మాల్దీవుల ఎన్నికల్లో ‘ఇండియా ఔట్’ అనే నినాదం ఎందుకు వినిపిస్తోంది... అక్కడ చైనా ఏం చేస్తోంది?

ఫొటో సోర్స్, @PPM_HULHUMALE
- రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాల్దీవుల ఎన్నికలు భారత్, చైనాలకు కీలకంగా మారాయి. హిందూ మహాసముద్రంలో ఉండే ఈ చిన్న దేశంలో ఎన్నికల ఫలితాలపై భారత్, చైనాలు దృష్టి సారించాయి.
ఇరు దేశాలకు వ్యూహాత్మకంగా మాల్దీవులు ముఖ్యమైనది. ఈ రెండు దేశాలు ఇప్పటికే మాల్దీవుల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా అన్ని విధాలా సాయం చేస్తున్నాయి. సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. కానీ, ఎన్నికల ఫలితాల ప్రకారం ఇరు దేశాల వ్యూహాలు మారతాయా? మాల్దీవుల్లో ‘‘భారత్ ఔట్’’ నినాదం ఎందుకు వినిపించింది?
సుమారు 5.21 లక్షల మంది జనాభా ఉన్న మాల్దీవుల దేశంలో అధ్యక్షుడిని నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు. సెప్టెంబర్ 9న జరిగిన ఓటింగ్‌లో బరిలో నిలిచిన ఏ అభ్యర్థికి 50% మెజారిటీ రాలేదు. నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 30వ తేదీన రెండో రౌండ్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలిచే వ్యక్తిని బట్టి ఇటు భారత్, అటు చైనా దేశాల వ్యూహాలు మారనున్నాయి.
సెప్టెంబర్ 9న నిర్వహించిన ఓటింగ్‌లో 2,25,486 ఓట్లు పోల్ కాగా, అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌కు 86,161 ఓట్లు (39.05%), ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన ముయిజ్జుకు 1,01,635 ఓట్లు (46.05%) వచ్చాయి. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ నషీద్ బలపర్చిన అభ్యర్థి ఇలియాస్ లబీబ్‌కు 15,839 ఓట్లు (7.18%) వచ్చాయి.

ఫొటో సోర్స్, REUTERS
ఎన్నికల నిబంధనల ప్రకారం తొలి రౌండ్‌లో ఎక్కువ ఓట్లు సాధించిన ఇద్దరు అభ్యర్థుల మధ్యనే రెండో రౌండ్‌లో పోటీ ఉంటుంది. ప్రజలు వీరిద్దరిలో ఎవరికి మెజారిటీ ఓట్లు వేస్తారో వారే అధ్యక్షుడిగా నిలుస్తారు. ఇక్కడ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ నషీద్ మద్దతు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారనే విషయం ఆసక్తిగా మారింది.
ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ భారత్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తూ, భారత్ ఫస్ట్ అన్న పాలసీతో తొలి ప్రాధాన్యం భారత్‌కే ఇస్తూ వస్తున్నారు. మరోవైపు మహమ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ చైనాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది.
ఆయన పేరు అనూహ్యంగా బరిలోకి వచ్చింది. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ బరిలో నిలవాల్సి ఉంది. కానీ, అబ్దుల్లా యమీన్ పేరు మనీ ల్యాండరింగ్, అవినీతి కేసుల్లో ఉండటంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు.
ఆగస్టులో సుప్రీం న్యాయస్థానం ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించడంతో ముయిజ్జు పేరు తెరపైకి వచ్చింది. 2013 -2015 మధ్య అధికారంలో ఉన్న అబ్దుల్ మాల్దీవులు చైనాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు కృషి చేశారు.

