'రష్యా ఒక పవిత్ర యుద్ధం చేస్తోంద'న్న ఉత్తర కొరియా అధ్యక్షుడు... కిమ్, పుతిన్ భేటీతో అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కులు తప్పవా?

ఫొటో సోర్స్, SPUTNIK/REUTERS
- రచయిత, స్టీవ్ రోజన్‌బర్గ్, జీన్ మెకంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌పై రష్యా దాడికి నేటితో 567 రోజులు గడిచాయి. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన రైలులో రష్యా చేరుకొని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.
రష్యాలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌లో పుతిన్, కిమ్‌లు కలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు నేతలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పుతిన్ ఈ స్థలాన్ని కిమ్‌కు చూపించారు.
ఉపగ్రహాల నిర్మాణంలో ఉత్తర కొరియాకు రష్యా సహాయపడుతుందా? అని పుతిన్‌ను అడగగా, అందుకే మేం వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌కు వచ్చామని పుతిన్ సమాధానం చెప్పారు.
పుతిన్, కిమ్‌లతో పాటు ఇరు దేశాల ఉన్నతాధికారుల బృందం కూడా అక్కడికి చేరుకుంది.
ఇరు దేశాల మధ్య ఆయుధాల విషయంలో ఏదైనా ఒప్పందం జరుగుతుందా? అని అడగినప్పుడు, మేం ప్రతీ అంశంపై చర్చిస్తామని పుతిన్ అన్నారు.
నేతలిద్దరూ చర్చలకు ముందు విలేఖరులతో మాట్లాడారు. కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చల్లో ఆర్థిక, మానవతా అంశాలపై దృష్టి సారిస్తామని పుతిన్ చెప్పారు. అదే సమయంలో ఒక అనువాదకుడి సహాయంతో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు.
"రష్యా ఒక పవిత్ర యుద్ధం చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్, రష్యా నాయకత్వ నిర్ణయాలకు మేం ఎల్లప్పుడూ మద్దతిస్తూనే ఉంటాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటంలో మేం కలిసే ఉంటాం’’ అని కిమ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, PAVEL BYRKIN/SPUTNIK/KREMLIN POOL/EPA-EFE/REX/SHUTTERSTOCK
రష్యా-ఉత్తర కొరియా సంబంధాలు
రష్యాతో సంబంధాలే తమ దేశానికి మొదటి ప్రాధాన్యం అని కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు.
‘‘రష్యా-ఉత్తర కొరియా సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇక నుంచి విదేశాంగ విధానంలో ఈ అంశాన్నే తొలి ప్రాధాన్యంగా మారుస్తామని’’ కిమ్ అన్నారు.
అంతకుముందు, వోస్టోచ్నీ సందర్శకుల పుస్తకంలో కిమ్ తన వ్యాఖ్యను రాశారు. "మొదటగా అంతరిక్షాన్ని జయించిన వారికి జన్మనిచ్చిన రష్యన్ మహిళ ఎప్పటికీ అమరురాలు" అని ఆ పుస్తకంలో కిమ్ రాశారు.
కాస్మోడ్రోమ్‌కు తన ప్రత్యేక రైలులోనే కిమ్ జోంగ్ ఉన్ చేరుకున్నారు.
ఆకుపచ్చ రంగులో పసుపు చారలతో ఉన్న ఈ ప్రత్యేక రైలుకు కాస్మోడ్రోమ్‌లోకి వెళ్లడానికి అనుమతించారు.
రైలు అక్కడికి చేరుకోగానే కిమ్ జోంగ్ ఉన్ కిందకు దిగడానికి ప్రత్యేక మెట్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కిమ్ కిందకు దిగారు.
కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఆయనతో ఉన్నారు. కిమ్ పర్యటన చిత్రాలు రష్యన్ మీడియాలో ప్రచురితం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, SPUTNIK/REUTERS
చారిత్రక పర్యటన
కిమ్ రష్యా పర్యటన చరిత్రాత్మకం. యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాకు దూరమైన వేళ, కిమ్ బహిరంగంగానే పుతిన్‌కు దగ్గరవుతున్నారు.
అయితే ఇది వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే కాదు. దీనికి బలమైన భౌగోళిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి.
మరో అతిపెద్ద కారణం ఏమిటంటే, ఈ రెండు దేశాల పరస్పర ప్రయోజనాలు. ఈ రెండు దేశాల వద్ద ఒక దేశానికి అవసరమైనవి ఇంకో దేశం వద్ద ఉన్నాయి.
ఉదాహరణకు యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యాకు ఉత్తర కొరియా ఫిరంగులు, మందుగుండు సామగ్రిని, ఇతర ఆయుధాలను అందించగలదు.
ఉత్తర కొరియా చాలా ఏళ్లుగా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. దాని సరిహద్దుల్లో కఠిన పహారా ఉంటుంది. దీంతో ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది.
ఇదే కాకుండా చమురు, నగదు కొరతను కూడా ఉత్తర కొరియా ఎదుర్కొంటోంది. అణు కార్యక్రమాన్ని మరింత మెరుగపర్చుకోవడం కోసం కూడా రష్యా నుంచి ఉత్తరకొరియా సహాయాన్ని కోరవచ్చు.

