మాల్దీవులలో భారత్ వ్యతిరేక ప్రచారం ఎందుకు సాగుతోంది, దీని వెనక ఎవరున్నారు?

ఫొటో సోర్స్, @PPMYYOUTHS
విదేశాంగ విధానంలో, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షాల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య ప్రభుత్వాల స్థాయిలో సంబంధాలు సవ్యంగానే ఉన్నాయి. కానీ, ఆ దేశంలో ప్రతిపక్షాల రూపంలో భారత్‌పై వ్యతిరేకత తీవ్రరూపం దాలుస్తోంది.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ భారత వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారత్ ఉనికి ఉండరాదని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఇక్కడ పెరుగుతున్న భారత వ్యతిరేకతపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. డిసెంబర్ 19న, మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం గురించి అసత్యాలు, ద్వేష భావనలు వ్యాప్తి చెందడంపై ఆందోళన చెందుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
భారత్ తమకు అత్యంత సన్నిహిత ద్వైపాక్షిక భాగస్వామి అని, అయితే కొన్ని గ్రూపులు, కొందరు నాయకులు భారత వ్యతిరేక ప్రచారంలో నిమగ్నమై ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
మొత్తం మీద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, ప్రపంచంలో సరికొత్త ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన మాల్దీవుల మధ్య సంబంధాలు గతి తప్పే అవకాశం కనిపిస్తోంది. వెయ్యికి పైగా దీవుల సమూహమైన మాల్దీవుల్లో విపక్షాల మద్దతుతో 'ఇండియా ఔట్' ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మాల్దీవుల ఎంపీ అహ్మద్ షియామ్ డిసెంబర్ 19న ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ, '' ప్రస్తుత భారత ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని, అంతర్గత వ్యవహారాలను గౌరవిస్తుందని మేం ఎప్పుడూ అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లు వాళ్ల చట్టాలను, ప్రజలను రక్షించుకోవడంలో ముఖ్యంగా మైనారిటీలకు భద్రత కల్పించడంలోనే విఫలమవుతున్నారు. అందువల్ల మేం వారికి మా స్వేచ్ఛను వదిలేయం" అని పేర్కొన్నారు.
మాల్దీవులు సున్నీ ముస్లిం మెజారిటీ దేశం. ఎంపీ అహ్మద్ షియామ్ కూడా అదే వర్గానికి చెందిన వారు. భారతదేశం ముస్లింలు, వారికి సంబంధించిన వార్తలకు మాల్దీవుల ముస్లింలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతారని, ప్రభావితమవుతారని చెబుతున్నారు. ‘ఇండియా ఔట్’ ప్రచారానికి అందుకే బలం చేకూరుతోందని అంటున్నారు.

ఫొటో సోర్స్, @PPM_HULHUMALE
భారత వ్యతిరేక ప్రచారం ఎందుకు?
మాల్దీవులలో భారత సైన్యం, సైనిక సామాగ్రి ఉంది. అక్కడి నుంచి వారిని పంపించి వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ డిమాండ్ 2018లో ప్రారంభమైంది. అప్పట్లో మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ భారతదేశం ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఈ హెలికాప్టర్లు, విమానాలను పరిశోధన, సహాయక చర్యల కోసం భారతదేశం మాల్దీవులకు సహాయంగా అందజేసింది. మాల్దీవులకు భారతదేశం వీటిని బహుమతిగా ఇచ్చినట్లయితే, దాని పైలట్లు మాల్దీవులకు చెందిన వారు ఉండాలని, భారతీయులు కాదని అబ్దుల్లా అన్నారు. ఈ సమస్యపై చాలా ఏళ్ల నుంచి వివాదంగా కొనసాగుతోంది. ఇప్పుడు జనం వీధుల్లోకి వచ్చి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
భారత సైనికులు మాల్దీవులను విడిచి వెళ్లాలని ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), దాని అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. "నాకు భారతీయ వంటకాలు, ఉత్పత్తులు, మందులంటే చాలా ఇష్టం కానీ నా భూమి పై ఉన్న భారతీయ సైనికులంటే మాత్రం ఇష్టం లేదు" అని మాల్దీవుల మాజీ మంత్రి లుబ్నా జహీర్ డిసెంబర్ 6న చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
''మాల్దీవుల ప్రజలు భారత సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు'' అని మరో మాజీ మంత్రి అహ్మద్ తౌఫిక్ నవంబర్ 21న చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చైనాకు అనుకూలమా?
