ఆసియా కప్ 2023: ఫైనల్లో భారత్ గెలుస్తుందా.. శ్రీలంక స్పిన్ అటాక్‌ను చిత్తు చేస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విధాన్షు కుమార్
- హోదా, బీబీసీ హిందీ
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడతాయని, ఫైనల్ కచ్చితంగా దాయాది జట్ల మధ్యే ఉంటుందని అటు క్రీడా నిపుణులు, ఇటు క్రికెట్ అభిమానులు భావించారు.
ఇరు జట్లు ఫైనల్స్‌కు చేరి ఉంటే ఇలాగే జరిగేది. మంగళవారం రాత్రి శ్రీలంక జట్టును ఓడించి టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది.
మరోవైపు గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును శ్రీలంక 2 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్‌లోకి ప్రవేశించింది.
దీంతో ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది శ్రీలంక.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్‌లో ఇరు జట్ల రికార్డు ఎలా ఉంది?
ఈ టోర్నీలో శ్రీలంక జట్టు మంచి ఆటతీరు ప్రదర్శించింది. దీంతో ఫైనల్‌లో షనక టీంను టీమిండియా తేలికగా తీసుకోదు.
ఇప్పటివరకు భారత్ 7 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. శ్రీలంక ఆరుసార్లు విజేతగా నిలిచింది. అయితే, ఆసియా కప్ ఫైనల్ చేరడం శ్రీలంకకు ఇది 11వ సారి.
శ్రీలంకలోనే టోర్నీ జరుగుతుండటంతో ఆ జట్టుకు ఇది అదనపు ప్రయోజనం. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రేక్షకులు కూడా మైదానంలో వారిని ఉత్సాహపరుస్తారు.
శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా లోతుగా ఉంది. భారత్‌పై చక్కటి బ్యాటింగ్ చేసిన వెల్లలఘే 8వ స్థానంలో దిగడం దీన్ని రుజువు చేస్తోంది.
లంక జట్టులో కుశాల్ పెరీరా, సమరవీర, అసలంక వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అంతేకాదు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.
టోర్నీలో కుశాల్ మెండిస్ రెండు సార్లు 90కి పైగా, ఒకసారి 50 పరుగులు చేశాడు. గత 4 ఇన్నింగ్స్‌లలో 3 అర్ధసెంచరీలు సాధించాడు. దీంతో అతనిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది.
మంచి కీపింగ్ చేస్తుండటంతో మెండిస్‌లో ఆత్మవిశ్వాసం పెరిగిందని శ్రీలంక మాజీ కెప్టెన్ మార్వన్ ఆటపట్టు అభిప్రాయపడ్డాడు.
ఇతర ఆటగాళ్లతో భాగస్వామ్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలో అతనికి తెలుసని, అతను మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాడని ఆటపట్టు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక బౌలింగ్ ఎలా ఉంది?
శ్రీలంక బౌలింగ్ పరిశీలిస్తే టోర్నీ ప్రారంభంలోనే జట్టు ప్రధాన బౌలర్లు వనిందు హసరంగా, కుమార లహిరు, దుష్మన్ చమీరా గాయాల కారణంగా తప్పుకున్నారు.
ఈ ముగ్గురూ ప్రపంచకప్ వరకు కోలుకుంటారని కెప్టెన్ దసున్ షనక ఆశాభావం వ్యక్తం చేశారు.
టాప్ 3 బౌలర్లు లేనప్పటికీ శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, జట్టును ఫైనల్ చేర్చారని సంజయ్ మంజ్రేకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు శ్రీలంక పేస్ అటాక్‌కు యువ బౌలర్లైన మధుషన్, పతిరనా నాయకత్వం వహిస్తున్నారు. లసిత్ మలింగ వంటి స్లింగ్లింగ్ యాక్షన్ ఉన్న పతిరానా బౌలింగ్‌లో రాటుదేలుతున్నాడు.
అయితే, శ్రీలంక బౌలింగ్ బలం వారి స్పిన్నర్లే. తీక్షణ, అసలంక, వెల్లలాగే, ధనంజయ్ డిసిల్వా రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు ఆ జట్టుకు.
ఫైనల్లో స్పిన్నర్లకు స్వర్గధామమయ్యే పిచ్ సిద్ధం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ బలం ఎవరు?
అయితే ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో శ్రీలంక కప్ గెలవడం అంత తేలికకాదు.
గత 3 ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు కొట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మొత్తంగా 4 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 65 సగటుతో 194 పరుగులు సాధించాడు.
రోహిత్ ఫామ్ చూస్తే మరో భారీ సెంచరీ వచ్చే అవకాశం ఉందని అభిమానుల అంచనా.
మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, పాకిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దూకుడైన ఆటతీరుతో అర్ధశతకం సాధించి, ఫామ్‌లోకి వచ్చాడు.
అదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చేసిన సెంచరీలు భారత బ్యాటింగ్ బలాన్ని చాటాయి.
అంతేకాదు పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లు క్రీజులో నిలిచి భారత లోయరార్డర్ లోతును చాటారు.
బౌలింగ్ పరిశీలిస్తే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత 2 ఇన్నింగ్స్‌లలో 9 వికెట్లతో సత్తా చాటాడు.
పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు ముఖ్యమైన వికెట్లు తీసిన రవీంద్ర జడేజా నుంచి అతనికి మంచి మద్దతు లభించింది.
గాయం నుంచి కోలుకొని, జట్టులోకి వచ్చిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఫామ్ అందుకోవడం భారత జట్టుకు లభించిన అతిపెద్ద ఊరట.

ఫొటో సోర్స్, Getty Images
పిచ్ ఎలా ఉండవచ్చు?
కొలంబోలో మ్యాచ్‌లు జరుగుతున్నందున అక్కడి వికెట్లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా మారుతున్నాయి.
గత భారత్-శ్రీలంక మ్యాచ్‌లో లంక స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు.
స్పిన్నర్లు దునిత్ వెల్లాలగే 5 వికెట్లు తీయగా, చరిత్ అసలంక 4 వికెట్లు తీశాడు. దీంతో టీమిండియాను 213 పరుగులకే కట్టడి చేయగలిగింది లంక జట్టు.
ఇదే పిచ్‌పై కుల్దీప్, జడేజా సత్తా చాటినా మరో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రాణించకపోవడం భారత జట్టుకు ఆందోళన కలిగించేదే.
జడేజా ప్రపంచకప్ జట్టులో ఉన్నప్పుడు అతనిలా బౌలింగ్ చేసే అక్షర్ బదులుగా అశ్విన్ లేదా వాషింగ్టన్ సుందర్ వంటి ఆఫ్ స్పిన్నర్లను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అనిల్ కుంబ్లే అభిప్రాయం వ్యక్తంచేశారు.
అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ప్రేమదాస స్డేడియంలో స్పిన్ పిచ్ ఎదురుకావొచ్చు కాబట్టి, తుది జట్టులో శార్ధూల్ స్థానంలో అక్షర్‌కే అవకాశం దక్కొచ్చు.
శ్రేయాస్ అయ్యర్ ఆడతాడా?
పునరాగమనంలో KL రాహుల్ బ్యాట్‌తోనే కాకుండా కీపర్‌గానూ రాణిస్తుండటం టీమిండియాకు శుభవార్తే.
గత 5 ఇన్నింగ్స్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్, మిడిలార్డర్‌లో కూడా బాగా ఆడగలనని, ఒత్తిడిలో కూడా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు.
వెన్నుపోటు కారణంగా శ్రేయాస్ అయ్యర్‌ను పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతని స్థానంలో రాహుల్‌ని తీసుకున్నారు.
శ్రేయాస్ గత కొంతకాలంగా వన్డేలలో మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఇపుడు అతను కూడా గాయం నుంచి కోలుకోవడం టీమిండియాకు బలమే.
ఇవి కూడా చదవండి:
- మెక్సికో పార్లమెంటులో ‘ఏలియన్స్’.. నాసా ఏం చెప్పిందంటే
- ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి... బాధితుల్లో చాలా మంది పిల్లలు
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














