క్లినికల్ ట్రయల్స్: ‘ఆ మహిళలను అమెరికా గినీ పందుల్లా వాడుకుంది’- డాక్యుమెంటరీలో దారుణ నిజాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రోనాల్డ్ అవిలా-క్లౌడియో
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్ జర్నలిస్ట్
ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్‌లోని ఒక పబ్లిక్ హౌసింగ్ కాంప్లెక్స్ ఎదురుగా నిల్చున్న ఇద్దరు మహిళలు అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు.
భయపడుతూనే, తమకెదురైన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.
‘‘నా ప్రపంచాన్ని ఎవరో లాగేసుకున్నారు. నా చూపు మందగించింది. ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా: వర్జెన్ డెల్ కార్మెన్, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో’’ అని ఆమె అన్నారు. వర్జెన్ డెల్ కార్మెన్ అంటే అక్కడ ప్రజలు కొలిచే దేవత.
ఆ తర్వాత ఆమె ఏడుస్తూ తల అడ్డంగా ఊపారు. తమకు తెలియకుండానే తమపై ప్రయోగం చేశారని చెప్పారు.
‘లా ఆపరేషన్’ డాక్యుమెంటరీలో ఈ దృశ్యాల్ని చూస్తే కన్నీళ్లు ఆగవు.
1950ల్లో గర్భనిరోధక మాత్రల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన క్లినికల్ ప్రయోగంలో తెలియకుండానే ఈ మహిళలు భాగస్వామయ్యారని ఈ డాక్యుమెంటరీలో వివరించారు.
ఈ ఇద్దరు మహిళలు తాము ఈ పరీక్షల్లో భాగమయ్యామని కనీసం తమకు తెలియదని డాక్యుమెంటరీలో చూపించారు.
వారిలాగే ప్యూర్టో రికో లో వందలాది మహిళలు తమకు తెలియకుండానే ఇద్దరు అమెరికా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో భాగమయ్యారు.
1960ల్లో కమర్షియల్‌గా వాడేందుకు అనుమతించినప్పటి నుంచి ఈ ఔషధం గర్భనిరోధక మాత్రగా బాగా ఉపయోగపడింది.
అమ్మతనాన్ని ప్లాన్ చేసుకునేందుకు పురుషులపైనే మహిళలు ఆధారపడాల్సినవసరం లేకుండా ఈ మాత్ర సాయం చేసింది.
అధిక జనాభాను నియంత్రించేందుకు ఈ గర్భనిరోధక మాత్రను అమెరికాలోని స్థానిక ఐల్యాండ్ ప్యూర్టో రికోలో పరీక్షించారు.
20వ శతాబ్దం ప్రథమార్థంలో పెరిగిన జనాభాతో, చాలా మంది ప్రజలు తీవ్ర పేదరికంలో ఉండేవారు. పిల్లలు కనకుండా ప్యూర్టో రికో ప్రజల్ని కట్టడి చేసేందుకు అక్కడ అమెరికా కనుసన్నలలో పని చేసే రాజకీయ నేతలు ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అత్యంత పేద కమ్యూనిటీల్లో జనాభాను తగ్గించేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను రూపొందించినట్లు ప్యూర్టో రికో యూనివర్సిటీ ప్రొఫెసర్, లా ఆపరేషన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ అన్నా మారియా గాస్రియా వివరించారు.
‘‘ఈ కార్యక్రమాల్లో దేశంలో అత్యంత పేదరికంలో నివసిస్తోన్న, పెద్దగా చదువులేని మహిళలను వారు లక్ష్యంగా చేసుకున్నారు.’’ అని ప్యూర్టో రికాన్ ఫెమినిస్ట్ ఎన్‌జీఓ టాలర్ సలూద్‌కు చెందిన లౌర్డస్ ఐనోవా అన్నారు.
ఎందుకంటే ఇలాంటి ప్రొసీజర్లలో పాల్గొనప్పుడు ఎలాంటి తీవ్ర ప్రభావాలు ఎదురవుతాయో తెలుసుకునేందుకు వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు.
పరీక్షలు నిర్వహించబోయే ముందు వారి నుంచి సమ్మతి తీసుకోవడం పెద్ద సవాల్ అని ఆమె తెలిపారు.
