంచి దూరమైంది. వంపులు తిరిగిన రోడ్డు పొడవునా ఆవులు, మేకలు కనిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది పెద్దవాళ్లు తమ వీపుపై ఉన్న చెక్క అరల్లో గడ్డి మోపుల్ని మోసుకెళుతున్నారు. ఆధునికత సృష్టిస్తున్న అలజడికి దూరంగా హంజా వ్యాలీ ప్రజల సంప్రదాయ జీవితంలో మరో కోణం ఇది.

నిర్మాణపరంగా అద్భుతంగా ఉండే కారకోరం హైవే హంజా వ్యాలీ ప్రజలు లేకపోతే కళా విహీనంగా కనిపిస్తుంది. అత్యాధునికంగా నిర్మించిన ఆ సొరంగాలలో నుంచి తిరిగి వెళుతున్నప్పడు రుజిక్ చెప్పిన ఓ మాట గుర్తుకొచ్చింది. మేము మా సంస్కృతిని 60 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి రక్షించుకుంటూ వస్తున్నాం.... అదే ఆ మాట.

అత్యాధునికంగా నిర్మించిన ఆ సొరంగాల గుండా తిరిగి వెళుతున్నప్పుడు అనేక మంది సంస్కృతి పరిరక్షకుల గురించి ఆలోచించాను. హంజా వ్యాలీలో వాళ్లను నేను కలుసుకున్నాను. సంగీత కళాకారుల నుంచి స్థానిక వంటవాళ్లు, కళాకారులు ఇలా ఎంతో మంది. భవిష్యత్‌లో ఇక్కడికొచ్చే పర్యటకులు కూడా ఈ కారకోరం హైవేను ప్రత్యేకంగా మారుస్తున్న వాళ్లను కలిసి, వారి అనుభవాలను పంచుకుంటారనే ఆశతో ఉన్నాను.

ఈ విశాలమైన రహదారి ప్రపంచంలోని అనేక హైవేలలో ప్రముఖమైనది. వాహనాల్లో వెళ్లే వారికి సాహసాలు చేసే ప్రయాణికులకు మంచి జ్ఞాపకాల్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)