ఉత్తర కొరియా: మిసైళ్లు పోయి కంప్యూటర్లు వస్తున్నాయి

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images

భారీ మిసైళ్లు, ఆయుధాలను ప్రదర్శిస్తూ ఉత్తర కొరియా గతంలో ఎక్కువగా వార్తల్లో నిలిచేది. కానీ, కొంత కాలంగా అది పద్ధతి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సైనిక ఆయుధులకు బదులుగా ప్రజలకు ఉపయోగపడే సాంకేతికత వైపు దృష్టి పెడుతోంది.

తన దారి మార్చుకున్నట్లు ఉత్తర కొరియా చెబుతున్నా, ఆ విషయం నమ్మడం కష్టం. కానీ, ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీపైన దృష్టిపెడుతున్నట్లు అది చెప్పడం మాత్రం మంచి పరిణామమే.

మెరుగైన గృహోపకరణాలకు తోడు మరెన్నో ఆధునిక సాంకేతిక పరికరాల సృష్టిలో పురోగతి సాధించినట్లు ఉత్తర కొరియా మీడియా కొంతకాలంగా వార్తలు ప్రచురిస్తోంది.

ఆ ప్రచారం వెనుక సాంకేతికత సాయంతో తమ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలన్న ఉత్తర కొరియా నాయకుడు కిమ్ కోరిక బలంగా కనిపిస్తోంది.

ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ వాడకం విషయంలో అనేక పరిమితులున్నాయి. ప్రభుత్వం అనుమతించిన కొన్ని వెబ్‌సైట్లనే చూడాలి. ఆ పరిమితులను సడలిస్తూ ప్రభుత్వం ‘మిరే’ అనే కొత్త వైఫై వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వం అనుమతిచ్చిన ఆ ఇంట్రానెట్ వ్యవస్థను ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో వాడుకోవచ్చు.

ఆ దేశం ఐటీలో సాధించిన పురోగతిని తెలియజేస్తూ ఇటీవల ఓ ప్రదర్శన నిర్వహించింది. ఆ ప్రదర్శనలోనే ‘మిరే’ వైఫైను స్మార్ట్‌ ఫోన్ ద్వారా విజయవంతంగా వాడుకున్నట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ చానెల్ చూపించింది.

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, KCTV

ఉత్తర కొరియా మీడియాలో ప్రజా వైఫై సేవల గురించి చూపించడం అదే తొలిసారి అని అమెరికాకు చెందిన 38 నార్త్ అనే వెబ్‌సైట్ పేర్కొంది. ఆ దేశంలో రెండు సెల్యులర్ నెట్‌వర్క్‌లు కూడా డేటా సేవలను అందిస్తున్నాయి.

ఆ ఐటీ ప్రదర్శనలో ‘ఇంటెలిజెన్స్ హోమ్ సిస్టమ్’ అనే మరో పరికరాన్నీ ప్రదర్శించారు. ఆ పరికరం మనిషి గొంతును గుర్తిస్తూ, వాయిస్ కమాండ్స్ ద్వారా ఫ్యాన్లు, ఏసీ, టీవీ, లైట్ల లాంటి వాటిని నియంత్రిస్తుంది. ఈ పరికరాన్ని కిమ్ II-సంగ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దేశంలో ఐటీ ఆవిష్కరణల్లో ముందున్న సంస్థ అదే.

ఆ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొరియా భాషను గుర్తించే వాయిస్ సాఫ్ట్‌వేర్‌తో పాటు అనేక ఇతర ఆవిష్కరణలు చేసినట్లు డీపీఆర్‌కే టుడే అనే కొరియన్ వెబ్‌సైట్ తెలిపింది.

‘యూనివర్సిటీలోని ఐటీ విభాగం కృత్రిమ మేధస్సులో పైచేయి సాధించాలని తహతహలాడుతోంది. దేశంలో కృత్రిమ మేధస్సు పరిశ్రమను నెలకొల్పేందుకు అది ప్రయత్నిస్తోంది’ అని అధికార వర్కర్స్ పార్టీకి చెందిన పత్రిక రోడంగ్ సిన్మన్ పేర్కొంది.

‘ఉత్తర కొరియా మీడియాలో వస్తున్న టెక్నాలజీ వార్తలు నిజమే. అవి ప్యాంగ్యాంగ్‌లో వాడుకలో ఉన్నట్లే కనిపిస్తున్నాయి’ అని ఉత్తర కొరియా టెక్ బ్లాగ్‌ను నడిపిస్తున్న మార్టిన్ విలియమ్స్ తెలిపారు.

‘ఉత్తర కొరియాలో చాలామంది ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. కాబట్టి, ఆ వార్తలను అవాస్తవాలని అనలేం’ అంటారాయన.

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images

నాలుగో పారిశ్రామిక విప్లవం

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపం కల్పించి, మరింత శక్తిమంతమైన దేశంగా తయారయ్యేందుకు ఉత్తర కొరియా ఐటీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు కనిపిస్తోంది.

