ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఏం జరుగుతుంది, ఆ ఆలోచనలను ఎలా పసిగట్టాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హమీద్ దాభోల్కర్
- హోదా, మానసిక నిపుణుడు
ఆత్మహత్యలపై దశాబ్దాలుగా పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్, ఉదయ్ కిరణ్‌ల ఆత్మహత్యల తర్వాత మీడియాలో దీనిపై కొంత చర్చ మొదలైంది.
కోవిడ్-19 వ్యాప్తి నడుమ విపరీతమైన ఒత్తిడి వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరగడంతో దీన్ని తీవ్రమైన సమస్యగా గుర్తిస్తున్నారు.
అంటు వ్యాధుల కేసులు పెరినట్లే ప్రస్తుతం ఆత్మహత్యల కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకే వీటిని ప్రేరేపిస్తున్న కారణాలను మనం అర్థం చేసుకోవాలి.
భారత్‌లో ఏటా రెండు లక్షల కంటే ఎక్కువ మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. వీరిలో సగం మంది 15 నుంచి 35 ఏళ్ల మధ్యవారు అంటే యువతే.
ఆత్మహత్యల తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తులతోపాటు ఈ సమస్యను కూడా మరచిపోతుంటాం. కానీ, ఇదొక తీవ్రమైన మహమ్మారి లాంటిది.
ఉగ్రవాదం, యుద్ధాల కంటే నేడు ఆత్యహత్యలే అత్యంత ముఖ్యమైన సమస్యని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు యువాల్ నోహ హరారీ కూడా చెప్పారు.
కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఆర్థిక, సామాజిక ప్రభావాలతో మనపై మానసిక ఒత్తిడి చాలా పెరుగుతోంది. నిరుద్యోగం వల్ల ఆత్మహత్య చేసుకున్నారంటూ రోజూ ఏదో ఒక వార్త పత్రికల్లో కనిపిస్తూనే ఉంటుంది.
ఈ సమస్యపై మనం అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ రాసుకోవడం లాంటివి చేసినట్లే ఆత్మహత్యలను అడ్డుకునేందుకూ మనం ‘వ్యాక్సీన్’ తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఆత్మహత్యల నివారణకు వ్యాక్సీన్.. అదేంటో తెలుసా
పెరుగుతున్న ఆత్మహత్యల విషయంలో మనం ముందుగానే వ్యాక్సీన్ వేసుకోవాలని చెప్పడంతో మీరు కాస్త ఆశ్చర్యానికి గురికావచ్చు. కానీ, ఇక్కడ వ్యాక్సినేషన్ అనే పదాన్ని మనం విశాల దృక్పథంతో చూడాలి. అంటే ఆ వ్యాధి నుంచి మనల్ని కాపాడుకొనే శక్తినిచ్చే ఒక అస్త్రం మనకు కావాలి.
ఇక్కడ అతిపెద్ద సమస్య ఏమిటంటే మానసిక ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడమే. మరికొందరిలో చాలా అపోహలు కూడా ఉంటాయి.
మానసిక ఆరోగ్యంపై మాట్లాడేందుకు కూడా మన చుట్టుపక్కల చాలా మంది ఇష్టపడరు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకునే కంటే వీటిని దాచి పెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు.
‘మానసిక నిపుణులు నిద్ర మాత్రలు మాత్రమే ఇస్తారు’, ‘ఆ మందులు మనల్ని బానిసలుగా మార్చేస్తాయి’ లాంటి అపోహలను కొంతమందిని వెంటాడుతుంటాయి. మరికొందరు వైద్యుల దగ్గరకు వెళ్తారు, కానీ చికిత్సను మధ్యలోనే వదిలిపెడతారు. అపోహలు, నిర్లక్ష్యమే దీనికి కారణం.
ఆత్మహత్య ఆలోచనలు బయటపెట్టేవారిని చాలా మంది తక్కువగా చూస్తుంటారు. మరికొందరైతే కావాలనే వారు నాటకాలు ఆడుతున్నారని అనుకుంటారు. ఈ విషయంలో మనం కాస్త మనసు పెట్టి ఆలోచించాలి, నడుచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని వారాల ముందు..
ఆత్మహత్యను చేసుకునే కొన్ని వారాల ముందు తమకు దగ్గరి వారితో తమకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని సదరు వ్యక్తులు చెబుతుంటారని ఆత్మహత్యలపై జరిగిన అధ్యయనాల్లో వెల్లడింది. 50 శాతం కేసుల్లో తీవ్రమైన ఒత్తిడి నడుమ తమకు తాము హాని చేసుకోవడం కూడా కనిపిస్తుంది.
అందుకే మనకు దగ్గరి వ్యక్తుల భావోద్వేగ సమస్యలను వినేందుకు మనం ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి.
ఆత్మహత్యల ఆలోచనలను వినడం, వారికి ధైర్యం చెప్పడం కాస్త కష్టమే. అయితే, దీని కోసం మొదట మనకు అవగాహన అవసరం. అప్పుడు మనం వారికి మెరుగ్గా ధైర్యం చెప్పొచ్చు.
