తల్లిదండ్రులు కన్నబిడ్డల మధ్య వివక్ష చూపిస్తారా?

పేరెంటింగ్

ఫొటో సోర్స్, EMMANUEL LAFONT

    • రచయిత, ఫాతిమా ఫహ్రీన్
    • హోదా, బీబీసీ కోసం

‘‘మా అమ్మ నాన్నకు నేనంటే ఇష్టం లేదు. మా అక్క, అన్న అంటేనే చాలా ఇష్టం’’ అని మీ కుటుంబంలోని, స్నేహితులకు చెందిన లేదా ఇరుగుపొరుగు పిల్లలు అనడం మీరు వినే ఉంటారు.

ఒకరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న చాలా కుటుంబాల్లో లేదా ఇళ్లల్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తుంటాయి.

దిల్లీలో నివసించే 26 ఏళ్ల రష్మీ (పేరు మార్చాం) ఈ అంశం గురించి బీబీసీతో మాట్లాడారు.

‘‘మా తల్లిదండ్రులకు మేం ఐదుగురు సంతానం. మా అమ్మనాన్నకు మేమంటే ఇష్టమే. కానీ, అందరికంటే మా సోదరుడు సాహిల్ అంటే వారికి ఎక్కువ ఇష్టం. మా అందర్నీ కొడతారు, తిడతారు. కానీ, సాహిల్‌ను కనీసం కోపంగా చూసే ధైర్యం కూడా చేయరు. ఏ విషయంలోనూ సాహిల్‌ ఎప్పుడూ రాజీ పడాల్సిన అవసరమే రాలేదు’’ అని రష్మీ చెప్పారు.

దీనికి కారణం ఏంటని అడగగా రష్మీ ఇలా చెప్పారు.

‘‘చిన్నతనంలో సాహిల్ ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యేవాడు. ఇప్పటికీ ఆయనను బలహీనంగా పరిగణించడానికి ఇదే కారణం. అందుకే ఇంట్లో తీసుకునే ప్రతీ నిర్ణయంలో సాహిల్ అభిప్రాయాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు’’ అని రష్మీ తెలిపారు.

పట్నాలో నివసించే 45 ఏళ్ల సర్వర్ కూడా తన చిన్ననాటి అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

‘‘నాతో పాటు మా మరో ఇద్దరు సోదరులు చదువులో అంతంతమాత్రమే. కానీ, మా మధ్య సోదరుడికి మాత్రం చదువు తప్ప మరో ప్రపంచమే లేదు. ఎప్పుడూ పుస్తకాల్లోనే మునిగిపోయేవాడు. అందుకే అతను అంటే మా అమ్మనాన్నకు చాలా ఇష్టం. అన్ని విషయాల్లో అతని అభిప్రాయం తీసుకోవడం, అతను తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తుల వరకు ప్రతీ అంశంపై మా అమ్మనాన్నలు చాలా శ్రద్ధ వహించేవారు. నాతో పాటు మా ఇతర సోదరులకు ఈ అంశంపై చాలా కోపం వస్తుండేది’’ అని సర్వర్ వివరించారు.

పేరెంటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఒకే బిడ్డపై అధిక ప్రేమ

ఒకే బిడ్డపై అధిక ప్రేమ కురిపిస్తున్నారనే విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ, ఒకే బిడ్డ వైపు తల్లిదండ్రులు మొగ్గడం అత్యంత సాధారణ అంశమని ఒక పరిశోధన చెబుతోంది.

కానీ, ఇలా చేయడం కుటుంబంలో భేదాభిప్రాయాలకు దారి తీయడమే కాకుండా, ఒక్కోసారి ఇది ప్రమాదకరం కావొచ్చు. దీని ప్రభావం చాలా కాలం వరకు ఉండొచ్చు.

దాదాపు 65 శాతం కుటుంబాల్లో ఇలాంటి వైఖరి కనిపిస్తుంది. అనేక విభిన్న సంస్కృతులు, దేశాల్లో దీనిపై అధ్యయనం చేశారు.

పిల్లల్లో అనేక మానసిక సమస్యలకు ఇది ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించారు.

