నిపా వైరస్ కోవిడ్ కంటే ప్రమాదకరం - ఐసీఎంఆర్ హెచ్చరిక

ఫొటో సోర్స్, AFP
నిపా వైరస్ కోవిడ్ మహమ్మారికంటే ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిపా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 70 శాతం ఉంటుందని, కోవిడ్ మరణాల రేటు 3 శాతం లోపే ఉంటుందని వెల్లడించింది.
నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అలర్ట్ ప్రకటించింది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆగస్టు 30వ తేదీన ఒకరు, ఈ నెల మొదట్లో మరొకరు నిపా వైరస్‌తో చనిపోయినట్లు అధికారులు చెప్పారు.
వారి బంధువుల్లో ఇద్దరికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ ఏడాది కేరళలో నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
2018 నుంచి ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు వెలుగు చూడటం ఇది నాలుగోసారి.

ఫొటో సోర్స్, Getty Images
నిపా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, నిపా వైరస్ అనేది జూనోటిక్ అనారోగ్యం. అంటే, జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. నిపా వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మానవులకు వ్యాప్తిస్తుందరి డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
కలుషిత ఆహారం, ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి ద్వారా కూడా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది.
కొన్ని సందర్భాలలో వైరస్ సోకిన వారిలో వైరస్ లక్షణాలు కనిపించవు. కొంతమందిలో మాత్రం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ వైరస్‌కు సరైన చికిత్స, వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం వలన వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వైరస్ లక్షణాలను గుర్తించి, వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
కేరళలో పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృందాన్ని కేరళకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. వైరస్‌ను కట్టడి చేయడంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేస్తామని అన్నారు.
కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ చనిపోయిన ఇద్దరితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంటాక్ట్ అయిన 168 మంది వ్యక్తులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాపించిన కోజికొడ్ జిల్లాలో పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో అనుసరించే ప్రోటోకాల్స్ పై సూచనలు చేసినట్లు తెలిపారు.

వైరస్ మూలంగా చోటుచేసుకున్న మరణాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఆసుపత్రులకు వెళ్లొద్దని సూచించారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇప్పటికే చనిపోయిన వారితో సంబంధం ఉన్న వారందరినీ గుర్తించి, అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
2018లో కోళికోడ్ జిల్లాలో 18 నిపా వైరస్ కేసులు వెలుగుచూస్తే అందులో 17 మరణాలు సంభవించాయి.
2019లో ఎర్నాకులం జిల్లాలో ఒక నిపా వైరస్ కేసు నమోదైంది. అయితే బాధితుడు కోలుకున్నాడు. 2021లో చాతమంగలం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు వైరస్ బారినపడి మరణించాడు.
రాయిటర్స్ సంస్థ మే నెలలో నిపా వైరస్ వ్యాప్తిపై పరిశోధనల వివరాలను ప్రచురించింది. ఉష్ణమండల రాష్ట్రమైన కేరళలో పట్టణీకరణతోపాటు ఇష్టానుసారంగా చెట్లను నరికివేయడం వంటి పరిస్థితులు నిపా వైరస్ లాంటి వైరస్‌లు వ్యాపించడానికి అనువుగా మారాయని తెలిపింది.
అటవీ ప్రాంతం తగ్గిపోవడం వలన జంతువులు ఆవాసాలను కోల్పోయి మానవులకు మరింత దగ్గరగా జీవిస్తున్నాయని, ఇందువల్ల వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి పారిపోయిన ‘డేంజరస్ కిల్లర్’
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














