జీ 20: మోదీ ఇంటికి వస్తున్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్... చైనా దూకుడుతో ఇద్దరి మధ్యా పెరుగుతున్న స్నేహం

Modi, Biden

ఫొటో సోర్స్, REUTERS

ప్రపంచంలోని బడా ఆర్థిక వ్యవస్థలను నడుపుతున్న నేతలు జీ20 సదస్సు సందర్భంగా భారత్ చేరుకుంటున్నారు.

భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

ప్రపంచంలోని శక్తిమంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం దిల్లీ చేరుకుంటున్నారు.

శుక్రవారం రాత్రి అమెరికా అధ్యక్షుడి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు.

విందు సమయంలో ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగబోతోంది.

శుక్రవారం మధ్యాహ్నం మోదీ చేసిన ట్వీట్‌లోనూ ఈ ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రస్తావించారు. శుక్రవారం రాత్రి తన ఇంట్లో మూడు ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లతో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటున్నట్లు మోదీ తన ట్వీట్‌తో వెల్లడించారు.

modi

ఫొటో సోర్స్, Getty Images

జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా మోదీ మొత్తంగా 15 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటున్నారు.

మోదీ, బైడెన్‌లు శుద్ధ ఇంధనాలు, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలపైనా మాట్లాడుకునే అవకాశాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

రెండు దేశాల మధ్య వీసాల మంజూరు అంశం కూడా ప్రస్తావనకు రావొచ్చు.

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జో బైడెన్ తొలిసారి భారత్ వస్తుండడంతో ఆయన రాకకు, మోదీతో ద్వైపాక్షిక సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

‘ఈ ఏడాది జీ20 సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నందుకు భారత్‌కు అభినందనలు, భారత్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ విజయవంతం చేయడానికి కట్టుబడి ఉన్నాం’ అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

biden

ఫొటో సోర్స్, Getty Images

ఎంక్యూ9బీ డ్రోన్ల కోసం..

భారత్ బయలుదేరడానికి ముందు బైడెన్ ‘జీ20 సమావేశాలలో పాల్గొనేందుకు భారత్ వెళ్తున్నాను’ అన్నారు.

కాగా మోదీ, బైడెన్‌లు ఈ రోజు సమావేశం కావడానికి ముందే భారత్ ఎంక్యూ9బీ డ్రోన్ల కోసం అమెరికాను కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

రెండు దేశాల మధ్య ఈ ఏడాది చివరి నాటికి ఈ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం జరిగే అవకాశాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. 31 ‘హంటర్ కిల్లర్’ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ కొనుగోలుకు భారత రక్షణ శాఖ నుంచి అమెరికాకు లేఖ పంపారని ఆ కథనంలో రాశారు.

ధర, ఇతర విషయాలపై అమెరికా ఒకట్రెండు నెలల్లో భారత్‌కు సమాచారం ఇవ్వనుందని ఆ కథనంలో రాశారు.

జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

మోదీ, బైడెన్ సమావేశంపై అమెరికన్ మీడియాలో చర్చ

కాగా, మోదీ-బైడెన్‌ల ద్వైపాక్షిక సమావేశంపై అమెరికా మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఈ అంశంపై కథనం రాసింది. 2021 నుంచి మోదీ, బైడెన్‌లు ఇప్పటివరకు ప్రత్యక్షంగా, వర్చువల్‌గా డజన్ సార్లకు పైగా సమావేశమయ్యారని ఆ కథనంలో రాసింది.

రెండు దేశాలకూ సంబంధించిన కొన్ని ఉమ్మడి అంశాలుండడంతో ఇద్దరి మధ్యా స్నేహం పెరుగుతోందని ఆ కథనంలో పేర్కొన్నారు.

‘రోజురోజుకూ చైనా దూకుడు పెరుగుతుండడంపై మోదీ, బైడెన్‌లు మాట్లాడుకోవచ్చు. అలాగే వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ సప్లయ్ చైన్ తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు రావొచ్చు’ అని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.

బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

బైడెన్ మధ్యేవాద వామపక్ష ప్రజాస్వామ్యవాద నేత కాగా మోదీ సంప్రదాయ హిందూ జాతీయవాద నేత. ఇద్దరు నేతల మధ్య భావజాలపరంగా సారూప్యతలు చాలా తక్కువ.

కానీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు కారణంగా బైడెన్, మోదీల మధ్య సహకారం బాగా పెరిగింది.

అయితే, జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనుక వస్తే బైడెన్ ఆయనతో సమావేశం కావొచ్చని ఊహించారు. కానీ, జిన్‌పింగ్ ఈ సమావేశాలకు హాజరుకావడం లేదు. దీంతో జిన్‌పింగ్ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని బైడెన్ కూడా అన్నారు.

భారత్ పర్యటన ముగిసిన తరువాత ఆదివారం రాత్రికి బెడైన్ దిల్లీ నుంచి వియత్నాం వెళ్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)