పాత సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చెత్త కాదు, లక్షల కోట్ల సంపద... ఎలాగో తెలుసా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ రిపోర్టర్
మీకు ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయా? ఇంకా ల్యాప్‌టాప్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులున్నాయా?
సాధారణంగా వాటిలో ఒకటి, లేదంటే రెండు వస్తువులను మీరు వాడుతుంటారు. మిగిలినవి ఇంట్లో అలంకారప్రాయంగా పడి ఉండేవే.
వాటిలో కొన్ని ఉపయోగపడే స్థితిలో ఉండొచ్చు. మరికొన్ని పాడైపోయి ఉండొచ్చు.
అలా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ-వేస్ట్‌గా భావిస్తున్నారా? అయితే, ఇటీవల జరిగిన అధ్యయనంలో గుర్తించిన విషయాలు తెలిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకోవాల్సిందే.
అవి దేశంలోని గొప్ప సంపద అని ఆ అధ్యయనం చెబుతోంది.
వాడని సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్
ఇటీవల ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ), ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి.
ఈ సర్వే ప్రకారం, దాదాపు 206 మిలియన్లు, అంటే 20 కోట్ల 60 లక్షల విరిగిపోయిన, పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు భారతీయుల ఇళ్లలో పడి ఉన్నాయని తేలింది. వాటిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.
నిజానికి ఇలాంటి వ్యర్థాలే ఎలక్ట్రానిక్ రీ సైక్లింగ్ బిజినెస్‌కి ఆధారం. 2035 నాటికి ఈ రీసైక్లింగ్ బిజినెస్ 20 బిలియన్ డాలర్లకి (దాదాపు లక్షా 66 వేల కోట్ల రూపాయలు) చేరే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
దీని ప్రకారం, ఈ-వేస్ట్ రిఫర్బిషింగ్, రిపేర్ అండ్ రీసేల్ సహా ఆరురకాల ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ బిజినెస్ 2035 నాటికి 7 బిలియన్ డాలర్ల (దాదాపు 58 వేల కోట్ల రూపాయలు) ఆదాయం ఆర్జించగలదని నివేదిక చెబుతోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే 20 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
రీసైక్లింగ్, ఈ వేస్ట్ రీ సెల్లింగ్ బిజినెస్‌లో భారత్ ముందంజలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
''భారత్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతూనే ఉన్నందున, వాటిని రీసైక్లింగ్ చేసి విక్రయించే వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం'' అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అఖిలేశ్ కుమార్ శర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
50 లక్షల మందికి ఉపాధి
భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద రంగంగా ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్ అవతరించనుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, ఈ రంగంలో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
దేశంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు కొదువ లేదు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ రీసైక్లింగ్ బిజినెస్‌లో రాణించేందుకు భారత్‌కు మెరుగైన అవకాశాలున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్‌కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అందువల్ల ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్ మార్కెట్‌లో ప్రపంచ దేశాలకు భారత్ గమ్యస్థానంగా మారే అవకాశం కూడా ఉంది.
''ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ బిజినెస్ ఎగుమతుల వ్యాపారంలో నూతన అవకాశాలను కూడా సృష్టిస్తుంది'' అని హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అజయ్ చౌధురి చెప్పారు.
''భారత్ ఎలక్ట్రానిక్స్ రిపేర్‌లో నిపుణులు ఉన్నారు. అందువల్ల ప్రపంచంలోని వివిధ దేశాలు నుంచి పరికరాలు రిపేర్ కోసం భారత్‌కు వస్తాయి. విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకునేందుకు ఈ బిజినెస్ చక్కటి అవకాశం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఎపిక్ ఫౌండేషన్, సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వీఎల్‌ఎస్‌ఐ సత్య గుప్తా కొన్నేళ్ల కిందట లింక్డ్‌ఇన్‌లో ఒక సర్వే నిర్వహించారు.
అందులో పాల్గొన్న వారి వద్ద సగటున నాలుగు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అవి పనిచేసే స్థితిలో ఉన్నా, వినియోగంలో లేవని తేలింది.
''ప్రతిరోజూ వాడే మొబైల్ ఫోన్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను రిపేర్ చేసి మళ్లీ వాడుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు 30 శాతానికి పైగా మేలు జరుగుతుంది'' అని సత్య గుప్తా చెప్పారు.
''ఒక మొబైల్ ఫోన్‌ని మూడేళ్లు వాడిన తర్వాత చిన్న రిపేర్ వచ్చినా దానిని తీసేసి మరో కొత్త ఫోన్ కొనుక్కుంటున్నాం. అలాకాకుండా దానిని రిపేర్ చేయించి మరో సంవత్సరం వాడుకుంటే 30 శాతం విదేశీ మారకద్రవ్యాన్ని మిగల్చవచ్చు. అది 33 శాతం ఈ వేస్ట్‌ను కూడా తగ్గిస్తుంది.
ఎలాగంటే, ఇప్పటికీ భారత్‌లో వాడుతున్న మొబైల్ ఫోన్లు, వాటి అనుబంధ పరికరాలన్నీ దాదాపుగా దిగుమతి చేసుకుంటున్నవే'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ మారకద్రవ్యం పొదుపు
చమురు, బంగారం తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటోంది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకూ భారత్ దిగుమతుల విలువ 550 బిలియన్ డాలర్లు (దాదాపు 45 లక్షల 63 వేల కోట్ల రూపాయలు). అందులో ఎలక్ట్రానిక్ పరికరాల విలువ 62.7 బిలియన్ డాలర్లు (దాదాపు 5 లక్షల 20 వేల కోట్లు).
