మత్స్య 6000 - సముద్రయాన్: చంద్రయాన్ లాంటి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ... సాగర గర్భంలో ఎందుకీ అన్వేషణ?

ఫొటో సోర్స్, NIOT/GETTY IMAGES
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహా సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను కనిపెట్టేందుకు భారత్ సముద్ర యాత్రను ప్లాన్ చేస్తోంది.
ఈ యాత్రలో భాగంగా ముగ్గురు భారతీయుల బృందంతో కూడిన ఒక జలాంతర్గామిని మహా సముద్ర గర్భంలోకి పంపించాలనుకుంటోంది.
ఈ జలాంతర్గామి పేరును ‘మత్స్య 6000’గా నిర్ణయించింది.
భారత అంతరిక్ష పరిశోధన మిషన్లు చంద్రయాన్, ఆదిత్య ఎల్1, గగన్‌యాన్‌ల లాగానే సముద్రయాన్ కూడా భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు.
ఇప్పటి వరకు కొన్ని దేశాలు మాత్రమే మానవులను మహా సముద్ర గర్భంలోకి పంపగలిగాయి.
ఒకవేళ ఈ క్రూయిజ్ క్యాంపెయిన్ విజయం సాధిస్తే.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనాల సరసన భారత్ కూడా నిలవనుంది.
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మిషన్‌కు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సహకారం అందించనుంది.
సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతున అధ్యయనం చేయడం, అక్కడి జీవివైవిధ్యాన్ని తెలుసుకోవడం, దేశాభివృద్ధికి అక్కడి వనరుల ఉపయోగాన్ని పరిశీలించడం వంటిది ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.
2023 సెప్టెంబర్ 11న చెన్నైలోని ఎన్‌ఐఓటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత భారత్ ఈ మిషన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర భూ శాస్త్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘‘ఈ జలాంతర్గామి సముద్ర జీవ వైవిధ్యానికి ఎలాంటి హాని కలిగించదు. ప్రధాన మంత్రి బ్లూ ఎకానమీ లక్ష్యాలను ఈ మిషన్ మరింత బలోపేతం చేస్తుంది’’ అని తెలిపారు.
ఈ ప్రాజెక్టు గురించి క్లుప్తంగా చెప్పాలంటే... భారత్ ఏకకాలంలో ‘గగన్‌యాన్’ ద్వారా అంతరిక్షంలోకి, ‘సముద్రయాన్’ ద్వారా సముద్ర గర్భంలోకి అక్కడి రహస్యాల గుట్టును విప్పేందుకు మానవ సహిత మిషన్లను పంపించేందుకు సిద్ధమవుతుందన్నమాట.

ఫొటో సోర్స్, @ESSO_INCOIS
క్రూయిజ్ షిప్ అంటే ఏమిటి?
సముద్ర గర్భాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీప్ ఓషన్ మిషన్‌లో సముద్రయాన్ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన భాగం.
డీప్ ఓషన్ మిషన్‌ను ఎన్ఐఓటీ అమలు చేస్తోంది. దీని ఖర్చు మొత్తంగా రూ.4,077 కోట్లు.
ఈ మిషన్ కింద, ఎన్‌ఐఓటీ అంతకుముందు 2022 డిసెంబర్‌లో సాగర్ నిధి పేరుతో ఒక నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపింది.
ఈ నౌకలో రోబోటిక్ సబ్‌మెరైన్ ఓఎంఈ 6000 ఏయూవీ(ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరర్) 5,271 మీటర్ల లోతుకు వెళ్లింది. అక్కడున్న మాంగనీస్ ఓర్ కోసం వెతికింది.
అదే మిషన్ కింద మరో దశను ఎన్ఐఓటీ చేపడుతోంది. ఈసారి ముగ్గురు భారతీయులతో ఒక చిన్న ఆటోమేటిక్ జలాంతర్గామి అంటే సబ్‌మెర్సిబుల్ సముద్రంలోకి వెళ్తుంది. ఈ ప్రాజెక్టును సముద్రయాన్ అని కూడా పిలుస్తారు.
2019లోనే సముద్రయాన్ మిషన్ ప్రారంభమైంది. 2020లో దీని పనిని మొదలు పెట్టారు. 2025-26 కల్లా ఈ జలాంతర్గామిని సముద్ర గర్భంలోకి పంపాలని భారత్ అంతకుముందు ప్లాన్ చేసింది.
