కిమ్ జోంగ్ ఉన్ బుల్లెట్ ప్రూఫ్ రైలు ప్రత్యేకతలేంటి, ఇంకా ఆయన వాడే విలాస వాహనాలు ఎన్ని?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను కలిసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బుల్లెట్‌ప్రూఫ్ రైలులో రష్యా తీరప్రాంత నగరం వ్లాదివొస్టోక్‌కు బయలుదేరి వెళ్లినట్లు ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ తెలిపింది.
కిమ్ తన విదేశీ ప్రయాణాలకు ఉపయోగించే అత్యంత భద్రత ఉన్న రైలు ఆదివారం అంటే సెప్టెంబర్ 10 మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్ నుంచి బయలుదేరినట్లు పేర్కొంది.
మంగళవారం ఉదయం ఈ రైలు రష్యా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. రాబోయే రోజుల్లో కిమ్ రష్యాలో పర్యటిస్తారని ఇంతకు ముందే క్రెమ్లిన్ కూడా ధ్రువీకరించింది.
ఉత్తర కొరియా నాయకులు సంప్రదాయంగా కొనసాగిస్తున్న రైలు ప్రయాణాన్నే కిమ్ కూడా అనుసరిస్తున్నారు. నిదానంగే ప్రయాణించే ఈ రైలులో సుమారు 1,180 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కిమ్ 20 గంటలకు పైగా సమయం ప్రయాణంలోనే వెచ్చించనున్నారు.
భారీ సాయుధ రక్షణ ఏర్పాట్లు ఉన్న ఈ రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
ఈ వేగాన్ని పోల్చిచూస్తే, లండన్‌లోని హై స్పీడ్ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగం, జపాన్ షింకన్సేన్ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి.
అయితే ఉత్తర కొరియా పురాతన రైలు నెట్‌వర్క్ కారణంగా ప్రయాణానికి అధిక సమయం పడుతుంది.
ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలును తయాంఘొ (Taeyangho) అని పిలుస్తారు. అంటే కొరియన్ భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.
రైలులో సుదూర ప్రయాణం చేసే సంప్రదాయాన్ని దేశ వ్యవస్థాపకుడు కింగ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్ మొదలుపెట్టారు. ఆయన సొంత రైలులో వియత్నాం, తూర్పు యూరప్ ప్రయాణించారు.
ఈ విలాసవంతమైన రైలులో భారీ ఆయుధాలతోపాటు, భద్రతా ఏజెంట్లు ఉంటారు. వీరు రైలు ప్రయాణించే మార్గాన్ని ఎప్పటికప్పుడూ తనిఖీ చేసుకుంటూ ఎలాంటి బాంబు దాడులు జరగకుండా నిఘా ఉంచుతారు.

ఫొటో సోర్స్, Getty Images
కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌కు విమాన ప్రయాణాలంటే భయం. అందుకే ప్రయాణానికి రైలు మార్గాలనే ఎంచుకునేవారు.
2001లో రష్యా అధ్యక్షులు పుతిన్‌ను కలుసుకునేందుకు మాస్కోకు 10 రోజుల పాటు రైలులోనే కిమ్ జోంగ్ ఇల్ ప్రయాణించారు.
ఆ సమయంలో ఆయనతో పాటు ప్రయాణం చేసిన రష్యన్ మిలటరీ కమాండర్ కొంటాస్టిన్ పులికొవస్కీ తన అనుభవాలపై రాసిన ‘ఓరియంట్ ఎక్స్ ప్రెస్’ పుస్తకంలో రైలు ప్రయాణం గురించి ప్రస్తావించారు.
“రైలులో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఫుడ్ గురించి చెప్పాలంటే రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచ్ వంటకాలలో వేటినైనా అందిస్తారు. పుతిన్ ప్రైవేట్ రైలులో కూడా కిమ్ జోంగ్ ఇల్ రైలులో ఉన్నన్ని సౌకర్యాలు లేవు’’ అని అన్నారు.
రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కిమ్ జోంగ్ ఇల్ మృతి చెందినట్లు ఉత్తర కొరియా స్టేట్ మీడియా వెల్లడించింది. ఆ తర్వాత కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టారు.