‘‘ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్సింగ్‌తో, ఈ దీవిలో అత్యాధునిక జనన నియంత్రణ ల్యాబోరేటరీని ఏర్పాటు చేశారు’’ అని గాస్రియా చెప్పారు.
ప్రయోగం కోసం ఇక్కడి మహిళలను ‘‘గినీ పందుల మాదిరి’గా వాడుకున్నారని ఐనోవా అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇద్దరు శాస్త్రవేత్తలు, ఇద్దరు కార్యకర్తలు
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది మహిళలు వాడుతోన్న ఈ గర్భనిరోధక మాత్ర ప్యూర్టో రికోకు దూరంగా, మస్సాచుసెట్స్‌లోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఆవిర్భవించింది.
ఈ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన జాన్ రాక్, గ్రెగోరి పింకస్ అనే ఇద్దరు ప్రఖ్యాత ప్రొఫెసర్లు ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేశారు.
వీరికి మార్గరెట్ సాంగర్ నుంచి సపోర్టు లభించింది. ఆమె అమెరికాలో తొలి గర్భనిరోధక క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది ప్లాన్డ్ పేరెంట్‌హుడ్ ఆర్గనైజేషన్‌గా మారింది. ఆమె నర్సు, హెల్త్ నిపుణురాలు కూడా.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇక నాలుగో వ్యక్తి ఈ గర్భనిరోధక మాత్రకు ఆర్థికసాయం చేసిన రాజ కుటుంబ వారసురాలు కేథరీన్ మెక్‌కార్మిక్. మార్గరెట్ ద్వారా ఆమె గ్రెగరీ పింకస్‌ను కలిశారు. ఆయన చేస్తోన్న పరిశోధన ఆమెకు ఆసక్తి కరంగా అనిపించింది. దీంతో ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
‘‘సమాజంలో పలు అంశాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా, వారికి గొప్ప శక్తిని కల్పించినట్లవుతుంది. దీన్ని సాధించేందుకు మహిళలు తల్లులు కాకుండా ఆపడం అత్యంత అవసరం. ’’అని ఐవోవా చెప్పారు.
‘‘ జనాభా నియంత్రణ ఉద్యమంలో రెండు అంశాలున్నాయి. ఒకటి మహిళలు సొంతంగా వారికి పిల్లలు ఎప్పుడు కావాలో నిర్ణయించుకోవడం, రెండు పేద మహిళలు తక్కువ మంది పిల్లల్ని కనడం మంచిది’’ అని న్యూజెర్సీకి చెందిన రాగర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్గరెట్ మార్ష్ చెప్పారు. ఉత్తర అమెరికాలో సంతానోత్పత్తి నిపుణులలో ఆమె ప్రముఖ వ్యక్తి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తొలి అధ్యయనం
అమెరికాలో గర్భనిరోధక మాత్రలపై తొలి పరిశోధన ఎలుకలు, ఇతర జంతువులపై జరిగింది.
కానీ ఆ తర్వాత అనైతిక నిర్ణయాన్ని తీసుకున్నారు. మస్సాచుసెట్స్‌లోని మానసిక ఆరోగ్య సమస్యలతో వచ్చే కొద్ది మంది రోగులకు ఈ డ్రగ్‌ను ఇచ్చారని మార్గరెట్ మార్ష్ చెప్పారు.
అమెరికాలో గర్భనిరోధక చరిత్రను పూర్తిగా అధ్యయనం చేసిన వారిలో మార్గరెట్ మార్ష్ ఒకరు.
‘‘వారిపై అధ్యయనం చేపట్టేందుకు రోగుల కుటుంబాలు అనుమతి తీసుకున్నాయి. కానీ, సైకియాట్రిక్ ఆస్పత్రిలో ఉండటంతో స్వతహాగా రోగుల అనుమతిని తీసుకోలేదు. ఆ సమయంలో ఇది చట్టబద్ధమే’’ అని చెప్పారు.
ఈ దశలో వారు రూపొందించిన రసాయన సమ్మేళనంతో అండం ఉత్పత్తి కావడం ఆగిపోతుందని జాన్ రాక్, గ్రెగోరి పింకస్‌లు గుర్తించారు. దీంతో, వారు పెద్ద మొత్తంలో ఈ ప్రయోగం చేపట్టాలనుకున్నారు. దీనిలో కూడా ఫలితాలు అనుకూలంగా వస్తే, అమెరికన్ రెగ్యులేటర్లు ఈ మాత్రను ఆమోదిస్తాయని భావించారు.
