అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణ... ఈ కేసు ఏంటి?

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో బైడెన్ అధికార దుర్వినియోగానికి సంబంధించి ఇంకా ఆధారాలు లభించలేదు
    • రచయిత, బెర్నాడ్ డేబుస్‌మన్ జూనియర్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చుట్టూ ఉన్న అవినీతి వలయాన్ని వెలికితీసినట్లు పేర్కొంటూ అధ్యక్షునిపై అభిశంసన విచారణకు అధికారికంగా ఆదేశించినట్లు సీనియర్ రిపబ్లికన్ కెవిన్ మెకార్తి ప్రకటించారు.

జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపార లావాదేవీలతో పాటు హంటర్ వ్యాపారాల నుంచి అధ్యక్షుడు లబ్ధి పొందారా అనే కోణంలో ఈ దర్యాప్తు సాగుతుందని చెప్పారు.

రిపబ్లికన్ కమిటీ నెలలుగా విచారణ జరుపుతున్నప్పటికీ బైడెన్ అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలు సంపాదించలేదు. బైడెన్‌పై వస్తోన్న ఆరోపణలను డెమొక్రాట్లు ఖండించారు.

విచారణ కమిటీ దృష్టి సారించే అవకాశం ఉన్న ఆరోపణల గురించి ఇక్కడ చూద్దాం.

హంటర్ బైడెన్

ఫొటో సోర్స్, GETTY IMAGES FOR WORLD FOOD PROGRAM USA

ఫొటో క్యాప్షన్, హంటర్ బైడెన్

1. బైడెన్ కుటుంబానికి విదేశాల నుంచి డబ్బు

చైనా, కజకిస్తాన్, యుక్రెయిన్, రష్యా, రొమేనియా వంటి దేశాల నుంచి బైడెన్ కుటుంబానికి, వారి అసోసియేట్స్‌కు చెల్లింపుల రూపంలో 20 మిలియన్ డాలర్లకు పైగా నగదు అందిందని ‘‘ది హౌస్ ఓవర్సైట్ కమిటీ’’ ఆగస్టులో విడుదల చేసిన మెమొరాండంలో పేర్కొంది.

బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్‌ బ్రాండ్ ఇమేజ్‌ను అమ్ముకొని ఓలిగార్క్‌ల నుంచి హంటర్ బైడెన్ మిలియన్ డాలర్లు పొందారని సరైన ఆధారాలు లేకుండానే కమిటీ చైర్మన్ కెంటకీ రిపబ్లికన్ జేమ్స్ కామర్ వ్యాఖ్యానించారు.

తన కుమారుడికి డబ్బులు పంపించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓలిగార్కులతో కలిసి వాషింగ్టన్ డీసీలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్‌లో జో బైడెన్ విందులో పాల్గొన్నాడని ఆగస్ట్ 9న చేసిన మరో ప్రకటనలో కామర్ వెల్లడించారు.

బ్యాంకు రికార్డుల ఆధారంగా మూడు వేర్వేరు మెమోలను ఈ కమిటీ సంపాదించింది. అయితే, వాటిలో జో బైడెన్‌కు నిర్ధిష్ట చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించడంలో కమిటీ విఫలమైంది. వారి నుంచి నేరుగా బైడెన్ లబ్ధి పొందారనే అధారాలను కూడా కనిపెట్టలేకపోయింది.

ఆగస్టులో వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఒక విశ్లేషణలో కేవలం ఏడు మిలియన్లు మాత్రమే బైడెన్ కుటుంబానికి ముఖ్యంగా బైడెన్ కుమారుడు హంటర్‌కు చేరినట్లు మిగతా మొత్తం వారి అసోసియేట్స్‌కు చేరినట్లు పేర్కొంది. అయితే కామర్‌తో పాటు ఇతర రిపబ్లికన్ చట్టసభ సభ్యులు మాత్రం బైడెన్ కుటుంబానికే 20 మిలియన్ల డాలర్లు చేరాయని ఆరోపించారు.

బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంటర్ బైడెన్‌తో జో బైడెన్

2. బ్రాండ్’ గా జో బైడెన్

జో బైడెన్ 10 ఏళ్ల కాలంలో దాదాపు 20 సార్లు విదేశీ పౌరులతో సహా వ్యాపార భాగస్వాములతో ఫోన్‌లో మాట్లాడారని హంటర్ బైడెన్‌ మాజీ వ్యాపార భాగస్వామి డెవాన్ ఆర్చర్ చెప్పారు

తానెప్పుడూ హంటర్‌తో వ్యాపార లావాదేవీల గురించి చర్చించలేదని జో బైడెన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈ ఫోన్ కాల్స్ డేటా ఉన్నట్లు రిపబ్లికన్లు చెబుతున్నారు.

అయితే, ఆ ఫోన్ కాల్స్ అన్నీ సాధారణ సంభాషణలే అని, వాటిలో హంటర్ బైడెన్ వ్యాపార లావాదేవీల గురించి కనీసం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని డెవాన్ సాక్ష్యమిచ్చారు.

ఆర్చర్ ఇచ్చిన సాక్ష్యం బైడెన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వడంలో విఫలమైందని ‘కాంగ్రెషనల్ ఇంటిగ్రిటీ ప్రాజెక్ట్’ నివేదిక పేర్కొంది.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంటర్ బైడెన్ వ్యాపారా లావాదేవీలు, వాటిలో తండ్రి జో బైడెన్ ప్రమేయం గురించి అనేక వాదనలు ఉన్నాయి

3. లంచం పథకం

హంటర్ బైడెన్ బోర్డ్ సభ్యుడిగా ఉన్న యుక్రెయిన్ గ్యాస్ ఎనర్జీ కంపెనీ బురీస్మాపై కొనసాగుతున్న దర్యాప్తును నిలువరించేందుకు జో బైడెన్ ప్రయత్నించారని ఎఫ్‌బీఐకి వచ్చిన అనధికారిక సమాచారంపై కూడా రిపబ్లికన్లు దృష్టి సారించారు. దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక ప్రముఖ ప్రాసిక్యూటర్‌ను తప్పించాలంటూ యుక్రెయిన్ ప్రభుత్వంపై జో బైడెన్ ఒత్తిడి తెచ్చారని ఎఫ్‌బీఐకి సమాచారం అందింది.

2019లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన సమయంలో ఈ వార్త బయటకు వచ్చింది.

ఎఫ్‌బీఐ డాక్యుమెంట్‌ను సంపాదించిన రిపబ్లికన్ సెనెటర్ చుక్ గ్రాస్లీ జులై నెలలో అందులోని వివరాలను వెల్లడించారు.

జో బైడెన్, హంటర్ బైడెన్‌లకు 5 మిలియన్ డాలర్లు చెల్లించానని బురీస్మా కంపెనీ మాజీ సీఈవో మైకోలా జ్లోకెవస్కీ చెప్పినట్లు ఆ డాక్యుమెంట్‌లో ఉంది.

ట్రంప్ హయాంలో ఈ ఆరోపణలను ఎనిమిది నెలలపాటు దర్యాప్తు చేసిన న్యాయశాఖ సరైన ఆధారాలు లేవని కొట్టివేసింది.

మైకోలా జ్లోకెవస్కీ తర్వాత ఈ వాదనలను తిప్పికొట్టారు. జో బైడెన్‌తో గానీ ఆయన సిబ్బందితో గానీ తానెప్పుడూ సంప్రదింపులు జరుపలేదని.. తనకు, తన కంపెనీకి ఉఫాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బైడెన్ ఎలాంటి సహాయం చేయలేదని చెప్పారు. డెమొక్రాట్ ప్రతినిధి జేమీ రస్కీన్ విడుదల చేసిన ఒక ఇంటర్వ్యూ ట్రాన్స్‌స్క్రిప్ట్‌లో ఇదంతా మైకోలా చెప్పారు.