2009లో దక్షిణ కొరియా పత్రిక చోసున్ ఇల్బో లో ఈ రైలుపై ఒక కథనం ప్రచురితమైంది. ఇందులో 90 గదులు ఉన్నాయని, ఇది ఆకుపచ్చ, పసుపు రంగు గీతలతో ఉంటుందని పేర్కొంది. కాన్ఫరెన్స్ గదులు, ఆడియన్స్ ఛాంబర్స్, పడక గదులతోపాటు, బ్రీఫింగ్ కోసం శాటిలైట్ ఫోన్లు, టీవీలు కూడా ఏర్పాటు చేశారు.
కిమ్ జోంగ్ ఉన్‌కు విమాన ప్రయాణంపై ఎలాంటి భయాలూ లేవు. చివరిసారిగా 2019లో పుతిన్ కలుసుకున్న సమయంలో కూడా రష్యాకు రైలు మార్గంలోనే వచ్చారు. రష్యన్ అధికారులు సంప్రదాయాన్ని అనుసరించి కిమ్‌కు బ్రెడ్, ఉప్పుతో ఆహ్వానం పలికారు.
కిమ్ రైలు ప్రయాణం ప్యాంగ్యాంగ్ నుంచి మొదలై రష్యా సరిహద్దు దగ్గర ఉన్న టుమాన్ గ్యాంగ్ మీదుగా రష్యాలోకి ప్రవేశిస్తుంది. అక్కడే రైలు ట్రాక్ మార్చుకుని రష్యా ట్రాక్‌పై తన ప్రయాణం మొదలుపెట్టడానికి కనీసం 2 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు సమయం పడుతుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు..
ఉత్తర కొరియా ప్రజల జీవన శైలికి భిన్నంగా కిమ్ విలాసవంతమైన రైలు ప్రయాణమే కాకుండా ఇతర వాహనాల్లో కూడా ప్రయాణించారు. స్విట్జర్లాండ్ బోర్డింగ్ స్కూల్‌లో విద్యను అభ్యసించిన సమయం నుంచి కిమ్‌కు విమాన ప్రయాణం కొత్తేమీ కాదు.
మే 2018లో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి అంతర్జాతీయ విమానంలో ప్రయాణించారు కిమ్. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కలుసుకునేందుకు చైనాలోని దలియన్ నగరానికి విమానంలో చేరుకున్నారు.
కిమ్ తన ఉత్తరకొరియా అంతర్గత పర్యటనల్లో కూడా ప్రత్యేక విమానంలో ప్రయాణించారని మీడియా కథనాలు వచ్చాయి.
కిమ్ చైనాకు వెళ్లేందుకు వినియోగించిన జెట్ విమానం సోవియట్ రూపొందించిన ఇల్యూషిన్-62 (ఇల్-62) . ఉత్తర కొరియా వెబ్ సైట్ NKన్యూస్ లో స్థానిక ప్రజలు ఈ జెట్ ను ‘చమ్మేయ్-1’ గా పిలుస్తారని పేర్కొంది.
తెలుపు రంగులో ఉన్న విమానానికి రెండు వైపులా కొరియా భాషలో ఉత్తర కొరియా అధికారిక పేరు, జాతీయ జెండా కనిపిస్తుంది. విమానం తోక భాగంలో ఎరుపు, నీలం రంగుల వృత్తాల్లో నక్షత్రం గుర్తు ఉంటుంది.
ఈ విమానంలో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. విమానంలో కిమ్ సమావేశాల నిర్వహణ, పని చేసుకుంటున్న ఫొటోలు అప్పుడప్పుడూ బయటకు వస్తుంటాయి.
2018లో దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్స్ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్, అతడి సోదరి కిమ్ యో జోంగ్‌లు ఇదే విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలోనూ ఈ విమానం వార్తల్లో నిలిచింది.
దక్షిణ కొరియా న్యూస్ ఏజెన్సీ యోన్ఫాప్ ఈ విమానం గురించి ప్రస్తావిస్తూ దీని ఐడీ నంబర్ PRK-615గా పేర్కొంది. బహుశా ఇది 2000 జూన్ 15 వ తేదీన ఉత్తర దక్షిణ కొరియా దేశాలు కలిసి ఒప్పందం చేసుకున్న సంయుక్త డిక్లరేషన్ కు గుర్తుగా పెట్టి ఉండొచ్చని పేర్కొంది.
