'నా రొమ్ముల మధ్య ముఖం పెట్టాడు'.. ఆపరేషన్ థియేటర్లలో సీనియర్ల లైంగిక వేధింపులకు బలవుతున్న మహిళా సర్జన్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లఘర్, నటాలీ ట్రూస్వెల్, జొనథన్ సంబర్గ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆపరేషన్ థియేటర్లలో తమపై పురుష వైద్యులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని మహిళా సర్జన్లు ఆరోపిస్తున్నారు.
బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఉద్యోగులపై చేసిన అధ్యయనంలో మహిళా వైద్యులకు సహోద్యోగుల నుంచి లైంగిక దాడులు ఎదురవుతున్నాయని తెలిసింది.
ఆపరేషన్ థియేటర్లలో శస్త్ర చికిత్సల సమయంలో లైంగిక దాడులకు గురైన మహిళా వైద్యులతో బీబీసీ మాట్లాడింది.
బ్రిటన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ ఆసుపత్రుల్లో సీనియర్ పురుష వైద్యుల నుంచి మహిళా ట్రైనీలు లైంగిక దాడులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన వాళ్లు చెబుతున్నారు.
ఇది చాలా ఆందోళనకరమని ‘ద రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’ పేర్కొంది.
శస్త్ర చికిత్సల సమయంలో లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, రేప్ వంటివి జరగడం ఒక బహిరంగ రహస్యమని ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేసేవారు చెప్తున్నారు.
తమకు ఎదురైన అనుభవాలను బయటకు చెప్పకుండా భరిస్తున్న మహిళా వైద్యులు చాలా మంది ఉన్నారు.
‘శస్త్ర చికిత్సల సమయంలో పురుష వైద్యులు మహిళల రొమ్ములనే చూస్తూ ఉండటం, గట్టిపడిన పురుషాంగాన్ని మహిళల వెనుక భాగంలో తాకించడం వంటివి చేస్తున్నారు. సెక్స్‌కు ఒప్పుకుంటే కెరీర్‌లో మంచి అవకాశాలు ఇచ్చిన ఘటనలూ ఉన్నాయి’ అని ఈ అధ్యయనంలో కొందరు చెప్పారు.
యూనివర్సిటీ ఆఫ్ ఎగ్జిటర్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే, వర్కింగ్ పార్టీ ఆఫ్ సెక్సువల్ మిస్‌కాండక్ట్ ఇన్ సర్జరీ లాంటి సంస్థలు నిర్వహించిన విశ్లేషణలను బీబీసీకి అందించారు.
మూడింట రెండొంతుల మంది మహిళా సర్జన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు.
మూడింట ఒక శాతం మంది బాధితులు తమపై సహోద్యోగులు లైంగిక దాడులకు పాల్పడినట్టు చెప్పారు.
ఇదంతా గత ఐదేళ్లలో జరిగినట్లు అధ్యయనం చెబుతోంది.
అయితే, కెరీర్ దెబ్బతింటుందనే భయంతోనే వాళ్లు ఈ విషయాలపైన ఫిర్యాదులు చేయట్లేదు. అలానే వీటిపైన ఎన్‌హెచ్ఎస్ సరైన విధంగా చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కూడా వారికి లేదని సర్వేలో తేలింది.

ఫొటో సోర్స్, CREDIT: JONATHAN SUMBERG
నా క్లీవేజ్ మీద అతని ముఖం ఎందుకు?
స్వేచ్ఛగా మాట్లాడాలంటే భయంగా ఉంటుందని చెబుతున్నారు జుడిత్. ఆమె తన గుర్తింపు పూర్తిగా తెలియకుండా పేరులో మొదటి భాగాన్ని మాత్రమే ఉపయోగించాలని మమ్మల్ని కోరారు. అనుభవమున్న, నైపుణ్యం కలిగిన కన్సల్టెంట్ సర్జన్లలో ఆమె ఒకరు.
కెరీర్ తొలినాళ్లలో ఆమె లైంగిక దాడులను ఎదుర్కొన్నానని, అప్పుడు ఆపరేషన్ థియేటర్లో తాను జూనియర్‌ని అని చెప్పారు.
