ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? ఆ బాక్స్‌లో ఏమేం ఉండాలి?

ప్రథమ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రీతి రాజేశ్వరి, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కూరగాయలు తరుగుతున్నప్పుడు చేతి వేలు తెగితే ఏం చేస్తారు? స్టవ్ దగ్గర ఉన్నప్పుడు వేడి పాత్రలు అంటుకున్నప్పుడో, సలసలా కాగే నూనె మీద పడితేనో ఏం చేస్తారు?

ఎవరికైనా ప్రమాదవశాత్తు గాయాలైనప్పుడు, ప్రాణహాని తలెత్తినప్పుడు ఆసుపత్రికి తరలించేలోగా పరిస్థితి విషమించకుండా మొట్టమొదట చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు.

ప్రథమ చికిత్సపై సరైన అవగాహన ఉంటే కేవలం వ్యక్తులకే కాకుండా పెంపుడు జంతువులకు, ఇతర ప్రాణులకు కూడా దీన్ని అందించవచ్చు.

గాయాలైన సందర్భాల్లో కంగారు పడకుండా ప్రథమ చికిత్స చేయాలంటే మనకు అందుబాటులో ఉండేలా ఒక ప్రథమ చికిత్స పెట్టె (ఫస్ట్ ఎయిడ్ బాక్స్)ను సిద్ధం చేసుకోవాలి. దీన్ని మనమే తయారుచేసుకోవచ్చు. మెడికల్ షాప్‌లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంటాయి.

వెతుక్కోవాల్సిన పని లేకుండా బాగా కనిపించే చోట ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను భద్రపరచాలి. ఇంట్లో అయితే ఇంటి మధ్యలో, వంటగదిలో, స్నానాల గదిలో పెట్టుకోవచ్చు. ఆఫీసులో, కారులో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను ఏర్పాటు చేసుకుంటే అవసరమైన సమయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారో అక్కడ ఈ బాక్స్ పెట్టుకోవడం మేలు. ఎక్కడ పెట్టినా చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలన్నది మర్చిపోవద్దు.

ప్రథమ చికిత్స కిట్

ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలా తయారు చేయాలి?

ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

లోపలి వస్తువులు బయటికి కనిపించేలా ఉండే, నీరు చొరబడని ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకోవాలి.

అందులో వివిధ రకాల బ్యాండేజ్‌లు, అన్ని పరిమాణాల్లోని గాజ్ డ్రెస్సింగ్ రోల్స్, స్టెరిలీ ఐ డ్రెస్సింగ్స్, సేఫ్టీ పిన్స్, డిస్పోజబుల్ గ్లౌజులు, ట్వీజర్స్, కత్తెర, ఆల్కహాల్ రహిత క్లెన్సింగ్ వైప్స్, స్టిక్కీ టేప్, థర్మామీటర్, స్కిన్ రాష్ క్రీమ్, కీటకాలు కుట్టినప్పుడు మంటను నివారించే స్ప్రే లేదా క్రీమ్, యాంటిసెప్టిక్ క్రీమ్, పారాసిటమాల్- ఆస్పిరిన్ వంటి నొప్పి నివారణ మందులు, గాయాలను కడగడానికి డిస్టిల్డ్ వాటర్ వంటి వస్తువులను పెట్టుకోవాలి.

వీటిలోని కొన్ని వస్తువులను ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చు. అలాంటప్పుడు గడువు మీరిన ఔషధాలను ఎప్పటికప్పుడు తీసివేసి వాటి స్థానంలో కొత్తవి పెట్టుకోవాలి.

ప్రథమ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ప్రథమ చికిత్స ఎలా చేయాలి?

గాయాన్నిబట్టి ప్రథమ చికిత్స చేయాల్సి ఉంటుంది. సాధారణంగా కాలడం, జంతువులు లేదా కీటకాలు కరవడం, దెబ్బ తగలడం వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ గాయాలు అయినప్పుడు ప్రథమ చికిత్స చేసే వారు భయపడకుండా ఉండటం ఎంతో ముఖ్యమని బీబీసీతో డాక్టర్ సృజన్ వడ్రానపు చెప్పారు. గుంటూరుకు చెందిన సృజన్, తమిళనాడులోని కోయంబత్తూరులో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.

తెగడం, చర్మం గీసుకుపోవడం వల్ల రక్తం వచ్చే గాయాలైతే డాక్టర్ దగ్గరకు వెళ్లాలా? వెళ్లనవసరం లేదా అనేది వెంటనే తేల్చుకోవాలి.

