IMF రిపోర్ట్: సౌదీలో మహిళల జీవితాలు మారిపోయాయా... ఎలా?

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మహిళల విషయంలో సౌదీ అరేబియాను సంప్రదాయవాద దేశంగా పరిగణిస్తారు. అక్కడ మహిళలకు సంబంధించిన ఎలాంటి మెరుగుదల కనిపించినా అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్తే.

అయితే, రోజులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా చాలా మార్పు వచ్చింది సౌదీలో. ఆ దేశంలో మహిళల దుస్తులు, లింగ విభజన, మహిళా డ్రైవర్లపై పరిమితులను ఎత్తివేశారు. అంతేకాదు మహిళలు ఇల్లు వదిలి వెళ్లకూడదన్న నిబంధనను కూడా సవరించారు.

ఇపుడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం గల దేశాల కంటే సౌదీ అరేబియా ఆర్థికవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందని పలు రిపోర్టులు చెబుతున్నాయి.

మహిళల ఉనికిని ఊహించడమే సాధ్యం కాదని భావించిన సౌదీలోని కొన్ని రంగాల్లో ఇప్పుడు వారు పని చేస్తున్నారు. సరిహద్దు ఏజెంట్లు, టూర్ గైడ్‌లు, ఆతిథ్యం వంటి పెద్ద సంఖ్యలో ఇతర రంగాల్లో వారు భాగస్వాములయ్యారు.

IMF నివేదికలో ఏముంది?

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సౌదీ అరేబియాపై సెప్టెంబర్ 6 ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో మహిళలకు సంబంధించి ఆ దేశంలో మారిన గణాంకాలు పరిశీలించదగినవి.

సౌదీ వర్క్ ఫోర్స్‌లో మహిళలు 36 శాతం మేర ఉన్నారని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ తన 'విజన్ 2030' ప్రకారం దేశ వర్క్ ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని 30 శాతంకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2022లోనే ఈ లక్ష్యాన్ని అధిగమించింది సౌదీ. దశాబ్దాలుగా కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉన్న ప్రపంచంలోని దేశాలలో సౌదీ ఒకటి. 2018లో సౌదీ అరేబియా కార్మిక శక్తిలో మహిళల వాటా 19.7 శాతం మాత్రమే.

చమురు ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడిన తన దేశాన్ని 2030 వరకు ఆధునిక ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకుంటున్నారు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్. దీని కింద అనేక సంస్కరణలు చేపట్టడంతో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని ఐఎంఎఫ్ నివేదిక చెబుతోంది.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్

ఫొటో సోర్స్, Getty Images

సౌదీకి వచ్చిన మహిళలు ఏమంటున్నారు?

సౌదీ అరేబియాకు చెందిన ఫాతిమా అల్మతమి 14 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఆమె క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్‌డీ చేశారు.

తాను ప్రతి సంవత్సరం సెలవుల్లో సౌదీకి వెళ్తానని, మహిళల విషయంలో జరుగుతున్న మార్పును గమనిస్తున్నానని ABC వార్తాసంస్థతో ఫాతిమా తెలిపారు.

ఏబీసీ కథనం ప్రకారం "గత ఏడాది జూలైలో ఫాతిమా సౌదీ అరేబియాకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె రియాద్‌లో నివసిస్తున్నారు. సౌదీ యువతులు ఐటీ రంగంలోకి వెళ్లేలా ఫాతిమా సాయం చేస్తున్నారు.

“సౌదీ అరేబియాలో పురుషులు లేని చోట మహిళలు పని చేయాలనే నిబంధన ఉండేది. దీని కారణంగా ముఖ్యంగా వైద్య రంగంలో చాలా ఇబ్బంది ఉండేది. పురుషులున్న చోట మహిళలు పనిచేయడం అనైతికంగా పరిగణించేవారు. మహిళలకు అవకాశాలు ఇవ్వడమంటే అన్ని రంగాలలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లాంటిదే. మహిళల రాకతో రాజకీయ, పర్యాటక, క్రీడా తదితర రంగాలలో చాలా మార్పులు వచ్చాయి'' అని ఆమె అన్నారు.

ప్రిన్సెస్ రీమా బింట్ బందార్ అల్-సౌద్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ రీమా బింట్ బందార్ అల్-సౌద్ - సౌదీ మొదటి మహిళా రాయబారి

ఏ రంగంలో ఎక్కువగా ఉన్నారు?

సౌదీ అరేబియాలో ఉపాధి పొందుతున్న వారిలో మహిళల నిష్పత్తి 30.4 శాతానికి పెరిగిందని సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ గత ఏడాది నాలుగో త్రైమాసికంలో విడుదల చేసిన నివేదిక తెలిపింది.

