పీఎం విశ్వకర్మ పథకం: 5 శాతం వడ్డీకి రూ.మూడు లక్షల వరకు రుణం.. ఏ వృత్తుల వారు అర్హులంటే..?

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, PMO INDIA

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీసీసీ ప్రతినిధి

సంప్రదాయ కళావృత్తుల వారి కోసం ‘‘పీఎం- విశ్వకర్మ’’ అనే పథకాన్ని అమలు చేయనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు.

ఈ పథకం ఎవరికి వర్తించనుంది? ఎలాంటి లబ్ధి కలుగనుందో తెలుసుకుందాం.

పీఎం- విశ్వకర్మ పథకం అంటే?

ఆగస్టు15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంప్రదాయ వృత్తులు చేసే, పనిముట్లు వాడే, చేతివృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం పీఎం-విశ్వకర్మ పథకం పేరిట 13-15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు.

ఆయన చెప్పినట్లే, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆగస్టు 16న ‘‘పీఎం-విశ్వకర్మ’’ పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది.

ఈ పథకం 2023-24 నుంచి 2027-28 వరకు అయిదేళ్లపాటు అమలులో ఉంటుంది.

విశ్వకర్మ పథకం

ఫొటో సోర్స్, Getty Images

ఈ పథకం ఉద్దేశం ఏంటి?

గురు-శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి దాన్ని పెంపొందించడంతోపాటు సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల ‘కుటుంబ ఆధారిత వృత్తుల’ను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.

చేతిపనుల వారు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానించడం ఈ పథకం వెనుక ఉన్న మరో ఉద్దేశమని ప్రకటించారు.

లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటి?

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద కళాకారులు, చేనేత కార్మికులకు ‘పీఎం విశ్వకర్మ’’ సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు.

అలాగే, తొలి విడతగా లక్ష వరకు, రెండో విడతగా రూ. 2 లక్షల రుణ సహాయాన్ని 5 శాతం వడ్డీతో ఇస్తారు.

విశ్వకర్మ పథకం

ఫొటో సోర్స్, Getty Images

ఏ వృత్తుల వారికి ఇస్తారు?

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతివృత్తులవారికి ఈ పథకం వర్తిస్తుంది.

తొలుత 18 సంప్రదాయ వృత్తులకు ఈ పథకాన్ని అందించనున్నారు. అవేంటంటే... వడ్రంగి(సుతార్), స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు-రాతి పనిచేసేవారు, చెప్పులు తయారు చేసేవారు, మేసన్, తాపీ పని, బుట్టలు-చాపలు-చీపుర్లు-తాళ్లు అల్లేవారు, సంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు, బార్బర్, పూలదండలు చేసేవారు, లాండ్రీ పనివారు, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, సుత్తి-పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు.

విశ్వకర్మ పథకం

ఫొటో సోర్స్, Getty Images

సర్టిఫికెట్, ఐడీ కార్డు కాకుండా కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి?

‘'పీఎం-విశ్వకర్మ’' పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, చేతివృత్తుల వారికి శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బేసిక్, అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.

ట్రైనీలకు రోజుకు రూ. 500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, పారిశ్రామిక పనిముట్ల కొనుగోలు కోసం అవసరమైన వారికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.

ఈ పథకం ద్వారా తొలి ఏడాది 5 లక్షల కుటుంబాలకు, అయిదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.

ఈ పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఎలా దరఖాస్తు చేయాలి?

విశ్వకర్మ జయంతిని సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. కాబట్టి ఆ రోజున ప్రాజెక్టును ప్రారంభించవచ్చు.

ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.