గాయం బాగా లోతుగా ఉన్నా, రక్తం ఎక్కువగా ఆగకుండా వస్తున్నా వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లడం మంచిది.

ప్రథమ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

తెగిన గాయాలైతే...

తెగిన గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేయాలో డాక్టర్ సృజన్ వివరించారు.

‘‘గాయాన్ని మంచి నీళ్లతో కడగాలి. సబ్బు ఉపయోగించొచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్, బీటాడిన్ వంటివి వాడకూడదు. స్పిరిట్, శానిటైజర్ వాడితే బాగా మంటగా అనిపించవచ్చు. అందువల్ల వీటిని కూడా ఉపయోగించకూడదు. గాయాన్ని కడిగిన తరువాత ఒక శుభ్రమైన గుడ్డ లేదా గాజ్ క్లోత్‌తో (gauze)అద్దుతూ తుడవాలి.

ఒకవేళ మురికి, ఇసుక లాంటివి గాయంలో కనిపిస్తుంటే మన దగ్గర ఉన్న ట్వీజెర్స్ (tweezers)తో వాటిని తీసేయడానికి ప్రయత్నించాలి. తర్వాత శుభ్రమైన గాజ్(gauze) క్లోత్ గాయం మీద పెట్టి గట్టిగా బ్యాండేజ్ కట్టాలి.

గాయం చిన్నగా ఉండి, ఎక్కువ లోతుగా లేకపోతే గాయానికి డ్రెస్సింగ్ ఏమీ లేకుండా వదిలేయవచ్చు. కానీ, గాయాన్ని శుభ్రం చేసిన తరువాత ఒక యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ రాసి గాలి తగిలేలా వదిలేస్తే మంచిది’’ అని సృజన్ చెప్పారు.

ఫస్ట్ ఎయిడ్

ఫొటో సోర్స్, Srujun Vadranapu

కాలిన గాయాలకు ఎలా?

కాలిన గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేయాలనే అంశం గురించి బీబీసీతో వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రతిభా లక్ష్మీ వివరించారు.

‘‘ఇంట్లో ఏమైనా చిన్న కాలిన గాయాలు అయినప్పుడు, వెంటనే ఆ భాగాన్ని 10 నిమిషాల పాటు చల్లటి నీటి కింద పెట్టాలి. అలా అని ఆ గాయాల మీద ఐస్ పెట్టకూడదు. తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోని, శుభ్రమైన చేతులతో ఏదైనా యాంటీసెప్టిక్ క్రీమ్ (silverex or burnol) రాయాలి. మట్టి, టూత్‌పేస్ట్, లేదా ఎటువంటి నూనెలు పెట్టకూడదు. నీటి బుడగలు వచ్చాయంటే చర్మం ఉపరితలం మీదనే గాయం అయినట్లు లెక్క. కాబట్టి అలా నీటి బుడగలు వస్తే కంగారు పడకూడదు. వాటిని పగుల కొట్టకూడదు. వాటిని శుభ్రంగా పగలకొట్టకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక సారి వైద్యులను సంప్రదించడం మంచిది.

ఎక్కువగా కాలినట్లైతే శుభ్రమైన క్లాత్, లేదా బ్యాండేజ్ కట్టి, వీలైనంత తొందరగా, ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కాలిన గాయాల వల్ల కన్నా, వాటికి కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాపాయం ఎక్కువగా సంభవిస్తుందని గుర్తు పెట్టుకోవాలి. కాలిన గాయాల వల్ల 20 శాతం మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది. కానీ, ఇన్ఫెక్షన్ వల్ల 80 శాతం మరణాలు సంభవిస్తాయి. అందుకే శుభ్రమైన బట్టలు, కుదిరితే ఏదైనా క్రిమి హారక మందులతో (Dettol) ఉతికిన బట్టలు వేయాలి. వారు ప00డుకునే కప్పుకునే బట్టలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్ క్రమం తప్పకుండా వాడాలి. వాటితో పాటు గాయాలు త్వరగా మానడానికి విటమిన్లు, అవసరమైన లవణాల కోసం, అవి ఉండే పండ్లు తినడం మంచిది. అలాగే మాంసకృత్తులు బాగా ఉన్న ఆహారం తినడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

