G 20: ప్రపంచ నాయకులకు ఆహ్వానం పలికిన ఈ నటరాజ విగ్రహం ప్రత్యేకత ఏమిటి?

నటరాజ విగ్రహం

ఫొటో సోర్స్, SKANDA STHAPATHY

    • రచయిత, సారద వీ
    • హోదా, బీబీసీ తమిళ్

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి విచ్చేసిన ప్రపంచ నాయకులకు ఆహ్వానం పలకడంలో నటరాజ విగ్రహం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

27 అడుగుల ఈ విగ్రహాన్ని తమిళనాడు తంజావూరు స్వామిమలైకు చెందిన ముగ్గురు సోదరులు తయారుచేశారు. జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతీ మైదాన్‌లోని భారత మండపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

ఈ నటరాజ విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, సీసం, జింక్, టిన్, ఇనుము, పాదరసం లాంటి ఎనిమిది లోహాలతో తయారుచేశారు. దీన్ని తమిళ్‌లో అష్టధాతుగా పిలుస్తారు. దీనికి అవసరమైన మట్టిని కావేరీ ఒండ్రు నేల నుంచి సేకరించారు.

చోళుల హయాంలో నిర్మించిన తంజావూర్ దేవాలయంలో నటరాజ విగ్రహాన్ని తయారుచేసిన కుటుంబం వంశీయులే తాజా విగ్రహాన్ని తయారుచేశారు.

నటరాజ విగ్రహం

ఫొటో సోర్స్, SKANDA STHAPATHY

చోళుల కాలంనాటి శిల్ప కళ

దేవసేన స్థపతి కుటుంబం చోళుల కాలం నుంచీ ఇలాంటి శిల్పాలను తయారుచేస్తోంది. ఆయన ముగ్గురు కుమారులు రాధాకృష్ణ స్థపతి, శ్రీకంధ స్థపతి, స్వామినాథ స్థపతి ప్రస్తుత విగ్రహాన్ని తయారుచేశారు.

తంజావూరులోని ప్రధాన దేవాలయం నిర్మాణంలో వీరి పూర్వీకులు పాలుపంచుకున్నారు. మొత్తంగా 34 తరాల నుంచీ ఈ కుటుంబం దేవుడి విగ్రహాలను తయారుచేస్తోంది.

ఈ విగ్రహాన్ని తయారుచేసిన ముగ్గురు సోదరుల తండ్రి దేవసేన స్థపతి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. బ్రిటన్, అమెరికా, మలేసియా, మారిషస్, ఫ్రాన్స్, కెనడా లాంటి చాలా విదేశాలతోపాటు మన దేశంలోనూ ఎన్నో దేవాలయాల కోసం ఆయన విగ్రహాలను తయారుచేశారు.

మరోవైపు ఆసక్తి ఉండేవారికి విగ్రహాల తయారీలో ఈ కుటుంబం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోంది. స్వామిమలైలో ప్రస్తుతం ఇలాంటి శిల్పులు 600 మంది వరకూ ఉంటారు.

నటరాజ విగ్రహం

ఫొటో సోర్స్, SKANDA STHAPTHY

కావేరీ మట్టితో విగ్రహం

స్వామిమలై విగ్రహాల్లో ప్రత్యేకత ఏమిటంటే వీటి తయారీలో ఉపయోగించే మట్టే. కావేరీ నదీ పరివాహక ప్రాంతంలోని ఒక ప్రత్యేకమైన చోట లభించే ఒండ్రు మట్టిని మాత్రమే వీటిలో ఉపయోగిస్తారు.

స్వామిమలైకు చెందిన పంచలోహ విగ్రహాలకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు కూడా ఉంది.

‘‘తంజావూరులోని కావేరీ నది మలుపు తిరిగేచోట మాత్రమే ఆ మట్టి లభిస్తుంది. స్వామిమలైలో తయారుచేసే విగ్రహాలన్నింటిలోనూ ఆ మట్టే ఉపయోగిస్తారు. జీ20 సదస్సు కోసం తయారుచేసిన విగ్రహం కూడా దీనికి మినహాయింపేమీ కాదు’’ అని శ్రీంకధ స్థపతి బీబీసీతో చెప్పారు.

‘‘ఇక్కడి నుంచి రెండు కి.మీ. ముందుకు వెళ్తే మళ్లీ ఆ మట్టి మీకు దొరకదు. మేం ఈ మట్టిలో ఎలాంటి రసాయనాలూ కలపం’’ అని ఆయన చెప్పారు.

నటరాజ విగ్రహం

ఫొటో సోర్స్, SKANDA STHAPATHY

ఆ నటరాజ విగ్రహం తయారీచేసే అవకాశం అంత తేలిగ్గా తమకు దొరకలేదని, దీని కోసం చాలా కష్టపడ్డామని శ్రీంకధ స్థపతి అన్నారు.

‘‘ఈ విగ్రహం తయారీ కాంట్రాక్టు కోసం సాంస్కృతిక శాఖ పరిధిలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఒక టెండర్‌ను ఆహ్వానించింది. గత ఐదేళ్లలో 300 విగ్రహాలు తయారుచేసినవారే దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని దీనిలో సూచించింది. దీనికి సంబంధించిన జీఎస్‌టీ వివరాలు కూడా సమర్పించాలని పేర్కొంది. అంతేకాదు తయారుచేసిన ఆ 300 విగ్రహాల్లో కనీసం పది విగ్రహాలైనా పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండేవి తయారుచేయాలనే నిబంధన పెట్టారు’’ అని ఆయన అన్నారు.

