ఆంధ్రప్రదేశ్: ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చిన సీఐడీ

ఫొటో సోర్స్, UGC
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని విజయవాడ ఏసీబీకోర్టులో ప్రవేశ పెట్టారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో ఆయనను ముద్దాయిగా చేర్చాలంటూ సీఐడీ మెమో దాఖలు చేసింది.
న్యాయస్థానం ఆమోదించడంతో చంద్రబాబు నాయుడు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు సీఐడీ అధికారులు.
అంతకుముందు శనివారం ఉదయం 6 గంటలకు నంద్యాలలో అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి 11 గంటల రోడ్డు ప్రయాణం తర్వాత శనివారం సాయంత్రం 5గంటలకు తాడేపల్లి కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి ఆయన్ని తీసుకొచ్చారు.
ఆ తర్వాత సుమారు 13 గంటల పాటు అర్థరాత్రంతా ఆయన సిట్ అదుపులోనే ఉన్నారు. సీఐడీ అధికారులు ఈ కేసులో ఆయనను విచారించారు.
మధ్యలో కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ సిట్ ఆఫీసులోనే చంద్రబాబుని కలిశారు.

సుదీర్ఘంగా విచారణ..
సాయంత్రం 5 గంటలకే సిట్ కార్యాలయానికి చంద్రబాబు చేరడంతో కొద్దిసేపట్లోనే ఆయన్ని కోర్టుకి తరలించే అవకాశం ఉందని అంతా భావించారు. ఏసీబీ కోర్టు జడ్జి కూడా రాత్రి 9గంటల వరకు కోర్టులో వేచి చూశారు.
అయితే విచారణకు చంద్రబాబు సహకరించడం లేదంటూ సీఐడీ అధికారులు అనుకున్న సమయానికి చంద్రబాబుని కోర్టుకి తరలించకపోవడంతో చివరకు జడ్జి ఇంటికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కూడా చంద్రబాబుని అర్థరాత్రి సమయంలో తరలించే అవకాశం ఉందనే కారణంగా వైద్యుల బృందం ఏసీబీ కోర్టుకి చేరింది. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని భావించారు.

ఫొటో సోర్స్, UGC
హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
సమయం గడుస్తున్నప్పటికీ కోర్టులో హాజరుపర్చకపోవడంతో, సీఐడీ అధికారుల తీరుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ చంద్రబాబు న్యాయవాదుల బృందం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబు వయసుని దృష్టిలో పెట్టుకుని తక్షణమే కోర్టుకి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అయితే రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత మాత్రమే తాము జోక్యం చేసుకుంటామంటూ హౌస్ మోషన్ పిటీషన్ ని జడ్జి తిరస్కరించారు. దాంతో తెల్లవారే వరకు వేచి చూడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, UGC
తెల్లవారుజామున 4గంటల సమయంలో చంద్రబాబుని సిట్ ఆఫీసు నుంచి బయటకు తీసుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించి, తర్వాత కోర్టుకి కాకుండా మళ్లీ సిట్ ఆఫీసుకి తరలించారు.
పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటలలోగా కోర్టులో హాజరుపర్చాలనే నిబంధన మేరకు ఉదయం 5.40 గం.ల తర్వాత చంద్రబాబుని సిట్ ఆఫీసు నుంచి కోర్టుకి తరలించారు. కోర్టుకి తీసుకు వచ్చిన తర్వాత తొలుత జడ్జిరూమ్‌లో విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు.
కోర్టులో విచారణ చేయాలని చంద్రబాబు న్యాయవాదులు కోరగా జడ్జి ఆమోదించారు. దాంతో ఉదయం 6 గంటల తర్వాత కోర్టు హాలులో విచారణ మొదలైంది. చంద్రబాబు కీలక నిందితుడని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజ్‌ను రిఫ్రెష్ చేయండి)
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















