జీ20: ఈ సదస్సు నిర్వహిస్తే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సులో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా పలు దేశాలకు చెందిన ప్రముఖులూ పాల్గొననున్నారు.
అసలు ఈ జీ20 ఏమిటి? అది ఎందుకు స్థాపించారు?
ఈ సదస్సు ఆర్థిక, రాజకీయ ప్రాముఖ్యం ఏమిటి? G20 దిల్లీలో నిర్వహించడం వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
జీ20 అంటే ఏమిటి? ఎందుకు ఏర్పాటుచేశారు?
'జీ20' పేరులో ఉన్నట్లుగా ఇది 20 దేశాల (సభ్యుల) కూటమి.
1999లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు పలు దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు కలిసి ప్రపంచ ఆర్థిక, దాని సమస్యలపై చర్చించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత ప్రపంచమంతటా 2007లో ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపించింది. అటువంటి పరిస్థితిలో ఆర్థిక మంత్రుల స్థాయిలో ఉన్న G-20 గ్రూప్‌ను అప్‌గ్రేడ్ చేసి దేశాధినేతలతో కూడిన గ్రూప్‌గా మార్చారు.
జీ20 సమావేశంలో కూటమిలోని అన్ని దేశాల అధినేతలు పాల్గొంటారు.
జీ20 సంస్థ తొలి సమావేశం 2008లో అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగింది. ఇప్పటివరకు మొత్తం 17 సమావేశాలు జరిగాయి. భారత్ 18వ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది.
జీ-20 ఆర్థిక సమస్యలపై చర్చించడానికి ఏర్పాటైనప్పటికీ కాలక్రమేణా దాని పరిధి సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, అవినీతికి అడ్డుకట్ట వంటి అంశాలను చేర్చడానికి విస్తరించింది.

ఫొటో సోర్స్, REUTERS
ప్రపంచంపై జీ20 నిర్ణయాలు ప్రభావం చూపిస్తాయా?
జీ20 గ్రూప్‌లో అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, బ్రిటన్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియేతో కలిపి 19 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఈ గ్రూప్‌లో 20వ మెంబర్.
కూటమిలోని దేశాల పేర్లను చూస్తేనే దీని బలమేంటో అర్థమవుతోంది.
ఇవి కాకుండా, ప్రతి సంవత్సరం గ్రూప్‌కు అధ్యక్షత వహించే దేశం కొన్ని దేశాలను, సంస్థలను అతిథులుగా ఆహ్వానిస్తుంది.
ఈసారి బాధ్యతలు చేపట్టిన భారత్.. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను ఆహ్వానించింది.
జీ20 గ్రూప్‌లోని సభ్య దేశాలకు ప్రపంచ GDPలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో 2/3 వాటా కలిగి ఉన్నాయి.
దీంతో ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
జీ20 ఎలా పని చేస్తుంది?
జీ20 అధ్యక్ష పదవిని కలిగి ఉన్న దేశం సమావేశాలను నిర్వహణ బాధ్యత తీసుకుంటుంది.
జీ20 సమావేశాలు ముఖ్యంగా రెండు విధాలుగా (ట్రాక్స్) జరుగుతాయి.
ఒకటి ఫైనాన్స్ ట్రాక్, ఇక్కడ అన్ని దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు కలిసి పని చేస్తారు.
రెండోది షెర్పా ట్రాక్, ఇందులో సభ్య దేశాల అధినేతలు ఉంటారు. వ్యవసాయం, అవినీతి వ్యతిరేకత, వాతావరణం, డిజిటల్ వాణిజ్యం, విద్య, ఉపాధి, ఇంధనం, పర్యావరణం, ఆరోగ్యం, పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులపై ఇందులో చర్చిస్తారు. జీ20 అధ్యక్ష పదవికి అర్హుడిని ట్రోకా అనే కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో సభ్య దేశాల గత, వర్తమాన, భవిష్యత్తు అధ్యక్షులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జీ20 సదస్సు వల్ల భారత్‌కు ప్రయోజనం ఏమిటి?
G-20 శిఖరాగ్ర సమావేశం ఆర్థిక ప్రాముఖ్యత, అంతేకాకుండా ఇండియాకు అది ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహాన్ని తెస్తుందో తెలుసుకోవడానికి ఆర్థిక సలహాదారు సోమ వల్లియప్పన్‌తో బీబీసీ మాట్లాడింది.
ప్రపంచ జీడీపీలో 85 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో 70 శాతం వాటా జీ-20 దేశాలదేనని, మన సాంకేతికత గురించి ఈ దేశాలు తెలుసుకునేందుకు భారత్‌లో జరిగే ఇలాంటి సదస్సు గొప్ప అవకాశమని అన్నారు. దేశ పురోగతి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవశక్తిని చాటిచెప్పొచ్చని అభిప్రాయపడ్డారు.