‘సైన్స్, విద్య... జాతి నిర్మాణానికి ఈ రెండూ పునాదులు కావాలి. దేశ శక్తిని చాటే సూచీలుగా ఇవి నిలవాలి’ అనే ఏప్రిల్‌లో జరిగిన అధికార పార్టీ సమావేశంలో కిమ్ అన్నారు. ఆ రంగాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని కూడా చెప్పారని కేసీఎన్‌ఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

దేశంలో శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను ప్రోత్సహించేందుకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల రూపంలో ఉత్తర కొరియా ప్రభుత్వం అనేక తాయిలాలను అందిస్తోంది. సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఉత్తర కొరియా మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తోంది.

‘ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ విజ్ఞానంపై ఆధారపడాలి. ఐటీ, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ తదితర రంగాలను అభివృద్ధి చేయాలి. గతంలో కంటే ఎంతో సృజానత్మక మార్గంలో ప్రస్తుతం ఉత్తర కొరియా పయనిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తాం.

అత్యున్నత పరిశ్రమలను తీసుకొచ్చినప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఉత్తర కొరియా నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు అడుగేస్తోంది’ అని లిమ్ ఎల్-చుల్ అనే దక్షిణ కొరియా ప్రొఫెసర్ చెప్పారు.

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images

చైనా మాల్

దక్షిణ కొరియా స్థాయిలో ఉత్తర కొరియా సాంకేతికంగా అభివృద్ధి చెందలేదు. ‘ఆ దేశానికి అంత ఉత్తత్పి సామర్థ్యం లేదు. స్వదేశీ ఉపకరణాలుగా వాళ్లు చెప్పే చాలా ఫోన్లు, కంప్యూటర్లు నిజానికి చైనా నుంచి తెప్పించినవి’ అని ఉత్తర కొరియా టెక్ బ్లాగ్‌ను నడిపిస్తున్న మార్టిన్ విలియమ్స్ చెబుతారు.

ఉత్తర కొరియన్లు అక్రమంగా తమ ‘సిలీ వ్యాక్సిన్’ సోర్స్ కోడ్‌ను కాపీ చేశారని మే నెలలో జపాన్‌కు చెందిన ట్రెండ్ మైక్రో అనే యాంటీ-వైరస్ సంస్థ తెలిపింది.

గతేడాది దేశంలో తయారు చేసిన ట్యాబ్లెట్‌కు ఉత్తర కొరియా మీడియా ‘ర్యోంగంగ్ ఐపాడ్’ అని నామకరణం చేసింది.

నేరుగా కాపీ చేసిన ఉత్పత్తులు, బాగా పేరున్న బ్రాండ్ పేర్ల వినియోగం, పాక్షికంగా కాపీ చేసి తయారు చేసిన పరికరాలు... ఇలా ఉత్తర కొరియా మార్కెట్లో అనేక విదేశ ఉత్పత్తుల నకళ్లు కనిపిస్తాయి.

కేవలం శాస్త్రవేత్తల కొరత మాత్రమే కాదు, నిధుల లేమి, అంతర్జాతీయ ఆంక్షల ఫలితంగా కూడా ఉత్తర కొరియా కృత్రిమ మేధస్సు పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉందని సోల్‌కు చెందిన కొరియా డెవలప్‌మెంట్ బ్యాంక్ పేర్కొంది.

కిమ్

ఫొటో సోర్స్, Getty Images

ఒకవేళ ఆంక్షలు ఎత్తేసినా కూడా కొన్ని సంస్థలు తమ పేరు చెడిపోతుందేమో అనే భయంతో ఉత్తర కొరియాతో వ్యాపారం చేయడానికి ఇష్టపడకపోవచ్చని విలియమ్స్ అంటారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే దక్షిణ కొరియా నుంచే ఉత్తర కొరియాకు ఎక్కువగా పెట్టుబడులు లభించే అవకాశం ఉంది.

ఇటీవల ఉత్తర కొరియాకు చెందిన కొందరు అధికారులు దక్షిణ కొరియాలోని ఓ టెక్‌ హబ్‌కు వెళ్లి అక్కడ అటానమస్ కార్లు, 3డీ ప్రింటింగ్, కృత్రిమ మేధస్సు, గేమింగ్ టెక్నాలజీ లాంటి వాటి గురించి తెలుసుకొని వచ్చారు.

మరోపక్క ఉత్తరకొరియా తమ దేశం గురించి బయటి వారికి ఎక్కువగా తెలియకూడదని, అలా తెలియడం తమ దేశ భద్రతకు ప్రమాదమని భావిస్తుంది. అది కూడా అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.

‘ప్రజలు సంతోషంగా ఉండాలి. వారికి సమాచారమంతా అందుబాటులో ఉండాలి. కానీ, దేశంలో నియంతృత్వం మాత్రం కొనసాగాలి అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం’ అన్నది విలియమ్స్ మాట.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)