G 20 - నాగరాజు నాయుడు: జాయింట్ డిక్లరేషన్ కోసం దేశాలను ఏకతాటిపైకి తెచ్చిన తెలుగు అధికారి

Nagaraj Naidu Kakanur

ఫొటో సోర్స్, https://www.un.org/

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ‘దిల్లీ డిక్లరేషన్’కు సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి.

అయితే, యుక్రెయిన్-రష్యా యుద్ధం, వాతావరణ మార్పులు, చైనా-అమెరికా మధ్య పెరుగుతున్న దూరం, శుద్ధ ఇంధనాల విషయంలో చమురు ఉత్పత్తి దేశాలు - కొనుగోలు దేశాల మధ్య భేదాభిప్రాయాలు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ జీ20 సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తేవడమన్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

యుక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో సభ్య దేశాల మధ్య స్పష్టమైన చీలిక ఉన్నా కూడా ఏకాభిప్రాయం సాధ్యమవడానికి భారత అగ్రనాయకత్వం ఎంత కారణమైందో.. తెరవెనుక సుదీర్ఘ చర్చలు జరిపిన కీలక విదేశాంగ అధికారులూ అంతే కారణమయ్యారు.

అందులో ఓ తెలుగు దౌత్యాధికారి పోషించిన పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. ఆయనే కాకనూర్ నాగరాజు నాయుడు.

నాగరాజు నాయుడు

ఫొటో సోర్స్, @NagNaidu08

ఫొటో క్యాప్షన్, నాగరాజు నాయుడు

అదే అతి పెద్ద సవాల్

ఇండియాకు జీ20 అధ్యక్ష బాధ్యతలు వచ్చాక మొత్తం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ఈ విషయం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

నాగరాజు నాయుడు కాకనూర్, ఈనామ్ గంభీర్ సహా దౌత్యాధికారులు 200 గంటల పాటు 300 ద్వైపాక్షిక సమావేశాలలో చర్చించి సాధించిన ఫలితమే ఈ డిక్లరేషన్ అంటూ అమితాబ్ కాంత్.. వారిద్దరితో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.

‘రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తేవడమే జీ20 శిఖరాగ్ర సదస్సులో అత్యంత సంక్లిష్టమైన అంశం. 200 గంటల పాటు నిర్విరామంగా జరిపిన చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్ట్‌ల వల్ల ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో ఇద్దరు చురుకైన అధికారులు నాగరాజు నాయుడు, ఈనామ్ గంభీర్‌లు గొప్ప సహకారం అందించారు’ అంటూ అమితాబ్ కాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఎవరీ నాగరాజు నాయుడు?

నాగరాజు నాయుడు కాకనూర్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఐఎఫ్ఎస్ అధికారి. జీ 20లో జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేశారు.

1998 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఫ్ఎస్ అధికారి కొద్దికాలం కిందట ఐక్యరాజ్య సమితి జనరల్అసెంబ్లీ 76వ సెషన్ అధ్యక్షుడికి ‘చెఫ్ డి కేబినెట్’గా పనిచేశారు.

అంతకుముందు 2019 జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత ఉప ప్రతినిధిగా ఉన్నారు.

చైనా రాజధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో నాలుగు విడతలుగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఈయన చైనీస్ అనర్గళంగా మాట్లాడుతారు.

2013 నుంచి 2015 వరకు చైనాలోని గాంగ్జూలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో కాన్సుల్ జనరల్‌గానూ పనిచేశారు.

2019లో మోదీ న్యూయార్క్ పర్యటన సమయంలో స్వాగతం పలుకుతున్న నాగరాజు నాయుడు

ఫొటో సోర్స్, @NagNaidu08

ఫొటో క్యాప్షన్, 2019లో మోదీ న్యూయార్క్ పర్యటన సమయంలో స్వాగతం పలుకుతున్న నాగరాజు నాయుడు

యూరప్ దేశాల బాధ్యతలు

అనంతరం భారత్‌కు తిరిగొచ్చి దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ‘ఎకనమిక్ డిప్లొమసీ డివిజన్’లో జాయింట్ సెక్రటరీ/డైరెక్టర్ జనరల్

హోదాలో 2017 వరకు పనిచేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ అబ్జర్వర్ స్టేటస్ ఉన్న ‘ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇన్ ఇండియా’ ఏర్పాటులో నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.

అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో బోర్డ్ మెంబర్‌గానూ ఉన్నారు నాగరాజు నాయుడు.

అనంతరం 2017 నుంచి 2018 వరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో యూరప్ వెస్ట్ డివిజన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఇర్లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, మొనాకో, ఆండోరా, సాన్ మారినో, యూరోపియన్ యూనియన్‌లతో ద్వైపాక్షిక రాజకీయ చర్చలకు ఆయనే నేతృత్వం, బాధ్యత వహించేవారు.

ఐరాసలో నాగరాజు నాయుడు

ఫొటో సోర్స్, @NagNaidu08

నిజాం కాలేజీలో విద్యాభ్యాసం

నాయుడు మసాచూసెట్స్‌లోని ‘ది ఫ్లెచర్ స్కూల్ ఎట్ టఫ్స్ యూనివర్సిటీ’లో ‘లా అండ్ డిప్లమసీ, ఇంటర్నేషనల్ బిజినెస్’ మాస్టర్స్ చదివారు.

అంతకుముందు నాగరాజు నాయుడు సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్, నిజామ్ కాలేజీలలో చదువుకున్నారు.

ప్రభుత్వ వ్యవహారాలు, అంతర్జాతీయ దౌత్యం, వ్యూహాత్మక సంప్రదింపులు, చైనా వ్యవహారాలలో నాయుడు నిపుణుడిగా పేరొందారు.

2019లో ఐక్యరాజ్యసమితిలో భారత పర్మినెంట్ మిషన్‌లో పనిచేసిన ఆయన ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సమస్యగా చూపేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టడంతో నాయుడు కీలకంగా పనిచేశారు.

2018లో ఐరాసలో జమ్ముకశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడి భారత్ వైఖరిని బలంగా చెప్పగలిగారు.

కాగా నాగరాజు నాయుడుతో పాటు అమితాబ్ కాంత్ ప్రశంసలు అందుకున్న ఈనామ్ గంభీర్ 2005 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి.

జీ20కి సంబంధించి భారత సీనియర్ దౌత్య బృందంలోని అతికొద్ది మంది మహిళా అధికారులలో ఆమె ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)