2021లో ఇది 27.6 శాతంగా ఉండేది. సౌదీ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

అంతేకాదు హోటల్, రెస్టారెంట్ రంగంలో మహిళల భాగస్వామ్యం 40 శాతానికి చేరుకుంది. 2012లో సౌదీలో మహిళలకు ఇంటి బయట పని చేసేందుకు అనుమతించారు.

ఆ తర్వాత కాస్మోటిక్స్, మహిళల అండర్ గార్మెంట్స్ దుకాణాలలో పని చేయడానికి మహిళలకు వీలు కల్పించారు.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2016లో విజన్ 2030ని ప్రారంభించినప్పుడు, మహిళల విషయంలో నిర్ణయాలు వేగంగా తీసుకున్నారు, మార్పు కూడా అదే మాదిరి జరిగింది.

సౌదీలోని మహిళలు ఎక్కువగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ మార్పు ప్రభుత్వ స్థానాలకు చేరుకోవడానికి ప్రారంభంగా చూస్తున్నారు.

ఈ ఏడాది జూలైలో ఇద్దరు మహిళలు ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో నియమితులయ్యారు. షిహానా అల్జాజ్‌ను డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా, ప్రిన్సెస్ హైఫా బింట్ మహ్మద్ అల్ సౌద్‌ను డిప్యూటీ టూరిజం మంత్రిగా నియమించారు.

అమల్ అల్-మొయాలిమి

ఫొటో సోర్స్, @ABOUTHEROFCL

ఫొటో క్యాప్షన్, నార్వేలో సౌదీ అరేబియా రాయబారిగా అమల్ అల్-మొయాలిమి నియమితులయ్యారు.

రాజకీయ రంగంలోనూ...

సౌదీ షూరా కౌన్సిల్‌లో మహిళలకు రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. 150 స్థానాలున్న కౌన్సిల్‌లో 30 మంది మహిళలు అవసరం.

"2013లో మొదటిసారిగా 30 మంది మహిళలు సౌదీ షూరా కౌన్సిల్‌లో నియమితులవడంతో మార్పు మొదలైంది" అని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రిపోర్టులో సౌదీ అరేబియా జీసీసీ డైరెక్టర్ ఎస్సామ్ అబౌస్లీమాన్ తెలిపారు .

2015లో మున్సిపల్ కార్పొరేషన్‌లో 17 మంది మహిళలు నియమితులయ్యారు. పురుషులు ఆధిపత్యం చెలాయించే విభాగాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు మేనేజర్ పోస్టుల్లో ఉండటం ఇక్కడ కనిపిస్తోంది.

ఈ ఏడాది సౌదీ అరేబియా రాజు సల్మాన్ 11 దేశాలకు కొత్త రాయబారులను నియమించారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

2019లో సౌదీ తొలిసారిగా మహిళా అంబాసిడర్‌ను నియమించింది. అప్పటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటి వరకు ఐదుగురు మహిళలకు ఈ బాధ్యతలు అప్పగించారు.

సౌదీ అరేబియాలో మహిళలు బుల్లెట్ రైళ్లనూ నడుపుతారని అక్కడి రైల్వే 2023 జనవరిలో ఒక వీడియో విడుదల చేసింది. 32 మంది మహిళలకు శిక్షణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు.

హైఫా

ఫొటో సోర్స్, @ALARABIYA_KSA

ఫొటో క్యాప్షన్, హైఫా జెడియా

ఆయా దేశాల్లో రాయబారులుగా సౌదీ మహిళలు

2019లో సౌదీ అరేబియా నుంచి మొదటి మహిళా రాయబారిగా ప్రిన్సెస్ రీమా బింట్ నియమితులయ్యారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆమెను అమెరికా రాయబారిగా నియమించారు.

ఆ తర్వాత, 2020 సంవత్సరంలో అమల్ అల్-మొయాలిమి నార్వేలో సౌదీ రాయబారిగా నియమితులయ్యారు.

ఏప్రిల్ 2021లో స్వీడన్, ఐస్‌లాండ్‌లలో సౌదీ రాయబారిగా ఇనాస్ అల్-షాహవాన్ ప్రమాణ స్వీకారం చేశారు. సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహించిన మూడో మహిళా రాయబారిగా ఆమె నిలిచారు.

2023 జనవరిలో నియమితులైన కొత్త అంబాసిడర్‌లలో హైఫా జెడియా ఒకరు. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీకి సంబంధించి సౌదీ మిషన్ బాధ్యతలు హైఫాకు అప్పగించారు

2023 జనవరిలో ఫిన్లాండ్‌లో సౌదీ రాయబారిగా నిస్రీన్ బింట్ హమద్ అల్-షిబెల్ నియమితులయ్యారు. రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ముందు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)