పాకిస్తాన్: ఇంధనానికి డబ్బుల్లేక ఆగిపోతున్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ జాతీయ విమానయాన సేవా సంస్థ 'పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)' సంక్షోభంలో కూరుకుపోయింది. పీఐఏ ఎంతగా అప్పుల పాలైందంటే దాని 31 అంతర్జాతీయ విమానాలలో 14 విమానాలు నిలిచిపోయాయి.
గల్ఫ్ దేశాలలో ఇంధనానికి డబ్బులు చెల్లించకపోవడంతో అక్కడి నుంచి పీఐఏ విమానాలు ఎగరలేదు. ఇపుడు అత్యవసర నిధులు అందించకపోతే ఈ జాతీయ విమానయాన సంస్థ ఏ క్షణంలోనైనా మూతపడొచ్చని పీఐఏ డైరెక్టర్ చెప్పారు.
అదే సమయంలో బ్యాంకుల నుంచి ఎయిర్‌లైన్స్‌కి కొన్ని నిధులు సమకూర్చామని, రావడానికి సమయం పడుతుందని పీఐఏ ప్రతినిధి చెప్పారు.
సెప్టెంబర్ మధ్యలో బోయింగ్, ఎయిర్‌బస్ విమానాల విడిభాగాల సరఫరా నిలిచిపోవచ్చని పీఐఏ గతవారమే ప్రకటించింది. పీఐఏ ఈ కంపెనీలకు బకాయిలను చెల్లించకపోవడమే కారణం.
ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కోసం ఇప్పటికే ప్రణాళికను రూపొందించింది. అయితే, ప్రైవేటీకరణ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆర్థిక ఊబిలో చిక్కుకున్న కంపెనీలను ఎవరైనా ఎందుకు కొనుగోలు చేస్తారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇదేసమయంలో పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) విమర్శిస్తోంది.
ఇప్పటికే పాకిస్తాన్ అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
దేశానికి 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25 వేల కోట్ల) బెయిలౌట్ ప్యాకేజీని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆమోదించడంతో ఈ సంవత్సరం డిఫాల్ట్ నుంచి పాకిస్తాన్ గట్టెక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి..
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆరు కంపెనీలకు దాదాపు రూ. 830 కోట్లను వెంటనే చెల్లించాల్సి ఉంది.
అయితే సంస్థ జీతాలు, ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు కూడా చెల్లించలేని స్థితిలో ఉందని పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
బుధవారం పలు దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది పీఐఏ. ఇంతకుముందు ఐదు ఎయిర్‌బస్ A320 జెట్‌ల విమానాలనూ నిలిపివేసింది.
ఇంధన సరఫరా చేయడానికి పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ (పీఎస్‌ఓ)కి ఏవియేషన్ కంపెనీ చెల్లింపులు చేయలేదని జియో న్యూస్ తెలిపింది.
ఇంధనం లేక పీఐఏ పలు విమానాలను రద్దు చేసుకోవల్సి వచ్చింది. వీటిలో కరాచీ-మస్కట్ (ఒమన్ రాజధాని), కరాచీ-ఫైసలాబాద్, ఇస్లామాబాద్-లాహోర్ విమానాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్‌లైన్స్ అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమేంటి?
పీఐఏ అప్పులు పెరగడానికి దాని ఖాతాలను స్తంభింపజేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ 800 కోట్ల రూపాయల మేర పన్ను చెల్లించనందున దాని 13 బ్యాంక్ ఖాతాలను పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్) స్తంభింపజేసినట్లు ఏఆర్‌వై నివేదిక తెలిపింది .
ఆగస్టు నెలలోనే రూ. 2 బిలియన్ల బకాయిలను చెల్లిస్తామని పీఐఏ హామీ ఇచ్చిందని, అయితే అది తన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయిందని ఎఫ్‌బీఆర్ పేర్కొంది.
ఇప్పుడు ఒప్పందం ప్రకారం పీఐఏ ఈ నెలలో రూ. 250 కోట్లు చెల్లించాలి.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ-దుబాయ్‌లో నిలిచిన విమానాలు
ఇంధనానికి డబ్బులు చెల్లించకపోవడంతో దమ్మామ్, దుబాయ్ విమానాశ్రయాలలో పీఐఏ విమానాలను నిలిపివేసినట్లు పాకిస్తాన్ టుడే కథనం పేర్కొంది.
అయితే, PIA నుంచి రాతపూర్వక హామీ రావడంతో ఈ విమానాలు వెళ్లడానికి అనుమతించారు. రూ. 29 కోట్ల అత్యవసర చెల్లింపులను స్వీకరించిన తర్వాత పీఐఏ విమానాలను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పునరుద్ధరించిందని ఒక అధికారి తెలిపారు.
వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని పీఐఏ కోరినట్లు కూడా ఆ కథనంలో రాశారు. లీజుకు తీసుకున్న 13 విమానాలలో ఐదింటిని నిలిపివేస్తున్నట్లు పీఐఏ సెప్టెంబర్ 7న ప్రకటించింది.
ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రభుత్వం నుంచి పీఐఏ రూ. 22 బిలియన్ల అత్యవసర బెయిలౌట్ ప్యాకేజీని కోరింది. అయితే, ఈ ప్రతిపాదనను ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
పీఐఏ ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏం తేల్చింది?
నష్టాల్లో ఉన్న పీఐఏను ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు గత నెలలోనే పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఉన్నత స్థాయి కేబినెట్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ నేతృత్వంలోని కేబినెట్ కమిటీలో దీనిపై చర్చ జరిగింది.
ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని మూడు ప్రధాన విమానాశ్రయాల నిర్వహణను వేరే కంపెనీకి అప్పగించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ విమానాశ్రయాల నిర్వహణ కోసం పాకిస్తాన్ ఖతార్‌తో సంప్రదింపులు జరుపుతోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.
గతవారమే పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్-ఉల్-హక్ కక్కర్ PIA పునర్నిర్మాణంపై చర్చించారు. అయితే, పలువురు నెటిజన్లు పీఐఏ ప్రైవేటీకరణను విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నష్టాల్లో ఉన్న పాకిస్తాన్ స్టీల్ మిల్స్, పీఐఎ, పాకిస్తాన్ రైల్వేలు, పవర్ సెక్టార్ డిస్ట్రిబ్యూషన్ తదితర కంపెనీల (డిస్కోలు) నష్టం ఏడాదికి కనీసం రూ. 300 బిలియన్లని ఒక నెటిజన్ ట్విటర్‌లో రాశారు.
ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కొనుగోలుదారులు వీటిపై ఎందుకు ఆసక్తి చూపుతారో ప్రైవేటీకరణను సమర్థించే వారు వివరించాలని సూచించారు.
"మీరు ఏదో ఒకరోజు లాభపడతారనే ఆశతో నష్టాల్లోని సంస్థను కొంటారా? ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడతారా?" అని ట్విటర్‌లో ప్రశ్నించారు.
PIA ప్రైవేటీకరణ కోసం ఆర్థిక వ్యవహారాల నిపుణుడు నజం అలీ ప్రభుత్వానికి ఒక ప్రణాళికను సూచించారు.
"ప్రభుత్వం 51 శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించి, 49 శాతం వాటాను తన వద్ద ఉంచుకోవాలి (సంస్థ లాభాలు ఆర్జించే వరకు )" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
150 మంది పైలట్ల లైసెన్సులు నకిలీవే..
2020 మే 22న, పీఐఏ ఫ్లైట్ నంబర్ PK-8303 కరాచీలో కూలిపోయింది. ప్రమాదంపై విచారణ నిర్వహించగా అనేక విస్మయకర నిజాలు బయటపడ్డయి.
ఆ సమయంలో 150 మంది పీఐఏ పైలట్ల లైసెన్స్‌లు నకిలీవని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ పార్లమెంటులో ప్రకటించారు.
ఈ నకిలీ లైసెన్సుల వ్యవహారం వెలుగులోకి రావడంతో యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాల్లోని పీఐఏ విమానాల లైసెన్సులను రద్దు చేశారు.
పీఐఏ ఏటా రూ.71 బిలియన్ల నష్టాన్ని చవిచూస్తోందని పాకిస్తాన్ ఆర్థిక, రెవెన్యూ మంత్రి ఇషాక్ దార్ గత నెలలో పార్లమెంట్‌లో ప్రకటించారు.
బ్రిటన్ వెళ్లే విమానాల ద్వారా ఏటా రూ.59 బిలియన్ల ఆదాయం వచ్చేదని, దాదాపు మూడేళ్లుగా అక్కడ వ్యాపారం మూతపడిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
PIAలో అలా ఎందుకు జరిగింది?
డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి పతనం కారణంగా పీఐఏ ఎదుర్కొంటున్న సవాళ్లు పెరిగాయి. అంతేకాకుండా వడ్డీ రేట్లలో అసాధారణ పెరుగుదల కూడా పీఐఏని ఇబ్బందుల్లోకి నెట్టింది.
పాత అప్పులు, వడ్డీల భారం వల్ల ఎయిర్‌లైన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని పీఐఏ సీఈవో ఎయిర్ వైస్ మార్షల్ అమీర్ హయత్ అన్నారు.
ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు రూ. 5,040 కోట్లకు పెరుగుతుందన్నారు.
పీఐఏను వీలైనంత త్వరగా పునర్వ్యవస్థీకరించకుంటే 2030 నాటికి నష్టాలు రెట్టింపు అవుతాయని అమీర్ హెచ్చరించారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం కూడా పీఐఏని ఇబ్బందుల్లోకి నెట్టింది.
అంతేకాదు విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్ల పీఐఏ లక్షల రూపాయల నష్టాన్ని చవిచూసిందని, దీంతో ఏడు విమానాలు దెబ్బతిన్నాయని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.
పీఐఏ చరిత్ర ఏంటి?
భారత్, పాకిస్తాన్‌ల విభజనకు ముందు ఓరియంట్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ అనే ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీ నెలకొల్పారు.
1947లో రంగూన్ (ప్రస్తుతం యాంగాన్) నుంచి కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)కి దీని విమాన సర్వీసులను ప్రారంభించింది.
ప్రారంభంలో కంపెనీకి నైపుణ్యం కలిగిన పైలట్లు, ఇంజనీర్లు లేరు. అయితే, దేశ విభజన తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఓరియంట్ పూర్తిగా ప్రైవేట్ కంపెనీ. అందువల్ల వనరులు, మూలధన కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంది.
అయితే 1951లో పాకిస్తాన్ ప్రభుత్వం 'జాతీయ విమానయాన సంస్థ'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దానిలో ఓరియంట్‌ను విలీనం చేసుకుంది.
దీంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ 1955 జనవరి 10న ఏర్పాటైంది.
ఇవి కూడా చదవండి
- X (ట్విటర్) ఈ దేశ చట్టాలను చిన్నచూపు చూస్తోందని అఫిడవిట్లో ఆరోపించిన కేంద్రం
- ADR రిపోర్ట్: పార్లమెంటు సభ్యుల్లో తెలుగు ఎంపీలే సూపర్ రిచ్... నేర చరిత్రలోనూ మనవారే టాప్
- ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి... బాధితుల్లో చాలా మంది పిల్లలు
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