ఫొటో సోర్స్, SPUTNIK/REUTERS
అంతర్జాతీయ ఆంక్షలు
ఈ ఇద్దరు నేతలు దగ్గరవడానికి రెండో పెద్ద కారణం ఏంటంటే, వారిద్దరికీ ఒకే ‘శత్రువు’ ఉండటం. పాశ్చాత్య దేశాలను, అమెరికాను వీరిద్దరూ తమ శత్రువులుగా పరిగణిస్తారు.
ఉత్తర కొరియా, రష్యా దేశాలు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఒక రకంగా ఈ రెండు దేశాలు అంతర్జాతీయ ప్రపంచంలో ఒంటరిగా మారాయి.
యుక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలకు రష్యా మరింత దూరమైంది. యుద్ధాని కంటే ముందే పశ్చిమ దేశాలకు, రష్యాకు మధ్య దూరం మొదలైంది.
2019లో కిమ్ జోంగ్ ఉన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ ప్రపంచం నుంచి ఒక రకంగా ఉత్తర కొరియా బహిష్కరణకు గురైంది.

ఫొటో సోర్స్, SPUTNIK/MIKHAIL METZEL/KREMLIN VIA REUTERS
ఆసియాలో అమెరికా ఉనికి
అమెరికా గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియాకు దగ్గరవుతోంది. ఆసియాలో తన సైనిక ఉనికిని పెంచుకుంటోంది.
ఇదంతా ఉత్తర కొరియాకు మింగుడు పడని విషయం.
రష్యా, ఉత్తరకొరియా దగ్గరవడానికి మూడో కారణం చైనా.
నిజానికి పాశ్చాత్య ఆంక్షల తర్వాత చైనాకు దగ్గరవ్వడం రష్యాకు తప్పనిసరిగా మారింది.
అదే సమయంలో ఉత్తర కొరియా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. చైనా మినహా అంతర్జాతీయ ప్రపంచంలో ఉత్తర కొరియాకు మంచి స్నేహితులు లేరు.
చైనాపై ఉత్తర కొరియా ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే, చైనాపై అతిగా ఆధారపడటం ఉత్తర కొరియాకు అంత సౌకర్యంగా లేదు.

ఫొటో సోర్స్, SPUTNIK/MIKHAIL METZEL/KREMLIN VIA REUTERS
ఒకరి కంటే ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండటం ఎప్పుడూ మంచిదే.
ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరవచ్చని తమ భేటీకి ముందు పుతిన్, కిమ్‌లు సంకేతాలు ఇచ్చారు.
వాటి మధ్య ఒప్పందాలు కుదురుతాయో లేదో. కానీ, ఈ భేటీ ద్వారా రష్యా ఇప్పుడు తన స్నేహితులను ఎంపిక చేసుకుంటుందని, రష్యా నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని అమెరికాకు పుతిన్ సందేశం ఇస్తున్నారు.
అదే సమయంలో ఈ సమావేశం ద్వారా, అమెరికాకు దగ్గరవొద్దని దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా సందేశాన్ని ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి పారిపోయిన ‘డేంజరస్ కిల్లర్’
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