మత్స్య 6000 అనే ఎందుకు పెట్టారు?
చేప అనే పదానికి సంస్కృత రూపమైన మత్స్యను ఈ జలాంతర్గామికి పేరుగా ఎంపిక చేశారు.
ఈ జలాంతర్గామి 6 వేల మీటర్లు అంటే 6 కి.మీల సముద్ర లోతులోకి వెళ్లనుంది. దీంతో దీనికి మత్స్య 6000గా నామకరణం చేశారు.
మత్స్య 6000 పేరుతో ఈ జలాంతర్గామి సముద్ర రహస్యాలను అన్వేషించేందుకు సముద్ర గర్భంలోకి వెళ్లనుంది.
6 కి.మీల లోతుకి వెళ్లినప్పుడు, అక్కడ నీటి పీడనం ఆరు వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ పీడనాన్ని తట్టుకునేలా ఈ జలాంతర్గామిని టైటానియం అలాయ్‌తో రూపొందించారు.
ఈ 2.1 మీటర్ డయామీటర్ సబ్‌మెరైన్‌లో ఒకేసారి ముగ్గురు ప్రయాణించవచ్చు. వారిలో ఒకరు ఆపరేటర్, ఇద్దరు ఇతరులు ఉండొచ్చు.
నీటి లోపల 12 గంటల పాటు ఈ ఆటోమేటిక్ సబ్‌మెరైన్ పనిచేస్తుంది.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, 96 గంటల పాటు ఈ సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు.
తిరువనంతపురంలోని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయంతో ఈ జలాంతర్గామిని అభివృద్ధి చేశారు.
వివిధ దశలలో ఈ జలాంతర్గామికి పరీక్షలు కూడా నిర్వహించారు.

ఫొటో సోర్స్, @KIRENRIJIJU
సముద్రయానానికి ఎందుకంత ప్రాధాన్యం?
మత్స్య 6000 జలాంతర్గామిలో అబ్జర్వేషన్లను రికార్డు చేసేందుకు కూడా వివిధ రకాల శాస్త్రీయ పరికరాలతో ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అంతేకాక, జలాంతర్గామిలో ఉన్న బృందం సముద్ర అట్టడుగు భాగాన్ని నేరుగా అధ్యయనం చేయనుంది.
సముద్ర గర్భంలో ఉన్న నికెల్, కోబాల్ట్, మాంగనీస్, హైడ్రోథెర్మల్ సల్ఫైడ్, ఇతర అరుదైన ఖనిజాల వెలికితీతకు ఈ డివైజ్‌లు సహకరించనున్నాయి.
అంతేకాక, ఈ సముద్ర యానం సముద్రం లోపలున్న జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అత్యంత కీలకంగా మారింది.
ఈ జలాంతర్గామి మిషన్ ద్వారా భారత్ తన సముద్ర సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి నిరూపించుకోవాలనుకుంటోంది.
సముద్రం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ మిషన్ సాయపడనుందని కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
భారత సముద్ర మిషన్లు 1980లలోనే ప్రారంభమయ్యాయి. అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉన్న ఖనిజాలను అన్వేషించేందుకు భారత్ అప్పట్లోనే సముద్ర యాత్రలను చేపట్టింది.
కానీ, తొలిసారి సముద్ర గర్భాన్ని పరిశీలించేందుకు మానవులను సైతం పంపుతోంది.
‘‘ఇప్పటి వరకు భారత్ చేపట్టిన అన్ని సముద్ర యానాలు కూడా ప్రధానంగా స్కూబా డైవింగ్‌ను ఆధారంగా చేసుకునే న్నాయి. స్కూబా డైవింగ్ అనేది చాలా ఖరీదైనది. కొన్ని నిర్దిష్ట సంస్థలు మాత్రమే దీనిపై ఖర్చులు పెట్టగలవు’’ అని మెరైన్ బయోలజిస్ట్ డాక్టర్ అభిషేక్ సతమ్ అన్నారు.
‘‘స్కూబా డైవింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్‌తో మీరు నీటిలోకి వెళ్లినప్పుడు, కేవలం అక్కడ మీరు 45 నిమిషాలు లేదా గంటల మాత్రమే ఉండగలరు. అలాంటి డైవ్‌లు రోజుకు రెండు మాత్రమే చేయగలరు.
ఎందుకంటే, ఒక వ్యక్తి నీటిలోకి వెళ్లినప్పుడు, అతని శరీరంలో నైట్రోజెన్ పెరిగిపోతుంది. ఇది అతని శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’’ అని వివరించారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. స్కూబా డైవింగ్‌లో అధ్యయనం చేసేందుకు చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. మరింత లోతుగా వెళ్లలేరు. సముద్ర గర్భంలో వాతావరణాన్ని పరిశోధించాలంటే మాత్రం జలాంతర్గామి సాయం తీసుకోవడమే సరైనది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సముద్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి?
భూ ఉపరితలం 70 శాతానికి మహా సముద్రాలతోనే నిండి ఉంది. 80 శాతానికి పైగా మహా సముద్ర గర్భాలను మానవులు ఇంకా అన్వేషించలేదు.
శాస్త్రానికి అంతరిక్షం పట్ల ఎంతైతే ఆసక్తి ఉందో.. సముద్రం పట్ల కూడా అంతే ఆసక్తి ఉంది. శాస్త్రీయ ఉత్సుకతకు మించిన వ్యూహాత్మక కారణాలు కూడా దీనిలో ఉన్నాయి.
ఏ దేశానికి చెందిన తీర ప్రాంతం నుంచైనా 230 మైళ్లు లేదా 370 కి.మీల ప్రాంతాన్ని.. ఆ దేశ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్(ఈఈజెడ్) అంటారు.
ఈ జోన్‌లో ఉన్న మహా సముద్రం, దాని లోపలున్న వనరులు, జీవ వైవిధ్యమంతటిపై ఆ దేశానికే హక్కులుంటాయి.
భారత దేశానికి ఏడున్నర వేలకు పైగా కి.మీల తీర ప్రాంతం ఉంది. 12 ప్రధాన, 200 చిన్న నౌకాశ్రయాలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ 23 లక్షల 5,143 చదరపు కిలోమీటర్లు.
కానీ, ఇప్పటి వరకు కూడా సముద్రంలో చాలా భాగాన్ని అసలు అన్వేషించలేదు.
బాంబే హై వంటి చమురు బావులు లేదా మహా సముద్రపు అన్వేషణ మిషన్లు అయినా.. చాలా వరకు కాంటినెంటర్ షెల్ఫ్ వరకే సాగాయి.
కాంటినెంటల్ షెల్ఫ్ అనేది సముద్ర నీటిలో తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న లోతులేని ప్రాంతం. కానీ, సముద్రయాన్ మిషన్ అంతకుమించి అధ్యయనం చేపడుతోంది.
సముద్రాలు కేవలం ఖనిజ వనరుల కోసమే కాకుండా, జీవ వైవిధ్యానికి, వాతావరణ మార్పులను అరికట్టేందుకు అత్యంత కీలకం.
కార్బన్ ఉద్గారాల ద్వారా భూమిపైకి వచ్చే 90 శాతం ఉష్ణోగ్రతలను మహా సముద్రాలే గ్రహిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా భారత్ వంటి దేశాలలో వ్యవసాయం, దాని సంబంధిత ఆర్థిక వ్యవస్థ అంతా రుతుపవనాలతోనే ముడిపడి ఉంటుంది. రుతుపవనాలు సముద్రంపైనే ఆధారపడి ఉంటాయి.
అందుకే కచ్చితంగా భారత్‌కు సముద్రంపై అధ్యయనం చేయడం అత్యంత అవసరం.
ఇవి కూడా చదవండి:
- హరియాణా - నూహ్: 'అవన్నీ రాళ్ళు విసిరిన వారి నిర్మాణాలే, జాలి చూపించాల్సిన పని లేదు... కూల్చేయండి' - గ్రౌండ్ రిపోర్ట్
- అహ్మదీయులు ముస్లింలు కాదా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లేఖపై ఏమిటీ వివాదం?
- బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....
- ‘‘జైల్లో కెమెరాల ముందు దుస్తులు విప్పించారు.. శానిటరీ ప్యాడ్లు, టాంపాన్లను తొలగించమన్నారు’’-ఇరాన్ మహిళల ఆరోపణ
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