జనన నియంత్రణ అనేది చట్టవిరుద్ధమని మస్సాచుసెట్స్‌లో ప్రొఫెసర్ గాస్రియా వివరించారు. మనుషులపై దీనిపై ప్రయోగాలు చేసేందుకు చట్టబద్ధమైన పరిమితులున్నాయన్నారు.
కానీ, శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్ చేపట్టేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించారు..

ఫొటో సోర్స్, THE NEW YORK TIMES
దీవిలో ప్రయోగశాల
స్టెరిలైజేషన్ కోసం ప్యూర్టో రికో వెళ్లాలని వారు నిర్ణయించారు. గర్భనిరోధకాన్ని సాధించేందుకు అక్కడ ప్రయోగాలు చట్టబద్ధం. అంటే 1937 నుంచి ప్యూర్టో రికోలో గర్భనిరోధకాలు చట్టబద్ధమయ్యాయి.
‘‘ఆ చట్టం చారిత్రాత్మక ఘట్టంగా కూడా నిలిచింది. అమెరికాతో సహా భూమిపైనున్న మిగిలిన ఏ దేశంలో కూడా ఇది చట్టబద్ధం కాదు, కానీ అక్కడ చట్టబద్ధం’’ అని గాస్రియా చెప్పారు.
న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన ఆర్టికల్ ప్రకారం, యుజెనిక్స్‌కు బహిరంగంగా మద్దతును ప్రకటిస్తూ గవర్నర్ బ్లాంటన్ సీ విన్‌షిప్ ఈ చట్టంపై సంతకం చేశారు.
1950ల్లో ఈ గర్భనిరోధక మాత్ర రీసెర్చర్లు ఈ ద్వీపానికి చేరుకున్న తర్వాత, 41 శాతం ప్యూర్టో రికో మహిళలు గర్భనిరోధకం కోసం కొన్ని విధానాలను వాడుతున్నారని ప్యూర్టో రికో యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది.
ఈ ప్రాంతంలో డజన్ల కొద్దీ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం అనుమతించింది. మారుమూల పట్టణాలైనా, ప్రభుత్వ రాయితీలతో క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. గర్భనిరోధకాన్ని ప్రోత్సహించే స్టాఫ్‌లో మహిళలు కూడా ఉన్నారు.
ఈ క్లినిక్‌ల నెట్‌వర్క్ చూసి పింకస్, రాక్‌లు ఆశ్చర్యపోయారు. తమ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడం కోసం వారిని వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్ పక్కనున్న ఒక ప్రాంతంపై ఫోకస్ పెట్టారు.
1955లో ఈ ప్రాజెక్ట్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. మెడికల్, నర్సింగ్ విద్యార్థులు దీనిలో పాలుపంచుకున్నారు. కానీ, ఈ అధ్యయనం చాలా క్లిష్టంగా, బాధాకరంగా సాగింది. చాలా మంది ఈ ప్రయోగాన్ని పూర్తి చేయలేకపోయారు.
ప్రస్తుతం వారు వాడుతున్న దానికి అత్యధిక డోసులో ఈ పిల్‌ను ప్యూర్టో రికో మహిళలపై పరీక్షించారు. దీంతో వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చాయి.
‘‘అండోత్పత్తి ఆగిందో లేదో తెలుసుకోవడం కోసం వారికి మూత్ర పరీక్షలు, ఎండోట్రయల్ బయోస్పీస్, ఇతర పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఇది చాలా అసౌకర్యవంతమైన విధానాలు. గర్భనిరోధకం అవసరం లేని విద్యార్థులుంటే.. వారిపై ఈ పరీక్షలు చేయలేరు’’ అని మార్గరెట్ మార్ష్ తెలిపారు.
దీని కోసం తీసుకున్న మెడికేషన్ వల్ల తీవ్ర అలసట, వాంతులు, తలపోటు వచ్చేవి. ప్రయోగం చేస్తోన్న మహిళలలో వస్తోన్న ఈ ఆరోగ్య సమస్యలను పింకస్ కొట్టిపారేస్తూ వచ్చారు. ‘సైకోసోమాటిక్’ వల్ల వారికి ఇలా జరుగుతుందన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘తన కుటుంబీకులకు కూడా ఈ గర్భనిరోధక మాత్రలు ఇస్తున్నట్లు అంటే ఆయన కూతుర్లకు, మనవరాళ్లకు, పిల్లల స్నేహితులకు ఇచ్చినట్లు మార్ష్ చెప్పారు.