వేడి నూనె, లేక వేడి నీరు పడటం వల్ల కలిగే గాయాలు (scalds), చిన్న పిల్లలలో సాధారణంగా చూస్తుంటాం. వారి శరీర ఉపరితల ప్రదేశం తక్కువ ఉండటం కారణంగా కాస్త నూనె లేక నీరు వల్ల అయ్యే గాయాలు కూడా ఎక్కువ సమస్యాత్మకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇవి కాలిన గాయాలకు ఏ మాత్రం తక్కువ కాదు. ఈ గాయాలలో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు చాలా అధికమే. అందుకే వీటిని పరిశుభ్రంగా ఉంచుతూ, తగిన యాంటీసెప్టిక్ క్రీమ్ రాస్తూ దుమ్ము పడకుండా, బట్టలు లేక ఇతర ఏ కారణాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు, గాయం త్వరగా మానేందుకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. గాయాలు పూర్తిగా నయమైన తర్వాత ఒకవేళ గాయం తాలూకూ వైకల్యం లేదా మచ్చలు మిగిలిపోతే, దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి సవరించే అవకాశం ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.

dog

ఫొటో సోర్స్, Getty Images

జంతువులు కరిస్తే ఏం చేయాలి?

భారతదేశంలో కుక్క కాటు ఘటనలు సాధారణంగా కనిపిస్తుంటాయి. కుక్కలే కాకుండా పిల్లులు, కోతులు కూడా కరుస్తుంటాయి. పెంపుడు జంతువులు కరిస్తే, వాటికి వాక్సినేషన్ చేయించారో లేదో యజమానులను కనుక్కోవాలి.

జంతుకాటు గాయాలకు తెగిన గాయాల తరహాలోనే ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి వెళ్లాలి. ఎందుకంటే, జంతుకాట్ల వల్ల గాయానికి చీము పట్టే అవకాశం ఉంది. పైగా రేబిస్, టెటనస్ అనే జబ్బులు సోకే ముప్పు కూడా ఉంది.

భారతదేశంలో పాము కాటు కేసులు కూడా ఎక్కువ. పాము లేదా తేలు కరిస్తే వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలి. గుర్తు తెలియని కీటకం లేదా జంతువు కరిచినా కూడా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ఉత్తమం.

కందిరీగలు, తేనెటీగలు కరిస్తే కొందరిలో తీవ్రమైన ఎలర్జీ రావొచ్చు. అలాంటి వారు డాక్టర్ సలహా మేరకు సరైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.

ప్రథమ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

స్పృహ తప్పి పడిపోతే ఏం చేయాలి?

సాధారణంగా కళ్లకు చీకట్లు వచ్చి పడిపోవడం ఎక్కువగా మహిళల్లో చూస్తుంటాం. ఈ వైద్య పరిస్థితిని సింకోప్ అని పిలుస్తారని వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రతిభా లక్ష్మీ చెప్పారు.

మెదడుకు రక్తసరఫరా తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని ఆమె తెలిపారు.

‘‘కళ్లకు చీకట్లు వచ్చి పడిపోయిన లేదా స్పృహ తప్పి పడిపోయిన వారిని చూసిన వెంటనే ఎవరైనా ముందుగా వారిని పైకి లేపే ప్రయత్నం చేస్తారు. కానీ, ఇలా చేయకూడదు.

తలను పైకి లేపడం వల్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే తలను పైకి ఎత్తడం వల్ల మెదడుకు రక్తసరఫరా జరగడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని ఒకవైపు తిప్పి పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఊపిరి అందుతుంది. దీన్న రికవరీ పొజిషన్ అంటారు.

ఒక్కోసారి రోగికి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ స్పృహ కోల్పోయి కనిపిస్తారు. అలాంటప్పుడు రోగి కాళ్లు కాస్త ఎత్తులో ఉండేలా పెట్టడం వల్ల బ్రెయిన్‌కు రక్త సరఫరా సులభంగా జరిగి కాసేపట్లో వారు స్పృహలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇలాంటి వైద్యపరిస్థితి తలెత్తినప్పుడు రోగికి ఫిట్స్ వస్తున్నాయో లేదో గమనించాలి. కాళ్లు, చేతులు కొట్టుకోవడం వంటి చర్యలు 3 నిమిషాలకు మించి సాగితే అది ప్రమాదకరంగా భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. 3 నిమిషాల్లోపే ఆగిపోతే వాటిని ప్రమాదంగా పరిగణించనవసరం లేదు’’ అని డాక్టర్ ప్రతిభా లక్ష్మీ వివరించారు.