‘ఒక రోజు నా తోటి సీనియర్ పురుష సర్జన్‌కు చెమటలు పడుతున్నాయి. వెంటనే అతను నా వైపు తిరిగి నా రొమ్ములపై తల ఆన్చాడు. తన ముఖంతో నా రొమ్ములను రుద్దుతున్నాడు. నా క్లీవేజ్‌పై అతడి ముఖం ఎందుకు పెట్టాడో అర్థం కాక ఒక్కసారిగా బిగుసుకుపోయాను’’ అని చెప్పారామె.
రెండోసారి కూడా అతను అలా చేసినపుడు, టవల్ తీసుకురమ్మంటారా అని అడిగానని.. దానికి అతడు టవల్ కంటే ఇదే బాగుందని వెటకారంగా సమాధాననిచ్చాడని జుడిత్ చెప్పారు.
‘’చాలా అసహ్యంగా అనిపించింది, అవమానంగా అనిపించింది,’’ అన్నారు.
ఈ విషయంలో మిగిలిన వారు మౌనంగా ఉండడాన్ని మరింత దారుణమైన విషయంగా జుడిత్ భావించారు.
‘’ఆపరేషన్ థియోటర్లో అతను అందరికన్నా సీనియర్ కాదు. కానీ మహిళల పట్ల అలాంటి ప్రవర్తనతో ఏం ఫర్వాలేదన్న భావన అతనిలో ఉంది. అది చాలా దారుణమైన, అసహ్యకరమైన పని వాతావరణం,’’ అని జుడిత్ అన్నారు.
ఈ ఘటన ఆపరేషన్ థియేటర్‌లో జరిగింది. కానీ లైంగిక వేధింపులు, లైంగిక దూషణలు ఆసుపత్రిలో ప్రతిచోటా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేను అతన్ని ఆపలేకపోయాను..
ఆనీ.. కొన్ని కారణాల వల్ల మేం ఆమె అసలు పేరు చెప్పడం లేదు. ఆమె బీబీసీతో మాట్లాడాలి అనుకున్నారు. ఎందుకంటే బయటికొచ్చి మాట్లాడితేనే మార్పు వస్తుందని ఆమె నమ్ముతున్నారు.
తనపై జరిగిన రేప్ గురించి ఆమె వివరించాలని అనుకోవట్లేదు. కానీ, ఆమె అంగీకారం లేకుండా సెక్స్ జరిగిందనేది నిజం. ఒక మెడికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జరిగిన సోషల్ ఈవెంట్‌లో ఒకే విభాగానికి చెందిన వైద్యుల సమావేశం జరిగింది.
ఆ సమయంలో ఆమె ట్రైనీగా, అతను కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
నేను అతన్ని నమ్మాను. అవసరమైతే అతని సాయం అడిగేదాన్ని అని ఆమె చెప్పారు.
తన నమ్మకాన్ని అతను వాడుకున్నాడు. అక్కడ ఇతర సహోద్యోగుల గురించి తనకు పెద్దగా తెలీదని, వాళ్లను నమ్మలేకపోయానని ఆమె చెబుతున్నారు.
‘’ నా వెనకే నేను ఉంటున్న చోటుకు వచ్చాడు. ఏదైనా మాట్లాడాలేమో అనుకున్నా. వెంటనే నా వైపు తిరిగి సెక్స్ చేయడం మొదలుపెట్టాడు’’
‘ఆ సమయంలో నా శరీరం బిగుసుకుపోయింది. నేను అతడిని ఆపలేకపోయాను’ అని ఆమె చెప్పారు.
‘’నేనెప్పుడూ అలా అనుకోలేదు. నేను అది కోరుకోలేదు. అది ఊహించని విధంగా జరిగిపోయింది.’’
తర్వాత రోజు అతన్ని చూసినపుడు, ‘’నేను ఎప్పటిలా ఉండలేకపోయాను’’
‘’నేను దానిని రాద్దాంతం చేయాలనుకోలేదు. మనకు ఏం జరిగినా సహించడం తప్ప వేరే మార్గం లేదనే బలమైన సంస్కృతి అక్కడ ఉందనిపించింది.''
