చంద్రయాన్-3 విజయంతో భారత అంతరిక్ష రంగం విలువ రూ. 82 లక్షల కోట్లకు చేరనుందా?

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా, దిల్లీ

1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిసారి చంద్రుడిపై కాలుమోపి జాబిలిపై అడుగుపెట్టిన తొలి మానవుడిగా నిలిచారు. ''ఇది చిన్న అడుగే కావొచ్చు. కానీ, మానవజాతికి పెద్ద ముందడుగు'' అని ఆయన అన్నారు.

ఆ మాట ప్రపంచ అంతరిక్ష చరిత్రలో దాదాపు ఒక సామెతగా మారిపోయింది.

అది జరిగిన దాదాపు యాభై ఏళ్ల తర్వాత భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 బుధవారం సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది.

ల్యాండర్ విక్రమ్ నుంచి ఏటవాలు నిచ్చెన మీదుగా కిందకు దిగిన రోవర్ ప్రజ్ఞాన్, చంద్రుడి ఉపరితలంపై తన ప్రయాణాన్ని కూడా ప్రారంభించింది.

రోవర్ ప్రజ్ఞాన్ సెకనుకు ఒక సెంటీమీటర్ మాత్రమే ప్రయాణిస్తుంది. అయితే, చంద్రుడి ఉపరితలంపై ఈ చిన్న అడుగు కూడా జియో పాలిటిక్స్ (భౌగోళిక రాజకీయాలు), లూనార్ ఎకానమీకి(చంద్రుడిపై విజయవంతమైన ప్రయోగాల ఫలితాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ) చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలకు తెలుసు.

''భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ కావడం జియో పాలిటిక్స్‌లో ఓ భారీ ముందడుగు'' అని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫారిన్ ఫాలసీ పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అంతరిక్ష పరిశోధనపై మరింత ఫోకస్ పెట్టాయి. అందుకోసం భారీగా నిధులను కూడా ఖర్చు చేస్తున్నాయి.

భారత్, రష్యా, చైనా, అమెరికానే కాకుండా దాదాపు అన్ని దేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి.

అలాంటి సమయంలో, భారత్ మిషన్ చంద్రయాన్ -3 అత్యద్భుత విజయం సాధించడం దక్షిణ ధ్రువం దిశగా మరిన్ని పరిశోధనలకు కొత్త మార్గాలను సృష్టించిందని భావిస్తున్నారు.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

భారత అంతరిక్ష రంగం విలువ 1 ట్రిలియన్ డాలర్లు!

భారత అంతరిక్ష రంగం విలువ రానున్న ఏళ్లలో దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లకు (లక్ష కోట్ల డాలర్లు - అంటే, భారత కరెన్సీలో 82 లక్షల కోట్ల రూపాయలు) చేరనుందని భారత శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) జితేంద్ర సింగ్ ఇప్పటికే అంచనా వేశారు.

చంద్రయాన్ -3 అద్భుత విజయం తర్వాత, భారత్ ఆ లక్ష్యాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

''ఈ విజయం భారతీయ యువతను అంతరిక్ష రంగం వైపు ప్రభావితం చేస్తుంది. దీన్ని ఒక వృత్తిగా స్వీకరించే అవకాశం ఉంది'' అని తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌ స్పేస్ అండ్ జియోపాలిటిక్స్‌‌ విభాగంలో రీసెర్చర్‌గా ఉన్న ఆదిత్య రామనాథన్ అభిప్రాయపడ్డారు.

''చంద్రయాన్ సాధించిన ఈ విజయంతో భారత్ ఇప్పుడు చంద్రుడి చుట్టూ తిరిగే జియో పాలిటిక్స్‌కి కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది'' అని రామనాథన్ రాసిన ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది.

చంద్రుడి ఉపరితలంపై విలువైన ఖనిజాలు, భారీ స్థాయిలో ఇంధన వనరులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా దేశాలు చంద్రుడిపై ప్రయోగాలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో చంద్రయాన్ -3 విజయం భారత్‌ను చెప్పుకోదగ్గ స్థాయిలో నిలబెడుతుందని నమ్ముతున్నారు. అంటే, చంద్రుడి వైపు జరుగుతున్న ప్రపంచ దేశాల అంతర్జాతీయ రేసులో భారత్ ముందువరుసలో ఉన్నట్టే.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు రేసు

చంద్రుడిని చేరుకునేందుకు సోవియట్ యూనియన్, అమెరికా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా సాగిన రేసు ఇప్పుడు మలుపు తిరిగింది. కొత్త రేసు మొదలైంది.

నీటి జాడ, మంచు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొనడంతో ఇప్పడందరి ఫోకస్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై పడింది.

దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా తన మొదటి లునార్ మిషన్‌ను నెల రోజుల కిందట ప్రయోగించింది.

అయితే, ఆగస్టు 20 ఆదివారం నాడు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగాల్సిన రష్యా లునార్ మిషన్ 'హె లునా - 25' విఫలమైంది.

సరిగ్గా మూడు రోజుల తర్వాత భారత్ ప్రయోగించిన చంద్రయాన్ - 3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది.

