భారత్‌ను చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలని, విధానాలను సమీక్షించుకోవాలని ఆ దేశ నెటిజన్లు ఎందుకు అంటున్నారు

భారత్

ఫొటో సోర్స్, PIB

    • రచయిత, శుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్

జీ20 సదస్సులో భాగంగా మే నెలలో కశ్మీర్‌లో భారత్ నిర్వహించిన టూరిజం సమావేశం పాకిస్తాన్ మీడియాతో పాటు అక్కడి సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది.

ఈ సమావేశంపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఈ విషయంపై మాట్లాడారు.

పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌‌ ప్రాంతంలోని ముజఫరాబాద్‌ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ "20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత్ దుర్వినియోగం చేస్తోంది" అని అన్నారు.

భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ప్రపంచం ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

ఆ తర్వాత పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడారు.

భారత్ ఆధీనంలోని కశ్మీర్ పరిస్థితి గురించి పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అయితే, ఆమె వ్యాఖ్యలలో మిగతావారిలా దూకుడు లేదు.

“జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశాల నిర్వహణ ద్వారా ప్రపంచ వేదికపై భారత్ తనను తాను ముఖ్యమైన దేశంగా ప్రపంచానికి చాటాలనుకుంటోంది. అలాంటప్పుడు ఆ దేశం అంతర్జాతీయ మానవ హక్కులను, తన బాధ్యతలను కూడా గౌరవించాలని, జమ్ముకశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలి'' అని ఆమె అన్నారు.

జీ20కి ప్రాధాన్యమివ్వని పాకిస్తాన్ మీడియా

భారతదేశంలో జరిగిన జీ20 సదస్సు గురించి పాక్ మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు.

జీ20కి సంబంధించిన వార్తలు పాకిస్తాన్‌లోని ప్రధాన పత్రికల (ఇంగ్లిష్, ఉర్దూ) మొదటి పేజీల్లో కనిపించలేదు. కానీ, భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మాత్రం పతాక శీర్షికల్లో నిలిచింది.

ఉర్దూ పత్రిక నవా-ఇ-వక్త్ జీ20కి సంబంధించిన వార్తను వెనుక పేజీలో ప్రచురించింది. అయితే, సదస్సుకు సంబంధించిన విషయాలపై కాకుండా కశ్మీరీ సంస్థల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కథనాన్ని ఇచ్చింది.

డైలీ డాన్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ది నేషన్ వంటి ఇతర మీడియా సంస్థలు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీల వార్తలను తమ వెబ్‌సైట్‌లలో ప్రచురించాయి.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సదస్సుకు రాకపోవడం, ప్రధాని మోదీ టేబుల్‌పై భారత్‌ అని ఉన్న నేమ్‌ ప్లేట్‌, సమ్మిట్‌ కోసం దిల్లీలోని మురికివాడలను కవర్ చేయడం వంటి వాటికే పాకిస్తాన్ మీడియా ప్రాధాన్యమిచ్చింది.

భారత్

ఫొటో సోర్స్, PIB

కానీ, సోషల్ మీడియాలో చర్చ

అయితే, ఈ సదస్సు పాకిస్తాన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

భారత్, పాకిస్తాన్‌ను పోలుస్తూ పాక్ నెటిజన్లు తమ దేశ పరిస్థితిపై నిరాశ, నిస్పృహలు వ్యక్తం చేశారు. అసలు ఇప్పటి వరకూ పాకిస్తాన్‌లో ఏం జరిగింది? అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు.

భారత్ ఒకదాని తర్వాత మరొక అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తూ పోతోంది. పాకిస్తాన్ ఎక్కడుంది? అని కొందరు ట్విటర్ యూజర్లు ప్రశ్నించారు.

మరికొందరు రెండు దేశాల చారిత్రక నేపథ్యాలను ప్రస్తావించడంతో పాటు, తమ దేశ దుస్థితికి సైన్యమే కారణమని నిందించారు.

''నవాజ్ భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు రెండుసార్లు ప్రయత్నించారు. వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలనుకున్నారు. పాకిస్తాన్‌ను ప్రాంతీయ, ప్రపంచ వాణిజ్యానికి రవాణా కేంద్రంగా మార్చాలనుకున్నారు. కానీ, రెండుసార్లూ సైన్యం ఆయన్ను అడ్డుకుంది.

1999లో కార్గిల్, 2014-15లో ''మోదీ కా యార్ గద్దార్'' అని ఇమ్రాన్ ఖాన్ ప్రచారం చేశారు. కానీ, భారతీయులు మాత్రం వేగంగా ముందుకు వెళ్తున్నారు'' అని ఒమర్ అజార్ అనే అనలిస్ట్ ట్వీట్ చేశారు.

అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన మాజీ అధికారి హుస్సేన్ హక్కానీ జీ20 సదస్సుపై ప్రచురితమైన కథనంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

''జీ20 నిర్వహణ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై ఇండియాను గ్లోబల్ సౌత్‌కి ప్రతినిధిగా చూపించాలని అనుకున్నారు'' అని ఆయన ట్వీట్ చేశారు.

భారత్

ఫొటో సోర్స్, PIB

''ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను ప్రపంచ వేదిక ముందుంచే ప్రయత్నం చేసింది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ వేగంగా అడుగులేస్తోందన్నారు.

భారత్, మిడిల్ ఈస్ట్‌, యూరప్‌ను కలుపుతూ ప్రతిపాదించిన ఎకనామిక్ కారిడార్ మ్యాప్‌ను ఈ మాజీ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పాకిస్తానీలు తమ గురించి తాము ఆలోచించుకోవాలని, పాకిస్తాన్ అందులో ఎందుకు భాగం కాలేదో ఆలోచించాలని, పాకిస్తాన్ తన విధానాలను సమీక్షించుకోవాలని ఆయన కోరారు.

''ప్రసంగాలు, నినాదాలు, ప్రమాణస్వీకారాల వల్ల ఒరిగేదేం లేదు'' అని ఆయన అన్నారు.

అయితే, హక్కానీ ప్రారంభించిన చర్చను కొంత బ్యాలెన్స్ చేసేలా పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే అకౌంట్ నుంచి మరొకరు స్పందించారు.

''పాకిస్తాన్ ఇప్పుడు తన ముందున్న అవకాశాలపై దృష్టి పెట్టాలి. పాకిస్తాన్ నుంచి ఇరాన్‌కు నేరుగా వెళ్లొచ్చు. అలాగే, సముద్ర మార్గంలో ఒమన్‌కు వెళ్లే అవకాశం కూడా ఉంది. గ్వాదర్ పోర్టు నిర్మాణం కూడా పూర్తయింది. అవన్నీ త్వరలోనే జరగనున్నాయి'' అని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.

భారత్

ఫొటో సోర్స్, PIB

'ఆత్మపరిశీలన చేసుకోవాలి'

జీ20 సదస్సుపై రాజకీయ విశ్లేషకులు ఇంతియాజ్ గుల్ అభిప్రాయాలను పాకిస్తాన్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి ప్రజలు ప్రస్తుతం సొంత సమస్యలతో సతమతమవుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో పాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో టెర్రరిజం సమస్య కూడా ఉంది. అయితే, పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఇంతియాజ్ గుల్ అభిప్రాయపడ్డారు.

'''క్రష్ ఇండియా' భారత్‌ను నాశనం చేయండి అనే నినాదాలు వింటూ పెరిగాం. ఆ దేశాన్ని అవమానించేందుకు ప్రయత్నించాం. ఇప్పుడు చూడండి ఆ దేశం ఎక్కడుందో, మనం ఎక్కడున్నామో'' అని ఇంతియాజ్ అన్నారు.

''ఆత్మ పరిశీలన చేసుకోవాలని అనుకునేవాళ్లు, తమ దేశ పురోగతిని చూడాలనుకునే పాకిస్తానీలు బాధ పడుతున్నారు. అది భారత్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం వల్ల కాదు. పాకిస్తాన్ ఇప్పటికీ దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టడం లేదు. ముందుచూపు లేకపోవడం వల్లే పాకిస్తాన్ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

రఫీవుల్లా, మొహమ్మద్ హుస్సేన్ ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్ - ఇ - అజాం యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై కోర్సు చేస్తున్నారు.

భారత్ నుంచి పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలని వారు అంటున్నారు.

1990లలో పాకిస్తాన్ ఆసియాకు టైగర్ కావాలని కలలు కన్నదని, కానీ ఆ తర్వాత గాడి తప్పిందని వారు బీబీసీతో అన్నారు.

ఐటీ, ఇతర రంగాల్లో భారత్ ఎన్నో పరిశోధనలు చేసిందని, ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)