అలాంటి చెల్లింపుల గురించి తనకూ తెలియదని డెవాన్ ఆర్చర్ కూడా తన సాక్ష్యంలో చెప్పారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, REUTERS

4. న్యాయశాఖ జోక్యం

హంటర్ బైడెన్ పన్ను చెల్లింపులపై ఏళ్లుగా జరిగిన విచారణలో న్యాయశాఖ ఉద్దేశపూర్వకంగానే జోక్యం చేసుకుందని రిపబ్లికన్లు అన్నారు. ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)కు చెందిన ఇద్దరు విజిల్ బ్లోయర్లు ఇచ్చిన సాక్ష్యాలను రిపబ్లికన్లు ఉటంకించారు.

న్యాయశాఖ దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని తగ్గించి, దారులు మూసుకుపోయేలా చేస్తోందని ఈ ఏడాది ప్రారంభంలో ఇచ్చిన వాంగ్మూలంలో ఆ ఇద్దరు విజిల్ బ్లోయర్లు చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్ విచారణలో బైడెన్ తరపున న్యాయ శాఖ వేగంగా పనిచేసిందని, హంటర్ విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్పడానికి విజిల్ బ్లోయర్లు ఇచ్చిన వాంగ్మూలమే ఆధారమని రిపబ్లికన్లు అన్నారు.

అయితే, న్యాయశాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది. రిపబ్లికన్ సభ్యులు పిలిపించిన ఇతర సాక్ష్యులు కూడా జో బైడెన్, అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్ ఎప్పుడూ దర్యాప్తులో జోక్యం చేసుకోలేదని వాంగ్మూలం ఇచ్చారు.

ఐఆర్‌ఎస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ స్పెషల్ ఏజెంట్ గ్యారీ షాప్లీ (ఎడమ), క్రిమినల్ ఇన్వెస్టిగేటర్ జోసెఫ్ జిగ్లర్

బురిస్మా దర్యాప్తులో కుమ్మక్కు

ఇదిలా ఉంటే, అభిశంసన విచారణకు ఆదేశిస్తూ, జో బైడెన్ సిబ్బందికి హంటర్ బైడెన్ బృందానికి మధ్య జరిగిన సమాచార మార్పిడి గురించి కూడా స్పీకర్ మెకార్తీ ప్రస్తావించారు.

బురిస్మా అవినీతికి సంబంధించి మీడియా ప్రశ్నలకు ఇవ్వాల్సిన జవాబుల విషయంలో వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం, హంటర్ బైడెన్‌లు కుమ్మక్కయ్యారని కమిటీ పేర్కొంది. హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది.

బైడెన్ కుటుంబ వ్యాపార సహచరుడు ఎరిక్ స్కెవరిన్ నుంచి 2015లో ఉపాధ్యక్ష కార్యాలయ సిబ్బంది కేట్ బెడింగ్‌ఫీల్డ్‌కు వచ్చిన ఒక మెయిల్ గురించి కమిటీ ఉదహరించింది.

ఆ మెయిల్‌లో బురీస్మా అంశంలో హంటర్ బైడెన్ పాత్రకు సంబంధించి మీడియాతో చెప్పాల్సిన కోట్స్ అనే సందేశం ఉంది అని కమిటీ తెలిపింది.

‘‘ఉపాధ్యక్షుడు బైడెన్ దీనికి ఆమోదించారు’’ అని బెడింగ్‌ఫీల్డ్ ఆ మెయిల్‌కు బదులిచ్చారు.

బురిస్మా వ్యవహారంపై వైట్ హౌస్ అధికార ప్రతినిధి అయాన్ సామ్స్ స్పందిస్తూ, ‘‘సాధ్యపడని సాక్ష్యాల కోసం పన్ను చెల్లింపు దారుల డబ్బును, సమయాన్ని వృథా చేయడానికి రిపబ్లికన్లు నెలల తరబడి చేస్తున్న ప్రయత్నం ఇది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)