పిల్లలకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి?

ఆటలు ఆడుతూ పిల్లలు గాయపడటం చాలా సాధారణం. పిల్లలకు ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బీబీసీతో పీడియాట్రీషియన్ డాక్టర్ రమాదేవి మాట్లాడారు.

‘‘పిల్లలకు అయిన గాయాన్ని ముందుగా నీటితో శుభ్రంగా కడగాలి. డెటాల్‌ను కూడా వాడొచ్చు. గాయం తీవ్రతను బట్టి ప్రథమ చికిత్స చేయాల్సి ఉంటుంది.

గాయం బాగా లోతుగా అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. గీరుకుపోవడం లేదా చిన్న గాయమైతే గాయాన్ని కడిగి యాంటీబయాటిక్ క్రీమ్ రాస్తే సరిపోతుంది.

గాయం లోతుగా ఉంటే వైద్యులు టీటీ సిఫార్సు చేయొచ్చు.

మామూలుగా అయిదేళ్ల లోపు చిన్నారులకు టీటీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారికి అయిదేళ్ల వరకు వివిధ రకాల వ్యాక్సినేషన్ ఇస్తుంటారు. కాబట్టి అదనంగా టీటీ ఇవ్వనక్కర్లేదు’’ అని డాక్టర్ రమాదేవి వివరించారు.

ప్రథమ చికిత్స

ఫొటో సోర్స్, Ravisankar Lingutla

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

ఎలాంటి గాయమైనా కూడా ప్రథమ చికిత్స తర్వాత డాక్టర్‌ను సంప్రదించి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. సొంత వైద్యం ఎప్పుడూ ప్రమాదకరమేనని గుర్తుంచుకోవాలి.

పెద్ద గాయాలైనప్పుడు, లోతైన గాయం అయినప్పుడు కుట్లు వేయాల్సి రావొచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ దగ్గరకు తప్పక వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ టెటనస్ ఇంజెక్షన్ కూడా ఇవ్వొచ్చు.

తుప్పు పట్టిన వస్తువు వల్ల గాయమైనప్పుడు, జంతువు కరవటం వల్ల గాయమైనప్పుడు, ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగనప్పుడు, ముఖంపై, చేతి వేళ్ళు తెగిపోవడం, కీళ్లు గాయపడటం, గాయం చుట్టూ ఎర్రని చారలు కనిపించినా, గాయం ఎర్రబారి వాచిపోయినా, పిల్లల్లో అయినా పెద్దవారిలో అయినా 100.4 F లేదా అంతకంటే ఎక్కువ జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని డాక్టర్ సృజన్ చెప్పారు.

“కొన్ని విష పురుగులు, కీటకాలు కరిచినప్పుడు తల బరువుగా అనిపించడం, ఒంటి పైన దద్దుర్లు రావడం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, నాలుక వాచిపోయి మొద్దుబారడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి” అని ఆయన వివరించారు.

ప్రథమ చికిత్స ఎంత ముఖ్యమో, డాక్టర్‌ను సంప్రదించాలా, వద్దా అనేది సరిగా అంచనా వేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

“ఉదాహరణకు నా ప్రాక్టీస్‌లో చూసిన రెండు కేసుల గురించి చెబుతాను. ఒక రోజు సుమారు 60 ఏళ్ల వ్యక్తి కుంటుతూ నా వద్ద ఓపీకి వచ్చారు. రెండు నెలల క్రితం మెట్ల మీద నుంచి కాలు బెణికి పడ్డారంట. ఎక్స్‌రే తీసి చూస్తే చీలమండ (ఆంకిల్)లో మూడు ఎముకలు విరిగి ఉన్నాయి! అంటే అంత నొప్పితో ఆయన రెండు నెలలు ఉన్నారు. కొంత మంది మాత్రం పెద్దగా గాయాలు లేకపోయినా ఆందోళనతో డాక్టర్ల వద్దకు వస్తుంటారు. ఇవి రెండూ భిన్నమైన పరిస్థితులు. నన్నడిగితే, రెండోదే మెరుగైనది. సమస్య ఎంతదైనా డాక్టర్ దగ్గరకు వెళ్లడం వల్ల దాని తీవ్రత ఏంటి? ఎలాంటి చికిత్స అవసరం, ఆందోళన చెందాల్సింది ఏమైనా ఉందా అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి” అని డాక్టర్ సృజన్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)