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, సహజ వాయువు ధరలు పెరుగుదల భారత విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులు కూడా విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ భారత్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రిపేర్ మార్కెట్ పెరిగితే వాటి దిగుమతులు తగ్గుతాయని, తద్వారా విదేశీ మారక ద్రవ్యం పొదుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొబైల్ ఫోన్లలో 14 విడిభాగాలు ఉంటాయి. వాటిని తయారుచేసేందుకు వినియోగించే లోహాలు అరుదైనవి. ప్రస్తుతం భారత్ ఈ 14 లోహాలను దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ రిపేర్ మార్కెట్ పెరిగితే ఈ లోహాల దిగుమతులు కూడా తగ్గుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
వాడుకుని పడేయడం వర్సెస్ రిపేర్ చేయించుకోవడం
భారత్‌లో పాశ్యాత్య దేశాల మాదిరిగా వాడుకుని పడేసే అలవాటు తక్కువే. ఒక వస్తువును అనేక రకాలుగా, చాలా సార్లు వాడే అలవాటు భారతీయుల్లో అంతర్లీనంగా ఉంటుంది.
ఉదాహరణకు ''ఒక టూత్ బ్రష్‌ను భారత్‌లో చాలా రకాలుగా వాడతారు. మొదట పళ్లు తోముకోవడానికి, ఆ తర్వాత జట్టును ముడివేసుకోవడానికి, స్నానాల గదిని శుభ్రం చేయడానికి కూడా వాడతారు. ఒక వస్తువును సాధ్యమైనంత వరకూ వినియోగించే సంస్కృతి భారతీయుల్లో ఉంది'' అని సత్యా గుప్తా చెప్పారు.
''ఈ రోజుల్లో చాలా మంది దగ్గర నాలుగైదు ల్యాప్‌టాప్‌లు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. వాటిలో ఏవైనా రిపేర్‌కి వస్తే బాగు చేయించి విద్యార్థులకు, లేదంటే తక్కువ ఆదాయ వర్గాలకు అందించడం ద్వారా వాటిని మళ్లీ వినియోగించే వీలుంది. ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయడం, తిరిగి వాటిని వినియోగించే పద్ధతులను అలవాటు చేసుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించొచ్చు'' అని ఆయన అన్నారు.
ఎలక్ట్రానిక్స్ రిపేర్ ఇండస్ట్రీ గురించి అజయ్ చౌధురిని బీబీసీ ప్రశ్నించింది.
''ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో పాశ్యాత్య పోకడలను వదిలేసి, భారతీయ సంస్కృతిని కొనసాగించాలి. రీయూజ్, రీసైక్లింగ్‌పై దృష్టి పెట్టాలి'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందుకోసం భారత్ ఏం చేస్తోంది?
ఎలక్ట్రానిక్ పరికరాల రీసైక్లింగ్ మార్కెట్‌ను పరిగణనలోని తీసుకుని ఎపిక్ ఫౌండేషన్ 'రైట్ టు రిపేర్' పేరిట నివేదికను రూపొందిస్తోంది.
హార్డ్‌వేర్ రంగంలో ఎగుమతి అవకాశాలు విస్తృతంగా ఉన్నందున మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటీ) ద్వారా భారత ప్రభుత్వం ఒక నివేదికను సిద్ధం చేస్తోంది.
''ఈ వ్యవహారాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ(మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎఫైర్స్) పర్యవేక్షిస్తోంది. దీని కోసం మూడు నెలలుగా బెంగళూరులో పనులు జరుగుతున్నాయి'' అని అజయ్ చౌధురి చెప్పారు.
''ఎగుమతులు, దిగుమతుల విభాగం, కస్టమ్స్ విభాగం కూడా దీనిపై పనిచేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్, ఎగుమతి చేసేందుకు కూడా కొత్త నిబంధనలు రూపొందుతున్నాయి'' అని ఆయన వివరించారు.
దేశంలోని ఇంజినీర్లు, టెక్నీషియన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్‌ను సమర్థవంతంగా చేయగలరని భారత ప్రభుత్వం విశ్వసిస్తోంది.
ఈ లాభదాయకమైన రంగం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు ఎగుమతుల మార్కెట్‌ను కూడా సృష్టిస్తుందని చౌధురి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రిపేర్ రంగం భారత్‌లో చాలా వరకూ అసంఘటితంగా ఉందని, దానిని వ్యవస్థీకృతం చేసి సంఘటితంగా మార్చితే మెరుగైన ఫలితాలు ఉంటాయని సత్య గుప్తా చెప్పారు.
అలాగే, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్ల అనుమతులకు సంబంధించి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు రిపేర్ చేసేందుకు అనుమతులు పొందవచ్చు.
గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, వ్యవసాయ సంబంధిత పరికరాలను రిపేర్ చేసేందుకు అనుమతులు ఇస్తోంది.
ఇప్పటి వరకూ 17 కంపెనీలు ఇలా అనుమతులు పొందాయి. వాటిలో యాపిల్, శాంసంగ్, రియల్‌మీ, ఒప్పో, హెచ్‌పీ, బోట్, పానాసోనిక్, ఎల్జీ, కెంట్, హావెల్స్ వంటి కంపెనీలున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