ఈ ఘటన ఆమెపై చాలా ప్రభావం చూపింది. ఆమెలో భావోద్వేగ స్తబ్దత ఏర్పడింది. కొన్నేళ్లు గడిచిన తర్వాత ‘’గతం గుర్తుకొస్తూ పీడకలలా నన్ను వెంటాడింది.’’ పని చేసేటపుడు, రోగికి ఆపరేషన్ చేసేటపుడు కూడా అవన్నీ గుర్తుకొచ్చేవి.

ఫొటో సోర్స్, Getty Images
సర్జన్లలో దెబ్బతిన్న ఆత్మవిశ్వాసం
ఇలాంటి వాటిపై మౌనంగా ఉండిపోవడమే మంచిదనే పరిస్థితి అక్కడ ఉంది. ఆపరేషన్ థియేటర్లలో సర్జికల్ ట్రైనింగ్ సీనియర్ వైద్యులపైనే ఆధారపడి ఉంటుంది.
పైగా అధికారం ఉన్న బలవంతుల గురించి బయటకి మాట్లాడితే ట్రైనీల కెరీర్‌కే ప్రమాదకరమని కొందరు మహిళలు చెబుతున్నారు.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీలో పబ్లిష్ అయిన నివేదికలో, మొదటిసారిగా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసే ప్రయత్నం చేశారు.
రిజిస్టర్డ్ మహిళా సర్జన్లు, పురుష సర్జన్లను ఇందులో వేర్వేరుగా పాల్గొనాలని కోరారు. వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచారు. ఇందులో 1,434 మంది పాల్గొన్నారు. వారిలో సగం మంది మహిళలు.
- వారిలో 63 శాతం మంది మహిళలు సహోద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు.
- 30 శాతం మంది మహిళలు తోటి ఉద్యోగుల లైంగిక దాడికి గురయ్యారు.
- కెరీర్ అవకాశాలను కారణంగా చూపుతూ బలవంతపు శారీరక సంబంధాలు పెట్టుకునేలా చేశారని 11 శాతం మంది మహిళలు తెలిపారు.
- దాదాపుగా 11 రేప్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
- 90 శాతం మంది మహిళలు, 81 శాతం మంది పురుషులు లైంగిక వేధింపులకు సాక్ష్యంగా ఉన్నారు.
మగవాళ్లపైనా లైంగిక వేధింపులు
అయితే మగవారు కూడా వేధింపులకు గురైన ఘటనలున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.
24 శాతం మంది మగవారిపై కూడా లైంగిక వేధింపులు చోటుచేసుకున్నాయి. మహిళలు, పురుషుల పరిస్థితి వేర్వేరుగా ఉందని నివేదిక పేర్కొంది.
‘’మేము తెలుసుకున్న విషయాలు సర్జన్లపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి’’ అన్నారు ఎగ్జిటర్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ బిగెని.
వైద్యసేవల రంగంలో లైంగిక వేధింపుల సమస్యకు పరిష్కారం కోసం ఏం చేయాలో 'బ్రేకింగ్ ద సైలెన్స్' పేరిట విడుదల చేసిన రెండో నివేదికలో కొన్ని సూచనలు చేశారు.
ఈ రెండు నివేదికల్లోనూ తెలిసిన విషయమేంటంటే, సర్జరీ వ్యవస్థలో పురుష సర్జన్లకు కీలక అధికారాలు ఉన్నాయని, దీని వలన మితిమీరిన ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో మహిళా సర్జన్లు పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలాంటి మహిళలు దాదాపుగా 28 శాతం ఉన్నారు.
‘’ఇది కొందరు దారుణంగా ప్రవర్తించేలా చేస్తోంది. ఇక్కడ వాటిని పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు’’ అని యూనివర్సిటీ ఆఫ్ సర్రేలో కన్సల్టెంట్ సర్జన్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ కార్రీ న్యూలాండ్స్ అన్నారు. ఆమె జూనియర్ల నుంచి ఇటువంటి అనుభావాలను విన్న తర్వాత లైంగిక వైధింపులపై పోరాడాలని నిర్ణయించుకున్నారు.
ఒక జూనియర్ మహిళా ట్రైనీ తన సీనియర్ నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలే వీటిలో ఎక్కువగా ఉంటున్నాయని ఆమె బీబీసీతో చెప్పారు. వేధింపులకు పాల్పడిన వాళ్లే దాదాపు సూపర్‌వైజర్లు కూడా అని ఆమె అన్నారు.
‘’ఇది మౌనంగా భరించే సంస్కృతికి దారి తీస్తుంది. ఎందుకంటే, వీటి గురించి బయటకి మాట్లాడే ముందు అందరూ వాళ్ల భవిష్యత్తు, కెరీర్ గురించి భయపడతారు.’’

ఫొటో సోర్స్, Getty Images
నమ్మకం లేకపోవడమూ కారణం
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్, ది జనరల్ మెడికల్ కౌన్సిల్, ద రాయల్ కాలేజ్ లాంటి సంస్థలపై నమ్మకం లేకపోవడం.
బ్రిటన్‌లో రిజిస్టరైన వైద్యులను ప్రాక్టీస్ చేసుకోవడానికి జనరల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిస్తుంది.
‘’దర్యాప్తు పద్దతుల్లో భారీగా మార్పులు చేయాలి. అప్పుడే అవి పైన సంస్థలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జరుగుతాయి. అప్పుడే పని చేసుకునేందుకు ఆరోగ్య సేవల రంగం సురక్షితమనే నమ్మకం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ న్యూలాండ్స్
బయటకొచ్చిన విషయాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయని ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రెసిడెంట్ టిమ్ మిచెల్ అన్నారు. అవి తీవ్ర విచారానికి గురి చేస్తున్నాయన్నారు.
ఇటువంటి అసహ్యకరమైన ప్రవర్తనతో జీవితాలు నాశనమయ్యాయని, ఆపరేషన్ థియేటర్లలోనైనా, ఎన్‌హెచ్ఎస్‌లో కానీ మరెక్కడైనా సరే ఇటువంటి ప్రవర్తనకు చోటు లేదన్నారు.
‘’మా అధికారుల్లో అటువంటి ప్రవర్తనను సహించేది లేదు'' అన్నారు మిచెల్.
''ఆ నివేదిక చదవడానికే కష్టంగా ఉంది. అందులో స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆసుపత్రులను అందరికీ సురక్షితమైన ప్రదేశాలుగా మార్చే చర్యలు అవసరమని నివేదిక చెబుతోంది'' ఎన్‌హెచ్ఎస్ ఇంగ్లండ్‌కు చెందిన డాక్టర్ బింతా సుల్తాన్.
‘’ఆ దిశగా ఇప్పటికే కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నాం, మరింత సహకారం అందేలా చూస్తున్నాం, వేధింపులకు గురైన బాధితులు ఫిర్యాదులు చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.
గత నెలలో వైద్యుల వృత్తిపరమైన ప్రమాణాలకు సంబంధించి ద జనరల్ మెడికల్ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది.
''రోగులు, సహోద్యోగులపై లైంగిక వేధింపులను అంగీకరించేది లేదు. ఇలాంటి తీవ్రమైన ఘటనలకు పాల్పడిన వైద్యులు బ్రిటన్‌లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులవుతారు'' అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ చార్లీ మాస్సే చెప్పారు.
కానీ, ఇప్పటికీ ఆపరేషన్ థియేటర్లు మహిళలు పని చేయడానికి సురక్షితంగా ఉన్నాయా?
‘’ప్రతీసారీ సురక్షితమని చెప్పలేం. అది అంగీకరించాల్సిన ఒక దారుణమైన విషయం’’అన్నారు జుడిత్.
ఇవి కూడా చదవండి:
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
- IPC 498: గృహహింస చట్టాన్నిమహిళలు దుర్వినియోగం చేస్తూ 'లీగల్ టెర్రర్' సృష్టిస్తున్నారా?
- వివాహం: సహజీవనంలో ఉండే మహిళకు చట్టంలో రక్షణ ఉండదా?
- చంద్రబాబు అరెస్ట్: జైళ్లలో ‘వీఐపీ’ కేటగిరీ ఉంటుందా, ఖైదీలకు నంబర్ ఎలా కేటాయిస్తారు?
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే, శరీరాన్ని ఏం చేస్తారు?