సెప్టెంబరులో, అధికార మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరో వర్గం భారత్‌కు వ్యతిరేకంగా మోటార్ బైక్ ర్యాలీని చేపట్టింది. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని యమీన్ బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. భారత విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్ కు సంబంధించి కూడా ఇదే విధమైన డిమాండ్ లు వినిపించాయి. దీంతో 2012లో జీఎంఆర్ అక్కడి నుంచి వైదొలిగింది.
మాల్దీవులకు చెంది పీపీఎం పార్టీ పూర్తిగా చైనాకు అనుకూలంగా, భారత్ వ్యతిరేకంగా ఉంది. అధ్యక్ష ఎన్నికలలో ఓటమి తర్వాత భారత్ తనను అరెస్టు నుంచి రక్షించలేదన్నది మాజీ అధ్యక్షుడు యమీన్ ఆగ్రహంగా ఉన్నారని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, మాల్దీవుల్లో చైనా ఉనికిని బలపరిచింది యమీనే కాబట్టి, యమీన్‌ను జైల్లో పెట్టవద్దని మాల్దీవుల కొత్త ప్రభుత్వాన్ని భారత్ కోరడంలో అర్ధం లేదని దౌత్యవేత్తలు అంటున్నారు.
2018లో ఇబ్రహీం సోలిహ్ మాల్దీవుల అధ్యక్షుడైనప్పటి నుంచి ఆయన విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. 'ఇండియా ఫస్ట్' అన్నది సోలిహ్ పాలసీ అని, అయితే 'ఇండియా ఓన్లీ' విధానాన్ని అవలంబించాలని భారత్ నుంచి ఒత్తిడి వచ్చిందని కొందరు విమర్శిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోలిహ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనేక కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
సమీప పొరుగు దేశం కావడం వల్ల, మాల్దీవులు నిత్యావసర వస్తువుల కోసం భారత్‌పై ఆధారపడుతోంది. మాల్దీవుల ప్రజలు వైద్యం కోసం భారతదేశానికి వస్తుంటారు. భారత్‌తో ఆ దేశానికి వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే, మాజీ అధ్యక్షుడు యమీన్ విధానాలు చైనా అనుకూలంగా ఉండేవి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-చైనా, మధ్యలో మాల్దీవులు
చైనాకు మాల్దీవులు చెల్లించాల్సిన అప్పుల విషయంలో గత ఏడాది చివర్లో చైనా-సోలిహ్ ప్రభుత్వాల మధ్య వాగ్వాదం జరిగింది. చైనాకు చెల్లించాల్సిన అప్పుల గురించి తరచూ ఆందోళనలు వ్యక్తమవుతుండేవి. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ నాషీద్, మాల్దీవుల్లో చైనా రాయబారి చాంగ్ లిచాంగ్ మధ్య ట్విట్టర్‌లో ఈ వాగ్వాదం జరిగింది.