ఈ కాంట్రాక్టు గెలుచుకునేందుకు చాలా మంది శిల్పులతో ఈ ముగ్గురు సోదరులు పోటీ పడాల్సి వచ్చింది.

‘‘చివరి క్షణం వరకూ ఈ అవకాశం మాకు వస్తుందని మేం అనుకోలేదు’’ అని శ్రీకంధ్ అన్నారు.

ఎట్టకేలకు నిబంధనలన్నీ సరిచూసుకున్నకా స్వామిమలై దేవసేన స్థపతి సన్స్ అండ్ శ్రీజయరామ్ ఇండస్ట్రీస్‌కు ఈ కాంట్రాక్టు వచ్చింది.

నటరాజ విగ్రహం

ఫొటో సోర్స్, SKANDA STHAPATHY

ఎనిమిది లోహాలతో

ఎగ్జిబిషన్‌లలో కనిపించే విగ్రహాలను సాధారణంగా రాగి, ఇత్తడి, తగరంలతో తయారుచేస్తారు. ఈ విగ్రహాల్లో దేవుళ్ల కళ్లు తెరచి ఉంచినట్లు కనిపించవు.

మన ఇంట్లో పూజా మందిరాల్లో ఉపయోగించే విగ్రహాలకు ఈ మూడు లోహాలకు అదనంగా బంగారం, వెండి కూడా కలుపుతుంటారు. ఈ పంచ లోహ విగ్రహాల్లో దేవుడి కళ్లు తెరచి ఉంచినట్లు కనిపిస్తాయి.

అయితే, జీ20 కోసం తయారుచేసిన నటరాజ విగ్రహాన్ని ఎనిమిది లోహాలతో తయారుచేశారు. దీన్నే అష్టధాతుగా చెబుతారు.

‘‘పాదరసం, ఇనుము, జింక్‌లతోపాటు పంచలోహాలను దీనిలో కలిపాం. 15 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని మాయాపుర్‌లో ఇస్కాన్ టెంపుల్‌కు మేం ఇలాంటి విగ్రహాన్నే తయారుచేశాం. ఆ తర్వాత ఇలాంటి విగ్రహాన్ని మరొకటి కూడా తయారుచేశాం’’ అని శ్రీకంధ స్థపతి అన్నారు.

‘‘ఈ విగ్రహాన్ని తయారుచేయడం చాలా కష్టం. ఈ విగ్రహం కోసం 18 టన్నుల లోహాలను మేం కరిగించాం’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రిస్తారా?

ఏడు నెలలపాటు..

27 అడుగుల నటరాజ విగ్రహాన్ని తయారుచేసేందుకు ఏడు నెలల సమయం పట్టింది. వీటిలో మొదటి మూడు నెలలు మైనం విగ్రహాన్ని తయారుచేశారు.

ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారులు పద్మ సుబ్రమణియమ్, సోనాల్ మాన్‌సింగ్‌లు ఈ మైనం విగ్రహాన్ని పరిశీలించి కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత ఆ మార్పులను చేరుస్తూ విగ్రహానికి మెరుగులు దిద్దారు.

తంజావూరులోని ప్రధాన దేవాలయం, చిదంబరం నటరాజ దేవాలయం, కోనేరీరాజపురం దేవాలయాల్లోని నటరాజ విగ్రహాలను జాగ్రత్తగా పరిశీలించి తాజా విగ్రహాన్ని రూపొందించారు.

ఇలాంటి విగ్రహాన్ని తయారుచేసే అవకాశం తమకు లభించడం గొప్ప అవకాశమని తండ్రి దేవసేన స్థపతి, ప్రముఖ కళాకారుడు గణపతి స్థపతి నుంచి ఈ కళ నేర్చుకున్న రాధాకృష్ణ స్థపతి చెప్పారు. కన్యాకుమారి తీరంలో 133 అడుగుల తిరువల్లూరు విగ్రహాన్ని ఆయన తయారుచేశారు.

‘‘అసలు ఇంత తక్కువ సమయంలో ఈ విగ్రహాన్ని తయారుచేయడం ఒక కలలా అనిపిస్తోంది. మొత్తంగా 27 అడుగుల్లో విగ్రహం కాలి నుంచి తల వరకూ 14 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. దీని కోసం మాతోపాటు 32 శిల్పులు కూడా పనిచేశారు’’ అని ఆయన అన్నారు.

రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువచేసే ఈ విగ్రహాన్ని కేవలం పది రోజుల ముందే స్వామిమలై నుంచి దిల్లీకి తీసుకొచ్చారు. 36 టైర్లున్న భారీ ట్రక్కులో ఈ విగ్రహాన్ని తరలించారు.

‘‘ప్రపంచ నాయకులు వచ్చేచోట మా నటరాజ విగ్రహాన్ని పెట్టడమంటే మా కుటుంబం కంటే స్వామిమలై, తమిళనాడుకు ఇది గర్వకారణం లాంటిది’’ అని శ్రీకంధ స్థపతి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)