ఈ ‘ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్’ను ఉచితంగా అందించేందుకు పరివర్తన్ సంస్థ, అంధ్‌శ్రద్ధ నిర్మూలన్ సమితి లాంటి సంస్థలు రెండు వందల మందికిపైగా మానసిక నిపుణులను అందుబాటులో ఉంచుతున్నాయి.
వీరి దగ్గర నుంచి మనం ట్రైనింగ్ తీసుకుంటే మన ఆప్తులకు, కుటుంబాలకు అండగా నిలవొచ్చు. వీటి ద్వారా వారి సమస్యలను మనం మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.
ఆత్మహత్యలను అడ్డుకోవడంలో ఇది తొలి అడుగే కాదు, శక్తిమంతమైన అడుగు కూడా.
ఆ తర్వాత దశగా ఆత్మహత్యల ఆలోచనలతో బాధపడేవారిని మనం మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లాలి. అప్పుడే వారి ఆత్మహత్యల ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అంతేకాదు వైద్యుల పర్యవేక్షణతో ఆత్మహత్యలను మెరుగ్గా అడ్డుకోవచ్చు.
చాలా కేసుల్లో ఆత్మహత్య ఆలోచనలు అనేవి ఇతర తీవ్రమైన మానసిక సమస్యలకు సంకేతం కావచ్చు. అందుకే నేరుగా వైద్యుల దగ్గరకు వెళ్లడం అనేది చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి?
ఇక్కడ ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారిని మానసికంగా బలహీనులుగా చూస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారిని దూషిస్తూ చాలా మంది వ్యాఖ్యలు చేస్తుంటారు.
తీవ్రమైన మానసిక సంక్షోభానికి ఆత్మహత్యల ఆలోచనలు సంకేతాలు లాంటివని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎవరికైనా జరగొచ్చు. దీని వెనుక మూడు రకాల కారణాలు ఉండొచ్చు.
వీటిలో మొదటిది శరీరానికి సంబంధించిన కారణాలు. అంటే మెదడులో సెరెటోనిన్ లాంటి హార్మోన్లు పెరగడం వల్ల ఈ ఆలోచనలు వస్తుంటాయి.
ఇక రెండోది మానసిక కారణాలు. ఇవి సదరు వ్యక్తి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటాయి. మూడోది సామాజిక కారణాలు.
ఈ మూడు రకాల కారణాలు విడివిడిగా ఉండవు. ఇవన్నీ కలిసే ఆత్మహత్యలు చేసుకునేలా సదరు వ్యక్తులను ప్రేరేపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలి?
సాయం చేయడానికి చాలా మార్గాలున్నాయి. మొదట ఎవరైనా కుంగుబాటుతో బాధపడుతున్నా, నిద్ర సమస్యలున్నా, ఆకలి లేకపోయినా, ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతున్నా, తీవ్రంగా స్పందిస్తున్నా.. వెంటనే వారిని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి.
యువతలో ఎక్కువ ప్రేమ విఫలం కావడం లేదా కెరియర్ సమస్యల వల్ల మానసిక సమస్యలు, ఆత్మహత్యల ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ఈ విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ చర్చ జరిగేలా చూడాలి. దీని వల్ల వారికి మానసిక మద్దతు లభిస్తుంది.
‘‘దేనిలోనైనా విఫలమైతే ఇక జీవించడం వృథా’’ అనే ఆలోచనలు తప్పని మనం వారికి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. వైఫల్యాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేలా వారిని మానసికంగా సిద్ధం చేయాలి.
మరోవైపు ప్రభుత్వం కూడా ఆసుపత్రుల్లో మానసిక ఆరోగ్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచాలి. వార్తా చానెళ్లు కూడా ఆత్మహత్యల వార్తలు ప్రసారం చేసేటప్పుడు సున్నితత్వంతో వ్యవహరించడం లేదు. దీని వల్ల కూడా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది.
ఆత్మహత్యలను అడ్డుకోవడంలో సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్‌లు కూడా మెరుగ్గా పనిచేస్తాయి. పరివర్తన్ సంస్థ కూడా ఒక 24 గంటల హెల్ప్‌లైన్‌ను (7412040300) నడిపిస్తోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి హెల్ప్‌లైన్‌లను ఏర్పాటుచేశాయి. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
ఆత్మహత్యలను అడ్డుకునేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం, మీడియా, మనం కలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అప్పుడే ఆత్మహత్యలను అడ్డుకునే వ్యాక్సీన్ మన ఆప్తులకు ఇవ్వడంతోపాటు మనమూ తీసుకున్నట్లు అవుతుంది. దీని వల్ల చాలా ఆత్మహత్యలు తగ్గుతాయి.
(డాక్టర్ హమీద్ దాభోల్కర్ మానసిక నిపుణుడు, సామాజిక కార్యకర్త)
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?
- కోడలి హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న జమీందార్, మరి చంపిందెవరు? 110 ఏళ్లయినా వీడని మిస్టరీ
- ఆంధ్రప్రదేశ్: ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చిన సీఐడీ
- మొరాకో భూకంపం: ‘నా కుటుంబంలో 10 మంది చనిపోయారు’
- మొరాకో: రాజరికాన్ని రద్దుచేయాలంటూ ఒకప్పుడు ప్రజలు తిరగబడిన దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