ఈ రకమైన వైఖరిని ‘‘పేరంటల్ డిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్’’ అని సైకాలజిస్టులు పిలుస్తారు. దీన్ని సూక్ష్మంగా ‘‘పీడీటీ’’ అని కూడా అంటారు.

పేరెంటింగ్

ఫొటో సోర్స్, EMMANUEL LAFONT

పిల్లలపై ప్రభావం

అమెరికాలోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ లారీ క్రెమర్ మాట్లాడుతూ, ‘‘తమ కంటే తమ అన్ననో లేదా చెల్లినో తమ తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడతారనేది చాలామంది పిల్లలకు ఉండే భావన’’ అని అన్నారు.

చాలాసార్లు ఒకే కుటుంబంలోని పిల్లల అనుభవాలు వేర్వేరుగా ఉంటాయి. కొంతమంది పిల్లలకు ఈ విషయం అర్థం అవుతుంది. కొంతమంది పిల్లలు ఈ విషయాన్ని గ్రహించలేరు.

కానీ, తమ కంటే తమ సోదరుడినో లేదా సోదరినో తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిపై ఇది చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. జీవితాంతం ఈ ప్రభావం వారిపై ఉండొచ్చు.

తల్లిదండ్రులు తమ పట్ల ప్రేమగా లేరని భావించే పిల్లలకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. వారు యాంగ్జైటీ, డిప్రెషన్‌కు బాధితులుగా మారతారు. కొన్నిసార్లు వారి ప్రవర్తన చాలా ప్రమాదకరంగా మారుతుంది.

పేరెంటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?

చిన్నతనంలో తల్లిదండ్రుల వివక్షకు గురైన పిల్లలు యవ్వనంలో మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారతారని చైనా శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో కనుగొన్నారు. వివక్ష వల్ల కలిగే ప్రభావాల్లో ఇదొకటని వారు చెప్పారు.

తల్లిదండ్రుల వివక్ష వైఖరి జీవితాంతం పిల్లల్లో సంబంధాలను దెబ్బతీయవచ్చు.

ఈ అంశం గురించి ముగ్గురు నిపుణులతో బీబీసీ మాట్లాడింది. వారిలో ఒకరు డాక్టర్ సమీర్ మల్హోత్రా. సాకేత్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రలో మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్‌కు ఆయన డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

‘‘కొన్నిసార్లు పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ధ్యాస అంతా అనారోగ్యానికి గురైన బిడ్డపైనే ఉంటుంది. హాస్టల్లో ఉంటూ చాలా రోజులకు ఇంటికి వచ్చిన బిడ్డపై కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమను చూపించడం మొదలుపెడతారు. అప్పుడు తమను పట్టించుకోవడం లేదని తామంటే ఇష్టం లేదని మిగతా పిల్లలు భావిస్తారు. కానీ, తల్లిదండ్రులకు పిల్లలంతా ఒకటే’’ అని సమీర్ చెప్పారు.

చాలా సందర్భాల్లో ఇది పిల్లల మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుందని సమీర్ అన్నారు.

‘‘ఒకవేళ ఒక బిడ్డ అల్లరి ఎక్కువగా చేస్తూ, మరోబిడ్డ మంచి నడవడికతో ఉంటే తల్లిదండ్రులు ఎక్కువగా మంచి నడవడి ఉన్న చిన్నారిని ఉదాహరణగా చూపిస్తుంటారు. పిల్లల హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులు కోపంలో ఏదైనా మాట అంటే అది పిల్లల హృదయంలో ముద్రించుకుపోతుంది’’ అని ఆయన వివరించారు.

