కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?

ఫొటో సోర్స్, Facebook/Indian National Congress
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
విజయభేరి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ తన ప్రసంగంలో మహిళల కోసం గ్యారెంటీలను ప్రకటించారు.
తర్వాత ప్రసంగించిన మల్లిఖార్జున ఖర్గే.. రైతుల కోసం గ్యారెంటీలను ప్రకటించారు.
అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరు గ్యారెంటీలను వివరాలతో సహా చెప్పారు.

ఫొటో సోర్స్, TelanganaCongress
‘‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తన హామీలు నెరవేర్చలేదని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటలో ఐదు గ్యారెంటీలు ఇచ్చాం. కర్ణాటకలో క్యాబినెట్ తొలి భేటీలోనే ఐదు గ్యారెంటీలు నిలబెట్టుకున్నాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలను తొలి క్యాబినెట్ భేటీలోనే అమలు చేస్తాం’’ అని రాహుల్ చెప్పారు.
అయితే, గ్యారంటీల విషయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచీ విఫలమవుతోందని భారత రాష్ట్ర సమితి పార్టీ విమర్శించింది.

ఫొటో సోర్స్, TelanganaCongress
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమిటి?
విజయ భేరీ సభలో నాలుగు వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ప్రకటించింది.
మహిళలు, యువత, రైతులు, వృద్ధుల కోసం ఈ గ్యారెంటీలను ప్రకటించారు.
గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, తెలంగాణలో ఆరు గ్యారెంటీలను ప్రకటించడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు..
1. మహాలక్ష్మి
- ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
- రూ.500లకే గ్యాస్ సిలిండర్
- రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం
2. రైతు భరోసా
- ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం
- ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
- వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన
3. గృహజ్యోతి
- ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం
4. ఇందిరమ్మ ఇళ్లు
- ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
- తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం
5. యువ వికాసం
- విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం.
- ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
6. చేయూత
- పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను
- ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం
ఈ గ్యారెంటీలను రాహుల్ గాంధీ ప్రకటిస్తూ ‘‘కర్ణాటక మహిళలు ఇప్పుడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అక్కడ మహిళలు మా జీవితాలు కాంగ్రెస్ పార్టీ మార్చిందని మాకు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక మహిళల జీవితాలను మారుస్తాం’’ అని చెప్పారు.
రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం సోనియాగాంధీ శంకుస్థాపన పైలాన్‌ను విజయభేరి సభలో ఆవిష్కరించారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మా వల్లనే జరిగింది. ఇప్పుడు తెలంగాణను మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి’’ అని సోనియా గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, TelanganaCongress
కర్ణాటక ఎన్నికలలో ఇచ్చిన హామీలేంటి?
కొన్ని నెలల ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఐదు హామీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామంది.
కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఇలా..
- గృహజ్యోతి పథకం కింద ప్రతి నెల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు.
- గృహలక్ష్మి పథకం కింద ఇంటిపెద్దగా ఉన్న మహిళలకు నెలకు రెండు వేలు ఆర్థిక సాయం.
- రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.
- యువ నిధి పథకం కింద గ్రాడ్యుయేషన్ చదివిన నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు సాయం.. డిప్లోమా చదివిన నిరుద్యోగ యువకులకు రూ.1,500 సాయం .
- అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు పది కేజీల ఉచిత బియ్యం అందజేత.

ఫొటో సోర్స్, TelanganaCongress
రెండు రాష్ట్రాల మధ్య గ్యారెంటీలలో వ్యత్యాసం ఇలా..
తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు, కర్ణాటకలో ప్రకటించిన ఐదు గ్యారెంటీల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.
కర్ణాటక, తెలంగాణకు ఇచ్చిన గ్యారెంటీల విషయంలో మహిళలకు ఆర్థిక సాయం, బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కామన్‌గా కనిపిస్తున్నాయి.
రైతులకు పెట్టుబడి సాయం, పింఛన్ల విషయంలో ఇక్కడి పరిస్థితులకు తగ్గుట్టుగా డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు రైతుబంధు పేరిట ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది.
దీన్ని రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలకు పెంచి అందించాలని నిర్ణయించింది.
ఈ సాయాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
వరికి మద్దతు ధరకు అదనంగా రూ.500 ఇవ్వడమనేది రైతుల కోసం ప్రకటించిన హామీగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు అందించాలని ఇటీవల ప్రకటించింది.
దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు కట్టుకునేందుుకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అంతేకాకుండా ఉద్యమ కారులకు ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
‘‘తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు మించి కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించింది. అమర వీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అమరుల త్యాగాలను గుర్తు పెట్టుకుని వారికి సాయంగా ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా గ్యారెంటీలను సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించారు. ఈ గ్యారెంటీలను ఈ నెల 18వ తేదీ నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం’’ అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ బీబీసీకి చెప్పారు.

కాంగ్రెస్ గ్యారెంటీలపై బీఆర్ఎస్ ఏమంటోంది?
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
దీనిపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ పార్టీవి హామీల్లా లేవు. కేసీఆర్ సర్కార్ పథకాలతో పోటీపడే అర్రాసు పాటలా ఉన్నాయి. మొన్న కర్ణాటకలో అధికారం కోసం ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ కరెంట్ చార్జీలు బాగా పెంచారు. 100 రోజుల్లోనే 50 శాతం కమీషన్ సర్కార్ గా ముద్ర వేసుకుంది. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రూ.4వేల పింఛను ఎందుకు ఇవ్వడం లేదు. తన మనుగడ కోసం గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంటీలను ప్రకటించింది’’ అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
- Skin care: కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే భారతీయుల చర్మం కూడా అలా మారుతుందా?
- పాకిస్తాన్: ఇంధనానికి డబ్బుల్లేక ఆగిపోతున్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ విమానాలు
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
- ‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ
- తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