పింకస్ సహోద్యోగి రాక్ బయోగ్రఫీని ఆమె మార్ష్ రాశారు.
ఇన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, వారు ప్రయోగాలను కొనసాగించాలనే నిర్ణయించారు. ప్యూర్టో రికోకి ఉత్తరాన ఉన్న సబ్‌అర్బన్ రియో పీడ్రాస్‌కు వారి ప్రయోగాలను విస్తరించారు.
ఎలాంటి ధన పరిహారాలు లేకుండానే వారిలో కొందరి డేటాను సేకరించేందుకు పరీక్షలు కూడా నిర్వహించారు.
ప్యూర్టో రికో సమాజంలో పలు రంగాల నుంచి దీనిపై ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది.
ఈ రీసెర్చ్‌ను మాల్తుసియన్‌గా పేర్కొంటూ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ పరిశోధన కోసం మహిళలను రిక్రూట్ చేసుకున్న డాక్టర్లు సైతం సైడ్ ఎఫెక్ట్స్ చూసి వీటిని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, వీటిని కొట్టివేయొద్దని అన్నారని ఐనోవా చెప్పారు.
దీని సైడ్ ఎఫెక్ట్స్‌తో అంతకుముందు అధ్యయనాల్లో పాల్గొన్న చాలా మంది మహిళలు చికిత్స తీసుకోవడం ఆపేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు పేదరికంతో ఆ పిల్‌ను తీసుకునేందుకు అంగీకరించారు.
కరేబియన్ దీవుల్లో ఈ క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న ముగ్గురు మహిళలు చనిపోయారు. వారి శవపరీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో వారి మరణం ఎలా సంభవించిందన్నది బయటికి తెలియనే లేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆమోదమెలా వచ్చింది?
మరణాలు సంభవించినప్పటికీ, గర్భాన్ని నిరోధించడంలో ఈ మాత్ర బాగానే పనిచేస్తుందని తేలింది. ప్యూర్టో రికోలో ఇతర పట్టణాలకు కూడా శాస్త్రవేత్తలు తమ ప్రాజెక్ట్‌ను విస్తరించారు.
ఆ తర్వాత హైతీ, మెక్సికో, న్యూయార్క్, సియాటెల్, కాలిఫోర్నియాలో దీని పరీక్షలు జరిగాయి.
మొత్తంగా 900 మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో సుమారు 500 మంది ప్యూర్టో రికో ద్వీపానికి చెందిన వారు.
1960లో అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఎన్వోయిడ్‌కి ఆమోదం తెలిపింది. గర్భనిరోధానికి వచ్చిన తొలి మాత్రగా పేరొందింది.
దీన్ని విస్తారంగా వాడారు. కేవలం ఏడేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.3 కోట్ల మంది మహిళలు దీన్ని ఉపయోగించారు.
ఎఫ్‌డీఏ అనుమతి వచ్చినప్పటికీ, ఈ మాత్ర సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తీవ్రంగా ఉన్నాయి.
అమెరికాకు చెందిన ఇతర ప్రాంతాల్లో దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వచ్చినప్పటికీ, 1964 వరకు అధ్యయనాలు కొనసాగాయి.
మగవారికి గర్భనిరోధక డ్రగ్‌ను తీసుకురావాలని 30 ఏళ్ల కిందటే అధ్యయనాలు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటికి అవి ఫలించ లేదు.
ఇవి కూడా చదవండి:
- హరియాణా - నూహ్: 'అవన్నీ రాళ్ళు విసిరిన వారి నిర్మాణాలే, జాలి చూపించాల్సిన పని లేదు... కూల్చేయండి' - గ్రౌండ్ రిపోర్ట్
- అహ్మదీయులు ముస్లింలు కాదా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లేఖపై ఏమిటీ వివాదం?
- బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....
- ‘‘జైల్లో కెమెరాల ముందు దుస్తులు విప్పించారు.. శానిటరీ ప్యాడ్లు, టాంపాన్లను తొలగించమన్నారు’’-ఇరాన్ మహిళల ఆరోపణ
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