మాల్దీవులు చైనా బ్యాంకులకు పెద్ద మొత్తంలో అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉందని నాషీద్ 11 డిసెంబర్ 2020న ట్వీట్ చేశారు. "రాబోయే 14 రోజుల్లో, మాల్దీవులు చైనా బ్యాంకుకు $15 మిలియన్లు( రూ.1125 కోట్లు) చెల్లించాలి. ఈ రుణాలలో చైనా బ్యాంకులు మాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఇవి ప్రభుత్వ ఆదాయంలో 50 శాతానికి సమానం. కోవిడ్ సంక్షోభం నుంచి మాల్దీవులు ఇప్పుడిప్పుడే కోలుకోవాలని ప్రయత్నిస్తోంది'' అని నషీద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే నాషీద్ ట్వీట్‌లో చేసిన వాదనను చైనా రాయబారి తిరస్కరించారు. మాల్దీవులు రుణం చెల్లించాల్సి ఉందని, అయితే నషీద్ చెబుతున్నంత పెద్ద మొత్తం కాదని ఆయన అన్నారు.
భారత్, చైనాల మధ్య సోలిహ్ ప్రభుత్వం నలిగిపోతోందని, తన గడ్డపై ఎవరు ఉనికి ఉండవద్దని చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెబుతున్నారు. కానీ, సోలిహ్‌కు మొదటి నుంచి చైనాపై సదభిప్రాయం లేదు. రక్షణ ఒప్పందాలలో ఆయన ప్రభుత్వం భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చింది. మాల్దీవులకు భారత్ ఆర్థికంగా కూడా భారీ సాయం చేసింది. అయితే, అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది.
1988లో రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపి అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని కాపాడారు. 2004లో సునామీ వచ్చినప్పుడు మాల్దీవులలో ల్యాండ్ అయిన తొలి విమానం భారత్ పంపినదే.
పీపీఎం పార్టీ డిమాండ్ వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని, అయితే దీనికి దేశంలో మెజారిటీ ప్రజల మద్దతు లేదని కూడా చెబుతున్నారు. మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్, మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ 'ఇండియా ఔట్' ప్రచారం ఐసిస్ ప్రేరేపణతో జరుగుతోందని అన్నారు.

ఫొటో సోర్స్, @PPMYYOUTHS
భారతదేశానికి మాల్దీవులు ఎందుకంత ముఖ్యం?
చైనాకు మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకం. మాల్దీవులు చుట్టూ ఉన్న సముద్రం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఇక్కడ చైనా ఉనికి హిందూ మహాసముద్రంలో దాని వ్యూహంలో భాగం. 2016లో మాల్దీవులు ఒక ద్వీపాన్ని ఓ చైనా కంపెనీకి 50 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. ఆ ఒప్పందం ఖరీదు కేవలం 4 మిలియన్ డాలర్లు (రూ.30 కోట్లు).
మరోవైపు, భారతదేశానికి మాల్దీవులు ఇచ్చే ప్రాధాన్యం కూడా తక్కువేమీ కాదు. ఈ రెండు దేశాలు ఎక్కువ సన్నిహితంగా ఉండటంతో, అక్కడ చైనా అడుగుపెడితే భారత్ ఆందోళనకు గురికావడం సహజమే.
మాల్దీవులు భారతదేశంలోని లక్షద్వీప్ నుండి 700 కి.మీ.లు. మెయిన్ ల్యాండ్‌కు సుమారు 1200 కి.మీ. దూరంలో ఉంటుంది. భారత్‌తో కయ్యానికి దిగినప్పుడు, ఆ దేశం మీద కన్నేసి ఉంచడానికి మాల్దీవులు చైనాకు బాగా ఉపయోగపడుతుంది.
మరోవైపు, చైనాతో మాల్దీవులు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకుంది. అప్పట్లో ఇది భారత్‌ను ఆశ్చర్యపరిచింది. అంటే, మాల్దీవులకు భారత్ ఎంత దగ్గరో, చైనా కూడా అంతే దగ్గర అన్నది స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
- సముద్రంలో కూలిపోయిన హెలీకాప్టర్.. 12 గంటల పాటు ఈతకొట్టి, ప్రాణాలతో బయటపడ్డ 57 ఏళ్ల మంత్రి
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- త్రిపుర: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్‌లో అందుబాటులోకి
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