ఈ విమానమే కాకుండా కిమ్ యుక్రెయిన్ అంటోనోవ్-148 (AN-148) విమానంలో ప్రయాణించారు. 2014లో కొరియన్ సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో కిమ్ ఈ విమానం వినియోగిస్తున్నట్లుగా కనిపించారు.
2015లో ఉత్తర కొరియా స్టేట్ మీడియా కిమ్ దేశీయంగా తయారుచేసిన లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో కిమ్ ప్రయాణం, మిలిటరీ విమానం AN-2లో కూర్చున్న దృశ్యాలను కూడా ప్రసారం చేసింది.

ఫొటో సోర్స్, KOREA SUMMIT PRESS POOL
కిమ్‌కు ఇష్టమైన మెర్సిడెజ్ బెంజ్
కిమ్ జోంగ్ ఉన్ 2018 మార్చి పర్యటనలో చైనా రాజధాని బీజింగ్‌కు రైలు మార్గంలో చేరుకున్నాక, నగరంలో పర్యటించేందుకు తన వ్యక్తిగత కారు ఎస్ క్లాస్ మెర్సిడెజ్ బెంజ్ కారునే వినియోగించారు.
రైలులోనే ఈ కారును కూడా తీసుకుని వచ్చారని దక్షిణ కొరియా వార్తపత్రిక జూంగ్ఆంగ్ ఇల్బోలో పేర్కొంది. ఈ కార్ 2010లో తయారు చేశారని, ఇందుకోసం 1.8 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని తెలిపింది. కిమ్‌కు ఎంతో ఇష్టమైన ఎస్ క్లాస్ మోడల్ కారునే వినియోగిస్తున్నారు. 2018లో జరిగిన ఇంటర్ కొరియన్ సమ్మిట్ లో కూడా కిమ్ బాడీగార్డులు వెంటరాగా, ఈ బెంజ్ కారును నడుపుతూ కనిపించారు.
ఈ కాన్వాయ్‌లో ప్రైవేట్ టాయిలెట్ కార్ కూడా కనిపించింది. దీనిపై కిమ్ స్పందించారు. కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కాన్వాయ్‌లో ఉంచినట్లు తెలిపారు.
ఇదే విషయం సియోల్‌కు చెందిన డైలీఎన్కే వెబ్‌సైట్ పేర్కొంది. కిమ్ కాన్వాయ్‌లో ఒక కారులో కిమ్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా టాయిలెట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
మిస్టరీ యాట్ (బోట్)
కిమ్ పలు రకాల బోట్లు, సబ్ మెరైన్, బస్సులు, స్కై లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్న దృశ్యాలను ఉత్తర కొరియా స్టేట్ మీడియా ప్రసారం చేసింది. ఇవే కాకుండా వేరే రవాణా మార్గాలను కూడా వినియోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. అయితే కిమ్ విదేశీ ప్రయాణాల్లో ఇవేమీ కనిపించలేదు.
2013 మే నెలలో కిమ్ ఆర్మీ ఆధీనంలో ఉన్న ఫిషింగ్ స్టేషన్ ను సందర్శించిన సమయంలో తీసిన ఫొటోలో కిమ్ వెనకాల యాట్ (బోట్) కనిపించింది.
దీని గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేకపోయినా, ఈ యాట్ ధర 7 మిలియన్లు వరకు ఉంటుందని, కిమ్ జోంగ్ ఉన్ దీనికి యజమాని అయి ఉండొచ్చని పేర్కొంది.
జూన్ 2015లో వాషింగ్టన్ కు చెందిన ఫ్రీ ఏషియా రేడియాలో ఒక పరిశోధకులు దక్షిణ ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని కిమ్ విల్లా దగ్గర కొత్త హెలీప్యాడ్ ను చూసినట్లు, బహుశా కుటుంబ సభ్యులు, సందర్శకుల కోసం కిమ్ దీనిని ఏర్పాటు చేసి ఉండొచ్చని అన్నారు. ఈయన యూఎస్ కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జోన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- ఆంధ్రప్రదేశ్: ఓ గిరిజన వర్సిటీ రైతులను ఎలా రోడ్డున పడేసిందంటే....
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, జగన్ ఎన్నికల హామీ ఏమైంది?
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