“ఇది భారతదేశానికి రెండు ప్రధాన మార్గాల్లో ప్రయోజనం చేకూరుస్తుంది. ఒకటి దేశం బలాన్ని, సాధించిన పురోగతిని ప్రపంచానికి తెలుసుకోవడానికి ఇది గొప్ప మార్గం. రెండోది ఇది భారత్ సానుకూల ఇమేజ్‌ను బలోపేతం చేస్తుంది” అని ఆయన అన్నారు.
రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపనుంది?
జీ20 సమావేశం కోసం ఇప్పటివరకు జరిగిన 18 కేబినెట్, 80 వర్కింగ్ గ్రూప్, 33 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశాలలో భారత ప్రతినిధులు పాలుపంచుకున్నారని వల్లియప్పన్ గుర్తుచేస్తున్నారు.
“ఈ సదస్సులో పాల్గొనే ఆయా దేశాల ప్రతినిధులతో భారత ప్రతినిధులకు పరిచయం ఉంది. ఇలాంటి సమావేశాల వల్ల వారందరికి భారత్‌పై అవగాహన మరింత పెరుగుతుంది. విదేశాల్లో ఉపాధి, ఎగుమతులు, వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది దోహదపడుతుంది’’ అని చెప్పారు.
గత ఏడాది కాలంగా జీ-20 అధ్యక్ష పదవిని భారత్ చక్కగా వినియోగించుకుందన్నారు వల్లియప్పన్. అంతేకాదు అమెరికా, చైనా, రష్యా, ఐరోపా దేశాలు సభ్యులుగా ఉన్న గ్రూప్‌కు అధ్యక్షత వహించడం గొప్ప అవకాశం అని అంటున్నారు.
“ప్రపంచం రాజకీయంగా చీలిపోయిన తరుణంలో వారితో భారత ప్రధాని, ఆర్థిక మంత్రి ఏం మాట్లాడుతారో ప్రపంచం, మన పొరుగు దేశాలు నిశితంగా గమనిస్తాయి.
"ఈ అధికారం ఇండియాకు రావడం రాజకీయంగా, అంతర్జాతీయంగా దేశానికి ఉపయోగపడుతుంది" అని వల్లియప్పన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
వర్ధమాన దేశాల స్వరంగా భారత్ నిలుస్తుందా?
ఇది చాలా దేశాలు ఒకచోట చేరే వేదిక అయినప్పటికీ, ఆయా దేశాలు వ్యక్తిగతంగా ఎలాంటి చర్చలు జరుపుతాయనే దానిపై అంతర్జాతీయ, రాజకీయ ప్రాముఖ్యత ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ రంగంలో నిపుణుడు, సాంఘిక శాస్త్ర పరిశోధకుడు బెర్నార్డ్ డి సామి తెలిపారు.
ఉదాహరణకు భారతదేశం అమెరికా వంటి ఇతర దేశాలతో ద్వైపాక్షికంగా ఏం మాట్లాడబోతోందనేది కీలకం కానుందని ఆయన అంటున్నారు.
మూడో ప్రపంచ దేశాలు, ద్వీప, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ వాయిస్‌గా భారత్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయని సామి చెప్పారు.
దీనికి రుజువుగా “G-20కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశానికి కూటమిలో భాగం కాని దేశాలను ఆహ్వానించే అధికారం వచ్చింది. ఆ అధికారం ఉపయోగించి బంగ్లాదేశ్, ఈజిప్ట్, నైజీరియా వంటి దేశాలను ఇండియా ఆహ్వానించింది’’ అని సామి గుర్తుచేస్తున్నారు.
బ్రిక్స్ కూటమి విస్తరణ మాదిరిగానే జి-20ని కూడా విస్తరించాలని డిమాండ్లు వస్తున్నాయని ఆయన చెప్పారు.
"గతంలో G-20 కన్సార్టియంలోని సభ్య దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 90 శాతం వాటా కలిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు అది 75 శాతానికి పడిపోయింది. అందువల్ల జి-20 కూటమి ఆర్థిక శక్తిని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలను చేర్చాలనే అభిప్రాయం ఉంది ” అని ఆయన అన్నారు.
ఉదాహరణకు పోలాండ్, నైజీరియా, థాయ్‌లాండ్ వంటి దేశాల GDPలో మెరుగుదల ఉంది. వాటిని G-20 కూటమిలో ఎందుకు చేర్చకూడదు? అని సామి ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