పేరెంటింగ్

ఫొటో సోర్స్, Getty Images

వివక్షకు గురైన పిల్లల్లో దుష్ప్రభావాలు

డాక్టర్ సమీర్ మల్హోత్రా చెప్పినదాని ప్రకారం,

  • ఆత్మన్యూనతకు గురికావడం
  • నిద్రమాత్రలకు బానిస అవుతామనే భయం
  • త్వరగా కోపం తెచ్చుకోవడం
  • చిరాకుగా ఉండటం
  • అల్లరి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించడం
  • డిప్రెషన్, యాంగ్జైటీకి గురికావడం
  • స్వయం హానికి ప్రయత్నించడం

దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పనిచేసిన సైకాలజిస్ట్ డాక్టర్ షేక్ బషీర్ మాట్లాడుతూ, ‘‘భారత్ ఒక పితృస్వామ్య సమాజం. భారత్‌లో తల్లిదండ్రులు, పిల్లల పట్ల చూపే వివక్షకు పెద్ద కారణం లింగ భేదం. చాలా ఇళ్లలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు చాలా తక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. చదువు నుంచి ప్రతీ అంశం వరకు ఈ లింగ వివక్ష కనిపిస్తుంది’’ అని అన్నారు.

అయితే, కొన్ని ఇళ్లలో పైన చెప్పుకున్నదానికి చాలా విరుద్ధ పరిస్థితులు ఉంటాయి. ఆ ఇళ్లలో తల్లిదండ్రులకు ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టముంటుందని డాక్టర్ షేక్ చెప్పారు.

వివక్షకు గల ఇతర కారణాల గురించి ప్రస్తావించారు.

‘‘పిల్లల మధ్య అంతరం తక్కువగా ఉండటం మూలానా తోబుట్టువుల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు తామంతా సమానం అనే భావన పిల్లల్లో ఉంటుంది. అలాంటప్పుడు తనపై తల్లిదండ్రులు ఎందుకు తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని పిల్లలు అనుకుంటారు’’ అని డాక్టర్ షేక్ చెప్పారు.

భారత్‌లో చర్మం రంగు కూడా పక్షపాతానికి ఒక కారణంగా ఉంటుంది.

ఒకవేళ ఒక బిడ్డ నల్లగా, మరో బిడ్డ తెల్లగా ఉంటే... రంగు కారణంగా ఒక బిడ్డకు తక్కువ ప్రాధాన్యత, మరో బిడ్డకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు.

డాక్టర్ షేక్ చెప్పినదాని ప్రకారం, తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడే బిడ్డ భవిష్యత్‌లో అనేక సమస్యలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

‘‘పిల్లలు ఎప్పుడూ ప్రశంసలు వింటూ వాటికి అలవాటు పడతారు. భవిష్యత్‌లో ప్రశంసలు పొందకపోతే వారిలో దుష్ఫలితాలు కనిపిస్తాయి. ఇది వారి వ్యక్తిగత, వృత్తిగత, ప్రేమ, వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది’’ అని అన్నారు.

పేరెంటింగ్

ఫొటో సోర్స్, Getty Images

తల్లిదండ్రుల పాత్ర

కుటుంబంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని ప్రొఫెసర్ లారీ క్రెమర్ అన్నారు.

తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని పిల్లల్లో ఒకరు భావిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ తల్లిదండ్రులు చేయాల్సిన పని ఆ బిడ్డతో మాట్లాడటం అని లారీ క్రెమర్ చెప్పారు.

‘‘అలా ఎప్పటికీ జరుగదని, తమకు పిల్లలంతా ఇష్టమేనంటూ బిడ్డకు నమ్మకం కలిగించేలా మాట్లాడాలి. ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతున్న మరో బిడ్డకు ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే, ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందో వారికి వివరించి చెప్పాలి.

పిల్లలతో మాట్లాడటం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని’’ ప్రొఫెసర్ క్రెమర్ అన్నారు.

పేరెంట్స్ ఎడ్యుకేషన్‌పై పని చేస్తున్న రిద్వీ దేవ్రా ఈ అంశం గురించి మాట్లాడుతూ, ‘‘మీ సోదరున్ని/సోదరిని చూసి నేర్చుకో అంటూ ఎప్పుడూ పిల్లలతో అనకూడదు’’ అని అన్నారు.

తోబుట్టువుల మధ్య గట్టి బంధం ఏర్పడటంలో తల్లిదండ్రులే కీలక పాత్ర పోషిస్తారని రిద్వీ చెప్పారు.

‘‘ప్రతీ బిడ్డ ప్రత్యేకమనే విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇతర పిల్లలతో ఎప్పుడూ వారిని పోల్చకూడదు’’ అని రిద్వీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)