2025 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములను పంపాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఈ దశాబ్దం చివరి నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములతో ఒక అంతరిక్ష నౌక, వ్యోమగాములు లేకుండా మరో నౌకను పంపించేందుకు చైనా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

వాటితో పాటు, ఇజ్రాయెల్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలు కూడా చంద్రుడిపై ప్రయోగాలపై ఆసక్తి చూపుతున్నాయి. అయితే, అలాంటి ప్రయత్నాలన్నీ మొదటి దశలోనే విఫలమయ్యాయి.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిజంగా నీరు లభ్యమైతే, వాటిని రాకెట్లకు ఇంధనంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలు దక్షిణ ధ్రువం వైపు ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం కూడా అదే.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

చైనాకు భయపడుతున్న అమెరికా

చంద్రుడిపై నీటి జాడ లభిస్తే, అక్కడే ఒక శాశ్వత స్టేషన్ (పర్మినెంట్ బేస్)‌ను నిర్మించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లేదంటే అంగారకుడు (మార్స్), ఇతర ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా అక్కడే స్పేస్ మిషన్ ఏర్పాటే చేయొచ్చనేది వారి ఆశ.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిజంగా నీటి జాడ లభ్యమైతే భవిష్యత్ వ్యోమగాములకు, అంతరిక్ష నౌకలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నాసాకి చెందిన ఉన్నతాధికారి బిల్ నీల్సన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, ఒకవేళ చైనా ముందుగా తన వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధ్రువంపై దింపితే ఆ ప్రాంతం తమదేనని ప్రకటించుకునే అవకాశం ఉందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో అలాంటి పోటీ కూడా నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా 2020లో అర్టెమిస్ అగ్రిమెంట్‌లో భాగస్వామిగా మారింది.

అంతరిక్ష పరిశోధనల్లో నిర్దేశించిన విధానాలను అనుసరించడం, అక్కడి వనరులను సమానంగా వినియోగించుకోవడాన్ని అంగీకరిస్తూ ఈ ఒప్పందంపై పలు దేశాలు సంతకాలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ ఒప్పందంలో భాగమయ్యాయి.

గత జూన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారత్‌ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. కానీ, అంతరిక్ష పరిశోధనల్లో పెద్ద శక్తులుగా ఉన్న చైనా, రష్యా మాత్రం ఇప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.

చంద్రయాన్ - 3 విజయం చంద్రుడిపై ప్రయోగాల్లో పోటీని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా భారత్‌కు కొంత అడ్వాంటేజ్‌ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

అంతరిక్ష రంగంలో భారత్ ముందడుగు

భారత్ మిషన్ చంద్రయాన్ విజయం వల్ల ఆ దేశంతో పాటు, ప్రపంచానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని విల్సన్ సెంటర్‌లోని సౌత్ ఏషియా సెంటర్ డైరెక్టర్ మైక్ కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.

''ఈ అంతరిక్ష పరిశోధన, కమ్యూనికేషన్ అభివృద్ధికి, రిమోట్ సెన్సింగ్, అలాగే పరిశోధనలు మరింత విస్తృతమయ్యేందుకు ఉపయోగపడుతుంది'' అని ఆయన తన ఫారిన్ పాలసీలో రాశారు.

భారత గత అంతరిక్ష పరిశోధనలు భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షించడంలో, ప్రపంచ వాతావరణాన్ని అంచనా వేయడంలో చాలా ఉపయోగపడ్డాయని ఆయన ఉదాహరణలతో సహా ప్రస్తావించారు.

మరీముఖ్యంగా, వాతావరణ మార్పుల(క్లైమేట్ చేంజ్) వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు.

చంద్రయాన్-3 విజయం ప్రపంచ అంతరిక్ష పరిశోధనలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, చాలా కోణాల్లో ఆ ప్రభావం ఉంటుందని భారత్‌కు చెందిన స్ట్రాటజిక్ థింక్ ట్యాంక్ 'అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కి చెందిన డాక్టర్ రాజి రాజగోపాలన్ బీబీసీతో చెప్పారు.

''భారత స్పేస్ టెక్నాలజీ అత్యాధునికంగా అభివృద్ధి చెందిందని ఈ మిషన్ నిరూపిస్తోంది. స్పేస్ రంగంలో చాలా పరిణతి సాధించింది'' అని రాజగోపాలన్ చెప్పారు.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

చంద్రుడిపై హీలియం - 3 నిల్వలు

''భారత్ చాలా తక్కువ ఖర్చుతో విజయవంతంగా మిషన్‌ను పూర్తి చేసింది. అతి తక్కువ ఖర్చుతో, విశ్వసనీయ అంతరిక్ష శక్తిగా భారత్ స్థిరపడుతుంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

అసలు లునార్ ఎకానమీ అంటే ఏంటో కూడా, అంతర్జాతీయ సలహా సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ ఒక నివేదికలో ప్రస్తావించింది.

చంద్రుడిపై అందుబాటులో ఉన్న వనరులను అటు చంద్రుడిపై, ఇటు భూమిపై, అలాగే చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా ఉపయోగించుకోవడం ఆర్థిక వ్యవస్థను సూచిస్తోందని నివేదికలో తెలిపింది.

ఉదాహరణకు, అక్కడ భారీ స్థాయిలో హీలియం -3 నిల్వలు ఉంటే, చంద్రుడిపై రెన్యువబుల్ ఎనర్జీ(పునరుత్పాదక శక్తి)కి ఆ హీలియంలోని ఐసోటోపే ప్రధానం.

అదే భూమి వైపు నుంచి ఆలోచిస్తే, లునార్ ఎకానమీలో ఆ హీలియం చాలా కీలకం.

భవిష్యత్తులో పలు దేశాల మధ్య చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉందని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

ఒకవేళ అదే జరిగితే, తామే మొదట అక్కడకు చేరుకున్నట్లు భారత్ ధీమాగా చెప్పుకునే అవకాశం ఉంటుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, చంద్రయాన్ 3: ప్రజ్ఞాన్ రోవర్‌కు తప్పిన ముప్పు... ప్రయోగ లక్ష్యాలు ఎంతవరకు ఫలించాయి?

ఇవి కూడా చదవండి: