X (ట్విటర్) ఈ దేశ చట్టాలను చిన్నచూపు చూస్తోందని అఫిడవిట్‌లో ఆరోపించిన కేంద్రం

ఎక్స్ (ట్విటర్)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్స్ సంస్థ భారతీయ చట్టాలను అనుసరించడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
    • రచయిత, ఉమాంగ్ పోద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ నిబంధనలను అలవాటుగా ఉల్లంఘించే సంస్థ అంటూ ఎక్స్ (ట్విటర్)పై కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది.‘‘ఈ దేశపు చట్టాలను ఎక్స్ ఎప్పుడూ అనుసరించదు. చట్టం, న్యాయవ్యవస్థ, అధికార గణాలను చిన్న చూపు చూస్తుంది’’అని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఎక్స్ సంస్థ కర్ణాటక కోర్టులో చేసిన ఓ అప్పీలుపై వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేసింది. ఈ డాక్యుమెంట్‌ను బీబీసీ ప్రత్యేకంగా సంపాదించింది. అయితే, కేంద్రం దాఖలు చేసిన వివరణపై ఎక్స్ సంస్థ స్పందించలేదు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫేస్‌బుక్‌, ట్విటర్ లాంటి సోషల్ మీడియా వేదికలకు భారతదేశంలో ప్రత్యేక సేఫ్‌గార్డ్స్ ఉన్నాయి.

కర్ణాటక హైకోర్టులో కేసు

కొన్ని ట్విటర్ ‌అకౌంట్లను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎక్స్ సంస్థ హైకోర్టులో సవాలు చేయగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే, ఒక ఏడాదిపాటు ఇలా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది.

దీనిపై ఎక్స్ సంస్థ అప్పీలుకు వెళ్లింది.

అయితే, జరిమానా విధించిన మొత్తంలో సగం అంటే రూ.25 లక్షలను ముందుగా చెల్లించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. మిగిలిన మొత్తాన్ని తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

మరోవైపు ఆగస్టు 24న ఎక్స్ సంస్థ చేసిన ఈ అప్పీలును తిరస్కరించాలని ప్రభుత్వం కోర్టులో వాదించింది. కేంద్రం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఈ వారం ఆరంభంలో రాయిటర్స్ వార్తా సంస్థ తొలిసారిగా ప్రచురించింది.

దేశ సార్వభౌమాధికారం, భద్రతను దృష్టిలో ఉంచుకుని, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించే తాము కొన్ని అకౌంట్లపై నిషేధం విధించాల్సిందిగా ఎక్స్ సంస్థను కోరామని ప్రభుత్వం తన వివరణలో పేర్కొంది. కానీ, ఎక్స్ సంస్థ తమ ఆదేశాలను అనేకసార్లు పాటించలేదని, బ్లాక్ చేసిన కొన్ని అకౌంట్లను కూడా ఎలాంటి కారణం చెప్పకుండానే అనేక సందర్భాల్లో అన్‌బ్లాక్ చేసిందని ప్రభుత్వం ఆరోపించింది.

ఇలాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగా చేసినవేనని, నిషేధించిన కంటెంట్ ప్రచురించడం అనే నేరాన్ని ఇది ప్రోత్సహించడమేనని ప్రభుత్వం అన్నది.

తమ ఆదేశాలను పాటించకపోగా, వాటిపై పిటిషన్‌లు వేయడం ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రయత్నమని కూడా కేంద్రం అన్నది.

‘‘భారతదేశంలో లక్షలమంది యూజర్లు ఎక్స్‌ను ఉపయోగిస్తున్నారు. చాలామంది ట్వీట్లు చేస్తున్నారు. వారందరి ట్వీట్లు నిషేధించాలని ప్రభుత్వం అడగడం లేదు కదా’’ అని ప్రభుత్వం అన్నది.

కంటెంట్‌ను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం ఎక్స్ సంస్థను అనేకమార్లు కోరింది. ఒక్క 2022లోనే 3,417 ట్విటర్ యూఆర్ఎల్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. 2014లో కేవలం 8 యూఆర్‌ఎల్‌లను మాత్రమే బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది.

ఎక్స్ (ట్విటర్)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ ఆదేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని జాక్ డోర్సే అన్నారు.

కేంద్రం వర్సెస్ ఎక్స్ (ట్విటర్)

2020లో రైతులు చేపట్టిన ఆందోళనకు సంబంధించి అనేక ట్వీట్లను, అకౌంట్లను తొలగించాల్సిందిగా తమను ప్రభుత్వం ఆదేశించిందని ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే జూన్‌లో ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుల అకౌంట్లను కూడా సెన్సార్ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ట్విటర్‌ను మూసేస్తామని, దేశంలోని ఆ సంస్థ ఉద్యోగుల ఇళ్లపై దాడి చేస్తామని కూడా భారత ప్రభుత్వం బెదిరించిందని డోర్సే అన్నారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఎక్స్ భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రభుత్వం ఆరోపించింది.

ఎక్స్ సంస్థకు, భారత ప్రభుత్వానికి మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. ఇక్కడి నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టాల ద్వారా కంపెనీకి లభించిన ఇంటర్మీడియరి స్టేటస్‌, సేఫ్ హార్బర్ లాంటి రక్షణలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఎక్స్ సంస్థను హెచ్చరించింది.

ఈ సేఫ్‌గార్డ్‌లు ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు వర్తిస్తాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్లు ఇచ్చే కంటెంట్‌కు వేదికగా ఉంటాయి. యూజర్ల పోస్టుల కారణంగా తలెత్తే చట్టపరమైన సమస్యల నుంచి ఈ సేఫ్‌గార్డ్స్ ద్వారా ఆయా సంస్థలకు రక్షణ లభిస్తోంది.

అలాంటి సేఫ్‌గార్డ్స్‌ను కోల్పోవడం ఒక సోషల్ మీడియా కంపెనీకి మరణశాసనం లాంటిదని నిపుణులు అంటున్నారు.

ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉదాహరణకు, ఎక్స్ సంస్థ ఇక్కడి చట్టాల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ఈ దేశస్థుడైన ఒక అధికారి (రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్) ని నియమించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పాటించని పక్షంలో జరిమానా విధించవచ్చని కోర్టు వ్యాఖ్యానించే వరకు ఎక్స్ సంస్థ ఆ పని చేయలేదని ప్రభుత్వం పేర్కొంది.

‘‘కోర్టులు హెచ్చరించిన తర్వాతే ఈ దేశపు చట్టాలను అనుసరించే ప్రయత్నం చేస్తోంది. ఇది ఆ సంస్థకు అలవాటుగా మారింది’’ అని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్థానిక చట్టాలను అనుసరించకపోతే కంపెనీ మూసేసే ప్రమాదం ఉంటుంది: ఎలాన్ మస్క్

ఎక్స్ వాదన ఏంటి?

రైతుల ఆందోళన సందర్భంగా కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు భారతీయ చట్టాలకు అనుగుణంగా లేవని, అలాగే భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించాలన్న తమ సంస్థ పాలసీకి విరుద్ధమని ఎక్స్ వాదించింది.

తమ ఆదేశాలను పాటిస్తున్న రేటు చాలా తక్కువగా ఉండటంతో షోకాజ్ నోటీసులు పంపడం ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది.

భారతీయ చట్టాలను అనుసరించడం కంపెనీ వ్యాపారానికి అడ్డంకిగా చూడరాదని, అలాగే ఇది ఆప్షన్ కూడా కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను పాటించకపోతే సేఫ్‌గార్డ్‌లను కోల్పోవడంతోపాటు, శిక్షలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చని ప్రభుత్వం పేర్కొంది.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, GETTY

ఫొటో క్యాప్షన్, ఇటీవలే ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

మస్క్ రాక తర్వాత...

బిలియనీర్ ఎలాన్ మస్క్ 2022లో ఎక్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబంధించిన అనేక ఉదంతాలు జరిగాయి. అయితే, మస్క్ నాయకత్వంలోకి వచ్చాక ప్రభుత్వ ఆదేశాలను పాటించడం మొదలు పెట్టింది కంపెనీ .

ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఎలాన్ మస్క్ ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన, కంపెనీ స్థానిక ప్రభుత్వ చట్టాలను పాటించాల్సిందేనని, లేదంటే మూసేసుకోవాల్సిన ప్రమాదం ఉంటుందని అన్నారు.

ఒక సోషల్ మీడియా కంపెనీ, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ కోర్డుకు వెళ్లిన సంఘటన ఇదే మొదటిది. దీనిపై వచ్చే తీర్పు చాలా కీలకమైంది.

మరోవైపు కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అసంబద్ధంగా ఉన్నాయని హక్కుల కార్యకర్తలు విమర్శించారు. విచారణ తర్వాత వచ్చే తీర్పు ద్వారా భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిధులు, పరిమితులను కూడా కోర్టు సూచించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)