ఇబ్రహీం సోలీ: భారత ప్రభుత్వం మాల్దీవులకు వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకిస్తోంది? - మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన

నరేంద్ర మోదీ, ఇబ్రహీం సోలీ

ఫొటో సోర్స్, presidencymv/facebook

    • రచయిత, అమృతా శర్మ
    • హోదా, బీబీసీ మానిటరింగ్

మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలీ డిసెంబర్ 17న అంటే ఈరోజు భారత్‌కు రానున్నారు. సెప్టెంబర్ 23న ఎన్నికల్లో విజయం సాధించాక, ఇబ్రహీం సోలీ చేస్తున్న మొదటి అధికారిక పర్యటన ఇదే.

ఇబ్రహీం సోలీ చేతిలో ఓడిపోయిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చైనా అనుకూలురుగా పేరుంది. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం సోలీ భారత్ పక్షాన ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నవంబర్ 17న జరిగిన ఇబ్రహీం సోలీ ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అప్పుడే.. ఇబ్రహీం భారత పర్యటన గురించి ప్రకటన వెలువడింది.

అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం సోలీ విజయాన్ని.. మాల్దీవులతో సత్సంబంధాలు నెలకొల్పడానికి ఒక అవకాశంగా కేంద్రం భావించింది.

''భారత్ తన ముఖ్యమైన భాగస్వామిగా మాల్దీవుల కొత్త ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలీ భారత్‌లో పర్యటిస్తారు. అధ్యక్షుడి హోదాలో ఇదే ఆయేన మొదటి విదేశీ పర్యటన'' అని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ మాట్లాడినట్లు నవంబర్ 27న ఎన్‌డీటీవీ పేర్కొంది.

మాల్దీవుల నూత అధ్యక్షుడు ఇబ్రహీం సీలీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ పర్యటనకు ఎందుకింత ప్రాధాన్యం?

మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ చైనాతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. దీంతో భారత్, మాల్దీవుల మధ్య కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అబ్దుల్లా యమీన్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భారతీయుల వర్క్ వీసాలపై నిబంధనలను కఠినతరం చేయడం, చైనాతో సుంకాలు లేని వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం లాంటి యమీన్ నిర్ణయాలు భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి.

యమీన్ ఫిబ్రవరి 5న మాల్దీవులలో ఎమర్జెన్సీ విధించారు. అది 45రోజులపాటు కొనసాగింది. యమీన్ తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయాన్ని భారత్ విమర్శించింది. యమీన్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, యమీన్ హయాంలో క్షీణించిన సంబంధాలకు ఊపిరి పోయాలని భారత్ ప్రయత్నిస్తోంది.

మాల్దీవుల ఏరియల్ వ్యూ

ఫొటో సోర్స్, Getty Images

ఇరు దేశాలు ఏం కోరుకుంటున్నాయి?

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని భారతీయ వార్తా సంస్థ 'ది వైర్' డిసెంబర్ 12న పేర్కొంది.

పర్యటనలో భాగంగా, ఏ ఒప్పందాలపై సంతకాలు చేయాలన్న అంశంపై ఇరుదేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి.

సోలీ పర్యటనలో భాగంగా మాల్దీవుల ప్రభుత్వానికి దాదాపు 50వేల కోట్ల రూపాయల రుణం అందించడానికి భారత్ సుముఖంగా ఉండొచ్చు.

''మాల్దీవులకు మునుపెన్నడూ భారత్ ఇంత పెద్దమొత్తంలో రుణాలు ఇవ్వలేదు'' అని వైర్ సంస్థ తెలిపింది.

భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మాల్దీవుల ప్రభుత్వం ఇప్పటికే చైనాతో వందల కోట్ల రుణాన్ని తీసుకుంది.

భారతీయ వృత్తి నిపుణులు మాల్దీవులకు వెళ్లేందుకు, భారత్‌లో కుటుంబాలు కలిగిన మాల్దీవియన్లకు వీసా నిబంధనలను సులభతరం చేసే ఒప్పందంపై ఇరు దేశాలు త్వరలోనే సంతకాలు చేస్తాయని ఒక అంచనా.

సెక్యూరిటీ, రక్షణ రంగాలు, ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర అంశాలతోపాటు, సహాయసహకారాలు అందించుకోవాల్సిన మరికొన్ని అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

మాల్దీవుల రాజధానిలోని ఓడరేవు

ఫొటో సోర్స్, Getty Images

''మా ఓడరేవులను అభివృద్ధి చేసుకోవడానికి భారత్ సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. దేశంలోని దీవుల మధ్య రవాణాను సులభతరం చేయడమే అజెండాలోని ప్రధానాంశం. భారత్ సహాయంతో రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని మేం ఆలోచిస్తున్నాం'' అని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో నవంబర్ 26న అన్నారు.

మాల్దీవుల రాజధాని నగరం మేల్‌లోని వాణిజ్య ఓడరేవును సమీపంలోని ఖాఫు థిలఫ్యూషికి మార్చే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఓడరేవు మాల్దీవుల ప్రాథమిక అంతర్జాతీయ ఓడరేవు. దశాబ్దాలుగా మరమ్మతులు జరగకపోవడంతో ఈ ఓడరేవు చాలా ఇరుకుగా తయారైంది.

తేలికగా ఉండే రెండు ఆధునిక హెలీకాప్టర్ల లీజును కొనసాగించాలని భారత అధికారులు ఆశిస్తున్నారు. యమీన్ ప్రభుత్వం ఈ హెలీకాప్టర్ల లీజును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

మాల్దీవుల నూత అధ్యక్షుడు ఇబ్రహీం సీలీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిస్పందన ఎలా ఉంది?

మ్యూవాన్ మొహ్మెద్ అనే మాల్దీవియన్ విశ్లేషకుడు సోలీ భారత పర్యటన గురించి ధివేహీ-ల్యాంగ్వేజ్ టెలివిజన్ చానెల్ రాజ్జేకు చెందిన వెబ్‌సైట్‌లో ఓ వ్యాసం రాస్తూ.. సోలీ భారత పర్యటన చరిత్రాత్మకమైనదని, సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఇదో మంచి అవకాశం అని అన్నారు.

''మాల్దీవుల ప్రజలు.. ఆర్థిక సహకారం కోసం ఆలోచిస్తున్నారు. అదే దొరికితే, దేశాన్ని అప్పుల ఊబిలోకి తోసిన చైనా రుణాలను తిరిగి చెల్లించవచ్చు'' అన్నారు.

ధివేహీ టెలివిజన్ చానెల్ వాగుథు టీవీకి చెందిన వెబ్‌సైట్‌లో నవంబర్ 29న మరో విశ్లేషకుడు అదామ్ నవాజ్.. భారత్‌పై ఆధారపడటం గురించి హెచ్చరించారు.

''చైనా రుణాలను చెల్లించేందుకు భారత్ మాల్దీవులకు అప్పు ఇస్తోంది. ఇది పాత కథే.. చైనా స్థానంలో భారత్ వస్తుంది అంతే'' అని చైనా గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక నవంబర్ 29న పేర్కొంది.

''హిందూ మహాసముద్రం తనకే సొంతం అని భారత్ భావిస్తోంది. మాల్దీవులపై పట్టు సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న 'బెల్ట్ అండ్ రోడ్' ప్రాజెక్టు విషయంలో చైనా ఉద్దేశాలను భారత్ వక్రీకరిస్తోంది'' అని గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.

''మాల్దీవుల విధానాలు ఇలా మారుతూ ఉంటే, ఆ దేశం.. సూక్ష్మ, స్థిరమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించలేదు. ఆర్థికాభివృద్ధికి ఇబ్బందులు ఎదురవుతాయి. అదే జరిగితే చివరికి మాల్దీవియన్ ప్రజలే బాధితులు అవుతారు'' అని డిసెంబర్ 12న విశ్లేషకులు లియాంగ్ హైమింగ్ చైనా డైలీ అనే వార్తా పత్రికలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)