దక్షిణ కొరియా: హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట, భారీగా ప్రాణనష్టం ఉండొచ్చని ఆందోళన

81మంది శ్వాస సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 81మంది శ్వాస సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు
    • రచయిత, వాంగ్‌బీ లీ, మెర్లిన్ థామస్
    • హోదా, బీబీసీ న్యూస్

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న హాలోవీన్ వేడుల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భారీ ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరంలోని ఇటావోన్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్పృహలేని స్థితిలో ఎమర్జెన్సీ సర్వీసు ద్వారా చికిత్స పొందుతున్నట్లు వీడియోలు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి.

హాలోవీన్ వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దిగాల్సిందిగా దేశాధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఆదేశించారు.

ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న కేసులు 81 వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు.

కోవిడ్ తర్వాత తొలిసారి హాలోవీన్ వేడుకలు జరుపుకుంటుండంతో దాదాపు లక్షమంది ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.

అయితే, ఇప్పటి వరకు ఎవరైనా చనిపోయారా, ఎంత మంది గాయపడ్డారు అన్న విషయం ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు.

హాలోవీన్ వేడుకలో పాల్గొన్న జనాలతో సియోల్ వీధులు నిండిపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాలోవీన్ వేడుకలో పాల్గొన్న జనాలతో సియోల్ వీధులు నిండిపోయాయి

''ఈ ప్రాంతం అంత సురక్షితంగా లేదు''

ఇటవాన్ ప్రాంతం చాలా రద్దీగా ఉందని, అది సురక్షితమైన ప్రదేశంగా అనిపించడం లేదని సాయంత్రం కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఎమర్జెన్సీ సర్వీసులకు చెందిన సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులకు సపర్యలు చేస్తోన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి.

ఓ వీడియోలో ఓ ఇరుకైన రోడ్డు మీద కొందరు వ్యక్తులకు సీపీఆర్(Cardiopulmonary Resuscitation-గుండెకు అందించే చికిత్స) చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

మరో వీడియోలో కుప్పలుగా పడి ఉన్న మనుషులను కొందరు ఎమర్జెన్సీ సిబ్బంది బయటకు లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి.

ఇటవాన్‌లోని హామిల్టన్ హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం కారణంగా పౌరులు వీలైనంత త్వరగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని యోంగ్సాన్ జిల్లాలోని ప్రతీ మొబైల్ ఫోన్‌కు అత్యవసర సందేశం పంపించారని ఒక స్థానిక జర్నలిస్ట్ చెప్పారు.

బీబీసీ ప్రతినిధి హోసు లీ సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ చాలా మంది వైద్య సిబ్బంది, అంబులెన్సులు ఒక్కొక్కటిగా మృతదేహాలను తీసుకెళ్తున్నాయని ఆయన చెప్పారు.

ఆ గుంపులో వేలాది మంది ప్రజలు, పోలీసులు ఉన్నారని నీలిరంగు షీట్‌లలో చాలా మృతదేహాలు కనిపించాయని ఆయన తెలిపారు.

''చాలా మంది యువకులు ఇక్కడ గుమిగూడారు. పార్టీ చేసుకోవడం కోసం మంచి దుస్తులు ధరించి ఇక్కడికి వచ్చారు. అక్కడ చాలామంది విచారంగా కనిపిస్తున్నారు. పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది'' అని లీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)