ఫొటో సోర్స్, REUTERS
భారత్‌తో సంబంధాలు
భారత్, మాల్దీవుల మధ్య 60 ఏళ్లుగా ఆర్థిక, సాంస్కృతిక, మిలటరీ, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు ఉన్న భౌగోళిక ప్రాంతం వ్యూహాత్మక పరంగా భారత్, చైనాలకు చాలా కీలకం. దీర్ఘకాలంగా భారత్ నుంచి మాల్దీవులకు ఆర్థిక, మిలటరీ సహాయం అందుతోంది.
1965లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఇక్కడ రాచరికం నడిచింది. తర్వాత 1968 నవంబర్‌లో ఇది రిపబ్లిక్‌గా అవతరించింది.
మాల్దీవులు స్వాతంత్య్రం పొందినప్పటి నుంచే సామాజిక-ఆర్థిక అభివృద్ధి, ఆధునీకరణ, సముద్ర భద్రత వంటి రంగాల్లో భారత్ సహాయాన్ని అందించింది.
1980లలో మాల్దీవుల్లో అధికారంలో ఉన్న మౌమూన్ అబ్దుల్ గయ్యూమ్‌కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటును అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ కాక్టస్’ పేరిట అందించిన సాయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి.
2008లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మాల్దీవుల్లో తొలిసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గయ్యూమ్ ఓటమిపాలై, మహమ్మద్ నషీద్ అధికారం చేపట్టారు. అప్పటి నుంచి అధికారం కోసం ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. నషీద్ నాలుగేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. 2012లో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, REUTERS
2013లో జరిగిన ఎన్నికల్లో నషీద్‌కు తొలి రౌండ్‌లో మెజారిటీ ఓట్లు దక్కినప్పటికీ న్యాయస్థానం ఎన్నికను చెల్లదని పేర్కొంది. రెండో రౌండ్ ఎన్నికలలో అబ్దుల్లా యమీన్ గెలుపొంది అధికారం చేపట్టారు.
ఈ కాలంలోనే భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిని, చైనా వారికి మరింత దగ్గరైంది.
2018లో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) కి చెందిన ఇబ్రహీం సోలిహ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో తిరిగి సంబంధాలను మెరుగుపరిచేందుకు ‘ఇండియా ఫస్ట్’ పాలసీని చేపట్టి కీలకంగా వ్యవహరించారు.
ఈ పాలసీలో భాగంగా భారత్‌కు ఆర్థిక, సైనిక రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. ఇదే సమయంలో మాల్దీవులకు ఒక డానియర్ మారీటైమ్ సర్వియలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బహుమతిగా ఇవ్వడంతోపాటు, ఆ దేశ పైలట్లు, ఇంజినీర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా భారత్ అంగీకరించింది.
అయితే, ప్రతిపక్ష పార్టీలైన ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎమ్), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) భారత్ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. భారత్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని, ఎలాంటి సాయం పొందొద్దని ప్రభుత్వానికి సూచించాయి.
ఈ రెండు పార్టీలు, మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నేతృత్వంలో 2020 అక్టోబర్‌లో భారత్ వ్యతిరేక ప్రచారం ‘ఇండియా అవుట్’ను ప్రారంభించాయి.
అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ ఈ ప్రచార కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. భారత్‌పై వెదజల్లుతోన్న అసత్యాలు, ద్వేషపూరితమైన ప్రచారాలు ఆపాలని కోరుతూ మాల్దీవుల విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.
భారత్ 2021లో మాల్దీవుల్లోని 45కు పైగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల్లో పాల్గొంది. మాల్దీవులలోని నాలుగు ప్రధాన ద్వీపాలను కలుపుతూ వంతెన, రోడ్ల నిర్మాణం కోసం చేపట్టిన ‘‘ది గ్రేటర్ మేల్ కనెక్టవిటీ ప్రాజెక్ట్’’ (జీఎంసీపీ) కోసం ఆర్థికంగా రూ. 4,151 కోట్లు (500 మిలియన్ డాలర్లు) సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
2022 మార్చిలో మాల్దీవులలో పది తీరప్రాంత రాడార్ వ్యవస్థలను కూడా భారత్ ఏర్పాటు చేసింది. అద్దూ ద్వీపంలో పోలీస్ అకాడమీని ప్రారంభించడంలోనూ భారత్ సాయం చేసింది.

ఫొటో సోర్స్, REUTERS
చైనా అప్పుల ఉచ్చులో కూరుకుపోతున్న మాల్దీవులు
భారత్‌కు మాల్దీవులు ఎంత ముఖ్యమో అదే రీతిలో వ్యూహాత్మక పరంగా చైనాకు కూడా కీలకం. మాల్దీవుల్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూనే వస్తోంది. ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టింది.
2016లో మాల్దీవుల ప్రభుత్వం కేవలం రూ. 33 కోట్లు (40 లక్షల డాలర్లు)కే ఒక ద్వీపాన్ని చైనాకు 50 ఏళ్ల లీజుకు అప్పగించింది. చైనా ప్రారంభించిన వన్ బెల్ట్ వన్ రోడ్ విధానానికి బహిరంగంగానే మద్దతు తెలిపింది.
మాల్దీవులు ప్రభుత్వం చైనా నుంచి నిర్మాణ ప్రాజెక్టుల నిమిత్తం సుమారు రూ. 8,302 కోట్లు (1 బిలియన్ డాలర్లు) అప్పుగా తీసుకున్నట్లు నమ్ముతారు.
ఇవి కూాడా చదవండి:
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- ఆంధ్రప్రదేశ్: ఓ గిరిజన వర్సిటీ రైతులను ఎలా రోడ్డున పడేసిందంటే....
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, జగన్ ఎన్నికల హామీ ఏమైంది?
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














